
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒకప్పుడు బాల్ బాయ్‌గా ఉన్న పిల్లాడు.. కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అంతేనా.. టైటిల్ గెలిచిన మొనగాడు కూడా అతడు!.. అంతేకాదండోయ్.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడు కూడా! ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది.. అవును.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).
సారథిగా సూపర్ హిట్
ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించిన శ్రేయస్.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాల్లో మునిగిపోయాడు.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా జట్టును ఫైనల్ వరకు చేర్చిన ఈ ముంబైకర్.. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. గౌతం గంభీర్ తర్వాత కోల్‌కతాకు ట్రోఫీ అందించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.
అయితే, మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌తో తెగదెంపులు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసి.. పగ్గాలు అప్పగించింది.
పంజాబ్ టైటిల్ కలను తీర్చాలని
గత ప్రదర్శనను పునరావృతం చేస్తూ ఈసారి పంజాబ్ టైటిల్ కలను ఎలాగైనా తీర్చాలని శ్రేయస్ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జియోహాట్‌స్టార్‌తో ముచ్చటించిన ఈ కెప్టెన్ సాబ్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
అప్పుడు బాల్ బాయ్‌ని
‘‘మా వీధిలో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాళ్లం. అప్పట్లో (2008) నేను ముంబై అండర్-14 జట్టుకు ఆడుతున్నాడు. ముంబై జట్టులో ఉన్న పిల్లలందరినీ ఐపీఎల్‌లో బాల్ బాయ్స్‌గా తీసుకువెళ్లారు.
నేను కాస్త బిడియస్తుడిని. ఎవరితోనూ ఎక్కువగా కలవను. అయినా సరే.. అదృష్టవశాత్తూ వారిలో ఒకడిగా నాకూ అవకాశం దక్కింది. అప్పట్లో నా ఫేవరెట్ క్రికెటర్ రాస్ టేలర్‌ను దగ్గరగా చూడాలని అనుకునేవాడిని.
సర్.. నేను మీకు వీరాభిమానిని
అనుకోకుండా ఆరోజు అవకాశం వచ్చింది. ఆయన దగ్గరకు వెళ్లి.. ‘సర్.. నేను మీకు వీరాభిమానిని’ అని చెప్పాను. ఆయన నా మాటలకు నవ్వులు చిందించడంతో పాటు థాంక్యూ కూడా చెప్పారు.
అలా మన అభిమాన క్రికెటర్లను కలిసినపుడు గ్లోవ్స్ లేదంటే బ్యాట్ అడగటం పరిపాటి. నాకూ ఆయనను బ్యాట్ అడగాలని అనిపించినా సిగ్గు అడ్డొచ్చింది.
ఓ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మా పక్కకు వచ్చి కూర్చుని.. మ్యాచ్ ఆస్వాదిస్తున్నారా అని అడిగారు. అవును.. మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పాను.
అప్పట్లో ఇర్ఫాన్ భాయ్ క్రేజ్ తారస్థాయిలో ఉండేది. పంజాబ్ జట్టులోని అందగాళ్లలో ఆయనా ఒకరు. యువీ పాను కూడా అప్పుడు దగ్గరగా చూశాం. ఈ జ్ఞాపకాలు నా మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోతాయి’’ అని శ్రేయస్ అయ్యర్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.
2015లో ఎంట్రీ
కాగా ఐపీఎల్ తొలి సీజన్ 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా తాను రాస్ టేలర్ (RCB)ని తొలిసారి కలిసినట్లు అయ్యర్ వెల్లడించాడు. కాగా శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున తన తొలి మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 115 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.
మొత్తంగా 3127 పరుగులు సాధించడంతో పాటు కెప్టెన్‌గా టైటిల్ సాధించాడు. ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌తో తాజా సీజన్‌ను మొదలుపెట్టనున్నాడు.
చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్
Comments
Please login to add a commentAdd a comment