
ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వార్షిక విక్రయాలను నమోదు చేసింది. 99,000 యూనిట్‌లకు పైగా విక్రయించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఏడేళ్లలో కంపెనీకి ఇవే అత్యధిక వార్షిక విక్రయాలు. న్యూ నిస్సాన్ మాగ్నైట్ బీ-ఎస్‌యూవీ బలమైన పనితీరుతో 35 శాతం వృద్ధిని సాధించింది.
దేశీయంగా 28,000 యూనిట్లు, ఎగుమతుల్లో 71,000 యూనిట్లతో, నిస్సాన్ తన “ఒక కారు, ఒక ప్రపంచం” విధానంతో 65కు పైగా అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించింది. 2024 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన న్యూ మాగ్నైట్ 1.5 లక్షల విక్రయాలు, 50,000 ఎగుమతి యూనిట్లను దాటింది. సౌదీ అరేబియాలో తొలి ఎల్‌హెచ్‌డీ మార్కెట్‌గా అడుగుపెట్టింది.
నిస్సాన్ 25 ఆర్థిక సంవత్సరంలో 7-సీటర్ బీ-ఎంపీవీ, 26 ఆర్థిక సంవత్సరంలో 5-సీటర్ సీ-ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా చెన్నై జేవీ ప్లాంట్‌లో వాటాను అలయన్స్ భాగస్వామికి అప్పగించినప్పటికీ, భారత్‌లో నిస్సాన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. భారత్‌లో వృద్ధి స్థిరంగా ఉందని, భవిష్యత్ ఉత్పత్తుల పైప్‌లైన్ అలాగే ఉంటుందని నిస్సాన్ ఇండియా అధ్యక్షుడు ఫ్రాంక్ టోరెస్ తెలిపారు.