
హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుకుంది. హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇదే హోటల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేస్తోంది.
ఈ ప్రమాద సమయంలో ఎస్ఆర్‌హెచ్ టీమ్ సభ్యులు హోటల్‌లోనే ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లిపోయారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటల్ కు చేరుకుని పొగలను అదుపు చేశారు.
మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 17న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తలపడనుంది.
ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ టీమ్ సోమవారం సాయంత్రం ముంబైకి బయలు దేరాల్సి ఉంది. కానీ అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాస్త ముందుగానే ఎస్ఆర్‌హెచ్ టీమ్ చెక్ అవుట్ చేసింది.
ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్ టీమ్ కాస్త తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. అయితే ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై మాత్రం రికార్డు విజయాన్ని ఎస్ఆర్‌హెచ్ అందుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(141) భారీ సెంచరీతో చెలరేగాడు.