
Photo Courtesy: BCCI
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటన నిన్న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో అత్యంత అరుదైన హ్యాట్రిక్ రనౌట్స్ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. ఢిల్లీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు కావడం ఇదే మొదటిసారి.
లీగ్ ఆరంభ సీజన్‌లో (2008) ఓ సారి ఒకే ఓవర్‌లో మూడు రనౌట్లు నమోదైనా, అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్‌లో (2, 4, 6 బంతులకు) మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒకే ఓవర్‌లో, అందులోనూ వరుసగా మూడు బంతుల్లో రనౌట్లు నమోదయ్యాయి.
నిన్నటి మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా అశుతోష్ శర్మ (17), కుల్దీప్ యాదవ్ (1), మొహిత్ శర్మ (0) వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది.
కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసినా, చివర్లో హ్యాట్రిక్ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. లేని, అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికిలోనై రనౌటైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్‌లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.
నేటికి అది రికార్డే
2008 సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ముంబై బ్యాటర్లు రనౌట్లయ్యారు (చివరి ఓవర్‌లో మూడు రనౌట్లతో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో నేటికీ ఇది ఓ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్ మ్యాచ్‌లోనూ ఐదుగురు బ్యాటర్లు రనౌట్లు కాలేదు.