
దీపక్ చహర్, తిలక్ వర్మతో రోహిత్ శర్మ (PC: BCCI)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్-2025లో పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ (Mumabi Indians)కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగులు కేవలం 56. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రోహిత్.. 12 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.
మరోవైపు.. ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. ఈసారి కూడా ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ముంబై కేవలం రెండే గెలవడం ఇందుకు నిదర్శనం.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢీ
ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన హార్దిక్ సేన.. గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వైఫల్యం ముంబైపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
బ్యాటింగ్ ఆర్డరే ప్రధాన సమస్య
‘‘ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. బ్యాటింగ్ ఆర్డర్. అవును ఇది నిజమే. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు సాధించలేకపోతున్నాడు. ఒకవేళ అతడి వైఫల్యం ఇలాగే కొనసాగితే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కుదేలవడం ఖాయం.
రోహిత్ కుదురుకోకపోతే.. ఎవరిని ఎప్పుడు బ్యాటింగ్‌కు పంపాలో అర్థం కాని పరిస్థితి. నిజానికి ఓపెనర్‌గా రియాన్ రికెల్టన్ రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ డీసెంట్‌గా బ్యాటింగ్ చేస్తున్నారు.
నమన్ ధీర్ చక్కగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఇకపోతే.. విల్ జాక్స్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నా.. పర్లేదనిపిస్తున్నాడు. ఎటొచ్చీ రోహిత్ శర్మ ఫామ్‌లేమి వల్లే సమస్య. అతడు ఓపెనర్ కాబట్టి నమన్ ధీర్, విల్ జాక్స్ వంటి వాళ్లను బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనుక పంపాల్సి వస్తోంది.
సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో?
ఏదేమైనా రోహిత్ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గొప్ప టీ20 ప్లేయర్ అని.. అయితే, ఆది నుంచే దూకుడు ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్తగా ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్