
అభిప్రాయం
ఈ తరానికి ‘ఫ్యాన్సీ’గా అనిపించే వైజాగ్–అరకు ‘గ్లాస్ రైల్’కు ‘అరకు కాఫీ’కి ఒక దగ్గర పోలిక ఉంది. కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ ఆ రైలు పట్టాలు వేసింది ‘డీబీకే’ రైల్వే లైన్ (దండకారణ్య–బోలానగిర్ – కిరుబురి) కోసం. ముడి ఇనుమును విశాఖపట్టణం పోర్టు నుంచి జపాన్ ఎగుమతి కోసం 1960లో దీన్ని వేశారు. తొలితరం గిరిజన జాతుల జీవితంలోకి ఈ ‘ప్రాజెక్టు’ తెచ్చిన మార్పులో ఆ తర్వాత కాలంలో కాఫీ కూడా భాగమైంది.
తూర్పు కనుమల్లో ఒక్క విశాఖ మన్యసీమ మాత్రమే ఎందుకు ‘కాఫీ’కి నెలవయింది అంటే, ఇది సముద్ర మట్టానికి 900–1100 అడుగుల ఎత్తున ఉంది. వర్షపాతం 1000–1200 మి.మీ. ఉండి, కాఫీ మొక్క వేళ్ళకు తడి తగిలితే చాలు కనుక ఇక్కడి కొండవాలులు వీటి పెంప కానికి అనువు అయ్యాయి. ఎండ నేరుగా ఈ మొక్కలకు తగలకూడదు కనుక, నీడ కోసం పెంచే సిల్వర్ వోక్స్ చెట్లు (Silver Oak Trees) కూడా ఈ నేలలో బాగా పెరగడంతో అంతర పంటగా పెంచే మిరియాల పాదులు ఈ చెట్ల మధ్య పెంచుతారు. గిరిజనులకు అదొక అదనపు ఆదాయం.
అటవీ శాఖ 1960లో అరకు, అనంతగిరి, చింతపల్లి, పాడేరు రిజర్వ్ ఫారెస్ట్‌లో కాఫీ తోటల (Coffee Plantation) పెంపకం మొదలు పెట్టింది. దాంతో సాగులో మెలకువలు, సాంకేతిక అంశాలు చూడడానికి కాఫీ బోర్డ్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం కూడా ఏజెన్సీకి వచ్చింది. అలా అటవీ శాఖ పెంచిన తోటలు 1985లో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌కు అప్పగించే నాటికి వాటి విస్తీర్ణం 10,100 ఎకరాలు. ఇక ఎనభైల్లో పాడేరు ఐటీడీఏ (ITDA) వచ్చాక, విశాఖ ఏజెన్సీకి ఊరట కోసం వారాంతపు యాత్రలకు వచ్చే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ‘వీఐపీ’లకు ఐటీడీఏ అధికారులు చూపించే ఒక టూరిస్ట్ స్పాట్‌గా మన్యసీమలో ఈ కాఫీ తోటలు మారాయి.
అయితే వీటి విస్తీర్ణం 2002–03 నాటికి అరవై వేల ఎకరాలకు చేరినా, ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధాని అయ్యాక మాత్రమే, ‘గిరిజన్ కాఫీ’కి వాణిజ్యపరమైన విలువ పెరిగింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది ‘డవున్–టు–ఎర్త్’ ధోరణి కనుక, ముందు ‘భూమి’ – ‘మనిషి’, ఆ తర్వాతే కాఫీ అయినా దాని రుచి అయినా... అన్నట్టుగా మన్యం ‘కాఫీ’ గురించి ఆయన ఆలోచించారు. ప్రభుత్వం పెంచిన కాఫీ తోటలపై స్థానిక గిరిజనులకు యాజమాన్య హక్కులు ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాలు ఇచ్చి వాళ్ళ తోటల్లో వాళ్ళు తమ పని చేసుకుంటుంటే, దాన్ని– ‘నెరేగా’ ఉపాధి హామీ క్రిందికి వైఎస్ తెచ్చారు. గిరిజనుల పట్ల ఆయన ధోరణి ఇటువంటిది కనుకనే, నక్సలైట్లను – ‘అయినా మీరు ఇంకా అడవుల్లో ఎందుకు బయటకు రండి’ అని చర్చలకు పిలిచారు.
అరకు కాఫీ (Araku Coffee) తోటల పచ్చని భూముల కింది పొరల్లో బాక్సైట్ ఖనిజముంది. దాన్ని అల్యూమినియంగా మార్చి వ్యాపారం చేసుకోవడానికి కంపెనీలు 2009 నాటికే మన్యం ముఖద్వారం వద్ద ఫ్యాక్టరీలు పెట్టుకుని మరీ కనిపెట్టడం మొదలెట్టాయి. సరిగ్గా అప్పుడే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయిన డాక్టర్ జైరాం రమేష్ (Jairam Ramesh) కేంద్ర మంత్రి అయితే, ఆయన చేసిన అటవీ–వాణిజ్య శాఖల సేవలను వైఎస్ గిరిజనుల కాఫీ తోటల కోసం పూర్తి స్థాయిలో వాడుకున్నారు. కేంద్ర ‘ఉపాధి హామీ’ నిధులు 2009–10, మళ్ళీ 2015–16 మధ్య ఇలా రెండుసార్లు రూ. 287 కోట్లు, కాఫీ బోర్డు నిధులు రూ. 62 కోట్లతో 1.04 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు, మరొక లక్ష ఎకరాల్లో కాఫీ మొక్కలకు నీడ కోసం ‘షేడ్ ప్లాంటేషన్’ మొక్కలు ఆ కాలంలో నాటారు.
చదవండి: ప్రైవేటు ఎత్తులకు చిత్తవ్వాల్సిందేనా?
అయితే మన ‘కాఫీ కథ’ ఆ తోటల్లోనే ఆగిపోలేదు. కేంద్ర పరిశ్రమలు–వాణిజ్య సహాయ మంత్రిగా 2009 ఆగస్టు 13న ‘ఆసియాన్’ 49 దేశాలతో మన దేశం చేసు కున్న స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడిక (ఎఫ్‌టీఏ) రూప కల్పనలో మంత్రి జైరాం రమేష్‌ది కీలక పాత్ర అయింది. ఆ ఒప్పందం 2010 జనవరి 1 నుండి అమలులోకి వచ్చేది. కానీ, వైఎస్ ఒత్తిడితో సీఎంఓ డిల్లీతో చేసిన నిరంతర ‘లాబీయింగ్’తో మన దేశం ఎగుమతి చేసే 489 వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో మన ‘గిరిజన్ కాఫీ’కి చోటు దొరికింది. ఒప్పందం ముగిసిన నెలకు ఆయన లేరు. ఇది జరిగిన మూడు నెలలకు మన గిరిజన్ కాఫీ ‘అరకు ఆర్గానిక్ కాఫీ’ బ్రాండ్‌తో రెక్కలు కట్టుకుని మరీ విదేశాలకు ఎగిరింది.
- జాన్‌సన్ చోరగుడి
అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత