
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అత్యధిక టైటిళ్లు గెలిచిన కెప్టెన్లుగా రోహిత్ శర్మ(Rohit Sharma), మహేంద్ర సింగ్(MS Dhoni) కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్‌కు దక్కగా.. అతడి తర్వాత ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన సారథిగా ధోని చరిత్రకెక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడిగా ఈ ఫీట్ నమోదు చేశాడు.
విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో
ఇక గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ను విజేతగా నిలపడం ద్వారా మరో టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కూడా విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. గౌతం గంభీర్ తర్వాత కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలిపిన రెండో సారథిగా నిలిచాడు. అతడి సారథ్యంలో కోల్‌కతా గతేడాది అద్భుత విజయాలు సాధించింది.
లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి టాపర్‌గా ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులోనూ మరోసారి సన్‌రైజర్స్‌తో తలపడి పైచేయి సాధించి.. విజేతగా అవతరించింది. దీంతో ఓవరాల్‌గా మూడోసారి కేకేఆర్ ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో విన్నర్‌గా నిలిచింది.
అయితే, ఈ విషయంలో తనకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదంటున్నాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్‌లో టైటిల్ సాధించినా తను కోరుకున్నట్లుగా ఏదీ జరుగలేదని పేర్కొన్నాడు. కాగా శ్రేయస్ ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 243 పరుగులతో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
తద్వారా భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశసంలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపినప్పటికీ వేలానికి ముందు ఫ్రాంఛైజీ శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్ ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. కేకేఆర్‌తో పోటీపడి అయ్యర్‌ను భారీ ధరకు తమ సొంతం చేసుకుంది. ఐపీఎల్-2025లో తమ కెప్టెన్‌గా నియమించింది.
కోరుకున్న గుర్తింపు దక్కలేదు
ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ‘‘ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా నేను కోరుకున్నంత.. నాకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని అనిపిస్తోంది. అయితే, వ్యక్తిగతంగా నా ప్రదర్శన, కెప్టెన్సీ పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.
ఎవరూ లేనపుడు కూడా మనం సరైన, న్యాయమైన దారిలో వెళ్తేనే విలువ. వ్యక్తిగా మనకు అన్నింటికంటే నిజాయితీ అతి ముఖ్యమైనది. అలాగని నాకు ఎవరి మీదా అసహనం, అసంతృప్తి లేదు.
ఐపీఎల్ ఆడినందు వల్లే చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను. అదృష్టవశాత్తూ టైటిల్ కూడా గెలిచి మనుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను’’ అని శ్రేయస్ అయ్యర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.
క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే
కాగా ప్రస్తుతం టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న గంభీర్ గతేడాది కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరించాడు. కోల్‌కతా టైటిల్ గెలిచిన క్రెడిట్ మొత్తం అతడి ఖాతాలోకే వెళ్లిందన్నది బహిరంగ రహస్యమే.
ఈ విజయం తర్వాతే అతడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రధాన కోచ్‌గా నియమించింది. ఒక్కసారి కూడా కోచ్‌గా పని చేసిన అనుభవం లేకపోయినా గంభీర్‌పై నమ్మకం ఉంచింది. అయితే, టెస్టుల్లో అతడి మార్గదర్శనంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఓడిన భారత్.. చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం విజేతగా నిలిచింది.
చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment