
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన అద్బుత బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ టాపర్డర్‌ను కుప్పకూల్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే కరుణ్ నాయర్‌ను ఔట్ చేసి తన జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
ఆ తర్వాత మూడో ఓవర్ మొదట బంతికి ఫాఫ్ డుప్లెసిస్, ఐదో ఓవర్ మొదటి బంతికి అభిషేక్ పోరెల్‌ను కమ్మిన్స్ పెవిలియన్‌కు పంపాడు. కమ్మిన్స్ ఓవరాల్‌గా తన 4 ఓవర్ల కోటాలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కమ్మిన్స్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా కమ్మిన్స్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లే ఏ కెప్టెన్ కూడా మూడు వికెట్లు సాధించలేకపోయాడు. అక్షర్ పటేల్(ఢిల్లీ క్యాపిటల్స్), జహీర్ ఖాన్(ఢిల్లీ క్యాపిటల్స్), షాన్ పోలాక్(ముంబై ఇండియన్స్) వంటి కెప్టెన్లు ఐపీఎల్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో 2 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో ఈ త్రయాన్ని కమ్మిన్స్ అధిగమించాడు.
మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 7 వికెట్ల నష్టానికి ఢిల్లీ 133 పరుగులు చేసింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని స్టబ్స్(41 నాటౌట్), ఆశుతోష్ శర్మ(41) ఆదుకున్నారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు, ఉనద్కట్, హర్షల్ పటేల్, మలింగ తలా వికెట్ సాధించారు.