మే పన్నెండున భోపాల్ పోలింగ్. ప్రచారానికి తగినంత సమయం ఉన్నట్లేమీ కాదు. అయినప్పటికీ, ఉగ్రవాదుల తూటాలకు బలైన హేమంత్ కర్కరేను అమరవీరుడేనని కీర్తించడానికి నేను గత రెండు రోజులుగా నా ప్రచారసభలలో ఎక్కువ సమయం కేటాయిం చవలసి వస్తోంది. ఇది నేను కొనితెచ్చుకున్న పరిస్థితేమీ కాదు. విధి కొన్నిసార్లు అలా జరిపిస్తుంది.
భోపాల్‌లో ముప్పై ఏళ్లుగా వరుసగా బీజేపీ వస్తోంది. తొలిసారి బీజేపీ వచ్చినప్పుడు నా వయసు ఏడాది. ముప్పై ఏళ్ల బీజేపీకి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడి నుంచి మరో ముప్పై ఏళ్లయినా నేను, నాతో పాటు బీజేపీ విజయం సాధిస్తూ పోవాలి. మోదీ ఆకాంక్ష అది.
మోదీ ఆకాంక్షను నెరవేర్చడం కోసం భోపాల్ ఎంపీగా గెలిచి తీరడం అన్నది నేను ఆచరిస్తున్న హైందవ ధర్మంలోని ఒక కనీసం విధి మాత్రమే. ఆ మాత్రమైనా నా విధిని నేను నిర్వహించే దారిలో అవరోధాలు సృష్టించ డానికి నా ప్రత్యర్థి దిగ్విజయ్ సింగ్, ఆయన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ.. అశోక చక్ర అవార్డు గ్రహీత హేమంత్ కర్కరే ఆత్మను ఆశ్రయించడం నా మనసుకు బాధ కలిస్తోంది. ‘నా శాపంతోనే కర్కరే బలి అయ్యారు’ అని ఆవేదనతో నేను అన్న మాటను ఒక జాతి విద్రోహ వ్యాఖ్యగా చిత్రీకరించి వీళ్లంతా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడడం ఏమంత సముచితం?!
జాతి విద్రోహం అంటే దేశ విద్రోహమే కదా. దేశ విద్రోహం అంటే హైందవ విద్రోహ మేగా! హైదవ సాధ్విని నేను. నేనెందుకలా నన్ను నేను విద్రోహించుకుంటాను. ఆ మాత్రం ఆలోచించరా?
సాధువు గానీ, సాధ్వి గానీ.. రాగద్వేషా లకు, భావోద్వేగాలకు అతీతమైనవారు. అయితే మాలెగావ్ పేలుడు కేసులో ముంబై జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని ఒక సాధ్విగా నేనిప్పుడు నా నియోజక వర్గ ప్రజల దృష్టికి తీసుకురాలేదు. ఆనాటి ఇరవై ఏళ్ల బాధిత యువతిగా మాత్రమే మాట్లాడాను.
అవును శపించాను. ఆ రోజు కర్కరేకు, నాకు మధ్య జైల్లో జరిగిన సంభాషణే కర్కరేను నేను శపించేలా చేసింది. అయితే పైకేమీ నేను శపించలేదు. కమండలంలోని నీళ్లు ఆయన నెత్తిపై చల్లేమీ శపించలేదు. మనసులోనే శపించాను. శపించినట్లు ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడైనా శపించా నని చెప్పలేదు. శాపానికి గురయ్యేలా కర్కరే నన్ను ఎంత హింసించిందీ చెప్పాను. ఒక సాధ్వి పడిన హింసను పక్కన పెట్టి, ఒక సాధ్వి పెట్టిన శాపం గురించే అంతా మాట్లాడుతున్నారు.
నిర్బంధంలో ఉన్న ఇరవై ఏళ్ల ఆడపిల్ల.. తనెంత సాధ్వి అయినా.. శపించడం తప్ప ఏం చేయగలదు?! ఉగ్రవాదుల దగ్గర బాంబులు ఉంటాయి. పోలీసుల దగ్గర తూటాలు ఉంటాయి. రాజకీయ నాయకుల దగ్గర మాటలు ఉంటాయి. అవమానంతో క్షోభిస్తున్న స్త్రీ హృదయంలో శాపనార్థాలు తప్ప ఏముంటాయి?!
నిజం చెప్పమంటాడు కర్కరే! ‘పేలుళ్లతో నాకు సంబంధం లేదన్నదే నిజం’ అన్నాను. నమ్మలేదు. ‘సంబంధం ఉన్నదీ లేనిదీ ఆ దేవు డికి తెలుసు’ అన్నాను. ‘అంటే ఏంటి! నేనిప్పుడు దేవుడి దగ్గరకు వెళ్లి తెలుసుకోవాలా?!’ అని బెల్టు తీశాడు. సాధ్వి తిరగబడ గలదా? దేవుణ్ణి వేడుకుంటుంది. నేను చేసిందీ అదే.
‘ఆప్ కి అదాలత్’ షోలో రజత్ శర్మ నన్ను ఒకమాట అడిగారు. ‘రాజకీయాల్లోకి వస్తు న్నారా?’ అని. దేశం కోరుకుంటే వస్తాను అన్నాను. ఆయనే ఇంకో మాట.. రాహుల్ గాంధీ గురించి.. అడిగారు. ‘స్మాల్ చైల్డ్’ అని అన్నాను. నా వంటి పరిత్యాగులకు ఏదీ పెద్ద విషయంగా అనిపించదు. ఎవరూ పెద్ద నాయ కులుగా అనిపించరు. మోదీ ఇందుకు అతీతం. ఆయన నాయకుడే అయినప్పటికీ ఈ దేశంలో అందరికన్న పెద్ద పరిత్యాగి.
సాధ్వి ప్రజ్ఞ (బీజేపీ అభ్యర్థి)..రాయని డైరీ
Published Sun, Apr 21 2019 1:43 AM | Last Updated on Sun, Apr 21 2019 1:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment