
యూరప్‌లోని అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరున్న వోక్స్ వ్యాగన్ పునర్నిర్మాణ ప్రయత్నంలో భాగంగా 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీకి అనుబంధ సంస్థగా ఉన్న కారియాడ్ సాఫ్ట్‌వేర్ విభాగంలో అధికంగా ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుంది. దిగుమతి చేసుకున్న వాహనాలపై అమెరికా సుంకాలు, యూరోపియన్ యూనియన్ కర్బన ఉద్గారాల లక్ష్యాలకు సంబంధించిన జరిమానాల కారణంగా 2025 క్యూ1లో కంపెనీ నికర లాభం 40 శాతం తగ్గిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
వోక్స్ వ్యాగన్ నష్టాలకు కారణాలు..
అమెరికా సుంకాల ప్రభావం
దిగుమతి చేసుకున్న ఆటోమొబైల్స్‌పై అమెరికా 25% సుంకం విధించింది. ఇది వోక్స్ వ్యాగన్ మెక్సికో యూనిట్‌లో తయారవుతున్న వాహనాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది దాని యూఎస్ అమ్మకాలలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. సుంకాలు పెరగడంతో ఖర్చులు అధికమయ్యాయి. డిమాండ్ తగ్గిపోయింది. ఇది లాభాల మార్జిన్లపై ప్రభావం చూపింది.
ఈయూ కార్బన్ ఉద్గార జరిమానాలు
వోక్స్ వ్యాగన్ కఠినమైన యూరోపియన్ యూనియన్ కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకోవడం సవాలుగా మారుతుంది. నిబంధనలు పాటించనందుకు విధించే జరిమానాల కోసం కంపెనీ 600 మిలియన్ యూరోలను కేటాయించింది. ఇది దాని ఆర్థిక దృక్పథాన్ని మరింత దెబ్బతీసింది.
ఇదీ చదవండి: పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!
కారియాడ్ సాఫ్ట్‌వేర్ విభాగం
ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో కంపెనీ అనుబంధ సంస్థ కారియాడ్ నిరంతరం జాప్యం చేస్తోంది. ఇది వోక్స్ వ్యాగన్ ఈవీ లక్ష్యాలను ప్రభావితం చేసింది. ఈ విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించడానికి కంపెనీ 200 మిలియన్ యూరోలను కేటాయించింది. ఇది ఉద్యోగాల కోతకు, కార్యాచరణ మార్పులకు దారితీసింది.