పంజాబ్ కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్(PC: PBKS X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. ఐపీఎల్-2025 సీజన్‌కు గానూ టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తమ సారథిగా ఎంపిక చేసుకుంది. కాగా క్యాష్ రిచ్ లీగ్‌లో కెప్టెన్‌గా ఈ ముంబై బ్యాటర్‌కు మంచి అనుభవం ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లకు అతడు నాయకుడిగా వ్యవహరించాడు.
కోల్‌కతాకు టైటిల్ అందించి
ఇక గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన 30 ఏళ్ల శ్రేయస్ అయ్యర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, మెగా వేలం-2025(IPL Mega Auction 2025)కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రిటైన్ చేసుకుంటుందని విశ్లేషకులు భావించగా.. శ్రేయస్ మాత్రం జట్టుతో బంధాన్ని తెంచుకునేందుకే ఇష్టపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చాడు.
భారీ ధర..
ఈ చాంపియన్ కెప్టెన్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తగ్గేదేలే అన్నట్లు ధరను పెంచుకుంటూ పోయాయి. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన వేలం పాటలో ఆఖరికి పంజాబ్ నెగ్గింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26 కోట్ల 75 లక్షలు పెట్టి శ్రేయస్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది. తాజాగా అతడికి పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఇప్పటికే నిరూపించుకున్న ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులు చాలా మంది అందుబాటులో ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించేందుకు నావంతు కృషి చేస్తా’ అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక.. ప్రధాన కోచ్ పాంటింగ్ మాట్లాడుతూ ‘శ్రేయస్‌కు ఆటపై మంచి అవగాహన ఉంది. కెప్టెన్‌గా ఇప్పటికే నిరూపించుకున్నాడు. గతంలో అతడితో కలిసి పనిచేశా. సీజన్ కోసం ఆతృతగా చూస్తున్నా’ అని అన్నాడు.
కాగా ఇటీవల శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 2024లో రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలు గెలిచిన ముంబై జట్టులో శ్రేయస్ అయ్యర్ సభ్యుడు. అంతేకాదు.. ఇటీవల అతడి కెప్టెన్సీలో ముంబై టీమ్ దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ టైటిల్ గెలిచింది.
సూపర్ ఫామ్‌లో
అదే విధంగా.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ శ్రేయస్ అయ్యర్ భారీ శతకాలతో దుమ్ములేపాడు. తదుపరి అతడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది.
అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో మాత్రం అయ్యర్‌కు చోటు దక్కలేదు. కాగా శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు.
గతేడాది ఫ్లాప్ షో
ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఇక గత సీజన్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. గాయం వల్ల అతడు ఆదిలోనే తప్పుకోగా.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ పంజాబ్ కేవలం ఐదే గెలిచి.. తొమ్మిదో స్థానంతో సీజన్‌ను ముగించింది.
చదవండి: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్
𝐒𝐡𝐫𝐞𝐲𝐚𝐬 𝐈𝐲𝐞𝐫 ➡️ 𝐓𝐡𝐞 𝐜𝐡𝐨𝐬𝐞𝐧 𝐨𝐧𝐞! ©️♥️#CaptainShreyas #SaddaPunjab #PunjabKings pic.twitter.com/EFxxWYc44b
— Punjab Kings (@PunjabKingsIPL) January 12, 2025
Comments
Please login to add a commentAdd a comment