ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చాను: శ్రేయస్‌ అయ్యర్‌ | Main Rone Chalu Kiya: Shreyas Iyer reveals shocking story from CT 2025 | Sakshi
Sakshi News home page

ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చాను: శ్రేయస్‌ అయ్యర్‌ ‘షాకింగ్‌’ కామెంట్స్‌

Published Mon, Apr 7 2025 5:42 PM | Last Updated on Mon, Apr 7 2025 6:28 PM

Main Rone Chalu Kiya: Shreyas Iyer reveals shocking story from CT 2025

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిల్‌ టీమిండియా సొంతం కావడంలో శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ది కీలక పాత్ర. ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఐదు మ్యాచ్‌లలోనూ అద్భుత ఆట తీరుతో రాణించి.. జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ఈ వన్డే టోర్నీలో మొత్తంగా 243 పరుగులు సాధించి భారత్‌ తరఫున టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.

తుదిజట్టులో చోటు కరువు?
అయితే, ఈ మెగా ఈవెంట్‌కు ముందు శ్రేయస్‌ అయ్యర్‌కు తుదిజట్టులో చోటు దక్కే పరిస్థితే లేదు. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌ (Ind vs Eng ODIs)తో స్వదేశంలో టీమిండియా మూడు వన్డేలు ఆడగా.. తొలి మ్యాచ్‌కు విరాట్‌ కోహ్లి గాయం వల్ల దూరమయ్యాడు. ఫలితంగా శ్రేయస్‌ అతడి స్థానంలో ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చాడు.

ఇక అప్పటి నుంచి అతడికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస మ్యాచ్‌లలో బ్యాట్‌ ఝులిపించి చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక ఈ టోర్నీకి పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వగా.. భారత జట్టు మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ (Dubai)లో ఆడిన విషయం తెలిసిందే. అయితే, తొలి మ్యాచ్‌కు ముందు శ్రేయస్‌ అయ్యర్‌ బాగా ఏడ్చాడట. ఇందుకు గల కారణాన్ని అతడు తాజాగా వెల్లడించాడు.

ఆఖరిసారిగా అప్పుడే బాగా ఏడ్చాను
క్యాండిడ్‌ విత్‌ కింగ్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను చివరగా ఏడ్చిన సందర్భం అంటే.. చాంపియన్స్‌ ట్రోఫీ అప్పుడే. మొదటి ప్రాక్టీస్‌ సెషన్‌లో నేను సరిగ్గా ఆడలేకపోయాను. దాంతో ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాను.

అంతేకాదు.. నా మీద నాకు అంతులేని కోపం వచ్చింది. నిజానికి సాధరణంగా నేను అస్సలు ఏడ్వను. కానీ అప్పుడు ఎందుకు అంతలా బాధపడ్డానో నాకే తెలియదు. ఒక్కోసారి నాకు ఇది షాకింగ్‌గా అనిపిస్తుంది.

అంతకు ముందు ఇంగ్లండ్‌ సిరీస్‌లో నేను బాగానే ఆడాను. అదే జోరును చాంపియన్స్‌ ట్రోఫీలో కొనసాగించాలని ఫిక్సయ్యాను. అయితే, అలా తొలి సెషన్‌లోనే చేదు అనుభవం ఎదురుకావడం వల్ల నిరాశకు గురయ్యాను. తర్వాత అక్కడి పిచ్‌ పరిస్థితులను అర్థం చేసుకుని నాదైన శైలిలో ఆడాను’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు.

కనక వర్షం
కాగా ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌ అయ్యర్‌ను ఆ జట్టు వదులుకుంది. ఈ క్రమంలో మెగా వేలంలోకి వచ్చిన ఈ ముంబైకర్‌పై కాసుల వర్షం కురిసింది. పంజాబ్‌ కింగ్స్‌ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. ఇక పంజాబ్‌ సారథిగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అయ్యర్‌.. రెండింట గెలిచాడు.

చదవండి: గిల్‌, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్‌ దేవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement