RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్‌ అయ్యర్‌!.. వీడియో | Virat Kohli Animated Celebration Leaves Shreyas Iyer Fuming Heated Chat After RCB Beat PBKS, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

RCB Vs PBKS: ‘హద్దు’దాటిన కోహ్లి.. కింగ్‌పై మండిపడ్డ శ్రేయస్‌ అయ్యర్‌!.. వీడియో

Published Mon, Apr 21 2025 11:09 AM | Last Updated on Mon, Apr 21 2025 5:36 PM

Kohli Celebration Leaves Shreyas Iyer Fuming Heated Chat after RCB beat PBKS

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఐదో గెలుపు నమోదు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ (PBKS vs RCB) చేతిలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఎదురైన పరాభవానికి ఆదివారం బదులు తీర్చుకుంది. పంజాబ్‌ను వారి హోం గ్రౌండ్‌ ముల్లన్‌పూర్‌లో ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

శ్రేయస్‌ అయ్యర్‌ లక్ష్యంగా
ఈ క్రమంలో పంజాబ్‌పై ప్రతీకార విజయం నేపథ్యంలో ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. అయితే, పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ లక్ష్యంగా కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్న తీరు విమర్శలకు తావిచ్చింది.

కోహ్లి చర్య.. శ్రేయస్‌ ఫైర్‌
ఇక కోహ్లి చర్య పట్ల శ్రేయస్‌ కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది. మ్యాచ్‌ ముగియగానే ఇరుజట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలో.. అయ్యర్‌ కోహ్లితో కోపంగా ఏదో మాట్లాడాడు. అయితే, కోహ్లి మాత్రం నవ్వుతూ వాతావరణాన్ని చల్లబరచాలని ప్రయత్నించాడు.

కానీ శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం గంభీరంగా అతడికి బదులిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా సహచర టీమిండియా ఆటగాడిని కించపరిచేలా ఇలాంటి సెలబ్రేషన్స్‌ దిగ్గజ బ్యాటర్‌ అయిన కోహ్లి స్థాయికి తగవంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడా?
అయితే, ఆర్సీబీ అభిమానులు మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ గత మ్యాచ్‌లో కోహ్లిని అనుకరిస్తూ హేళన చేశాడని.. అందుకే కింగ్‌ ఇలా బదులిచ్చాడని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. శ్రేయస్‌ ఆర్సీబీ మ్యాచ్‌ సమయంలో ఎలాంటి మూర్ఖపు చర్యలకు దిగలేదని.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో అతడు ఇచ్చిన రియాక్షన్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.

బ్యాటర్‌గా శ్రేయస్‌ విఫలం
కాగా ముల్లన్‌పూర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. 

ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (33), వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ (29), శశాంక్‌ సింగ్‌ (33 బంతుల్లో 31) రాణించగా.. ఆఖర్లో మార్కో యాన్సెన్‌ (20 బంతుల్లో 25 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు.

ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్‌ పాండ్యా, సూయశ్‌ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. పేసర్‌ రొమారియో షెఫర్డ్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6) రూపంలో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

Virat Kohli vs Shreyas Iyer: ఈ ఓవరాక్షన్ తగ్గించుకో బ్రో

దంచికొట్టిన పడిక్కల్‌, కోహ్లి
ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి, వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. పడిక్కల్‌ కేవలం 35 బంతుల్లోనే 61 పరుగులతో దుమ్ములేపాడు.

అయితే, కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (12) ఈసారి విఫలం కాగా.. కోహ్లి- జితేశ్‌ శర్మతో కలిసి ఆర్సీబీ విజయాన్ని ఖరారు చేశాడు. కోహ్లి 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 73 పరుగులతో అజేయంగా నిలవగా.. జితేశ్‌ (8 బంతుల్లో 11) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కాగా ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ ఐదింట గెలిచి.. పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.

చదవండి: Rohit Sharma: ఒక్కోసారి మనపై మనకే డౌట్‌!.. నాకు దక్కిన అరుదైన గౌరవం
CSK Vs MI: ముంబై జెర్సీలో రాధికా మర్చంట్‌.. రోహిత్‌ ఫిఫ్టీ కొట్టగానే అనంత్‌ అంబానీతో కలిసి ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement