rayani diary
-
మమతా బెనర్జీ (సీఎం) రాయని డైరీ
ప్రజాస్వామ్యం కొన్నిసార్లు నిరంకుశత్వంతో పోరాడవలసి వస్తుంది. అప్పుడేం చేయాలి? పోరాడాలి. పోరాడేందుకు ఒక్కరైనా ముందుకు రావాలి. ఆ ఒక్కరు ఎవరన్నది... నిర్ణయంతో తేలేది కాదు. నిశ్చయంతో జరిగేది. ‘‘నేనొస్తాను...’’ అన్నాను. ‘‘సీఎంగా ఉంటూనే, ‘ఇండియా’ కూటమినీ నడిపిస్తాను’’ అన్నాను.నేను ఆ మాట అన్నప్పుడు... ‘‘కూటమిని నడిపించటానికే కదా మల్లికార్జున్ ఖర్గే కూటమికి చైర్మన్‌గా ఉన్నారు, కూటమిని కవాతు చేయించటానికే కదా లోక్‌సభలో రాహుల్, రాజ్యసభలో ఖర్గే కూటమి నాయకులుగా ఉన్నారు...’’ అని కూటమిలోని సభ్యులెవరూ అనలేదు! ‘‘ఎస్, మీరు రావాలి మమతాజీ...’’ అన్నారు శరద్ పవార్.‘‘మీరొస్తే 2025లో గెలుపు మనదే...’’ అన్నారు లాలూ ప్రసాద్.‘‘మీరు రావటమే మంచిది మేడమ్...’’ అని అఖిలేశ్ యాదవ్. వారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు కూడా! కూటమిలో మహామహులు ఉన్నారు. ప్రకాష్ కారత్, అరవింద్ కేజ్రీవాల్,ఎం.కె. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరేన్, ఫరూఖ్ అబ్దుల్లా, డి.రాజా, మెహబూబా ముఫ్తీ... వారిలో ఏ ఒక్కరూ... ‘‘కూటమికి నేను నాయకత్వం వహిస్తాను...’’ అని ముందుకు వచ్చినా నేను వారికి అడ్డుపడేది, వారితో నేను పోటీకి దిగేది ఏముంటుంది? అంతా ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూటమిగా ఏర్పడినవాళ్లం ఒకరిని ఒకరం ఎందుకు వెనక్కు లాగుతాం?!కానీ, రాహుల్ అలా అనుకున్నట్లు లేరు! ‘‘దిగువ స్థాయి లీడర్ల మాటల్ని పట్టించుకో కండి. కూటమిలోని సమస్యల్ని పరిష్కరించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది...’’ అంటున్నారు. నన్ను ‘దిగువ స్థాయి’ లీడర్ అన్నందుకు నాకేం పట్టింపు లేదు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి మాటల్ని ఎన్ని వినలేదు! ముఖ్యమంత్రిని అయినంత మాత్రాన నేనేమీ ‘వెరీ ఇంపార్టెంట్ పర్సన్’ అయిపోను. నిజానికి, నేనొక ‘లెస్ ఇంపార్టెంట్ పర్సన్’ అని చెప్పుకోవటమే నాకు ఇష్టం. ‘కూటమిలోని సమస్యల్ని పరిష్కరించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది...’ అని రాహుల్ అనడంలో తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు పరిష్కరించవలసింది కూటమి లోపలి సమస్యలనా? లేక, కూటమి బయట ఉన్న సమస్యనా? బయటి సమస్య వల్లనే కదా, లోపలి సమస్యలు బయటికి వస్తున్నది! బీజేపీని ఓడించటానికి కూటమిగా ఒకటై పోరాడాక కూడా 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేకపోయింది. 2024లో హరియాణా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రలలో విజయం సాధించలేకపోయింది. దీనిని కదా కాంగ్రెస్ పరిష్కరించవలసింది! నాయకుల్ని నాయకులు గౌరవించక పోయినా, పార్టీలను పార్టీలు గౌరవించాలి. రాహుల్ నన్ను దిగువ స్థాయి లీడర్ అని అనటం, తృణమూల్ కాంగ్రెస్‌ను దిగువస్థాయి పార్టీ అని అనటమే! తృణమూల్ కూడా ఒకప్పటి కాంగ్రెస్సే అనే సంగతి ఆయనకు గుర్తు లేకుండా ఉంటుందా?కూటమిని నేను నడిపిస్తాను అని నేను అంటున్నది... ఖర్గేజీ నడిపించలేక పోతున్నా రనో, రాహుల్ పరుగెత్తలేక పోతున్నారనో కాదు. కూటమి భాగస్వామిగా మోదీజీని దించే బాధ్యత నాకు మాత్రం లేదా... అని. ‘‘కూటమిని లీడ్ చేస్తాను’’ అని నేను అనగానే, అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాకు శ్రేయోభిలాషిగా మారిపోయారు! ‘‘మమతాజీ! చచ్చిపడి ఉన్న కూటమికి సారథ్యం వహించి, మీరు దానిని బతికించలేరు. 2026లో మీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి...’’ అని హితవు చెప్పారు. రాహుల్ అన్న మాట కంటే అదేమీ ఘాటైనది కాదు. -
ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యు.బి.టి.) రాయని డైరీ
శరద్ పవార్, నేను, నానా పటోలే ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా! 83 ఏళ్ల వయసులో కూడా ఆయన, మెలకువలోంచి కళ్లు తెరిచినట్లుగా... హఠాత్తుగా, ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం’’ అనే ప్రశ్న వేయగలిగారంటే అది ఆయనలోని తరగని రాజకీయ చైతన్యానికి ఒక స్పష్టమైన సంకేతమనే అనుకోవాలి. ఎక్కడ కూర్చొని ఉన్నామో చెప్పబోయాన్నేను. ‘‘ఉద్ధవ్జీ! మీరాగండి నేను చెబుతాను’’ అన్నారు నానా పటోలే!! విస్మయంగా ఆయన వైపు చూశాను. ‘‘సరే, మీరే చెప్పండి నానాజీ’’ అన్నాను. నానాజీ ఏం చెప్పినా – మేము కూర్చొని ఉన్నది ముంబై హెర్డియా మార్గ్‌లోని ఎన్సీపీ పార్టీ ఆఫీసు తప్ప మరొకటి అవటానికి లేదు. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నామంటే శరద్‌జీ... సరిగ్గా ఒక పరాజయ పీఠం మీద! అది కూడా ముగ్గురం సర్దుకుని కూర్చున్నాం...’’ అన్నారు నానాజీ!అంటే... ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్. ‘‘మీరేమంటున్నారు నానాజీ, కలిసి పోటీ చేయటం వల్ల మన మూడు పార్టీలు ఓడిపోయాయనేనా?’’ అన్నాను. ‘‘ఉద్ధవ్జీ... అక్కడ బీజేపీ కూటమిలో శివసేన ఉంది, ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ శివసేన ఉంది. అక్కడ బీజేపీ కూటమిలో ఎన్సీపీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ ఎన్సీపీ ఉంది. అయినప్పటికీ వాళ్లే ఎందుకు గెలిచారో తెలుసా?’’ అన్నారు నానాజీ. ‘‘కానీ నానాజీ, మనమిక్కడ కూర్చున్నది వాళ్లెందుకు గెలిచారు అని కాక, మనం ఎందుకు ఓడిపోయామో ఒకర్నుంచి ఒకరం తెలుసుకోటానికి కదా...’’ అన్నాను. ‘‘అదే అంటున్నాను ఉద్ధవ్జీ... వాళ్లెందుకు గెలిచారో తెలిస్తే, మనమెందుకు ఓడిపోయామో తెలుస్తుంది. పోనీ, మీరన్నట్లు మనం ఎందుకు ఓడిపోయామో తెలుసుకుంటే వాళ్లెందుకు గెలిచారో తెలుస్తుంది కానీ, వాళ్ల గెలుపుతో మనకు పనేమిటి? మన ఓటమి గురించి మనం ఆలోచించాలి కానీ...’’ అన్నారు నానాజీ!ఆలోచనలో పడ్డాన్నేను. గెలుపోటములు అన్నవి రెండు భిన్నమైన స్థితులా లేక, పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే పరిస్థితులా?‘‘సరే చెప్పండి నానాజీ! వాళ్లెందుకు గెలిచారని మీరు అనుకుంటున్నారు?’’ అన్నాను. ‘‘గెలవకుండా ఎలా ఉంటారు ఉద్ధవ్జీ! ‘విడిపోతే దెబ్బతింటాం. కలిసుంటే భద్రంగా ఉంటాం’ అని కదా వాళ్ల నినాదం. అది పట్టేసింది మహారాష్ట్రా వాళ్లకు, మహారాష్ట్రలో ఉండే గుజరాతీలకు; ఇంకా... హిందువులకు, ముస్లిములకు! పైకే నినాదం. లోపల అది బెదిరింపు. ఓట్లు విడిపోతే పాట్లు తప్పవని...’’ అన్నారు నానాజీ. ‘‘అందుకే ఓడామా మనం?’’ అన్నాను. ‘‘కాదు’’ అన్నారు. ‘‘మరి?’’ అన్నాను. ‘‘శివసేన నుంచి శివసేన, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయి, ఒకదాన్ని ఒకటి ఓడించాయి. రెండూ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాయి’’ అన్నారు నానాజీ... ‘మీతో కలిసి మేం దెబ్బతిన్నాం’ అనే అర్థంలో!!నేను మౌనంగా ఉండిపోయాను. నానాజీ కూడా కాసేపు మౌనం పాటించారు. ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా!అప్పుడు గానీ... ఆయన్ని పట్టించు కోకుండా మేమిద్దరమే చాలాసేపటిగా మాట్లాడుకుంటూ ఉన్నామన్న సంగతి మాకు స్పృహలోకి రాలేదు!‘ఎక్కడ కూర్చొని ఉన్నాం’ అనే తన ప్రశ్నకు, ‘‘పరాజయ పీఠం’’ మీద అన్న నానాజీ జవాబు ఆయన్ని సంతృప్తి పరిచే ఉండాలి. లేకుంటే – ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అనే కొనసాగింపు ప్రశ్న వేసి ఉండేవారు కాదు శరద్‌జీ. -
ఇమ్రాన్ ఖాన్ (మాజీ ప్రధాని) రాయని డైరీ
జైలు గదులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే... అవసరమైనవి మాత్రమే కాదు, అనవసరమైనవి కూడా ఇక్కడ ఏ మూలా కనిపించవు! ఇరుకే అయినా ఇదొక సువిశాల సుఖమయ జీవితం. ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోదు. అవసరం పడిందని వెతకటానికి కనిపించకుండా పోయేదేమీ ఉండదు.ఇల్లు అలాక్కాదు! అవసరమైనవి లేకున్నా పూట గడిచిపోతుంది కానీ, అనవసరమైనవి ఇంట్లో చేరిపోతుంటే చివరికి నడవటానికి కూడా దారి లేకుండా పోతుంది.ప్రధానిగా ఉన్నప్పుడు నేను, బుష్రా బీబీ ఉన్న మా నివాస భవనం నిరంతరం గిఫ్టుల రూపంలో వచ్చి పడుతుండే విలువైన చెత్తతో నిండిపోతూ ఉండేది. డైమండ్ జ్యూయలరీ, రోలెక్స్ వాచీలు, షాండ్లియర్లు, చెయిర్లు, సోఫాలు, ఆర్ట్ పీస్‌లు... వాటిని ఉంచుకోలేం, పడేయలేం. జ్యూయలరీకి ఒక మెడ, వాచీకి ఒక చెయ్యే కదా ఉంటాయి. అన్నన్ని ఏం చేస్కోను?! ఆరు రోలెక్స్ లు, కిలోల కొద్దీ జ్యూయలరీ, లివింగ్ రూమ్‌ని అమాంతం మింగేసే భారీ కలప ఫర్నిచర్!బుష్రా బీబీతో అన్నానొక రోజు, ‘‘బీబీ... మనింట్లో మనం వాడకుండా ఉండిపోయిన వస్తువులన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ ఏ మాయ వల్లనో కరెన్సీగా మారిపోతే ఎలా ఉంటుంది?!’’ అని. ఆ మాటకు బుష్రా బీబీ ఎంతో ఆహ్లాదకరంగా నవ్వారు. ‘‘వాడని వస్తువులు కూడా ఉంటేనే కదా అది ఇల్లవుతుంది ఇమ్రాన్‌జీ...’’ అన్నారు.ఆమె అలా నవ్వినప్పుడు బాబా ఫరీద్ దర్గాలోని ప్రశాంతత నన్నావరించినట్లౌతుంది. మేము తొలిసారి కలుసుకున్నది ఆ దర్గా ప్రాంగణంలోనే! ‘‘పోనీ ఇమ్రాన్‌జీ! మీరన్నట్లు ఇంట్లో వాడనివన్నీ వాటి విలువను బట్టి ఎక్కడివక్కడ కరెన్సీగా మారిపోతే మాత్రం... ‘ఇంతింత కరెన్సీ ఏంటి చెత్తలా కాలికీ చేతికీ తగులుతూ...’ అని అనకుండా ఉంటారా మీరు...’’ అన్నారు బుష్రా బీబీ నవ్వుతూ!జైలు గదికి ఉన్నట్లే బుష్రా బీబీ నవ్వుకు ఇరుకును అలవాటు చేయించే ‘గతి తాత్విక’ గుణం ఏదో ఉన్నట్లుంది! ‘‘ఇమ్రాన్ జీ! మీకు బెయిల్ వచ్చిందట!మీ లాయర్ వచ్చారు రండి...’’ అని నా సెల్ దగ్గరకు వచ్చి మరీ నన్ను వెంటబెట్టుకుని వెళ్లారు అసద్ జావేద్. నేనున్న రావల్పిండి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆయన. విజిటర్స్ రూమ్‌లో సల్మాన్ సఫ్దర్ నాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన చేతుల్లో బెయిలు పత్రాలు ఉన్నాయి. కానీ వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదని సఫ్దర్కి, నాకు, బుష్రాకు, జైలు సూపరింటెండెంట్‌కి, పాక్ ప్రధానికి, నా పార్టీకి, పార్టీ కార్యకర్తలకు, ఇంకా... యావత్ ప్రపంచానికీ తెలుసు. గిఫ్టుగా వచ్చిన జ్యూయలరీ, రోలెక్స్ వాచీలను అమ్మేయగా జమ అయిన అమౌంట్‌కి సరిగా లెక్కలు చూపించలేదన్న కేసులో మాత్రమే నాకు వచ్చిన బెయిల్ అది. నాపై ఇంకా 149 కేసులు ఉన్నాయి. మూడేళ్ల శిక్ష, ఏడేళ్ల శిక్ష, పదేళ్ల శిక్ష, పద్నాలుగేళ్ల శిక్ష పడిన కేసులు కూడా వాటిల్లో ఉన్నాయి. కేసులన్నిటినీ కలిపి ఒకేసారి బెయిల్ ఇస్తేనే నేను బయటికి వచ్చినట్లు! గిఫ్టుల కేసులో నా భార్య బుష్రా బీబీ కూడా జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది! బుష్రాను జనవరి 31న అరెస్టు చేసి, తొమ్మిది నెలల తర్వాత, నెల క్రితమే అక్టోబర్ 24న బెయిల్ మీద విడుదల చేశారు. ఇద్దరం ఉన్నది ఒకే జైలు. ఏడాది పైగా నేను జైల్లోనే ఉంటున్నా... నేను కఠిన కారాగార శిక్ష అనుభవించింది మాత్రం ఆ తొమ్మిది నెలలే. ఒక నిశ్శబ్దపు నిట్టూర్పుతో సఫ్దర్ వైపు చూశాను.‘‘తనెలా ఉన్నారు సఫ్దర్జీ?’’ అని అడిగాను... బుష్రాను ఉద్దేశించి.‘‘మీరెలా ఉన్నారని తను అడుగుతున్నారు ఇమ్రాన్‌జీ...’’ అన్నారు సఫ్దర్!! -
పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్ దిగ్గజం) రాయని డైరీ
‘‘మీరు వృద్ధాప్యంలో ఆలోచిస్తారు. యవ్వనంలో ఉండగా బీజేపీలో చేరి వికసిత్ భారత్‌లో ఎందుకు పాలు పంచుకోలేదా అని...’’ అన్నారాయన నాకు మళ్లీ ఫోన్ చేసి! ఆ ఫోన్ వచ్చింది ఆరెస్సెస్ నుంచి. ఆ ఫోన్ చేసింది ఆరెస్సెస్‌లోని ఒక పెద్ద మనిషి. ‘‘నేనిప్పుడు నా 78లో ఉన్నాను. అయినప్పటికీ... ‘మీరు మీ వృద్ధాప్యంలో ఆలోచిస్తారు...’ అని మీరు నాతో అనటం ద్వారా నా వయసు పట్ల మీరు కనబరుస్తున్న గొప్ప ఔదార్యం నన్ను కట్టిపడేస్తోంది. అలాగని నేను కాంగ్రెస్ కట్లు తెంపుకొని బీజేపీలోకి వచ్చేయలేను...’’ అన్నాను మృదువుగా.‘‘కట్లు అని మీరే అంటున్నారు. తెంపుకొని వచ్చేయటానికి ఏమిటి ఆలోచన?!’’ అన్నారాయన.‘‘అవి నన్ను నేను కాంగ్రెస్‌తో కట్టేసుకున్న కట్లు. కాంగ్రెస్ నన్ను ఫోన్ చేసి పిలిపించుకుని కట్టిపడేసిన కట్లు కావు...’’ అన్నాను. పెద్దగా నవ్వారాయన.‘‘మీలోని ఈ కట్టుబాటే నా చేత మీకు ఫోన్ చేయించేలా బీజేపీని ప్రేరేపించింది చవాన్జీ! ఢిల్లీలో బీజేపీకి మీ అవసరం ఉంది. సీనియర్ మోస్ట్‌గా మీకూ బీజేపీలో తగినంత గౌరవం ఉంటుంది. వచ్చేయండి...’’ అన్నారు.కోరుకున్న చోట దక్కే గౌరవం, కోరుకోని చోట పొందే గౌరవం... రెండూ ఒకటి కావు. దక్కింది సంతృప్తిని ఇస్తుంది. పొందిందిసంతోషాన్ని మాత్రమే ఇస్తుంది.‘‘నాకిక్కడ కాంగ్రెస్‌లో తగినంత గౌరవం దక్కుతూనే ఉంది మహోదయ్ జీ...’’ అన్నాను. ఆయన మళ్లీ నవ్వారు.‘‘నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం, ఆరేళ్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌లో సహాయ మంత్రిగా ఉండటం, ఒక టర్మ్‌కు పైగా రాజ్య సభలో ఉండటం, రెండు టర్మ్‌లు లోక్‌సభలో ఉండటం, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి, ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉండటం... ఇవన్నీ నిజంగా దక్కుదలలే అంటారా చవాన్ జీ... ఒక్కసారి మీ మనసును అడగండి...’’ అన్నారాయన!ఆయన ఉద్దేశం – ఇవేవీ ఆరెస్సెస్ ‘ప్రచారక్ ’, ‘విచారక్’లతో కానీ, బీజేపీ ‘మార్గదర్శక్ మండల్’ సభ్యత్వంతో కానీ సమానమైనవి కావన్నట్లుగా ఉంది!మొదటిసారి ఆయన నాకు ఫోన్ చేసింది ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు. రెండోసారి ఫోన్ చేసింది నామినేషన్లకు ముందు. మూడోసారి ఫోన్ చేసింది నవంబర్ 4న నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ముందు. ఇప్పుడు మళ్లీ ఫోన్ చేసి, ‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు, వచ్చేయండి, చవాన్ జీ...’’ అంటున్నారు 20న పోలింగ్, 23నకౌంటింగ్ పెట్టుకుని!కరద్ సౌత్ నుంచి వరుసగా రెండుసార్లు నా మీద పోటీ చేసి ఓడిపోయిన అతుల్ సురేశ్ భోసలేనే మళ్లీ నాపై నిలబెట్టింది బీజేపీ. మొదటిసారి 18 వేలు, రెండోసారి 9 వేల ఓట్ల తేడాతో అతుల్ ఓడిపోయారు కనుక ఈసారి ఆయన కచ్చితంగా గెలిచి తీరుతారని ఆ పార్టీ నమ్మకం.నమ్మకాలు బీజేపీకి మాత్రమే ఉంటాయా?! కరద్ సౌత్‌లో మళ్లీ నేనే వస్తానని కాంగ్రెస్ నమ్ముతోంది. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ వస్తే నేనే సీఎం అని నేను నమ్ముతున్నాను. తనే సీఎం అని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే నమ్ముతున్నారు.అడ్డు తొలగించుకోవటం కోసం బీజేపీ ఏమైనా చేస్తుంది. బీహార్‌లో తమ కన్నా తక్కువ సీట్లు వచ్చిన నితీశ్‌కు సీఎం సీటును ఇచ్చేస్తుంది. కరద్ సౌత్‌లో అతుల్‌కి దీటైన పోటీ లేకుండా నన్ను పార్టీలోకి తీసుకోటానికి ఆరెస్సెస్‌తో ఫోనూ చేయిస్తుంది. ‘‘వృద్ధాప్యంలో మీరు ఆలోచిస్తారు...’’అంటూ ఈసారి మళ్లీ ఆ ఆరెస్సెస్ మహోదయ్ ఫోన్ చేస్తే ఒకటే చెప్పాలి... కాంగ్రెస్‌లో వృద్ధాప్యమనేదే ఉండదని గట్టిగా చెప్పాలి! - మాధవ్ శింగరాజు -
నితీశ్ కుమార్ (బిహార్ సీఎం)రాయని డైరీ
ప్రధాని అవడం ఏముంది! ఎవరైనా అవొచ్చు. వాజ్‌పేయి అంతటి మనిషి ప్రధాని అయ్యారని చెప్పి... ఆయనపై గౌరవంతో మోదీజీ ఏమైనా ప్రధాని కాకుండా ఆగిపోయారా? మోదీజీ వంటి ఒక వ్యక్తి భారతావనికి ప్రధానిగా ఉండేవార ని చరిత్ర పుస్తకాలలో ఉన్నా కూడా భావితరాల్లో ఎవరైనా ఆత్మగౌరవంతో ప్రధాని అవకుండా ఆగిపోతారా? ప్రధాని ఎవరైనా అవొచ్చు. ప్రధాని ‘అభ్యర్థి’ అవడమే... ప్రధాని అవడం కన్నా పెద్ద సంగతి. ప్రతి పార్టీలో వాజ్‌పేయిలు, మోదీజీలు ఉంటారు. ‘‘అభ్యర్థి ఎవరైతేనేం, అయ్యేది ప్రధానేగా..’’ అని వాజ్‌పేయిలు అంటారు. ‘‘ప్రధాని ఎవరైతేనేం, ప్రధానం అభ్యర్థేగా’’ అని మోదీజీలు అంటారు. ఇక ఏకాభిప్రాయం ఎలా కుదురుతుంది? ఐతే అందరూ వాజ్‌పేయిలు అవ్వాలి. లేదంటే అందరూ మోదీజీలు అవ్వాలి. అయ్యేపనేనా?! ఒక పార్టీలోనే అందరూ వాజ్‌పేయిలు, లేదా అందరూ మోదీజీలు కాలేనప్పుడు నాలుగైదు పార్టీలు కలిసి తమలోంచి ఒక వాజ్‌పేయిని, లేదా ఒక మోదీజీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం అన్నది కేసీఆర్ పాట్నా వస్తేనో, కేజ్రీవాల్ గుజరాత్ వెళ్లొస్తేనో ఒకపూటలో జరిగిపోతుందా?! బిహార్‌లో ఒక మోదీజీ ఉన్నారు. సుశీల్ కుమార్ మోదీ ఆయన. బీజేపీలో పెద్ద మనిషి. పదకొండేళ్లు ఉప ముఖ్యమంత్రిగా నాతో ఉన్నారు. ఇప్పుడాయన రాజ్యసభ సభ్యులు. మంచి ఫ్రెండ్ నాకు. రామలక్ష్మణులు అనేవాళ్లు మమ్మల్ని. రామలక్ష్మణులు ఫ్రెండ్స్‌లా ఉన్నారేమో తెలీదు. మేము మాత్రం అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం. వయసులో నేను సీనియర్. అనుభవంలో ఆయన సీనియర్. రాష్ట్రంలోని రెండు సభల్లో, కేంద్రంలోని రెండు సభల్లో సభ్యుడైన ఏకైక బిహార్ నేత ఆయన. అంతటి విజ్ఞుడు, అనుభవజ్ఞుడు ఏమంటారంటే... కేసీఆర్ పాట్నా వచ్చి నన్ను అవమానించి వెళ్లారట!! అది ఎలాంటి అవమానం అంటే.. ఆయన నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకుండానే వెళ్లిపోయారట!! బీజేపీలో కింది నుంచి పైదాకా అంతా మూర్తీభవించిన మోదీజీలే కనిపిస్తున్నారు! కేసీఆర్, నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవాలని ఎవరికి వాళ్లం పగటి కలలు కంటున్నామని సుశీల్ కుమార్ అంటున్నారు. అలాంటప్పుడు కేసీయార్ తన కలను పక్కన పెట్టి, పాట్నాలో నా కలను కనకపోవడం నాకు అవమానం ఎలా అవుతుంది? ‘‘నితీశ్‌జీ! మీరు పగటి కలలు కంటున్నారని సుశీల్‌జీ అంటున్నారు కానీ, నిజానికి అది సుశీల్‌జీ రేయింబవళ్లు కన్న కల. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మెప్పు కోసం సుశీల్‌జీ మిమ్మల్ని ‘పీఎం మెటీరియల్’ అంటుండేవారు గుర్తుందా..’’ అన్నారు నీరజ్. జేడీ(యు) స్పోక్స్ పర్సన్ ఆయన. నవ్వాన్నేను. పక్కనే రాజీవ్ రంజన్‌సింగ్, ఉమేశ్ కుష్వాహ ఉన్నారు. ‘‘రాజీవ్‌జీ! నాకు తెలీకుండా మీరేమైనా నేను ప్రధాని అభ్యర్థినని సుశీల్జీతో అన్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు నితీశ్‌జీ’’ అన్నారు రాజీవ్. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన. ‘‘ఉమేశ్జీ! మీరేమైనా నేను ప్రధాని అభ్యర్థినని సుశీల్జీతో అన్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు నితీశ్‌జీ..’’ అన్నారు ఉమేశ్. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన. నేషనల్ లెవల్లో ఎవరూ అనకుండా, స్టేట్ లెవల్లోనూ ఎవరూ అనకుండా ప్రధాని అవ్వాలని నేను కలగంటున్నట్లు సుశీల్‌జీ అనుకున్నారంటే అది సుశీల్జీకో, మోదీజీకో వచ్చిన పీడకల అయి ఉండాలి. వాళ్లకు పీడకల అంటే అది దేశ ప్రజలకు పీడ విరగడయ్యే కల. ప్రధాని అవడం ఏముంది? ఎవరైనా అవొచ్చు. వాజ్‌పేయి వంటి ప్రధాని దగ్గర పనిచేసే భాగ్యమే అందరికీ దక్కదు. అది నాకు దక్కింది. ప్రధాని మోదీజీకి కూడా దక్కనిది నాకు దక్కింది. ప్రధాని అవడం కన్నా, ‘ప్రధాని’ అభ్యర్థి అవడం కన్నా కూడా పెద్ద సంగతి అది! -
విజయ్ మాల్యా (లండన్) రాయని డైరీ
నాలుగేళ్లు అయింది నేను లండన్ వచ్చి. వచ్చిన రోజు నుంచి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నా మీద బెంగ పెట్టేసుకున్నాయి. ఇండియా రమ్మంటాయి! ‘నాతో ఏం పని.. డబ్బులు తీసుకెళ్లండి’ అంటాను. ‘డబ్బుల్తో ఏం పని.. నువ్వొస్తే బాగుంటుంది’ అంటాయి! ‘అసలు నువ్వెందుకొచ్చావ్ చెప్పూ..’ అన్నాను.. మూడేళ్ల క్రితం లండన్ కోర్టు బయట సుమన్ కుమార్ కనిపిస్తే ! ‘ఎక్కడికి రావడం? లండన్‌కా, లండన్ కోర్టుకా?’’ అన్నాడు! సీబీఐ ఆఫీసర్ అతను. ఇండియాలో వేరే ఫ్రాడ్లు ఏమీ లేనట్లు నన్ను వెతుక్కుంటూ బ్రిటన్ అంతా ఏడాది పాటు తిరిగి, చివరికి కోర్టు బయట నన్ను పట్టుకున్నాడు. ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం వస్తావా విజయ్’ అన్నాడు. ‘మాల్యా అను. విజయ్ అంటే నేను నేను కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాను. ‘విజయ్ అని అనకుంటే నేను సుమన్ కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాడు! ‘సరే చెప్పు, టీ తాగడం కోసం మాట్లాడ్డమా, మాట్లాడ్డం కోసం టీ తాగడమా? ఏదైనా మాట్లాడ్డమంత ఈజీ కాదు నాకు టీ తాగడం’ అన్నాను. ‘టీ తప్ప నాకు ఇంకేదీ తాగడం రాదు’ అన్నాడు. ‘అయితే ఇక్కడ మాట్లాడేందుకేం లేదు. ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకో.. నేను వెళ్తున్నా’ అన్నాను. ఆగమన్నాడు. ఆగాను. ‘ఐడీబీఐకి నువ్వు తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి. ఎస్బీఐకి తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి. నేను డబ్బు మనిషిని కాదు. వాటిని అడగడానికి రాలేదు. నిన్ను తీసుకెళదామని వచ్చాను’ అన్నాడు. ‘డబ్బులు కావాలంటే బ్యాగులో పెట్టిస్తా తీసుకెళ్లు. భుజానికి బ్యాగేసుకుని ఇండియా వచ్చేయమంటే నీ వెనకే వచ్చేవాళ్లు ఎవరూ లేరిక్కడ’ అని చెప్పాను. ‘నా వయసు యాభై రెండేళ్లు. ఇరవై మూడేళ్ల వయసులో ఫీల్డులోకి వచ్చాను. తెల్ల కాలర్ల మీద నల్ల మరకల్ని వెతికే డ్యూటీ నాది. బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా మన్మోహన్సింగ్ నాకు మెడల్ ఇచ్చారు. పోలీస్ మెడల్ వచ్చింది. రాష్ట్రపతి పోలీసు మెడల్ వచ్చింది. ఇన్ని వచ్చిన నాకు నీ కేసు అప్పగించారంటే నాకు కాదు గొప్ప. నీకు. వచ్చేయ్.. వెళ్లిపోదాం’ అన్నాడు! ‘డబ్బొక్కటే నా చేతుల్లో ఉంది. నేను నా చేతుల్లో లేను. డబ్బు కావాలంటే తీసుకెళ్లు. నేను కావాలంటే కోర్టు లోపల వాదించుకుని వెళ్లు..’ అని చెప్పాను. అప్పుడు వెళ్లినవాడు మళ్లీ కనిపించలేదు. సుమన్–2 ఎవరో కోర్టుకు వచ్చేవాడు ఫైళ్లు పట్టుకుని. ఫైల్ చూసుకుంటూ ఉండేవాడే కానీ పాపం నన్ను చూసేవాడు కాదు. మాల్యాను ఇరవై ఎనిమిది రోజుల్లో ఇండియా పంపిస్తాం అని కోర్టు చెప్పినప్పుడు కూడా తలెత్తి చూడలేదు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే బయటికి వస్తుంటే సుమన్ ఫోన్ చేశాడు. ‘‘ఎక్కడా?’’ అన్నాను. ‘‘ఇండియాలో’’ అన్నాడు. ‘‘ఏంటి చెప్పు’’ అన్నాను. ‘‘సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడానికి లేదని కోర్టు తీర్పు చెప్పిందటగా. ముందే నాతో ఇండియా వచ్చి వుంటే.. ఇప్పుడిలా తీర్పు వచ్చేదే కాదు’’ అన్నాడు! ‘‘క్యాష్ ఇస్తా. డౌన్ పేమెంట్. మోయగలిగితే వచ్చి తీసుకెళ్లు. కొత్త నోట్లు. వాసన చూసి తీసుకో. మోదీజీలా ఇరవై లక్షల కోట్లు ఇస్తున్నానని చెప్పి పప్పులు ఉప్పులు ప్యాక్ చేసి ఇవ్వడం కాదు. ఫెళపెళలాడే కరెన్సీ’’ అన్నాను. ‘‘కరెన్సీ వద్దు. విజయ్ కావాలి నాకు’’ అన్నాడు! ‘‘విజయ్ కూడా కాదు, మెడల్స్ కావాలి నీకు. íపీఎం మెడలు, ప్రెసిడెంట్ మెడలు.. ఇస్తే ఐడీబీఐ మెడలు, ఎస్బీఐ మెడలు కూడా వేసుకుంటావ్ నువ్వు’’ అని ఫోన్ పెట్టేశాను. సుప్రీంకోర్టు కాకపోతే, మానవ హక్కుల కోర్టు. ఫ్రాన్స్‌కు వెళ్లకుండా ఇండియా వస్తానని ఆశిస్తున్నందుకు కూడా సుమన్‌కి ఒక మెడల్ ఏదైనా చేయించి ఇవ్వాలి. -
ఎల్.కె. అద్వానీ.. రాయని డైరీ
రాహుల్ గాంధీకి లైన్ కలపమని చెప్పి కొన్ని ఏళ్లు అయినట్లుగా ఉంది. ‘‘ఏమైంది, దొరకట్లేదా?’’ అన్నాను. ‘అయ్యో అద్వానీజీ.. మీకు ఇప్పటికే కనీసం కొన్నిసార్లు చెప్పి ఉంటాను. రాహుల్జీ కొన్నాళ్లుగా రఘురామ్ రాజన్, అభిజిత్ బెనర్జీలతో ఉంటున్నారట’ అన్నాడు నాకు కేటాయించబడిన యువ సహాయకుడు. తొంభై ఏళ్లు పైబడిన వ్యక్తికి తొంభై ఏళ్లు పైబడిన సహాయకుడు మాత్రమే ఉపకరించే సహాయకుడిలా ఉండగలడేమో! అభిజత్ బెనర్జీ కోల్‌కతాలో ఉన్నట్లు విన్నాను. రాజన్ ఈ మధ్య భోపాల్ వెళ్లినట్లున్నాడు. రాహుల్ వేయనాడ్లో ఉండాలి. అక్కడ లేకపోతే ఢిల్లీలో ఉండాలి. ఈ ముగ్గురూ ఎక్కడ కలుసుకుంటున్నట్లు! లాక్డౌన్లో గాయపడిన ఎకానమీకి కట్టు కడతానని దూది, గాజుగుడ్డ, టించరు బాటిలు పట్టుకుని కొన్నాళ్లుగా తిరుగుతున్నాడు రాజన్. అభిజిత్‌కి ఆర్థికశాస్త్రంలో నోబెల్ వచ్చింది కాబట్టి తనూ ఏదో ఒకటి పట్టుకుని తిరగాలి. వాళ్లిద్దర్నీ పట్టుకున్నట్లున్నాడు రాహుల్. లాక్డౌన్ అని మూత వేసుకుని కూర్చుంటే నెలాఖరు తర్వాత అకౌంట్లో తెరిచి చూసుకోడానికి ఏముంటుంది అని మోదీజీ అడగడానికి రాహుల్ వాళ్లిద్దరితో ఉంటున్నట్లుంది. అయినా ఉండటమేంటి! అదే అడిగాను నా యువ సహాయకుడిని. ‘‘జూమ్ వీడియోలో ఉంటున్నారట అద్వానీజీ’’ అన్నాడు. మళ్లీ ఒకసారి రాహుల్ కోసం ప్రయత్నించమని చెప్పాను. ‘నాకు నిద్ర వచ్చేలోపు ప్రయత్నించు’’ అని కళ్లు మూసుకున్నాను. ‘‘అద్వానీజీ.. లైన్లో రాహుల్జీ’’ అన్నాడు యువ సహాయకుడు! నన్ను నిద్రపోనివ్వకూడదనుకుని నేను నిద్రపోయే వరకు వేచి ఉండి అప్పుడు లైన్లోకి వచ్చాడా ఏంటి! ఫోన్ తీసుకున్నాను. ‘‘నమస్తే అద్వానీజీ’’ అన్నాడు. ‘‘నమస్తే రాహుల్ బాబు. చక్కగా మాట్లాడుతున్నావు ఈ మధ్య. చక్కగా కూడా కనిపిస్తున్నావు. కుర్తా పైజమా మీదకు ఆ నల్లటి జాకెట్ ఉండటం లేదిప్పుడు. రిలీఫ్‌గా ఉంది నిన్ను అలా చూస్తుంటే..’’ అన్నాను. రాహుల్ నవ్వాడు. ‘‘థ్యాంక్యూ అద్వానీజీ. ఎందుకు కాల్ చేయించారు’’ అన్నాడు. ‘‘ఏం లేదు. నేను, జోషి, ఉమ, కల్యాణ్.. జూమ్‌లో కలుసుకుంటున్నాం. నువ్వూ కలుస్తావేమోనని’’ అన్నాను. ‘‘ఓ.. బాబ్రీ కూల్చివేత కేసు! ఆగస్టులోపు తేల్చేయమంది కదా కోర్టు. అయినా అద్వానీజీ.. స్థలం ఎవరిదన్నది తేలిపోయాక, కూల్చిందెవరన్నది మాత్రం తేలిపోకుండా ఉంటుందా?’’ అన్నాడు రాహుల్. ‘‘మంచి మాట చెప్పావు రాహుల్ బాబు. జూమ్‌కి కనెక్ట్ అవుతావా.. నేను, నువ్వు, జోషి, ఉమ, కల్యాణ్ మాట్లాడుకుందాం’’ అన్నాను. ‘‘అది మీ పర్సనల్ విషయం కదా అద్వానీజీ. నేనెందుకు స్క్రీన్ పైకి రావడం?’’ అన్నాడు. ‘‘మా నలుగురిదీ ఒక పర్సనల్ విషయం. నాదొక్కటే ఒక పర్సనల్ విషయం రాహుల్ బాబూ. నీకు చేతులు జోడిస్తే ఫోన్లో నీకు కనిపించదు కదా. అందుకే నిన్నూ కలవమని అడుగుతున్నా..’’ అన్నాను. ‘‘అద్వానీజీ!! మీరు నాకు చేతులు జోడించడం ఏమిటి? పెద్దవాళ్లు మీరు’’ అన్నాడు ఆశ్చర్యం కలిసిన గొంతుతో. ‘‘ఆ మాట అనొద్దనే నీకు చేతులు జోడించాలనుకుంటున్నా రాహుల్ బాబూ. కరోనా వల్ల ప్రమాదం పెద్దవాళ్లకే గానీ, మిగతా వాళ్లకేమీ భయం లేదని ప్రచారం చెయ్యమని మోదీజీకి చెబుతున్నావు. పెద్దవాళ్లకు కదా ధైర్యం చెప్పాల్సింది’’ అన్నాను. ‘‘ఓ.. సారీ అద్వానీజీ. ఎకానమీ బతికితే చాలనుకున్నాను. ఈ యాంగిల్ నాకు తట్టలేదు’’ అన్నాడు!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : రతన్ టాటా (గౌరవ చైర్మన్)
కుర్చీకి తగని వ్యక్తిని తెచ్చిపెట్టుకుంటే కుర్చీ ఎంత చిన్నదైనా అది ఆ వ్యక్తికి పెద్దదే అవుతుంది. టాటా కంపెనీలో అసలు చిన్న కుర్చీలే ఉండవు. కుర్చీ ఎత్తుకు ఎదగాలని రోజూ ఆ కుర్చీలో కూర్చుని లేచే వాళ్లకు అనిపించాలి. అప్పుడే వాళ్లూ ఎదుగుతారు. కంపెనీ ఎదుగుతుంది. సైరస్ మిస్త్రీ అలా అనుకోలేదు! చైర్మన్‌గా కుర్చీలో కూర్చున్న రోజే.. ‘కుర్చీ నాకు చిన్నదైపోయింది రతన్జీ..’ అని నా క్యాబిన్‌కి వచ్చి కంప్లయింట్ చేశాడు! కంప్లయింట్ చేస్తూ.. నేను కూర్చొని ఉన్న కుర్చీ వైపు చూశాడు. ‘నీ కుర్చీ నీకు చిన్నదైందని నువ్వు అనుకున్నా, నా కుర్చీ నీకేమీ పెద్దదవదు మిస్త్రీ.. ఏం చేద్దాం?’’ అన్నాను. ‘కూర్చోడానికి కుర్చీ సరిపోనప్పుడు, కనీసం కాళ్లు చాపుకుని కూర్చోడానికి కాళ్ల దగ్గర ఇంకో కుర్చీ వేసుకునే ఏర్పాటైనా ఉండాలి రతన్జీ. అయితే నేను కాళ్లు చాపుకుని కూర్చోవాలని అనుకుంటున్న వైపు మీ క్యాబిన్ ఉంది. అది మీకు గౌరవం కాదు. పైగా టాటా కంపెనీలో నేను గౌరవించే ఏకైక వ్యక్తి మీరు’ అన్నాడు! మిస్త్రీ ఏమంటున్నాడో అర్థమైంది. నన్నిక ఆఫీస్‌కి రావద్దంటున్నాడు! పాత చైర్మన్ కళ్లముందే కనిపిస్తుంటే.. కొత్త చైర్మన్‌ని ఆఫీస్‌లో ఎవరు చూస్తారు అని హెచ్ఆర్ మేనేజర్ రాజన్‌తో అన్నాడని కూడా తెలిసింది. ‘‘నేను గౌరవం ఇచ్చే మనిషినే కానీ, తిరిగి గౌరవం కోరుకునే మనిషిని కాదు మిస్త్రీ. మీరు మీ కాళ్లను ఎటువైపు పెట్టుకునైనా కూర్చోడానికి ఒక కుర్చీని తెప్పించుకునే ఏర్పాట్లను మీరు నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు’ అని చెప్పాను. అతడు వెళ్లిపోయిన కొద్ది సేపటికి హెచ్ ఆర్ మేనేజర్ నా క్యాబిన్లోకి వచ్చారు. ‘కూర్చోండి రాజన్’ అన్నాను. ‘మిమ్మల్నో విషయం అడగడానికి వచ్చాను రతన్జీ. ఆ విషయాన్ని నేను నిలబడి కూడా అడగ్గలను’ అన్నాడు. ‘అడగండి రాజన్జీ’ అన్నాను. ‘రతన్జీ.. సెక్షన్ హెడ్లంతా కొత్తగా కనిపిస్తున్నారు. వాళ్లెవరూ నేను రిక్రూట్ చేసినవాళ్లు కాదు. రోజూ మధ్యాహ్నం క్యాంటీన్లో కూడా వాళ్లు కనిపిస్తున్నారు. ‘ఎక్స్క్యూజ్ మీ.. మీరెవరో నేను తెలుసుకోవచ్చా?’ అని వాళ్లలో ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి ఫ్రెండ్లీగా అడిగాను. ‘మిస్త్రీ ఎవరో మీకు తెలుసా?’ అని ఆ వ్యక్తీ నన్ను ఫ్రెండ్లీగా అడిగాడు’ అన్నారు రాజన్. ‘అవునా!’ అన్నాను. ‘వాళ్లెవరో నాకు మాత్రమే తెలియదా, మీక్కూడా తెలియదా అని అడగడానికే మీ దగ్గరికి వచ్చాను రతన్జీ’ అన్నాడు. ‘ఇద్దరికీ తెలియదంటే.. మిస్త్రీకి తెలిసే ఉంటుంది’ అని నవ్వాను. వెళ్లిపోయాడు. వెళ్లిన కొద్ది సేపటికే మళ్లీ వచ్చాడు! ‘ఏంటి రాజన్!’ అన్నాను. ‘నా కుర్చీలో పద్మనాభన్ అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు రతన్జీ. ‘ఎవరు మీరు?’ అని నేను అడిగేలోపే, ‘అడక్కుండా లోపలికి వచ్చేయడమేనా! ఇదేమైనా రతన్ టాటా క్యాబిన్ అనుకున్నావా? హెచ్ ఆర్ మేనేజర్ క్యాబిన్..’ అని, బెల్ కొట్టి నన్ను బయటికి పంపించాడు’ అని చెప్పాడు రాజన్! నాలుగేళ్లు కుర్చీలో ఉన్నాడు మిస్త్రీ. ఆ నాలుగేళ్లూ టాటా కంపెనీ అతడి కాళ్ల కింది కుర్చీలానే ఉండిపోయింది. ‘రతన్జీ.. అతడిని చైర్మన్‌ని చేసి మీరు పెద్ద తప్పు చేశారు’ అన్నారు కంపెనీ స్టాఫ్. అలా అన్న రోజే మిస్త్రీని బయటికి çపంపించాను. ‘పంపడం కుదరదు’ అని కంపెనీ ‘లా’ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాడు మిస్త్రీ. కుర్చీ కన్నా చిన్నవాళ్లే కుర్చీ కోసం పోరాటాలు చేయగలరు. మిస్త్రీ మూడేళ్లు పోరాడాడు. కుర్చీ గౌరవం కాపాడేందుకు టాటా మాత్రం పోరాడకుండా ఉంటుందా? -
బిపిన్ రావత్ (ఆర్మీ చీఫ్)
మంచి మాట చెప్పడానికి లేనప్పుడు మంచి స్థానంలో ఉండి వ్యర్థమనిపిస్తుంది. ‘ పిల్లల్ని చదువుకోనివ్వండి. వాళ్ల హాస్టళ్లలోకి వెళ్లి పాలిటిక్స్ ప్లే చెయ్యకండి’ అని మంచి చెప్పినందుకు..‘ఆర్మీ చీఫ్ మంచి చెప్పడం ఏంటని’ రెండు రోజులుగా దేశంలో మంచి–చెడు, భారత్–పాక్, హిందూ–ముస్లిం అని డివైడ్ టాక్ నడుస్తోంది! దేశం ఒక్కటే, దేశంలోని మనుషులంతా ఒక్కటే అని మళ్లీ నాచేత మంచి చెప్పించుకునేంత వరకు ఈ నాయకులు ఆగేలా లేరు. మంచి చెప్పేవాళ్లు లేకపోతే మంచి చెయ్యడానికి ఆర్మీ దిగవలసి వస్తుంది. ఒకేసారి మంచి చెయ్యడానికి దిగకుండా, మొదటే మంచి చెబితే మంచికి దిగే అవసరం ఉండదని చెప్పడం మంచి ప్రయత్నమే కదా! అయినా నేనెందుకు మంచి మాట్లాడానో నాకు గుర్తుకు రావడం లేదు. నా చేత మంచిని మాట్లాడించిన వాళ్లెవరో కూడా గుర్తు లేదు. ఏదో హెల్త్ ప్రోగ్రామ్‌కి పిలిస్తే వెళ్లాను. బాగా గుర్తు చేసుకుంటే అక్కడ నేను మాట్లాడిన రెండు మంచి మాటలు మాత్రం గుర్తుకొస్తున్నాయి. నాయకుడంటే ఎలా ఉండాలో చెప్పాను. నాయకుడు ముందు నడవాలనో, వెనకుండి ముందుకు నడిపించాలనో చెప్పాను. అంత వరకే! ఇంటికొచ్చి టీవీ చూసుకుంటే.. నేను వెళ్లిన హెల్త్ ప్రోగ్రామ్ రావడం లేదు. హెల్త్ ప్రోగ్రామ్‌లో నేను మాట్లాడిన మంచి మాటలు రావడం లేదు. యోగేంద్ర యాదవ్ అనే ఆయన టెలికాస్ట్ అవుతున్నాడు! ‘ఆయన అన్నది నిజమే’ అంటున్నాడు. ‘మోదీని దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ మాట అన్నాడు’ అంటున్నాడు. ఎవరీయన అని చూశాను. ‘హక్కుల కార్యకర్త’ అని పేరు కింద వేస్తున్నారు. ‘ఆయన’ అని ఆయన అంటున్నది నా గురించే! దిగ్విజయ్ సింగ్, అసదుద్దీన్ ఒవైసీ, బ్రిజేష్ కాలప్ప.. ఇంకా ఎవరెవరో స్క్రీన్ మీదకు వచ్చిపోతున్నారు. కాలప్ప పేరు వినగానే నాకు జనరల్ కరియప్ప గుర్తుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ ఫస్ట్ జనరల్ ఆయన. కరియప్ప కూడా డ్యూటీలో ఉండగా మంచి మాట్లాడే ఉంటారు. అప్పుడిన్ని పేపర్లు, ఇన్ని టీవీ చానళ్లు, ఇన్ని ప్రతిపక్షాల లేవు కాబట్టి ఆయన మంచి మాటలు రంగు మారకుండా మంచి మాటలుగానే ప్రజల్లోకి వెళ్లి ఉంటాయి. ఈ కాలప్ప ఎవరా అని చూశాను. కాంగ్రెస్ స్పోక్స్‌పర్సన్! ‘పౌరసత్వ చట్టం గురించి రావత్‌ని మాట్లాడనిస్తే, చట్టాన్ని తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టినట్లే’ అంటున్నాడు! ఒవైసీ కూడా వేలు పైకెత్తాడు. ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అంటున్నాడు. అంటే నన్ను హద్దుల్లో ఉండమని! ఆయనకెప్పుడూ హద్దుల గొడవే! దిగ్విజయ్ కూడా ఏదో అన్నాడు కానీ, ఏదో ఒకటి అనకపోతే బాగుండదన్నట్లుగా అన్నాడు. ‘పర్స్ జాగ్రత్త’ అని అకౌంటెంట్ జనరల్ చెబితే తప్పు లేదు, ‘పాలన జాగ్రత్త’ అని అటార్నీ జనరల్ చెబితే తప్పు లేదు, ‘విద్యార్థులు జాగ్రత్త’ అని ఆర్మీ జనరల్ చెబితే తప్పయిందా! నేనైనా నాయకులు ఎలా ఉండాలో చెప్పకుండా, ప్రజలు ఎలా ఉండాలో చెప్పి ఉండాల్సింది. ఆ తేడాను నాయకులు అర్థం చేసుకునేలోపు నా రిటైర్మెంట్ వచ్చేసేది. అప్పుడీ ఒవైసీకి, కాలప్పకీ మాట్లాడ్డానికి ఏమీ దొరక్కపోయేది. డిసెంబర్ 31న నా రిటైర్మెంట్. కొత్తగా పెట్టిన ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ పోస్టులోకి నన్ను తీసుకోవడం కోసం మోదీకి అనుకూలంగా మాట్లాడానని వీళ్ల అనుమానం. పైకి మాట్లాడేవారికి మోదీ ఎప్పుడూ పవర్ ఇవ్వలేదు. నేనూ అంతే. పవర్ కోసం పైకి మాట్లాడకుండా ఉన్నదెప్పుడూ లేదు. పవర్ రావడం, పవర్లో ఉండటం, పవర్ పోవడం.. వీటి గురించి పవర్ఫుల్ మనుషులెప్పుడూ పట్టించుకోరు. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : వెంకయ్య నాయుడు
మాట్లాడే భాష వినబుద్ధి అవదు. మాట్లాడలేని భాషను వదలబుద్ధి కాదు. భాషల్లోని వైరుధ్యమా లేక ఇది మనుషుల్లోని వైపరీత్యమా! పార్లమెంటు ప్రాంగణంలో తటాలున కొందరు ఎదురుపడి ‘నమస్కారమండీ వెంకయ్యనాయుడు గారూ.. బాగున్నారా’ అని పలకరిస్తుంటారు. మందంగా నవ్వుతాను. ‘బాగున్నాను’ అని చెప్పడం అది. దేవుడు మనిషికి మందస్మితం పెట్టడం మంచిదైంది. మాట్లాడే ఓపిక లేనపుడు, మాట్లాడే ఆసక్తి లేనప్పుడు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ‘హాయ్.. వెంకీ, హవ్యూ’ అని వెళ్లిపోతుంటారు కొందరు. అది నాకు సుఖంగా, సౌఖ్యంగా ఉంటుంది. పొడవాటి కుశలపు పలకరింపు షార్ట్ కట్‌లోకి అనువాదం అవడం వల్ల లభ్యమైన సుఖసౌఖ్యాలు కావచ్చవి. లేదా, నేను బదులు చెప్పే భారాన్ని వాళ్లు నాపై పెట్టి నేను ఆ బరువును వాళ్ల కళ్లెదుటే దించుకునే వరకు అక్కడే ఎదురుచూడకుండా వాళ్ల మానాన వాళ్లు వెళ్లిపోవడం వల్ల కావచ్చు. రాని భాష రాహుల్‌గాంధీని కూడా మంచి వక్తను చేస్తుంది! టీవీ మ్యూట్‌లో ఉండగా చూశాను. మలప్పురంలో ఏదో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే అక్కడ కేరళలో ఏం పని! రాహుల్ ఒక్కో మాటకు జనం హర్షధ్వానాలు చేస్తున్నారు! అంతగా ఏం మాట్లాడుతున్నాడా అని మ్యూట్ని తీసి చూశాను. రాహుల్ వేదికను అలంకరించి ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే పక్కనే ఒక విద్యార్థిని నిలబడి ట్రాన్స్‌లేట్ చేసి చెప్తోంది. ‘నౌ’ అని రాహుల్ అంటే.. ‘ఇప్పో’ అని ఆ అమ్మాయి, ‘ఫస్ట్ ఆఫ్ ఆల్’ అని రాహుల్ అంటే.. ‘ఒన్నామటై’ అని ఆ అమ్మాయి. ఏదో స్కూల్ కార్యక్రమం. చీఫ్‌గెస్ట్‌గా వెళ్లినట్లున్నాడు. అ అమ్మాయి కారణంగా ఇంగ్లిష్ వినసొంపుగా మలయాళంలోకి తర్జుమా అయి అక్కడ ఉన్నవాళ్లందరి చేతా చప్పట్లు కొట్టిస్తోంది. శుక్రవారం రాజ్యసభలో సరోజినీ హేంబ్రమ్ తన సొంత సంతాలీ భాషలో మాట్లాడినప్పుడు కూడా.. ఆ స్కూల్ అమ్మాయి మలయాళం మాట్లాడుతున్నట్లే ఉంది వినబుద్ధయ్యేలా. సభలో అంతా చప్పట్లు. రాజ్యసభలో మునుపెవరూ వినని భాష! రఘునాథ్ ముర్ము అనే ఆయన ఆ భాషకు లిపిని కనిపెట్టారని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని సరోజినీ హేంబ్రమ్ డిమాండ్. జేఎన్‌యూలో పీహెచ్డీ చేస్తున్న అమ్మాయిని రాజ్యసభలో రెడీగా కూర్చోబెట్టి సంతాలీని అక్కడికక్కడ హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేయించుకుంటే ఇవన్నీ తెలిశాయి. ‘‘ప్రతి సమావేశంలోనూ ఇవన్నీ చెప్పడానికి ట్రైచేస్తున్నాను నాయుడూజీ’’ అన్నారు సరోజిని.. జీరో అవర్ ముగిశాక. ‘‘అవును ఒకసారి సభ ఎడ్జార్న్ అయింది. ఒకసారి డిస్కషన్‌కి టైమ్ తక్కువైంది కదా’’ అన్నాను. ‘‘ఈ సమావేశాలు కాదు నాయుడూజీ. నేను రాజ్యసభ సభ్యురాలిని అయినప్పటి నుంచీ ట్రై చేస్తున్నాను. ఇంకో ఏడాదికి నా టెర్మ్ అయిపోతుంది. నా భాషలో నేనిక ఎప్పటికీ మాట్లాడలేనేమో అనుకున్నాను. మీరు మాట్లాడనిచ్చారు’’ అన్నారు సరోజిని నాకు ధన్యవాదాలు తెలుపుతూ. ‘‘నేను మాట్లాడనిచ్చేదేముందీ సరోజినీజీ. మీ భాషను మీరు మాట్లాడకుండా మిమ్మల్ని ఎవరు ఆపగలరు.. రాజ్యసభలోనైనా, లోక్‌సభలోనైనా, ఒరిస్సాలోనైనా, ఓవర్సీస్లోనైనా..’’ అన్నాను. ‘‘మాట్లాడేవాళ్లు లేకపోతే కాదు నాయుడూజీ, వినేవాళ్లు లేకపోతే ఏ భాషైనా చచ్చిపోతుంది’’ అన్నారు సరోజినీ. కరెక్ట్ అనిపించింది. ‘‘బాగా చెప్పారు అనే మాటను మీ సంతాలీ భాషలో ఏమంటారు సరోజినీజీ’’ అని అడిగాను. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: అమిత్ షా (బీజేపీ అధ్యక్షుడు)
‘‘పులి ప్రెసిడెంట్ రూల్కి భయపడదు అమిత్జీ. అదిగో పులి అంటారు కానీ, అడుగో ప్రెసిడెంట్ అని ఎవరూ అనరు’’ అన్నాడు ఉద్ధవ్ ఠాక్రే సడన్‌గా ఫోన్ చేసి. ‘‘నేను అమిత్‌షాని ఉద్ధవ్’’ అన్నాను. ‘‘బిడ్డకు పాలిచ్చి వస్తానని ఆవు పులికి ప్రామిస్ చేసింది కానీ, బిడ్డకు పాలిచ్చి వచ్చే వరకు నిన్నేమీ చెయ్యను పో అని పులి ఆవుకు ప్రామిస్ చెయ్యలేదు అమిత్జీ’’ అన్నాడు! ‘‘నేను అమిత్‌షాని ఉద్ధవ్’’ అన్నాను. ‘‘నేను మిమ్మల్ని అమిత్జీ అంటున్నానంటే మీరు అమిత్‌షా అని తెలిసే మాట్లాడు తున్నానని అర్థం అమిత్జీ. మీతో మాట్లాడుతున్నది ఉద్ధవ్ ఠాక్రేనేనా అని మీకు తెలుసుకోవాలని ఉంటే మాత్రం చెప్పండి. ‘నేను ఉద్ధవ్ ఠాక్రేని మాట్లాడుతున్నాను’ అని చెప్పి మీతో మాట్లాడ తాను’’ అన్నాడు! బాగా ప్రశాంతంగా ఉన్నట్లున్నాడు! ‘‘పులి ప్రశాంతంగా ఉంటే పులిగా దానిని గుర్తు పట్టడం కష్టం ఉద్ధవ్’’ అన్నాను. ‘‘అర్థం కాలేదు అమిత్జీ!’’ అన్నాడు. ‘‘పులెప్పుడూ పులుల గురించి మాట్లాడదు ఉద్ధవ్. మనుషులే పులుల గురించి మాట్లాడ తారు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను.. మాట్లాడుతున్నది మీరేనా అని’’ అన్నాను. ‘‘అమిత్జీ.. ఈ పులి.. పులుల గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే.. మనుషులు పులిని పట్టించుకోవడం మానేశారు! అది నేను నమ్మలేకపోతున్నాను. ఎన్నికల ముందు ఒక మనిషి పులి ఇంటికి వచ్చాడు. ‘పులీ పులీ.. ఎన్నికలయ్యాక అడవిని కొన్నాళ్లు నువ్వు పాలించు, కొన్నాళ్లు నేను పాలిస్తా’ అన్నాడు. పోనీలే పాపం.. మనిషి కదా, ఆశలు ఉంటాయి కదా అని ‘సరే’ అన్నాను. ఎన్నికలయ్యాక ఇప్పుడు.. ‘నేనొక్కడినే పాలిస్తా. నువ్వు నీ బిడ్డకు పాలివ్వడానికి వెళ్లు. బిడ్డకు పాలిచ్చి మళ్లీ రానక్కర్లేదు’ అని పులికే అభయం ఇస్తున్నాడు. ‘పులేంటి, బిడ్డకు పాలివ్వడం ఏంటి?’ అని అడిగాను. ‘ఇంకేం మాట్లాడకు. ప్రెసిడెంట్ వచ్చాడంటే నీకూ ఉండదు, నాకూ ఉండదు. అడవి ప్రెసిడెంట్ది అయిపోతుంది’ అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు’’ అన్నాడు ఉద్ధవ్. అతడు చెప్పిన కథలో, చెప్పకూడదనుకున్న నీతి ఏమిటో నాకు అర్థమైంది. ‘నా కొడుకు సి.ఎం. కాకుండా వేరెవరైనా సి.ఎం. ఎలా అవుతారో నేనూ చూస్తాను’ అని అంటున్నాడు! ‘‘అమిత్జీ.. ఈరోజు పేపర్ చూశారా? నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద పులి జాడ కనిపించిందట! పొలాల్ని, పెన్‌గంగా నదినీ దాటేసింది. ఐదు నెలల్లో రెండు వందల మైళ్లు ప్రయాణించింది! పార్ట్నర్ కోసం, కొత్త ప్లేస్ కోసం పులులు మైళ్లకు మైళ్లు నడుస్తాయట. సి1 అని పేరు పెట్టారు ఆ పులికి. నన్నడిగితే ఆదిత్యా ఠాక్రే అని పెట్టమని చెప్పేవాడిని. పేరుకు తగ్గ పులిలా ఉండేది’’ అన్నాడు ఉద్ధవ్. పుత్రోత్సాహం పీక్స్‌కి వెళ్లినట్లుంది! ‘‘పులి కొత్త ప్లేస్ వెతుక్కుంటూ వెళ్లే మాట నిజమే ఉద్ధవ్. అయితే ఫలానా కొత్త ప్లేస్ మాత్రమే కావాలని వెతుక్కుంటూ వెళ్లదు. ముఖ్యమంత్రి ప్లేసా, ఉప ముఖ్యమంత్రి ప్లేసా అని పులి చూసుకోదు’’ అన్నాను. ఉద్ధవ్ ఏమీ మాట్లాడలేదు. ‘‘పులి పార్ట్నర్ని వెతుక్కుంటూ వెళ్లే మాట కూడా నిజమే ఉద్ధవ్. అలాగని పులులు కాని వాటిని పులి పార్ట్‌నర్స్‌గా చేర్చుకోదు. ఎన్సీపీకి, కాంగ్రెస్‌కి ఉన్నవి పులిచారలే తప్ప, అవి పులులు కావు’’ అన్నాను. ఉద్ధవ్ ఏమీ మాట్లాడలేదు. ఫోన్ కట్ అయిందేమో చూశాను. లైన్ లోనే ఉన్నాడు! కానీ మాట్లాడ్డం లేదు. ‘హలో ఉద్ధవ్!’ అన్నాను. నో రెస్పాన్స్! ఉలిక్కిపడ్డాను. పులి కంటే పులిజాడ ఎక్కువ భయపెడుతుంది. -మాధవ్ శింగరాజు -
శరద్ పవార్ (ఎన్సీపి).. రాయని డైరీ
ఇంట్లోంచి బయటికి వెళుతుంటే బయటి నుంచి ఇంట్లోకి వస్తూ కనిపించాడు ముంబై పోలీస్ కమిషనర్. ‘‘సంజయ్ బార్వే!’’ అన్నాను. అవునన్నట్లుగా తల ఊపి, ‘‘పవార్జీ మీరు నన్ను సంజయ్ బార్వేగా గుర్తించడం అన్నది ఈ మధ్యాహ్నం నాకెంతో సంతోషాన్నిచ్చిన విషయంగా నాకెప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నాడు. ‘‘చెప్పు బార్వే.. ఇంట్లోంచి నేను పూర్తిగా బయటికి వచ్చాక నన్ను అరెస్ట్ చేస్తావా? నేనింకా ఇంట్లోనే ఉండగానే నువ్వే ఇంటి లోపలికి వచ్చి నన్ను అరెస్టు చేస్తావా? ఏది గొప్పగా ఉంటుంది నీకు, మీ డిపార్ట్‌మెంట్‌కీ?’’ అని అడిగాను. పెద్దగా నవ్వాడు బార్వే. ‘‘పవార్జీ.. నేనిప్పుడు లోపలికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసినా, మీరు బయటికి వచ్చే వరకు ఆగి అప్పుడు అరెస్ట్ చేసినా అది మీకే గొప్ప అవుతుంది కానీ.. నాకు, మా డిపార్ట్మెంటుకు గొప్ప అవదు. పవార్జీ.. మొదట మీకొక విషయం చెప్పడానికి మీరు నన్ను అనుమతించాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి కాదు’’ అన్నాడు. నవ్వాను. ‘‘అయితే చెప్పు బార్వే, మహారాష్ట్ర ఎన్నికలయ్యే వరకు మహారాష్ట్రలోని ఏ ఒక్క ప్రాంతానికీ నేను కదిలే వీలు లేకుండా చేసే ఆలోచన ఏదైనా మీ ముఖ్యమంత్రి మనసులో ఉండి, ఆ ఆలోచనను చక్కగా అమలు పరిచే విషయమై నా సహకారాన్ని కోరేందుకు వచ్చావా?’’ అని అడిగాను. ‘‘మిమ్మల్ని కదలకుండా చెయ్యడానికో, మిమ్మల్ని కదలకుండా చేసేందుకు ఏవైనా ఐడియాలుంటే చెప్పమని మిమ్మల్నే అడగడానికో నేనిప్పుడు రాలేదు పవార్జీ. మీ చేత ఒట్టు వేయించుకోడానికి వచ్చాను’’ అన్నాడు! ‘‘ఒట్టు దేనికి బార్వే’’ అన్నాను. ‘‘మీకై మీరుగా ఎప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం మెట్లెక్కి వెళ్లి అరెస్ట్ కానని నా మీద ఒట్టు వెయ్యాలి పవార్జీ’’ అన్నాడు! ‘‘కానీ.. వాళ్లు నన్ను పిలవాలని అనుకుంటున్నారన్న సంగతి తెలిసి కూడా వాళ్లు నన్ను పిలిచేవరకు నేను ఆగగలనని మీరంతా ఎందుకు అనుకుంటారు బార్వే. నేను బీజేపీ మనిషిని కానంత మాత్రాన నాక్కొన్ని ఎథిక్స్ ఉండకూడదా?!’’ అన్నాను. ‘‘కానీ పవార్జీ.. మీరు ఎథిక్స్ కోసం అరెస్ట్ అయిన మరుక్షణం ముంబై తన ఎథిక్స్ అన్నింటినీ వదిలేస్తుంది. ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్‌లో మీ పేరు వినిపించడం కన్నా, ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్‌లో మీరు అరెస్ట్ అవడం పెద్ద విషయం. వెంటనే శాంతిభద్రతలు దెబ్బతింటాయి. వెంటనే ఈ మహానగరం వెంటిలేటర్ మీదకు వెళ్లిపోతుంది’’ అన్నాడు బార్వే. అని ఊరుకోలేదు. ఒట్టు వెయ్యాల్సిందే అన్నట్లు చెయ్యి చాచాడు. ‘‘బార్వే.. అజిత్ పవార్ ఎవరో నీకు తెలిసే ఉంటుంది. మా పార్టీ ఎమ్మెల్యే. ఎందుకు రాజీనామా చేశాడో తెలుసా? స్కామ్‌లో తన పేరు ఉన్నందుకు కాదు. నా పేరు కూడా ఉన్నందుకు! అన్న కొడుకు. హర్ట్ అవడా మరి. అతడు హర్ట్ అవడం అతyì ఎథిక్. నేను అరెస్ట్ అవాలనుకోవడం నా ఎథిక్’’ అన్నాను ఒట్టేయకుండా. వెయ్యాల్సిందే అన్నట్లు నిలుచున్నాడు. ‘‘అయితే నువ్వూ నాకొక ఒట్టు వెయ్యాలి బార్వే’’ అన్నాను. ‘‘మీరు ఈ ఒట్టేస్తే నేను ఏ ఒటై్టనా వేస్తాను పవార్జీ’’ అన్నాడు. ‘‘అరెస్ట్ అవను అని నేను ఇక్కడ ఒట్టేశాక, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కి వెళ్లి ‘అరెస్టు చేయం’ అని నువ్వు అక్కడ ఒట్టేయించు కోకూడదు. అలాగని ఒట్టేయ్’’ అన్నాను. -
హెచ్.డి. దేవెగౌడ (జేడీఎస్) : రాయని డైరీ
కుమారస్వామి వచ్చి కూర్చున్నాడు. ‘‘నేనిక కూర్చోలేను నాన్నగారూ’’ అన్నాడు. ‘‘ఇప్పుడైనా నువ్వు కూర్చొని ఉన్నావని ఎందుకు అనుకుంటున్నావు?’’ అన్నాను. చప్పున కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుమారస్వామి చాలా సెన్సిటివ్. ఏదీ ఆపుకోలేడు. కన్నీళ్లను అసలే ఆపుకోలేడు. అభినందన సభల్లో చేతికి అందిన పుష్పగుచ్ఛం కూడా అతడిని ఏడిపిస్తుంది. అంత మృదు హృదయుడు సీఎంగా నిలబడగలిగాడంటే, అదీ కాంగ్రెస్ సపోర్ట్‌తో ఒక ఏడాది కాలాన్నయినా పూర్తి చేశాడంటే గొప్ప సంగతే.’’ ‘‘కళ్లు తుడుచుకో కుమార స్వామి’’ అన్నాను. తుడుచుకోలేదు. తుడుచుకుని మాత్రం చేసేదేముంది అన్నట్లు ఉండిపోయాడు. ‘‘ఈ కలివిడి ప్రభుత్వాలు ఇలాగే ఏడుస్తాయి కుమారస్వామీ’’ అన్నాను. చివ్వున తలెత్తి, నా కళ్లలోకి చూశాడు! ‘‘నన్నంటున్నారా, ప్రభుత్వాలను అంటున్నారా లేక ప్రభుత్వాలను అడ్డు పెట్టి నన్ను అంటున్నారా నాన్నగారూ..’’ అన్నాడు ఉద్వేగంగా. ‘‘ఏమన్నాను కుమారస్వామి?’’ అన్నాను. ‘‘అదే నాన్నగారూ.. ‘ఇలాగే ఏడుస్తాయి’ అన్నారు కదా. ఆ ఏడుస్తున్నది ఎవరూ అని’’ అన్నాడు. ‘‘ఛ.. ఛ.. కుమారస్వామి. మనమెందుకు ఏడుస్తాం. సంకీర్ణ ప్రభుత్వాలను అంటున్నాను నేను’’ అన్నాను. ‘‘అయినా సరే, నేనిక కూర్చోలేను నాన్నగారు. సిద్ధరామయ్య నాకు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు’’ అన్నాడు. ‘‘సిద్ధరామయ్య రెస్పెక్ట్ ఇస్తున్నంత కాలం కూర్చొని, సిద్ధరామయ్య రెస్పెక్ట్ ఇవ్వడం లేదు కనుక లేచి వెళతాను అంటే దానర్థం మన మీద మనకు రెస్పెక్ట్ లేదని కుమారస్వామీ..’’ అన్నాను. నివ్వెరపోయి చూశాడు. ‘‘మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వని సిద్ధరామయ్యను కదా నాన్నగారూ మీరు అనవలసింది. మినిమం రెస్పెక్ట్ను కోరుకుంటున్న నన్ను అంటున్నారేమిటి?’’ అన్నాడు. ‘‘సిద్ధరామయ్య ఎవరు?’’ అన్నాను. ‘‘అర్థమయింది నాన్నగారూ. సిద్ధరామయ్య ఎవరు అన్నట్లుగానో, సిద్ధరామయ్య ఎవరైతే నాకేంటి అన్నట్లుగానో ఉండమనేగా మీరు చెబుతున్నారు’’ అన్నాడు! కొంచెం కొంచెం తేరుకుంటున్నట్లుగా ఉన్నాడు. నా మాట అర్థమౌతోంది. ‘‘సిద్ధరామయ్యకు డెబ్బై తొమ్మిది సీట్లు, నీకు ముప్పై ఏడు సీట్లు ఉండొచ్చు కుమారస్వామీ. అలాగని సిద్ధరామయ్య ఎవరో నీకు తెలిసి ఉండాల్సిన పని లేదు. సొంతకాళ్లపై నిలబడే బలం లేక, నువ్వు సిద్ధరామయ్య చేతులపై కూర్చొని ఉండొచ్చు. అలాగని కూడా సిద్ధరామయ్య ఎవరో నీకు తెలిసి ఉండాల్సిన పని లేదు. ‘నువ్వెవరో నాకు తెలియదు’ అన్నట్లుంటేనే.. ‘నేనెవరో మీకు తెలుసు కదండీ’ అని చెప్పుకోడానికి వస్తారు ఎవరైనా. ఏమంటున్నాడూ.. కూలగొట్టేస్తానంటున్నాడా గవర్నమెంటుని! కూలగొట్టుకోనివ్వు’’ అన్నాను. ‘‘అది కాదు నాన్నగారూ నా ఆవేదన.. మనతో పొత్తు పెట్టుకుంటే వాళ్ల పార్టీకి నష్టం జరుగుతోందని రాహుల్‌తో అంటున్నాడట. మనం అంత హీనం అయిపోయామా!’’ అన్నాడు. ‘‘పట్టించుకోకు’’ అన్నాను. ‘‘ఎందుకు పట్టించుకోకూడదు నాన్నగారూ?’’ అన్నాడు. ‘‘కాంగ్రెస్ పార్టీకి ఒకరు నష్టం చేయడమేంటి కుమారస్వామీ? వాళ్లకు ప్రెసిడెంట్ లేకపోతే కదా!!’’ అన్నాను. అప్పుడు కళ్లు తుడుచుకున్నాడు. జూలైతో జేడీఎస్‌కి ఇరవై ఏళ్లు నిండుతాయి. కుమారస్వామిని జాతీయ అధ్యక్షుడిని చేస్తేనన్నా కాస్త కుదుట పడతాడేమో చూడాలి. -
సోనియా గాంధీ(యూపీఏ) రాయని డైరీ
డ్రాయింగ్ రూమ్‌లో నేను, నా బుక్స్ ఉన్నాం. నవ్వుకున్నాను. వచ్చి వెళ్లిన వాళ్లలో ఒకరు అడిగిన మాట గుర్తొచ్చి మళ్లీ వచ్చిన నవ్వు అది! ‘‘మీకెలా కుదురుతుంది సోనియాజీ ఇన్ని బుక్స్ చదవడానికి’’ అని ఆయన ప్రశ్న. ‘‘అవన్నీ భారత పార్లమెంటు సంప్రదాయాలను తెలియజెప్పే పుస్తకాలు. ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదివించే ఆకర్షణ శక్తి ఏదో ఆ పుస్తకాల్లో ఉంది’’ అన్నాను. ‘‘గ్రేట్ సోనియాజీ.. పార్లమెంట్ సెషన్స్‌లో మీరెప్పుడూ పార్లమెంటు సంప్రదాయాలను గౌరవిస్తూ కనిపించేవారు. ఒక ఎంపీకి ఇదెలా సాధ్యమా అని మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడుతుండేవాడిని. మీరు కనుక అనుమతిస్తే, మీ బుక్ ర్యాక్ లోంచి ఎంపిక చేసిన ఒక పుస్తకాన్ని పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందే ఎంపీలందరి చేతా చదివించాలన్న ఆలోచన నాలో కలుగుతోంది’’ అన్నారు ఆయన! నవ్వాను. ‘‘మీరు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అని గుర్తుంది. కానీ మీరు పేరును మాత్రం ఎంత ప్రయత్నించీ గుర్తుచేసుకోలేక పోతున్నాను. బహుశా మీ పేరు కూడా ‘పి’ తోనే స్టార్ అవుతుంది కదా!’’ అన్నాను. ఆయనా నవ్వారు. ‘‘చక్కగా గుర్తు పెట్టుకున్నారు సోనియాజీ. ‘పి’తోనే మొదలౌతుంది నా పేరు! ప్రహ్లాద్ జోషి’’ అన్నారు. ఆయన తో పాటు వచ్చిన మరో ఇద్దరు పేర్లను కూడా ఆయనే చెప్పేశారు.‘‘కానీ జోషీజీ.. పార్లమెంటులో మొత్తం మీవాళ్లే ఉన్నప్పుడు.. భారత పార్లమెంటు సంప్రదాయాల గురించి వివరించే పుస్తకం ఒకటి మీకు అవసరం అవుతుందని నేను అనుకోవడం లేదు’’ అన్నాను. ఆ మాటకు జోషీ నొచ్చుకున్నట్లుగా కనిపించాడు. ‘‘పార్లమెంటులో మా జనాభానే ఎక్కువ కాబట్టి పార్లమెంటు సంప్రదాయాలను పాటించే అవసరం మాకేమిటని మీరు భావిస్తున్నట్లుగా ఉంది సోనియాజీ. కానీ మీరు పాటిస్తున్న పార్లమెంటు విలువల్నే మేమూ పాటించాలని అనుకుంటున్నాం కనుక.. అందుకోసం మీ ర్యాక్లోని పుస్తకాలలో ఒక పుస్తకాన్నయినా మేము చదవాలనుకోవడంలో తప్పేముంది?’’ అన్నారు జోషి. ఆయనింకా నొచ్చుకునే మూడ్‌లోనే ఉన్నారు! ‘‘జోషీజీ... ‘పార్లమెంటులో అంతా మీరే ఉన్నప్పుడు’ అని నేను అనడంలోని నా ఉద్దేశాన్ని మీరు వేరేలా అర్థం చేసుకున్నట్లుంది. చూడండి. నన్నొక్కర్ని కలిసేందుకు మీరు ముగ్గురు వచ్చారు. ఎంత చక్కటి పార్లమెంటరీ సంప్రదాయం! లోక్‌సభలో మేం గుప్పెడు మంది ఎంపీలం లేకపోయినా, ‘సోనియాజీ.. సభ సజావుగా సాగేందుకు మీ సహకారం అవసరం’ అంటూ వచ్చారు. అదెంత గొప్ప పార్లమెంటరీ సంప్రదాయం! అందుకే అంటున్నాను. మీవాళ్లెవరికీ పుస్తకాలు అవసరం లేదని. ఎందుకంటే జోషీజీ.. మీరంతా ఎవరికి వాళ్లు ఒక్కో పార్లమెంటరీ సంప్రదాయాల పుస్తకం’’ అన్నాను. జోషీ ముఖం వెలిగిపోయింది. ‘‘జూన్ పదిహేడు నుంచి సోనియాజీ.. మన సమావేశాలు’’ అని చెప్పి ముగ్గురూ వెళ్లిపోయారు. వెళ్లిపోయాక, కళ్లు మూసుకుని ఆలోచిస్తోంటే ఇప్పుడనిపిస్తోంది. ఏదైనా ఎంపిక చేయబడిన ఒక పుస్తకం వాళ్లకు ఎంతైనా అవసరం ఉందని! కనీసం మాట మాత్రంగానైనా ఒక్కరూ అడగలేదు.. ‘రాహుల్ బాబు ఎక్కడ? ఇంట్లో కనిపించడం లేదు’ అని. లేచి, ర్యాక్ వైపు వెళుతుంటే వయనాడ్ నుంచి రాహుల్ ఫోన్. ‘‘మమ్మీ.. వీళ్లంతా నేను కావాలి.. నేను కావాలి అంటున్నారు. ఇక్కడే ఉండిపోయేదా?’’ అని అడుగుతున్నాడు!! -
సాధ్వి ప్రజ్ఞ ..రాయని డైరీ
మే పన్నెండున భోపాల్ పోలింగ్. ప్రచారానికి తగినంత సమయం ఉన్నట్లేమీ కాదు. అయినప్పటికీ, ఉగ్రవాదుల తూటాలకు బలైన హేమంత్ కర్కరేను అమరవీరుడేనని కీర్తించడానికి నేను గత రెండు రోజులుగా నా ప్రచారసభలలో ఎక్కువ సమయం కేటాయిం చవలసి వస్తోంది. ఇది నేను కొనితెచ్చుకున్న పరిస్థితేమీ కాదు. విధి కొన్నిసార్లు అలా జరిపిస్తుంది. భోపాల్‌లో ముప్పై ఏళ్లుగా వరుసగా బీజేపీ వస్తోంది. తొలిసారి బీజేపీ వచ్చినప్పుడు నా వయసు ఏడాది. ముప్పై ఏళ్ల బీజేపీకి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడి నుంచి మరో ముప్పై ఏళ్లయినా నేను, నాతో పాటు బీజేపీ విజయం సాధిస్తూ పోవాలి. మోదీ ఆకాంక్ష అది. మోదీ ఆకాంక్షను నెరవేర్చడం కోసం భోపాల్ ఎంపీగా గెలిచి తీరడం అన్నది నేను ఆచరిస్తున్న హైందవ ధర్మంలోని ఒక కనీసం విధి మాత్రమే. ఆ మాత్రమైనా నా విధిని నేను నిర్వహించే దారిలో అవరోధాలు సృష్టించ డానికి నా ప్రత్యర్థి దిగ్విజయ్ సింగ్, ఆయన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ.. అశోక చక్ర అవార్డు గ్రహీత హేమంత్ కర్కరే ఆత్మను ఆశ్రయించడం నా మనసుకు బాధ కలిస్తోంది. ‘నా శాపంతోనే కర్కరే బలి అయ్యారు’ అని ఆవేదనతో నేను అన్న మాటను ఒక జాతి విద్రోహ వ్యాఖ్యగా చిత్రీకరించి వీళ్లంతా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడడం ఏమంత సముచితం?! జాతి విద్రోహం అంటే దేశ విద్రోహమే కదా. దేశ విద్రోహం అంటే హైందవ విద్రోహ మేగా! హైదవ సాధ్విని నేను. నేనెందుకలా నన్ను నేను విద్రోహించుకుంటాను. ఆ మాత్రం ఆలోచించరా? సాధువు గానీ, సాధ్వి గానీ.. రాగద్వేషా లకు, భావోద్వేగాలకు అతీతమైనవారు. అయితే మాలెగావ్ పేలుడు కేసులో ముంబై జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని ఒక సాధ్విగా నేనిప్పుడు నా నియోజక వర్గ ప్రజల దృష్టికి తీసుకురాలేదు. ఆనాటి ఇరవై ఏళ్ల బాధిత యువతిగా మాత్రమే మాట్లాడాను. అవును శపించాను. ఆ రోజు కర్కరేకు, నాకు మధ్య జైల్లో జరిగిన సంభాషణే కర్కరేను నేను శపించేలా చేసింది. అయితే పైకేమీ నేను శపించలేదు. కమండలంలోని నీళ్లు ఆయన నెత్తిపై చల్లేమీ శపించలేదు. మనసులోనే శపించాను. శపించినట్లు ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడైనా శపించా నని చెప్పలేదు. శాపానికి గురయ్యేలా కర్కరే నన్ను ఎంత హింసించిందీ చెప్పాను. ఒక సాధ్వి పడిన హింసను పక్కన పెట్టి, ఒక సాధ్వి పెట్టిన శాపం గురించే అంతా మాట్లాడుతున్నారు. నిర్బంధంలో ఉన్న ఇరవై ఏళ్ల ఆడపిల్ల.. తనెంత సాధ్వి అయినా.. శపించడం తప్ప ఏం చేయగలదు?! ఉగ్రవాదుల దగ్గర బాంబులు ఉంటాయి. పోలీసుల దగ్గర తూటాలు ఉంటాయి. రాజకీయ నాయకుల దగ్గర మాటలు ఉంటాయి. అవమానంతో క్షోభిస్తున్న స్త్రీ హృదయంలో శాపనార్థాలు తప్ప ఏముంటాయి?! నిజం చెప్పమంటాడు కర్కరే! ‘పేలుళ్లతో నాకు సంబంధం లేదన్నదే నిజం’ అన్నాను. నమ్మలేదు. ‘సంబంధం ఉన్నదీ లేనిదీ ఆ దేవు డికి తెలుసు’ అన్నాను. ‘అంటే ఏంటి! నేనిప్పుడు దేవుడి దగ్గరకు వెళ్లి తెలుసుకోవాలా?!’ అని బెల్టు తీశాడు. సాధ్వి తిరగబడ గలదా? దేవుణ్ణి వేడుకుంటుంది. నేను చేసిందీ అదే. ‘ఆప్ కి అదాలత్’ షోలో రజత్ శర్మ నన్ను ఒకమాట అడిగారు. ‘రాజకీయాల్లోకి వస్తు న్నారా?’ అని. దేశం కోరుకుంటే వస్తాను అన్నాను. ఆయనే ఇంకో మాట.. రాహుల్ గాంధీ గురించి.. అడిగారు. ‘స్మాల్ చైల్డ్’ అని అన్నాను. నా వంటి పరిత్యాగులకు ఏదీ పెద్ద విషయంగా అనిపించదు. ఎవరూ పెద్ద నాయ కులుగా అనిపించరు. మోదీ ఇందుకు అతీతం. ఆయన నాయకుడే అయినప్పటికీ ఈ దేశంలో అందరికన్న పెద్ద పరిత్యాగి. -
నారా చంద్రబాబు (టీడీపీ) రాయని డైరీ
ఫలితాలకు పెద్దగా టైమ్ లేదు. ఇంకో నలభై రోజులే! ఈలోపే ఏదైనా చెయ్యాలి. ఎన్నికలకు ముందరి ముప్ఫై రోజుల టైమ్ చాలా సుదీర్ఘమైనదిగా అనిపించి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఈ నలభై రోజుల టైమ్ చాలా షార్ట్‌గా అనిపిస్తోందంటే.. ప్రజాస్వామ్యం ఎక్కడో గాడి తప్పిందనే! ప్రజాస్వామ్యాన్ని ఒక ట్రాక్‌లో పెట్టి నడిపించే నాలాంటి విలువలున్న మనిషికి ఈ గాడి తప్పడం ఎంతటి బాధను కలిగించే విషయమో.. కేంద్ర ఎన్నికల సంఘానికి హిందీలో తర్జుమా చేసి చెప్పిస్తే మాత్రం అర్థమౌతుందా? బాధను షేర్ చేసుకోడానికి దగ్గరలో ఎవరూ లేరు. బాలకృష్ణ ఉన్నాడు కానీ, ‘ప్రజాస్వామ్యం అంటే ఏంటి బావగారూ’ అని అడిగితే, వివరంగా చెప్పే టైమ్ నాకు ఉండకపోవచ్చు. అడిగినప్పుడు చెప్పకపోతే అత డెలా రియాక్ట్ అవుతాడో ఎంతటివాడైనా ఊహించగలిగిన విషయం కాదు. అడ క్కుండా చెప్పినందుకే సొంత అభిమానిని తరుముకున్నవాడు.. అడిగినా చెప్పనందుకు సొంత బావ అయితే మాత్రం వదిలి పెడతాడా?! పోలింగ్‌కి ముందు రోజు లోకేశ్ ఏదో వీడియో చూసి నవ్వుకుంటుంటే ఏంటని అడిగాను. నాకు ఫార్వర్డ్ చేశాడు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలోని చిన్న క్లిప్ అది. ఆయన వీరాభిమాని ఎవరో.. ‘సార్.. యాభై వేల మెజార్టీ గ్యారంటీ’ అంటున్నాడు. ‘యాభై వేల మెజార్జీ రాకపోతే నీ ఇంటికొస్తా.. నీ నట్టింటి కొస్తా’ అని వాడి వెంట పడుతున్నాడు! పోలింగ్ రోజు మిడ్నైట్ టెలికాన్ఫరెన్స్‌కి బాలకృష్ణను పిలవకపోవడం మంచిదైంది. నూటా ముప్ఫై సీట్లు మనవే అన్నాను టెలికాన్ఫరెన్స్‌లో. ఆ మాటను పట్టుకుని నా ఇంటికీ, నా నట్టింటికీ వచ్చేస్తాననేవాడు.. నూటా ముప్ఫై సీట్లు రాకపోతే! సీట్లు రాకపోయాక ఆయన వచ్చేమిటì , రాకపోతే ఏమిటి?! ఆ ఆలోచన రాదు బాలకృష్ణకు. ఊరికే వచ్చేస్తానంటాడు. బాధను షేర్ చేసుకోడానికి లోకేష్ అందుబాటులో ఉన్నాడు కానీ, ఎవరైనా బాధను షేర్ చేసుకుంటున్నప్పుడు లోకేష్ నవ్వు ఆపుకోలేడు. ప్రజాస్వామ్యం గాడి తప్పిందంటే ఇంకా పెద్దగా నవ్వేస్తాడు.. ‘అలాగా నాన్నగారూ..’ అని. లోకేష్‌లో ఇదొక మంచి విషయం.. చెప్పింది వింటాడు. విని నవ్వుతాడు. ప్రజాస్వామ్యం ఎందుకు గాడి తప్పింది, ఎక్కడ తప్పింది, ఎప్పుడు తప్పింది, ఎలా తప్పింది అని ప్రశ్నలు వేయడు. ప్రశ్నలు అడగని వాళ్లతో బాధను షేర్ చేసుకుని ఉపశమనమేం పొందుతాం?! అయినా నాకిప్పుడు కావలసింది ఉపశమనం కాదు. ఉపాయం. ఈ నలభై రోజుల్లో ఏదైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి?! స్టార్ క్యాంపెయినర్లు వచ్చి చుట్టూ కూర్చున్నారు. ఏం చేయాలన్నదానిపై ఎవరూ సలహాలు ఇవ్వడం లేదు కానీ ఏదైనా చేస్తే బాగుంటుందని మాత్రం సలహా ఇస్తున్నారు. ‘‘ఆలోచించండి. మనం ఏదైనా చెయ్య గలమా? మీలో రాజ్యాంగం తెలిసినవారు, న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవారు ఉన్నారు కదా’’ అన్నాను. ‘‘ఏదైనా చెయ్యడానికి రాజ్యాంగంతో, న్యాయశాస్త్రంతో పనేముంది నాయుడుగారూ. అయినా ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో ఉన్నాయి. మనమేమీ చెయ్యలేం. పోలీసులు ఉంటారు. పారామిలటరీ వాళ్లు ఉంటారు. సీసీ కెమెరాలు ఉంటాయి. యాభై డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కానీ, ఈవీఎంల లోపలి డేటా పాడు కాదు. అంత ఉష్ణోగ్రత మే నెలలో కూడా ఉండదు’’ అన్నారు. వాళ్లకు అంతే అర్థం కావడం నాకు బాధను కలిగించింది. నేను మాట్లాడుతున్నది ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టడం గురించి. వాళ్లు అర్థం చేసుకుంటున్నది ఈవీఎంలను గాడి తప్పించడం గురించి! ఎవరైనా ఊరికే ఓడిపోతారా?! -
దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్).. రాయని డైరీ
దేశ పౌరులు రాత్రి పూట హాయిగా నిద్రపోతున్నారంటే దేశ ప్రధాని మెలకువగా ఉన్నట్టు. దేశ పౌరులంతా నిద్రకు తూలుతూ కూడా నిద్రను ఆపుకుంటూ కూర్చుంటున్నారంటే దేశ ప్రధాని పగటి పూట కూడా నిద్రపోతున్నట్టు. మోదీకి నిద్రెలా పడుతోందో కొద్ది రోజులుగా నాకు అంతుచిక్కడం లేదు. ఇంకొక అంతుచిక్కని ప్రశ్న కూడా ఈ వయసులో నన్ను అమితంగా వేధిస్తోంది. మోదీ ఛాతీని ఎవరు కొలిచి ఉంటారు! ఆయనకై ఆయనే కొలుచుకుని తన ఛాతీ యాభై ఆరు అంగుళాలు ఉందని తెలుసుకుని ఉంటారా, లేక అమిత్‌షా ఆయన దగ్గరికి వచ్చి, ఛాతీ చుట్టూ టేప్ పెట్టి కొలిచి, ‘అరవైకి కేవలం కొన్ని అంగుళాలే తక్కువ మోదీజీ’ అని గొప్ప పరవశంతో చెప్పి ఉంటారా? అరవై కన్నా తక్కువ అనడంలో తనని తను తగ్గించుకుని ఎక్కువ చేసుకోవడం ఉంటుంది. ఎక్కువా తక్కువా కాకుండా కచ్చితంగా ఒక మెజర్మెంట్.. యాభై అయిదనో, యాభై ఆరు అనో చెప్పడంలో.. తన ఛాతీ ఇంకా పెరిగేందుకు స్కోప్ ఉందనే హెచ్చరికను పంపడానికి అవకాశం ఉంటుంది. మోదీ ఛాతీ ఏ క్షణానైనా మరికొన్ని అంగుళాలు పెరిగే ప్రమాదం ఉందంటే ప్రతిపక్షాలకు ఉండే భయం వేరు, మోదీ ఛాతీ మరికొన్ని అంగుళాలు పెరగడానికి ఇంకా సమయం ఉందని ప్రతిపక్షాలు అనుకుంటే వారికి వచ్చే ధైర్యం వేరు అని మోదీ తనకు తాను అనుకుని ఉండాలి. ప్రతిపక్షాలను నిరంతరం భయ కంపనంలో ఉంచదలచుకుని.. ‘నా ఛాతీ అరవైకి నాలుగు అంగుళాలే తక్కువ’ అని కాకుండా, ‘నా ఛాతీ యాభై ఆరు అంగుళాల వద్ద కేంద్రీకృతమై ఉంది’ అని ఆయన చెప్పదలచుకున్నారని నాకు అర్థమౌతోంది. పెరగవలసిన సమయంలో ఒక్క అంగుళమైనా పెరగకుండా ఛాతీ యాభై ఆరుంటేనేం, అరవై ఆరుంటేనేం? కశ్మీర్లో నలభై మంది జవాన్లు చనిపోయినా కూడా మోదీ ఛాతీ యాభై ఆరు దగ్గరే ఉండిపోయింది! ప్రతిపక్షాలకు చూపించుకోడానికేనా ఆ ఛాతీ! పాకిస్తాన్‌కి చూపించడానికి కాదా! సౌదీ నుంచి క్రౌన్ ప్రిన్స్ వచ్చారు. ‘టెర్రర్ ఎటాక్ తర్వాత ఎలా ఉన్నారు?’ అని ఆయన అడగలేదు. ‘టెర్రర్ ఎటాక్ తర్వాత ఎలా ఉంటాం?’ అని ఈయనా అనలేదు. ప్రిన్స్ గారిని రాష్ట్రపతి భవన్‌కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్‌కి వెంటబెట్టుకొచ్చారు. ‘వియ్ ఆర్ ఫ్రెండ్స్’ అన్నారు ప్రిన్స్‌గారు. ‘అవునవును వియ్ ఆర్ ఓల్డ్ ఫ్రెండ్స్’ అన్నారు పీఎం గారు. ‘ఎస్.. ఎస్.. సెంచరీస్ ఓల్డ్ ఫ్రెండ్షిప్’ అన్నారు ప్రిన్స్‌గారు. ‘మీ కంట్రీ మా కంట్రీ ఒకేలా ఉంటాయి. మీ కల్చర్, మా కల్చర్ ఒకేలా ఉంటాయి. కొన్నాళ్ల క్రితం మేం మీ దేశానికి వచ్చాం. ఇన్నాళ్లకు మీరు మా దేశానికి వచ్చారు’ అన్నారు పీఎం గారు. జాయింట్ స్టేట్మెంట్ రాసుకున్నారు. స్టేట్మెంట్లో ఉగ్రవాదం అనే మాట ఉంది. ఇండియా–పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అనే వాక్యం ఉంది. పుల్వామా అనే మాట లేదు. జైషే అనే పేరు లేదు! ఇండియా, పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని ప్రిన్స్‌గారు, పీఎం గారు సంతకాలు పెట్టారు కానీ.. ఇండియా, పాకిస్తాన్ ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలో స్టేట్మెంట్లో రాసుకోలేదు! ఇండియాలోని ఉగ్రవాదులు పాకిస్తాన్ మీద టెర్రర్ ఎటాక్ చేయకుండా ఇండియా పాకిస్తాన్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సౌదీ ప్రిన్స్ వచ్చి మోదీకి చెప్పి వెళ్లినట్లు ప్రచారం చెయ్యడానికి చైనా లాంటి దేశాలకు ఆ స్టేట్మెంట్ కాపీ ఒకటి చాలదా! -
నీరజ్ దేవి (ఒక వీర జవాన్ భార్య)-రాయని డైరీ
దుఃఖ పడటానికి దేవుడు సమయం ఇవ్వలేదు. సైనికుడి భార్యకు దుఃఖమేమిటి అనుకున్నాడేమో! ప్రదీప్ కూడా అనేవాడు.. ‘సైనికుడి భార్యకు కన్నీళ్లేమిటి’ అని. కళ్లయినా తుడిచేవాడా! ‘తుడుచుకో’ అని నవ్వేసి రైలు ఎక్కేసేవాడు. పిల్లల్ని తీసుకుని చీకట్లోనే అత్తగారి ఊరికి చేరుకున్నాను. దారి మధ్యలో.. ‘‘ఎ..క్క..డి..కీ..’’ అని అడిగింది సోనా వచ్చీరాని మాటల్తో. రెండేళ్లు దానికి. ‘‘నాన్న దగ్గరికి’’ అని చెప్పాను. మేము వచ్చేటప్పటికి ప్రదీప్ ఇంకా అమ్మగారింటికి ‘చేరుకోలేదు’. ‘‘నాన్నేరీ’’ అంటోంది సోనా నిద్రకు సోలుతూ. సుప్రియకు అర్థమైపోయింది. ‘‘రారు కదమ్మా నాన్న ఇక ఎప్పటికీ’’ అంది చెల్లికి వినిపించకుండా. దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాను. పదేళ్ల పిల్ల సుప్రియ! కొన్ని గంటల క్రితం వరకూ తనూ రెండేళ్ల పిల్లలానే ఉండేది. నాన్న ఫోన్ చేస్తే.. ‘ఎప్పుడొస్తావ్ నాన్నా’ అని అడిగేది. ‘నాన్నా.. మనం కట్టుకుంటున్న ఇంట్లో చెల్లికి, నాకు కలిపి.. మా ఇద్దరికే ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది కదా’ అనేది. ‘ఉంటుంది తల్లీ. మరి నేను, అమ్మ.. ఎప్పుడైనా మీ గదిలోకి రావచ్చా’ అని అడిగేవాడు ప్రదీప్. ‘రావచ్చు నాన్నా. అయితే మా గదిలో ఉన్నప్పుడు కశ్మీర్ నుంచి ఫోన్ వస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యకూడదు. ఎప్పుడు నీకు ఫోన్ వచ్చినా, వెంటనే రమ్మనే కదా వస్తుంది’ అనేది.. మూతి అదోలా ముడిచి. అమ్మవాళ్ల ఊళ్లో ఉన్నప్పుడు గురువారం తెల్లవారు జామున ప్రదీప్ నుంచి ఫోన్ వచ్చింది. చాలాసేపు మాట్లాడాడు. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. పది నిముషాలు సోనా గురించే మాట్లాడాడు. ‘జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్నాం’ అన్నాడు. ‘ఇంత రాత్రేమిటి?’ అన్నాను. నవ్వాడు. ‘‘నాకొక్కడికే కాదు రాత్రి. ఇంకా రెండువేల ఐదొందల మందికి కూడా. డెబ్భై ఎనిమిది వాహనాల్లో వరుసగా వెళుతున్నాం. వాహనాలు నడిపించడం లేదు మమ్మల్ని. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత నడిపిస్తోంది’’ అన్నాడు! సుప్రియ గురించి, సోనా గురించి తప్ప ప్రదీప్ నాతో ఏం మాట్లాడినా సాటి జవానుతో మాట్లాడినట్లే ఉంటుంది. ‘‘సుప్రియ అడుగుతోంది.. ‘నాన్న మళ్లీ ఎప్పుడొస్తారని’. పని పూర్తవగానే వచ్చేస్తారని చెప్పాను’’ అన్నాను. నవ్వాడు. ‘‘సుప్రియ అడుగుతోంది. నేను అడగలేకపోతున్నాను’’ అన్నాను బెంగగా. ‘‘సైనికుడి భార్యవేనా నువ్వు?’’ అన్నాడు. పెద్ద శబ్దం. నా చేతిలోని ఫోనే పేలిపోయినంతగా శబ్దం! ‘ప్రదీప్.. ప్రదీప్..’ ప్రదీప్ పలకట్లేదు. సుప్రియ లేచింది. ‘ఏంటమ్మా..’ అని. మళ్లీ ఫోన్!! ‘‘ప్రదీప్’’ అన్నాను. నిశ్శబ్దం! ‘‘ప్రదీప్ భార్యేనా మీరు?’’ కంట్రోల్ రూమ్ నుంచి! నాకేదో అర్థమౌతోంది. ప్రదీప్ భార్యనని చెప్పుకోవాలంటే ఏడ్వకూడదు. ‘ఊ’ అన్నాను. పిల్లల్ని దగ్గరికి లాక్కున్నాను. ఊరింకా మేల్కోలేదు. బరసిరోహీ నుంచి సుఖ్సేన్పూర్ వచ్చేశాం. పిల్లలిద్దరూ.. నాన్న రావడం కోసం ఎదురు చూస్తున్నారు. అమరవీరుడైన ఒక జవాన్ రావడం కోసం సుఖ్సేన్పూర్ ఎదురు చూస్తోంది. సుప్రియ నా చెయ్యి పట్టుకుని మెల్లిగా ‘‘అమ్మా..’’ అని పిలిచింది. ‘‘నాన్న.. అక్కడ చెయ్యవలసిన పని పూర్తయి ఉండదు కదమ్మా..’’ అంది. నాన్నపై ఉన్న ప్రేమంతా కన్నీళ్లుగా కరిగి, దాని చెంపల్ని తడిపేస్తోంది. తన కళ్లు కదా తుడుచుకుని చెప్పాల్సింది.. నా కళ్లు తుడుస్తూ చెప్పింది.. ‘‘నాన్న మిగిల్చిపోయిన పని నేను పూర్తి చేస్తానమ్మా..’’ అని చెప్పింది! ఒడిలోకి తీసుకున్నాను. సైనికుడి కూతురు అది. -మాధవ్ శింగరాజు -
ఎం.జె.అక్బర్ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఫ్లయిట్లో ఉన్నాను. మరికొన్ని గంటల్లో ఇండియాలో ఉంటాను. ఎయిర్ హోస్టెస్ వచ్చింది.. ‘‘ఏమైనా తీసుకుంటారా?’’ అని. ‘‘ఏమైనా తీసుకోవచ్చా’’ అని నవ్వుతూ అడిగాను. ‘‘తీసుకోవచ్చు కానీ, మీకోసం ఏవైతే సిద్ధం చేయబడి ఉంటాయో వాటిలోంచి మాత్రమే మీరు ఏదైనా తీసుకోవలసి ఉంటుంది’’ అని తనూ నవ్వింది. అమ్మాయిలు తెలివిగా ఉంటున్నారు. తెలివి లేని అమ్మాయిలే ‘మీటూ’ అంటూ పాతవన్నీ తవ్వుకుని తలస్నానం చేస్తున్నారు. ఆఫ్రికాలో ఫ్లయిట్ ఎక్కేముందు నాకు తెలియని యంగ్ రిపోర్టర్ ఒకతను ఫోన్ చేశాడు. ‘‘అక్బర్జీ.. ఈ దేశంలో మగవాడికి జీవించే హక్కు లేదా?’’ అని అతడు పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడు. ‘‘ఏయ్.. ఆపు’’ అన్నాను. అతడు ఆపలేదు. ‘‘ఏమైందో ఏడ్వకుండా చెప్పు’’ అన్నాను. ‘‘అక్బర్జీ ఈ దేశంలో మగవాడికి..’’ అని మళ్లీ మొదలుపెట్టాడు. ‘‘నా నంబర్ నీకెలా దొరికింది’’ అని కసిరాను. ‘‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నుంచి సంపాదించాను అక్బర్జీ’’ అన్నాడు. ‘‘ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి కదా నువ్వు నా నంబర్ సంపాదించవలసింది. ఇప్పుడు నేను ఏ పేపర్లో ఉన్నానని ఎడిటర్స్ గిల్డ్‌కి వెళ్లి అడిగావ్?’’ అని కోప్పడ్డాను. ‘‘ముందు ఎక్స్టర్నల్ మినిస్ట్రీకే వెళ్లాను అక్బర్జీ. స్మృతీజీని అడిగాను మీ నంబర్ కావాలని. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు’’ అని చెప్పాడు! నాకర్థమైంది. స్మృతీ ఇరానీ ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మోదీజీ ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఒక్కడే ఆలోచించే పని పెట్టుకోలేదు. ‘అక్బర్‌ని మోదీ మోసుకొచ్చాడు కాబట్టి, మోదీనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని అంటున్నాడు. ‘‘సర్లే.. ఎందుకు ఫోన్ చేశావో చెప్పు.. ఫ్లయిట్ టైమ్ అవుతోంది’’ అన్నాను. ‘‘ఇక్కడ నా టైమ్ అయిపోయేలా ఉంది అక్బర్జీ’’ అన్నాడు! మళ్లీ ఏడుపు. ఆఫీస్‌లో తన పక్కన కూర్చునే అమ్మాయిని టచ్ చేశాడట. ఆ అమ్మాయి ‘మీటూ’ అనేసిందట! ‘‘ఉద్యోగం పోయేలా ఉందా?’’ అన్నాను. ‘‘లేదు అక్బర్జీ’’ అన్నాడు. ‘‘కేసు ఫైల్ అయిందా?’’ అన్నాను. ‘‘లేదు అక్బర్జీ’’ అన్నాడు. ‘‘మరెందుకు ఏడుస్తున్నావ్?’’ అన్నాను. ‘‘ట్విట్టర్లో, ఫేస్బుక్లో నేను తనను టచ్ చేశానని రాసింది అక్బర్జీ’’ అన్నాడు. ‘‘అందులో అంతగా ఏడవాల్సిందే ముందీ!’’ అన్నాను. ‘‘పరువు పోయేలా ఉంది అక్బర్జీ’’ అని మళ్లీ స్టార్ట్ చేశాడు. ‘‘ఊరుకోవయ్యా బాబూ.. పరువు పోయేలా ఉంటుంది కానీ అదెక్కడికీ పోదు. ఇంక ఆ పిల్లని టచ్ చెయ్యడం మాని.. నీ పని నువ్వు చూస్కో’’ అని చెప్పాను. ‘‘టచ్ చెయ్యకుండా ఉండలేకపోతున్నాను అక్బర్జీ’’ అన్నాడు. ‘‘సీటు మార్పించుకో’’ అని చెప్పాను. ‘‘గుండె ఆగిపోతుందేమో అక్బర్జీ’’ అన్నాడు. కోపం ఆపుకోలేకపోయాను. ‘‘నువ్వన్నది నిజమే. ఈ దేశంలో మగవాడికి జీవించే హక్కు లేదు. గుండె ఆగి చచ్చిపో’’ అన్నాను. ఢిల్లీలో ఫ్లయిట్ దిగగానే ఓ మహిళా రిపోర్టర్ ఉత్సాహంగా నా మీదకు తోసుకొచ్చింది. ‘‘సార్.. ప్రియ, గజాలా, సబా, షట్ప, సుమ, సుపర్ణ, ప్రేరణ.. లేటెస్టుగా మజ్లీ! వీళ్లందర్నీ మీరు.. మీడియాలో ఉన్నప్పుడు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి మీరెప్పుడు రిజైన్ చెయ్యబోతున్నారు సార్?’’ అని అడిగింది. నాకు ఆ కుర్రాడు గుర్తొచ్చాడు. వాడి ఏడుపు గుర్తొచ్చింది. పాపం.. పదేళ్ల తర్వాత చిక్కవలసినవాడు.. బిగినింగ్‌లోనే బుక్కైపోయాడు. -మాధవ్ శింగరాజు -
