MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్‌.. కోహ్లి, గేల్‌, ఏబీడీ సరసన చోటు | IPL 2025, MI VS SRH: Rohit Sharma Joins Kohli, Gayle And ABD In elite List After Completing 100 Sixes In Wankhede | Sakshi
Sakshi News home page

MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్‌.. కోహ్లి, గేల్‌, ఏబీడీ సరసన చోటు

Published Thu, Apr 17 2025 10:29 PM | Last Updated on Fri, Apr 18 2025 2:00 PM

IPL 2025, MI VS SRH: Rohit Sharma Joins Kohli, Gayle And ABD In elite List After Completing 100 Sixes In Wankhede

Photo Courtesy: BCCI

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. సన్‌రైజర్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 17) జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన రోహిత్‌ వాంఖడే స్టేడియంలో (ఐపీఎల్‌లో) ఇప్పటివరకు 102 సిక్సర్లు కొట్టాడు. ఒకే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్‌.. కోహ్లి, గేల్‌, డివిలియర్స్‌ సరసన చేరాడు. 

ఈ ముగ్గురు కూడా ఆర్సీబీ​​కి ఆడుతూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 130 సిక్సర్లు బాదగా.. గేల్‌ 127, డివిలియర్స్‌ 118 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్‌లో ఈ ముగ్గురితో పాటు రోహిత్‌ మాత్రమే ఒకే వేదికలో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్‌ పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్‌, కమిన్స్‌ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ 40, ట్రవిస్‌ హెడ్‌ 28, ఇషాన్‌ కిషన్‌ 2, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 19, క్లాసెన్‌ 37, అనికేత్‌ 18 (నాటౌట్‌), కమిన్స్‌ 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్‌ జాక్స్‌ 2, బౌల్ట్‌, బుమ్రా, హార్దిక్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ ఎప్పటిలాగే ఆదిలో విధ్వంసం సృష్టించి, ఆతర్వాత ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ 16 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. 

9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 82/2గా ఉంది. రోహిత్‌ ఔటయ్యాక మరో ఓపెనర్‌ రికెల్టన్‌ (31) కూడా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం విల్‌ జాక్స్‌ (14), సూర్యకుమార్‌ యాదవ్‌ (8) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement