
ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో మళ్లీ ఫుల్ బిజీ అయ్యారు విజయశాంతి(Vijayashanti). ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun Son Of Vyjayanthi) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా విలేకరులతో ముచ్చటిస్తూ.. మీడియాకు ఓ చిన్న రిక్వెస్ట్ చేసింది. ఇంటర్వ్యూలు చేసే సమయంలో హీరోయిన్లను ‘నువ్వు’ అని కాకుండా ‘మీరు’ అని సంభోదించాలని కోరారు.
‘సినిమాలకు దూరంగా ఉన్నా.. నేను అన్ని ఫాలో అవుతుంటాను. సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు చూస్తుంటాను. ఇక్కడ మీకు(మీడియా) ఓ మాట చెబుతాను తప్పుగా తీసుకోకండి. మీరు(మీడియా) ఇంటర్వ్యూలు చేసే సమయంలో హీరోయిన్లను కూడా ‘మీరు’ అని పిలవండి. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ హీరోయిన్‌ని అయినా మీరు అనే పిలిస్తే వాళ్లను గౌరవించినట్లు ఉంటుంది.
(చదవండి: కొందరు హీరోయిన్లు నా ట్యాగ్ తీసుకున్నారు: విజయశాంతి)
హీరోని మీరంతా అలానే పిలుస్తారు కదా.. మరి హీరోయిన్‌ని నువ్వు అని ఎందుకు అంటారు? చదువుకున్న మనం వాళ్లకు గౌరవం ఇవ్వాలి. ముంబై, చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లు మన టాలీవుడ్‌కి వస్తున్నారు. వారందరిని ‘మీరు’ అని గౌరవిస్తే.. మన గొప్పదనం తెలుస్తుంది.
నేను కూడా అందరిని మీరు అనే పిలుస్తాను. ఇది నేను ఎన్టీరామారావు దగ్గర నుంచి నేర్చుకున్నాను. సత్యంశివం సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఆయన మీరు అనే సంభోదించేవారు. ఆయన మనవరాలి వయసు ఉన్న నన్ను కూడా మీరు అని పిలవడం చూసి ఆశ్చర్యపోయాను. నేను కూడా ఆయనలాగే అందరిని మీరు అని గౌరవించాలకున్నాను.నేను అదే ఫాలో అవుతున్నాను. మీడియా సోదరులు చాలా మంచోళ్లు.. చాలా కష్టపడతారు. హీరోయిన్లను మీరు గౌరవిస్తే.. వాళ్లు కూడా మీతో గౌరవంగా మాట్లాడతారు. నేను చెప్పేది తప్పుగా తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే’అని విజయశాంతి అన్నారు.