ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్‌లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్‌కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.
బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.
అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్‌తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్‌ని కూడా ఈ డీల్‌లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.
ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్‌గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్‌వేర్‌పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment