
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే సీఎస్‌కే బౌలర్లను ఆర్య ఊతికారేశాడు. ముల్లాన్‌పూర్ మైదానంలో సిక్సర్ల మోత మోగించాడు. పతిరానా, అశ్విన్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్‌ను సైతం 24 ఏళ్ల ఆర్య వదలేదు.
ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి ప్రియాన్ష్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని ప్రియాన్ష్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 42 బంతులు ఎదుర్కొన్న ఈ ఢిల్లీ క్రికెటర్.. 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అద్భుతమైన సెంచరీతో చెలరేగిన ఆర్య పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
👉ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ రికార్డును ఆర్య సమం చేశాడు. హెడ్ కూడా సరిగ్గా ఐపీఎల్-2024లో ఆర్సీబీపై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్(30 బంతులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో యూసఫ్ పఠాన్(37), మిల్లర్(38) ఉన్నారు.
👉అదే విధంగా ఐపీఎల్‌లో అత్యంతవేగంగా సెంచరీ చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు షాన్ మార్ష్(58) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మార్ష్ రికార్డును ఆర్య బ్రేక్ చేశాడు.
ఎవరీ ప్రియాన్ష్ ఆర్య..?
24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య లిస్ట్-ఎ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు పవన్ ఆర్య, రాధా బాల ఇద్దరూ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ విహార్‌లో పెరిగిన ప్రియాంష్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ. ప్రియాన్ష్‌కు అతడి తల్లిదండ్రలు ఎంతో మద్దతుగా నిలిచారు. ఇటు క్రికెట్, అటు విద్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్య ముందుకు సాగాడు.
ఆర్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్వామి శ్రద్ధానంద్ కళాశాల నుండి బి.ఎ. పూర్తి చేశాడు. ఇక ప్రియాన్స్ ఆర్యా 2019లో భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌తో కలిసి అతడు ఆడాడు.
అయితే ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024 ద్వారా ప్రియాన్ష్ వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది డీపీఎల్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. టోర్నీ ఆసాంతం ప్రియాన్ష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్‌రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్‌కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో సీఎస్‌కే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఆర్య రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జై సూర్య పేరిట ఉండేది. జై సూర్య ముంబై ఇండియన్స్ తరపున సీఎస్‌కేపై 40 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌తో జైసూర్యను ఆర్య అధిగమించాడు
ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వీరే
షాన్ మార్ష్ vs రాజస్తాన్ రాయల్స్ 2008
మనీష్ పాండే vs దక్కన్ ఛార్జెర్స్, 2009
పాల్ వాల్తాటి vs సీఎస్‌కే, 2009
దేవదత్ పడిక్కల్ vs రాజస్తాన్, 2021
రజత్ పాటిదార్ vs లక్నో , 2022
యశస్వి జైస్వాల్ vs ముంబై ఇండియన్స్, 2022
ప్రభసిమ్రాన్ సింగ్ vs ఢిల్లీ క్యాపిటల్స్, 2023
ప్రియాంష్ ఆర్య vs సీఎస్‌కే, 2025*