'టర్కీ ఆ ఫలితం అనుభవించక తప్పదు'
మాస్కో: తమ యుద్దవిమానాన్ని కూల్చివేసిన టర్కీ పదే పదే చింతించక తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న కారణంతో నవంబర్ 24న రష్యా సుఖోయ్ యుద్ధ విమానం ఎస్‌యూ 24ను టర్కీ సైన్యం కూల్చివేయడంపై ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. మాస్కో నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉగ్రవాదం అంశంతో పాటు టర్కీ దాడి గురించి ప్రస్తావించారు. టెర్రరిస్టులకు సహకరిస్తున్న అంకారాను మాస్కో అంత త్వరగా మరిచిపోదని అన్నారు. తమ స్వప్రయోజనాల కోసం టెర్రరిజం అంశంపై కొన్ని దేశాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమ యుద్దవిమానాన్ని కూల్చిన నేపథ్యంలో టర్కీకి చెందిన ఆహార ఎగుమతులపై పుతిన్ నిషేధం విదింతిచిన సంగతి తెలిసిందే. టర్కీ భూభాగంలోకి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఆయిల్ పైప్ లైన్ ఉంది. టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగన్, ఆయన సన్నిహితులు ఐఎస్ఎస్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న సిరియా, ఇరాక్ దేశాల నుంచి ఆయిల్‌ను అక్రమంగా రవాణా చేస్తూ లబ్ధిపొందుతున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మిలిటరీ బలగాలను పంపే ఉద్దేశం లేదని, నిర్మాణ, ఆహార ఉత్పత్తులు, మొదలైన రంగాలలో టర్కీకి పరిమితులు విధిస్తామని హెచ్చిరించారు. మా పౌరులను చంపి టర్కీ చేసింది ఘోర తప్పిదమన్నారు.