CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్‌.. రోహిత్‌ ఫిఫ్టీ కొట్టగానే అనంత్‌ అంబానీతో కలిసి.. | Anant Ambani And Radhika Merchant Reaction To Rohit Sharma Returns To Form, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్‌.. రోహిత్‌ ఫిఫ్టీ కొట్టగానే అనంత్‌ అంబానీతో కలిసి ఇలా..

Published Mon, Apr 21 2025 9:54 AM | Last Updated on Mon, Apr 21 2025 10:58 AM

Anant Ambani Radhika Merchant Reaction To Rohit Sharma Returns Form Goes Viral

రాధికా- అనంత్‌ (PC: JioHotstar)

ఐపీఎల్‌-2025 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్‌.. గేర్‌ మార్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో గెలుపు బాట పట్టిన హార్దిక్‌ సేన.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది.

తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుని.. ధోని సేనను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసి.. ఓవరాల్‌గా నాలుగో విజయం అందుకుంది.

ఈ క్రమంలో ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఆరో స్థానానికి దూసుకువచ్చింది ముంబై ఇండియన్స్‌. ఇక ఆదివారం నాటి సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఫామ్‌లోకి రావడం జట్టుకు మరో శుభసూచకం.

రోహిత్‌- సూర్య ధనాధన్‌
చెన్నై విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌ రియాన్‌ రికెల్టన్‌ 19 బంతుల్లో 24 పరుగులు చేసి నిష్క్రమించగా.. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్‌.. మొత్తంగా 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.

రోహిత్‌కు తోడుగా సూర్యకుమార్‌ యాదవ్‌ (30 బంతుల్లో 68 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్‌ కారణంగా ముంబై 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో చెపాక్‌లో చెన్నై చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆకాశ్‌ అంబానీల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి రావడం.. సూర్య ధనాధన్‌ ఇన్నింగ్స్‌ చూసి వారు ఖుషీ అయ్యారు.

రెండు జెడల సీతలా
ఇక నీతా- ఆకాశ్‌లకు తోడు ఈసారి అంబానీల కొత్త కోడలు రాధికా మర్చంట్‌ (Radhika Merchant) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త అనంత్‌ అంబానీతో కలిసి మ్యాచ్‌ను వీక్షించిన రాధికా..  రెండు జెడల సీతలా ముంబై జెర్సీలో తళుక్కుమన్నారు. రోహిత్‌ శర్మ ఫిఫ్టీ పూర్తి చేసుకోగానే కరతాళ ధ్వనులతో అనంత్‌- రాధికా తమ మాజీ కెప్టెన్‌ను అభినందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ధోని విఫలం
కాగా వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు ఆయుశ్‌ మాత్రే 32 పరుగులతో ఆకట్టుకున్నాడు.

మరోవైపు.. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్‌), శివం దూబే (32 బంతుల్లో 50) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్‌ ధోని 4 పరుగులకే పరిమితమయ్యాడు.

ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు, అశ్వనీ కుమార్‌, మిచెల్‌ సాంట్నర్‌, దీపక్‌ చహర్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ముంబై సీఎస్‌కే విధించిన లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది.

చదవండి: ఒక్కోసారి మనపై మనకే డౌట్‌!.. నాకు దక్కిన అరుదైన గౌరవం: రోహిత్‌ శర్మ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement