
రఫేల్ సహా ఫైటర్ జెట్లను ధ్వంసం చేశాం
రెండు ఇండియన్ డ్రోన్లు సైతం నేలమట్టం
పాక్ పార్లమెంట్‌లో ప్రధాని షరీఫ్ ప్రకటన
ఇస్లామాబాద్: భారత్ చేపట్టిన వైమానిక దాడులను తమ సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. భారత్ చేసే దాడి కోసం పాక్ సైనిక దళాలు ముందుగానే సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారత్ దాడి చేయగానే అత్యంత వేగంగా ప్రతిస్పందించాయని అన్నారు. తమ సైన్యం ఐదు భారత యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందని తేల్చిచెప్పారు. అయితే, అందుకు ఎలాంటి ఆధారాలు ఆయన చూపలేకపోయారు.
షెహబాజ్ షరీఫ్ బుధవారం పాకిస్తాన్ పార్లమెంట్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలను వివరించారు. ఇండియా యుద్ధ ప్రణాళికల గురించి తమ సైనిక దళాలకు ముందస్తుగానే సమాచారం ఉందన్నారు. ఇండియా దాడుల పట్ల పాక్ వైమానిక దళం ప్రతిస్పందన అద్భుతం అని కొనియాడారు. ఇండియాకు సంబంధించిన రఫేల్ జెట్లు సహా ఐదు యుద్ద విమానాలకు కూల్చేసినట్లు ప్రకటించారు. అలాగే రెండు ఇండియన్ డ్రోన్లను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు.
గత రాత్రి 80 ఇండియన్ యుద్ధ విమానాలు దాడికి దిగాయని, తమ సైన్యం గట్టిగా బదులివ్వడంతో అవి తోకముడిచాయని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. మాతృభూమిని రక్షించుకోవడానికి తమ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టంచేశారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని చెప్పారు. దర్యాప్తునకు సహకరించాల్సిన భారత ప్రభుత్వం ఆవేశంతో తమపై దాడికి దిగిందని మండిపడ్డారు.
భారత్ దాడిని యుద్ధ చర్యగా పరిగణిస్తున్నాం
భారత ప్రభుత్వం తమపై యుద్ధం ప్రారంభించిందని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. పాక్‌తోపాటు పీఓకేలో భారత సైన్యం జరిపిన క్షిపణి దాడులను ‘యుద్ధ చర్య’గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. భారత్‌కు తగిన సమాధానం చెప్పే హక్కు తమకు ఉందని స్పష్టంచేశారు. పాకిస్తాన్‌లో ఐదు చోట్ల భారత సైన్యం దాడులు చేసినట్లు తెలిపారు. ఇందుకు గట్టిగా బదులివ్వక తప్పదని అన్నారు. ఈ మేరకు షహబాజ్ షరీఫ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శత్రువుకు ఎలా బుద్ధి చెప్పాలో తమ సైన్యానికి బాగా తెలుసని ఉద్ఘాటించారు.
శత్రువు ఆటలు సాగవని అన్నారు. తమపై హేయమైన దాడులకు పాల్పడినవారిని నెగ్గనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమ చేతిలో భారత్‌కు ఓటమి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. ఇదిలా ఉండగా, క్షిపణి దాడులను పాక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ ఖండించారు. పాకిస్తాన్ సార్వభౌమతాన్ని దెబ్బతీయడానికి భారత్ కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. ప్రాంతీయంగా శాంతి ప్రమాదంలో పడిందని, ఇందుకు భారత్ పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.