అభిప్రాయం
ఆత్మహత్యల్ని సామాజిక సమస్యగా పేర్కొంటూ దీని పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త గౌరవ్ కుమార్ బన్సాల్ వేసిన ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాన్యులతోపాటూ వైద్యశాస్త్ర నిపుణులు సహితం ఇప్పటికీ ఆత్మహత్యల్ని మానసిక సమస్యగా పరిగణిస్తుంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మన సాధారణ అవగాహనలో ఒక గొప్ప ముందడుగు అనే భావించాలి.
ప్రభుత్వాలు ఆర్థిక సూచికల్ని ప్రచారం చేసుకున్నంతగా ఆనంద సూచికల్ని ప్రచారం చేయవు. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వంటి ఆర్థిక సూచికల గణాంకాలను సేకరించడం సులువు. అవి ప్రజలకు కూడ సులువుగా అర్థమవుతాయి. ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి, భవిష్యత్తు మీద నమ్మకం వంటి సామాజిక సూచికల గణాంకాలు తీయడం అంత సులువు కాదు. మనుషులు తమ వ్యక్తిగత ఆందోళన, ఒత్తిడి, కుంగుబాట్లను ఇతరులతో పంచుకోరు.
జనాభాలో మనదేశం ఇప్పుడు ప్రపంచంలో అగ్రస్థానంలో వుంది. మన తరువాత చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థల్లో 29 ట్రిలియన్ డాలర్లతో అమెరికాది అగ్రస్థానం. నాలుగు ట్రిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఇండియా ఉంది. త్వరలో మనం జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంతకాలంగా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అది సాధ్యమూ కావచ్చు.
ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు మరికొన్ని వున్నాయి. మనం జనాభాలో చైనాను అధిగమించవచ్చుగానీ చైనా ప్రజల జీవనస్థాయికి చేరుకోలేము. చైనా సాలీన తలసరి ఆదాయం 13 వేల డాలర్లు. అది అమెరికాలో 85 వేల డాలర్లు. మన దేశంలో 3 వేల డాలర్లకన్నా తక్కువ. జీడీపీలో మనం జర్మనీని అధిగమించవచ్చు గానీ, మన ప్రజల జీవనస్థాయి జర్మన్ల జీవన స్థాయిలో 20వ వంతు మాత్రమే వుంటుంది. ఇవి సగటు లెక్కలు మాత్రమే. వాస్తవానికి జనాభాలో 20 శాతం జీవనస్థాయి ఇంతకన్నా చాలా మెరుగ్గా వుంటుంది. 80 శాతం జీవనస్థాయి ఇంతకన్నా మరీ హీనంగా వుంటుంది. మన దేశంలో సంపదకు లోటు లేనప్పటికీ సంపద పంపిణి విధానంలో ఘోరమైన లోటు ఉన్నదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
జీడీపీ, తలసరి ఆదాయాలకు భిన్నమైన ప్రమాణాలు కూడా సమాజంలో ఉంటాయి. ఐక్య రాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్స’వాన్ని నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా ప్రపంచ ఆనంద నివేదికను (వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–డబ్ల్యూహెచ్‌ఆర్) పకటిస్తుంది. డబ్ల్యూహెచ్‌ఆర్ – 2024లో 143 దేశాల ర్యాంకులున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా ఫిన్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
స్కాండినేవియన్ రాజ్యాలు, సంక్షేమ దేశాలుగా పేరొందిన నార్వే, స్వీడన్, డెన్మార్క్ తొలి పది సంతోష దేశాల్లో ఉన్నాయి. అఫ్గానిస్తాన్ అన్నింటికన్నా దిగువన వుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ జాబితాలో ఇండియా స్థానం ఎక్కడా? 143లో 126. శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, నేపాల్ దేశాల ప్రజలు మనకన్నా సంతోషంగా ఉన్నారని ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.
సంతోష సూచికలకు, ఆత్మహత్యలకు ఒక విలోమానుపాత సంబంధం ఉంటుంది. సంతోష సూచికలు మెరుగ్గా ఉంటే ఆత్మహత్యల రేటు తక్కువగా ఉంటుంది. సంతోష సూచికలు తక్కువగా ఉంటే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుంది. సంతోష సూచికలు తక్కువగావున్న కారణంగా భారతదేశంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉందని నివేదికలు చెపుతున్నాయి. ఇండియా ఇప్పుడు ఆత్మహత్యల కేంద్రంగా మారిందని అనేకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2022లో దేశంలో 1 లక్షా 71 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జనాభాలో లక్ష మందికి సాలీనా 12.4 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ రికార్డు. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే.
మనుషులు వ్యక్తిగత మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటారని అనిపించడం సహజం. కానీ, ఇది రూపం మాత్రమే; సారం వేరు. ఆత్మహత్యలకు అసలు కారణం ‘సమాజం సంక్షోభంలో పడడం’ అని తొలిసారిగా చెప్పినవాడు ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలే దుర్ఖేమ్ (1858–1917). ఆయన అభిప్రాయం ప్రకారం సమాజ మౌలిక స్వభావం సంఘీభావం. సమాజం తన మౌలిక స్వభావమైన సంఘీభావాన్ని కోల్పోయినపుడు అక్కడ మనుషులు బతకలేరు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా నగరాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో; నిరక్షరాస్యులకన్నా విద్యావంతుల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రతి చారిత్రక దశలోనూ తిరిగితిరిగి ఒకే ప్రశ్న మన ముందుకు వచ్చి నిలబడుతుంది. అభివృద్ధికి కొలమానం ఏమిటి?– సంపదా? శాంతా? జీడీపీ పెరుగుదల రేటా? సంతోష సూచికలా?
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే ఒక అమానవీయ లక్షణం ఉందన్నాడు కార్ల్ మార్క్స్. కార్మికుడు తాను ఉత్పత్తి చేసిన సరుకుకు పరాయివాడైపోతాడు అన్నాడు. ఈ పరాయీకరణ ఫ్యాక్టరీ నుండి ఫ్యామిలీ లోనికి ప్రవేశించినపుడు మనిషి ఒంటరివాడయిపోతాడు. సంఘీభావానికి నోచుకోలేడు. ఓదార్చేవాడు కనుచూపు మేరలో కనిపించకపోతే మనిషి స్వచ్ఛందంగా లోకాన్ని వదిలేస్తాడు. మనం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ముందే ఆత్మహత్యల నిలయంగా మారాము. అదీ విషాదం!
డానీ
వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment