Operation Sindoor 2.0: భారత్‌ దెబ్బకు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ వేదిక మార్పు | PSL Moved To UAE Citing Player Well Being Amid Rising Indo Pak Tensions | Sakshi
Sakshi News home page

Operation Sindoor 2.0: భారత్‌ దెబ్బకు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ వేదిక మార్పు

May 9 2025 9:10 AM | Updated on May 9 2025 9:10 AM

PSL Moved To UAE Citing Player Well Being Amid Rising Indo Pak Tensions

ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 పేరిట భారత దళాలు పాక్‌పై దాడులు జరుపుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2025 వేదికను మార్చారు. పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే కొనసాగుతున్న పీఎస్‌ఎల్‌ 10వ ఎడిషన్‌ను యూఏఈకి మార్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. 

ఈ లీగ్‌ మరో ఎనిమిది మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. నిన్న (మే 8) భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్‌ఎల్‌ వేదికను పాక్‌ నుంచి యూఏఈకి తరలించారు. పీఎస్‌ఎల్‌లో తదుపరి జరగాల్సిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పీఎస్‌ఎల్‌ను యూఏఈకి తరలిస్తున్నట్లు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ ప్రకటించాడు.

జనావాసాలపై పాక్‌ దళాల దాడులకు బదులిచ్చే క్రమంలో నిన్న రావ‌ల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత దళాలు డ్రోన్‌ దాడి చేశాయి. ఈ దాడి తర్వాత కొద్ది గంటల్లోనే పీఎస్‌ఎల్‌లో భాగంగా పెషావర్‌ జల్మీ, క‌రాచీ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. భారత్‌ దాడుల తీవ్రతను పెంచిందని గ్రహించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తక్షణమే స్పందించి, అప్పటికప్పుడు ఆ మ్యాచ్‌ను రద్దు చేసింది. తాజాగా లీగ్‌ మొత్తాన్నే యూఏఈకి తరలిస్తున్నట్లు ప్రకటించింది.

కాగా, పీఎస్‌ఎల్‌లో దాదాపు 40 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. వారి భద్రత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. విదేశీ క్రికెటర్ల జాబితాలో కేన్‌ విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌ లాంటి ప్రముఖులు ఉన్నారు. పాక్‌ నుండి తమ స్వదేశాలను వెళ్లడం ప్రస్తుతం విదేశీ ఆటగాళ్లకు సవాలుగా మారింది. భారత దాడుల నేపథ్యంలో పాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ మూతపడ్డాయి. విదేశీ క్రికెటర్లకు ఎక్కడ తల దాచుకోవాలో అర్దం కావడం లేదు. పాక్‌ ప్రభుత్వం విదేశీ క్రికెటర్ల భద్రతను గాలికొదిలేసింది. పీసీబీ అధికారులు, పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీ యజమానులు చేతులెత్తేశారు. ప్రస్తుతం పాక్‌లో విదేశీ క్రికెటర్లు బిక్కుబిక్కుమంటున్నారు.

మరోవైపు పాక్‌ దాడుల దృష్ట్యా భారత్‌లో ఐపీఎల్‌ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. నిన్న ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ, పంజాబ్‌ మ్యాచ్‌ అర్దంతరంగా రద్దైంది. ధర్మశాలలో బ్లాక్‌ అవుట్‌ ప్రకటించడంతో స్టేడియంలో ఫ్లడ్‌ లైట్లు ఆర్పేశారు. తొలుత ప్రేక్షకులను బయటకు పంపించిన అధికారులు, ఆతర్వాత పరిస్థితిని వివరించారు. ఐపీఎల్‌-2025 భవితవ్యంపై ఇవాళ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కాగా, పహల్గామ్‌ ఉగ్రదాడికి బదులుగా భార‌త ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరిట పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియ‌న్ ఆర్మీ.. పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఇందులో 100 మంది ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు.

అనంత‌రం పాక్‌ దళాల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటంతో పాటు మిసైళ్లతో దాడికి దిగారు. జనావాసాలపై దాడికి దిగడంతో సహనం కోల్పోయిన భార‌త్ పాక్‌కు ధీటుగా బ‌దులిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌ 2.0ను మొదలుపెట్టింది. ఇప్పటికే భారత దళాలు పాక్‌కు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. రావల్పిండి, ఇస్లామాబాద్‌, ముల్తాన్‌, కరాచీ లాంటి నగరాలపై దాడులతో విరుచుకుపడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement