
2025 ప్రారంభం నుంచి అనేక వాహన తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. కాగా ఈ నెలలో (2025 మే) వోక్స్‌వ్యాగన్, కియా, ఎంజీ మోటార్ వంటి కంపెనీలు తమ కార్లను పరిచయం చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ కథనంలో త్వరలో మార్కెట్లో లాంచ్ కానున్న కార్లను గురించి తెలుసుకుందాం.
కియా క్లావిస్
ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న కార్ల జాబితాలో కియా క్లావిస్ ఒకటి. ఇది అప్డేటెడ్ కియా కారెన్స్ అని తెలుస్తోంది. అయితే క్లావిస్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఇంటీరియర్ ఫీచర్స్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డేటైమ్ రన్నింగ్ లైట్‌లు అన్నీ కూడా అప్డేట్ అయ్యాయని సమాచారం. రియర్ బంపర్‌లు, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ అన్నీ కూడా కారెన్స్ కంటే భిన్నంగా ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. అంతే కాకుండా ఇది మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్నట్లు తెలుస్తోంది.
ఎంజీ విండ్సర్ (50 కిలోవాట్ బ్యాటరీ)
ప్రస్తుతం 39 కిలోవాట్ ప్యాక్ కలిగిన ఎంజీ విండ్సర్ కారు.. ఈ నెలలో 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో లాంచ్ కానుంది. ఇది 460 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 39 కిలోవాట్ ప్యాక్ 332 కిమీ రేంజ్ అందిస్తుంది. రాబోయే ఎంజీ విండ్సర్ డిజైన్, ఫీచర్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ మోటారు విషయంలో స్పష్టత రావడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
ఇదీ చదవండి: ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ
గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ ఈ నెలలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది సొగసైన ఎల్ఈడీ లైట్ సిగ్నేచర్, జీటీఐ బ్యాడ్జింగ్, హానీ కూంబ్ గ్రిల్, వెనుక భాగంలో డిఫ్యూజర్, రిఫ్రెష్డ్ టెయిల్‌లైట్ మొదలైనవి ఉన్నాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, టెయిల్‌గేట్‌పై GTI బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి. అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 265 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్
2020లో ప్రారంభమైన టాటా ఆల్ట్రోజ్ త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, రీపోజిషన్ డీఆర్ఎల్, అప్డేటెడ్ ఫ్రంట్ ఎండ్ వంటి వాటితో పాటు.. కొత్త అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. ఈ కారులో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే టాటా లోగోతో కూడిన రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్. ఇది కాకుండా.. పెద్ద టచ్‌స్క్రీన్, అప్డేటెడ్ డాష్‌బోర్డ్, ఏసీ కంట్రోల్స్,, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కూడా ఇందులో ఉండనున్నాయి.