
Photo Courtesy: BCCI/IPL
ప్రియాన్ష్ ఆర్య.. 24 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడి పేరు క్రికెట్ వర్గాల్లో మారుమ్రోగిపోతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 39 బంతుల్లోనే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
సంచలన ఇన్నింగ్స్
చెన్నైతో మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya).. ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో ఏకంగా 103 పరుగులు సాధించాడు. 245కు స్ట్రైక్‌రేటుతో దంచికొట్టి చెన్నైపై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 88 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన సంచలన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025
సచిన్ టెండుల్కర్ తర్వాత అంతటి ‘అద్భుతం’!
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రియాన్ష్ ఆర్యను ఆకాశానికెత్తాడు. టీమిండియా దిగ్గజం, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత అంతటి అద్భుతాన్ని ఇప్పుడే చూశానంటూ అతడిని కొనియాడాడు. మైదానం నలుదిశలా షాట్లతో హోరెత్తించాడని.. సీఎస్‌కేలో ఉన్న ప్రపంచస్థాయి బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు అమోఘమని ప్రశంసించాడు.
‘‘ప్రియాన్ష్ ఆర్య... టీమిండియాకు సుదీర్ఘకాలం పాటు ఆడగల సత్తా ఉన్న ఆటగాడు. సచిన్ టెండుల్కర్ తర్వాత.. విపత్కర పరిస్థితుల్లో అంత గొప్పగా ఆడిన రెండో ఆటగాడు ఇతడే. సచిన్ తర్వాత నేను చూసిన అద్భుతం ఇతడే.
క్లిష్ట పరిస్థితుల్లో మేటి బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేయడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఇంచుమించు 250 స్ట్రైక్‌రేటుతో శతక్కొట్టడం ఊహకు అందని విషయం. శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అవుటైన తర్వాత.. ఒంటిచేత్తో పంజాబ్‌ను ఆదుకున్నాడు.
ఆకాశమే హద్దుగా
పాయింట్, కవర్లు.. ఒక్కటేమిటి మైదానం అన్ని వైపులకు బంతిని తరలిస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. పతిరణ, జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో పంజాబ్‌ను గెలిపించాడు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రియాన్ష్ ఆర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
వరుసగా నాలుగో ఓటమి
కాగా ముల్లాన్‌పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత తొలుత బ్యాటింగ్ చేసింది. చెన్నై ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించినా.. ప్రియాన్ష్ ఆర్య (103), శశాంక్ సింగ్ (52 నాటౌట్), మార్కో యాన్సెన్ (34 నాటౌట్) దంచికొట్టడంతో.. పంజాబ్ 20 ఓవర్లలో 219 పరుగులు స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైపోయింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (42), మహేంద్ర సింగ్ ధోని (27) ఓ మోస్తరుగా ఆడారు. అయితే, విజయానికి 18 పరుగులు దూరంలో చెన్నై నిలిచిపోయింది. ఇక ఐపీఎల్-2025లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్ ఇప్పటికి నాలుగింట మూడు గెలిచింది.
ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ చెన్నై స్కోర్లు
పంజాబ్: 219/6 (20)
చెన్నై: 201/5 (20)
ఫలితం: 18 పరుగుల తేడాతో చెన్నైపై పంజాబ్ గెలుపు
చదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్