
పురుషుడితో గొడవ పడిన స్త్రీ పూర్తిగా అతడిని పట్టించుకోవటం మానేస్తుంది. స్త్రీతో గొడవ పడిన పురుషుడు మరింతగా ఆమెను పట్టించు కోవటం మొదలు పెడతాడు! నిజానికది పట్టించుకోవటం కాదు, ఆమె తనని పట్టించు కోక పోవటాన్ని పట్టించుకోవటం!
కానీ ఎంపీలు కూడా ఇలా స్త్రీ, పురుషులుగా గొడవ పడాల్సిందేనా? ఏ నాగరికతా, ఏ పదవీ బాధ్యతా... స్త్రీని స్త్రీగా, పురుషుడిని పురుషుడిగా కాక, పరిణతి చెందిన ఒక మనిషిగా ఉంచలేవా?
కల్యాణ్ బెనర్జీ, నేనూ లోక్‌సభ ఎంపీలం. కానీ మా మధ్య ఘర్షణను ఇద్దరు ఎంపీల మధ్య ఘర్షణలా అతడు ఉండనివ్వటం లేదు!
లోక్‌సభలో అతడు పార్టీ చీఫ్ విప్. సభలో తృణమూల్ ఎంపీలు ఎవరు మాట్లాడాలన్నది అతడిదే నిర్ణయం. ఎవరు మాట్లాడకూడదన్నదీ అతడి నిర్ణయమే. లోక్‌సభలో మొత్తం 28 మంది తృణమూల్ ఎంపీలం ఉన్నాం. అందర్నీ మాట్లాడనిచ్చేవారు కల్యాణ్ బెనర్జీ. నా దగ్గరికి వచ్చేసరికి ‘నో’ చెప్పేవారు!
‘‘నేను మాట్లాడతాను’’ –‘‘నో’’
‘‘నాకు అవకాశం ఇవ్వండి’’ – ‘‘నో’’
‘‘రెండే రెండు నిమిషాలు...’’ –‘‘నో’’
‘‘నన్ను చెప్పనివ్వండి ప్లీజ్..’’ – ‘‘నో’’
కల్యాణ్ బెనర్జీ నాకన్నా 18 ఏళ్లు పెద్దవారు. 16 ఏళ్లుగా ఎంపీగా ఉంటున్నవారు. నిన్న మొన్న, ఆరేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన నాతో ఈయనకు ఏంటి ప్రాబ్లం?!
‘‘ఎందుకు మీరు నన్ను మాట్లాడనీయటం లేదు మిస్టర్ బెనర్జీ?’’ అని లాస్ట్ సెషన్‌లో మళ్లీ అడిగాను. కళ్లింత చేశారు!
‘‘ఫస్ట్ మీరు మీ చీఫ్ విప్‌తో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆ తర్వాత మీకు సభలో మాట్లాడే అవకాశం వస్తుంది. మిస్టర్ బెనర్జీ ఏంటి... మిస్టర్ బెనర్జీ? మన చైర్‌పర్సన్‌ని కూడా ఇలాగే ‘మిస్ బెనర్జీ’ అనేసేలా ఉన్నారు?’’ అన్నారు!
మధ్యలోకి దీదీజీని ఎందుకు తెచ్చినట్లు!
ఏప్రిల్ 4న తృణమూల్ ఎంపీలం అందరం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్‌కి వెళ్లాం. డూప్లికేట్ ఓటర్ ఐడీ నంబర్‌లు తొలగించాలని డిమాండ్ లెటర్ తయారు చేసి, అందులో
అందరి సంతకాలూ తీసుకున్నారు కల్యాణ్ బెనర్జీ... ఒక్క నా సంతకం తప్ప!
‘‘ఏమిటిది మిస్టర్ బెనర్జీ! ఎందుకిలా చేస్తున్నారు?’’ అని అడిగాను.
ఆ మాటకు అక్కడ సమాధానం చెప్పకుండా తృణమూల్ ఎంపీల వాట్సాప్ గ్రూప్‌లో నాపై పోస్టులు పెట్టారు. ‘‘ఇంగ్లిష్‌లో మాట్లాడగలనని అహంకారం... ఆ
ఇంటర్నేషనల్ లేడీకి...’’ అని నా పేరెత్తకుండా అన్నారు! నవ్వొచ్చింది నాకు.
సమాధానం లేనప్పుడు... ‘పెద్ద మగాళ్లం’ అనుకునే మగాళ్లు కూడా ఇలాగే చిన్నపిల్లల్లా మాట్లాడతారు!
గ్రూప్‌లోంచి బయటికి వచ్చేశాను.
వెంటనే నన్ను వెతుక్కుంటూ వచ్చారు సాగరికా ఘోష్! సాగరిక రాజ్యసభ ఎంపీ.
‘‘ఏప్రిల్ 4న జరిగిన దానికి దీదీజీ చాలా కోపంగా ఉన్నారు మొయిత్రా. కల్యాణ్ బెనర్జీతో తగాదా మానేయమంటున్నారు. సోమవారం లోపే ఇదంతా ముగిసిపోవాలని దీదీజీ కోరుకుంటున్నారు...’’ అన్నారు సాగరిక.
ఆ విషయాన్ని దీదీజీనే నేరుగా నాతో ఎందుకు చెప్పలేకపోయారు!
‘‘అంబేడ్కర్‌ని ఓన్ చేసుకోటానికి రేపు ఏప్రిల్ 14న బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని దీదీజీ అంటున్నారు మొయిత్రా. మహిళలకు రాజకీయాల్లో గౌరవం దక్కాలని అంబేడ్కర్ ఆకాంక్షిస్తే, తృణమూల్ పార్టీలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్న మాటను రానీయకూడదని మీకు చెప్పమన్నారు... ’’ అన్నారు సాగరిక.
‘‘అంటే, కల్యాణ్ బెనర్జీకి నన్ను అపాలజీ చెప్పమని అంటున్నారా?’’ అని అడిగాను.
‘‘లేదు. మిమ్మల్ని వెంటనే ఎంపీల వాట్సాప్ గ్రూప్‌లోకి తిరిగి వచ్చేయమంటున్నారు...’’ అన్నారు సాగరిక!!
రెండూ ఒకటే కదా! కాదా?!
- మాధవ్ శింగరాజు