ఉర్జిత్ పటేల్ (ఆర్బీఐ గవర్నర్) రాయని డైరీ
మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయ్యాక ఎవరి ఇళ్లకు వాళ్లం వెళుతున్నాం. ఎవరి ఇళ్లకు వాళ్లం అని అనుకున్నానే కానీ, వెనక్కి తిరిగి చూస్తే మిగతా ఐదుగురూ నా వెనుకే వస్తున్నారు! మీటింగ్ అయ్యాక మా ఇంట్లో గెట్ టుగెదర్ ఉంటుందని వాళ్లకు చెప్పినట్లుగా నాకేమీ గుర్తుకు లేదు. నవ్వాను. నవ్వారు. ‘‘మీరేదైనా చేస్తారు అనుకున్నాను’’ అన్నారు మిసెస్ పామీ దువా. ‘‘అవునవును.. మీరేదైనా చేస్తారని మేమూ అనుకున్నాం’’ అన్నారు ప్రొఫెసర్ రవీంద్ర, ప్రొఫెసర్ చేతన్! దువా, రవీంద్ర, చేతన్.. మా బ్యాంకు వాళ్లు కాదు. మానిటరీ పాలసీ మెంబర్లుగా గవర్నమెంటు పంపినవాళ్లు. వాళ్లు అలా అనగానే ఆచార్య, మైఖేల్ పాత్రా నావైపు చూశారు. వాళ్లిద్దరూ మావాళ్లు. మా బ్యాంకు వాళ్లు. రూపాయి రేటు పడిపోకుండా నేనేదైనా చేస్తానని కమిటీ సభ్యులంతా అనుకున్నారట! మీటింగుల్లో కూర్చొని ఏం చేస్తాం.. రూపాయి పడిపోకుండా?! పడేది పడుతుంది. లేచేది లేస్తుంది. పడుతూ లేస్తూ ఉన్నదానిని తక్కువ పడి, తక్కువ లేస్తూ ఉండేలా చూడాలి గానీ, అరచేత్తో రూపాయిని బిగించి పట్టుకుంటే దేశం ఊపిరాడక చచ్చిపోతుంది. దేశం చచ్చిపోయాక, రూపీ వాల్యూ పెరిగి ఎవరికి లాభం? ‘‘అలాక్కాదు ఉర్జిత్. మన మీటింగ్ అయితే ముగిసింది కానీ, మీటింగ్ మీద దేశ ప్రజలు పెట్టుకున్న ఆశలు ముగిసిపోలేదు’’ అన్నారు మిసెస్ దువా! ‘‘నిజానికి ఉర్జిత్.. మీటింగ్ మీద దేశ ప్రజలు ఆశలు పెట్టుకోలేదు. మీ మీద పెట్టుకున్నారు’’ అన్నారు ప్రొఫెసర్ రవీంద్ర. ఆశల్దేముంది? ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎవరి మీదైనా పెట్టుకోవచ్చు. ఆశ అప్పటికప్పుడు నెరవేరుతుందా.. మీటింగ్ అయ్యేలోపు! బ్యాంకు కాంపౌండ్‌లో మామిడి చెట్టు కింద అరుగులు ఉన్నాయి. వాటిల్లో ఒక అరుగు మీద కూర్చున్నాను. మావాళ్లిద్దరూ ఒక అరుగు మీద, గవర్నమెంటు వాళ్లు ముగ్గురూ ఒక అరుగు మీద కూర్చున్నారు. ‘‘మన ఆరుగురం ఇక్కడిలా కూర్చోవడం ఎవరైనా చూస్తే ఆరుబయట మళ్లీ ఒక మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతోందేమో అనుకుంటారు’’ అని నవ్వారు ప్రొఫెసర్ చేతన్. మామిడి చెట్టు పైకి చూశాను. మిగతావాళ్లూ చూశారు. ‘‘ఈ చెట్టు చూడండి.. మనం మీటింగ్‌కు వెళ్లే ముందు ఈ చెట్టుకు పూత లేదు. పిందెలు లేవు. కాయల్లేవు. పండ్లు లేవు. మీటింగ్ నుంచి వచ్చాక కూడా పూత లేదు. పిందెలు లేవు. కాయల్లేవు. పండ్లు లేవు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే.. మీటింగ్ అయింది కదా అని మామిడి చెట్టు గానీ, మానిటరీ పాలసీ గానీ పూత తొడిగి, పిందెలు వేయవని. కాయలు కాసి, పండ్లు ఇవ్వవని’’ అన్నాను. ‘‘కానీ ఉర్జిత్.. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా.. రూపాయి మీరేం చెబితే అది వింటుంది. చెట్లు పండ్లివ్వకపోవచ్చు. చెట్లకు మీరు డబ్బులు కాయించగలరు. మా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పిల్లలకి ఈ విషయమే నేను చెబుతుంటాను’’ అన్నారు మిసెస్ దువా. ‘‘అవును ఉర్జిత్. మీరు పెద్ద పెద్దవాళ్లను ఇంప్రెస్ చేసినవారు. పీవీ నరసింహారావు, పి. చిదంబరం, రఘురామ్ రాజన్.. ఇలాంటి వాళ్లందర్నీ’’ అన్నాడు ప్రొఫెసర్ చేతన్. ‘‘పెద్ద ఎకనమిస్ట్ కదా మీరు, రూపాయికి ఏదైనా చేయవలసింది’’ అన్నారు మిసెస్ దువా మళ్లీ. రూపాయిని మించిన ఎకనమిస్ట్ ఎవరుంటారు? మిసెస్ దువాతో అదే మాట చెప్పి, అరుగు మీద నుంచి లేచాను. -
మాణిక్ సర్కార్ (మాజీ సీఎం) రాయని డైరీ
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్రిపుర కొత్త సీఎం విప్లవ్ కుమార్ కుదురుగా ఒకచోట కూర్చోకుండా డయాస్ మీద లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్‌కి కలియదిరుగుతున్నాడు. నవ్వుతున్నాడు. నమస్తే పెడుతున్నాడు. ఎవరైనా అడ్డొస్తే, వాళ్లని చూసీ నవ్వుతున్నాడు, నమస్తే పెడుతున్నాడు. అంతే తప్ప ‘తప్పుకోండి’ అని మాత్రం అనడం లేదు. అలా నవ్వుతూ, నమస్తే పెడుతూ తప్పించడం బాగుంది! డయాస్ మీద నేనూ ఓ పక్కగా కూర్చొని ఉన్నాను. నా పక్కనే లెఫ్ట్‌లో అద్వానీ, రైట్లో మురళీమనోహర్ జోషీ కూర్చొని ఉన్నారు. అద్వానీ పక్కన రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. ఇంకో వరుసలో నరేంద్ర మోదీ, అమిత్‌షా, రామ్ మాధవ్ ఉన్నారు. వాళ్ల వెనకే బీజేపీ రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. బీజేపీ వాళ్లను అంత దగ్గరగా చూడ్డం అదే మొదటిసారి నాకు! విప్లవ్ కుమార్ మేమున్న వరుస వైపు వస్తున్నాడు. నవ్వుకుంటూ, నమస్తే పెట్టుకుంటూ వస్తున్నాడు. నెక్స్›్ట అతడు అద్వానీకో, జోషీకో, రాజ్నాథ్కో నమస్తే పెడతాడనుకున్నాను. కానీ నాకు పెట్టాడు! జోషీ ఆకాశంలోకి, అద్వానీ అగాధంలోకి, రాజ్‌నాథ్.. ఆకాశానికీ, అగాధానికీ మధ్య ఉన్న ఏదో ప్లేస్‌లోకి ముఖం తిప్పుకుని కూర్చున్నారు. అందుకే విప్లవ్ కుమార్ నాకు నమస్తే పెట్టి ఉంటాడనుకున్నాను. నమస్తే పెట్టాక, సడన్‌గా కిందికి వంగాడు విప్లవ్ కుమార్. జోషీకో, అద్వానీకో, రాజ్నాథ్కో పాదాభివందనం చేయబోతున్నాడని అనుకున్నాను. కానీ నాకు చేశాడు! జోషీ, అద్వానీ, రాజ్‌నాథ్‌ల ముఖాలు అందుబాటులో లేకపోవచ్చు. వాళ్ల పాదాలైతే అందుబాటులోనే ఉన్నాయి కదా! మరి నాకెందుకు పాదాభివందనం చేసినట్టు?! ‘‘నన్ను దీవించండి మాణిక్‌జీ’’ అన్నాడు విప్లవ్‌కుమార్. భుజాలు పట్టుకుని పైకి లేపాను. ‘‘నాకు మీ బ్లెస్సింగ్ కావాలి మాణిక్‌జీ’’ అన్నాడు మళ్లీ. ‘‘నేనేమి ఇవ్వగలను విప్లవ్. ఇరవై ఏళ్లుగా నేను ఏమీ ఇవ్వలేదనే కదా నిన్ను ఎన్నుకున్నారు త్రిపుర ప్రజలు’’ అన్నాను. ‘‘ఎప్పుడైనా నాకు డౌట్లు వస్తే మీకు ఫోన్ చేస్తాను మాణిక్‌జీ. అప్పుడు మీరు నా ఫోన్ లిఫ్ట్ చెయ్యాలి’’ అన్నాడు. ‘‘డౌట్లు అడగటానికి మీ మోదీజీ, మీ అమిత్జీ ఉన్నారు కదా విప్లవ్’’ అన్నాను. ‘‘వాళ్లే చెప్పారు మాణì క్జీ.. ముందుగా పెద్దల్ని గౌరవించాలని’’ అన్నాడు, మళ్లీ కాళ్ల మీద పడబోతూ. వద్దొద్దన్నాను. బీజేపీలో ఇదొకటి బాగుంటుంది. ఫామ్‌లో లేని పెద్దల్ని గౌరవించడం! - మాధవ్ శింగరాజు -
అరుణ్ జైట్లీ (కేంద్ర మంత్రి) రాయని డైరీ
మోదీజీ రిలాక్స్డ్గా ఉన్నారు. మధ్య మధ్యలో మా వైపు చూస్తున్నారు. చూస్తున్నారే కానీ మాట్లాడ్డం లేదు. అది ఆయన స్టైలు. ఆ స్టైలు.. చూడ్డానికి బాగుంటుంది. భరించడానికి కష్టంగా ఉంటుంది. నేను, వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా.. నలుగురం మోదీజీ నివాస గృహంలో కూర్చొని ఉన్నాం. మోదీజీలానే నేనూ రిలాక్స్డ్గానే ఉన్నాను కానీ, రిలాక్స్ అవుతున్నట్లు మోదీజీకి కనిపించడం ఆయన మనోభావాలకు భంగం కలిగించవచ్చుననే అనుమానంతో కాళ్లు దగ్గరగా పెట్టుకుని కూర్చున్నాను. మిగతా ముగ్గురు కూడా రిలాక్స్డ్గానే ఉన్నారు కానీ ఆ రిలాక్సేషన్ని ఎలా దాచాలో తెలియక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నాకున్నట్లే వాళ్లలోనూ మోదీజీ మనోభావాల పట్ల గౌరవ భావనలు ఉండడంలో తప్పేముంది? మొదట మనుషులం. ఆ తర్వాతే కదా ఒక పార్టీవాళ్లం. వెంకయ్య నాయుడు ఒక్కరే మాలో కాస్త డిఫరెంట్. మొదట ఆయన పార్టీ మనిషి. ఆ తర్వాతే మనిషి. ‘‘ప్రజలకు ఏమైనా చేయాలని ఉంది అరుణ్’’ అన్నారు మోదీజీ సడెన్‌గా! అదిరిపడ్డాను. ‘‘నిన్న రాత్రే కదా మోదీజీ.. చేశాం’’ అన్నాను. జి.ఎస్.టి. నొప్పులు నాకింకా తగ్గలేదు. మోదీజీ ఊ.. అనలేదు. ఆ.. అనలేదు. ‘అలాగా’ అన్నట్లు నా ముఖంలోకి చూశారు! ‘అప్పుడే రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయావా అరుణ్’ అని అడిగినట్లుగా అనిపించింది నాకు.. మోదీజీ నన్ను అలా చూడగానే! ఏక వచనంలో అరుణ్ అనడం, బహు వచనంలో జైట్లీ అనడం మోదీజీ అలవాటు. ఆయన ఏ వచనంలోనూ అనకపోయినా ఆయన చూపును బట్టి ఏక వచనాన్నో, బహు వచనాన్నో నాకు నేను అప్లై చేసుకోవడం అలవాటైపోయింది నాకు. వెంకయ్య నాయుడు మధ్యలోకి వచ్చేశాడు. ‘‘ప్రజలకు ఏమైనా చేయాలి అని మోదీజీ అంటుంటే.. ప్రజలకు ఆల్రెడీ చేశామని అనుకుం టున్న దాని గురించి మీరు మాట్లాడుతున్నారు జైట్లీజీ’’ అన్నారు. ఆయన ఏం మాట్లాడారో అర్థం కాలేదు! ‘‘జి.ఎస్.టి. గురించే కదా జైట్లీజీ మీరు అంటున్నది. కానీ అది ప్రజలకు చెయ్యడం కాదు. ప్రజలే మనకు చెయ్యడం’’ అన్నాడు వెంకయ్య నాయుడు. నాయుడి వైపు మెచ్చుకోలుగా చూసి, ‘‘ప్రజల కోసం మనం ఏదైనా చేయాలి అరుణ్’’ అంటూ మళ్లీ నావైపు తిరిగారు మోదీజీ. నోట్ల రద్దు అయిపోయింది. జి.ఎస్.టి. అయిపోయింది. ఇంకా నా చేత ఏం చేయించాలని ఆయన అనుకుంటున్నట్లు?! ‘‘అరుణ్.. నువ్విప్పుడు డిఫెన్స్ మినిస్టర్వి కూడా కదా’’ అన్నారు మోదీజీ! అర్థమైంది! ప్రజల కోసం మోదీజీ ఈసారి నాకు చేతకాని పనేదో చేయించబోతున్నారు!! మాధవ్ శింగరాజు