న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, గ్రామీణ మార్కెట్లు మెరుగుపడుతుండటం వంటి సానుకూల అంశాలతో నవంబర్‌లో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్స్ మొదలైన దిగ్గజాల దేశీయ అమ్మకాలు వృద్ధి చెందాయి.
మారుతీ విక్రయాలు 5 శాతం, టాటా మోటర్స్ 2 శాతం, టయోటా 44 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అటు, కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. గ్రామీణ మార్కెట్లు పుంజుకుంటూ ఉండటం, ఎస్‌యూవీలకు డిమాండ్ నెలకొనడం, లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం తదితర అంశాలు తమకు కలిసొచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.
నవంబర్‌లో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్‌ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నవంబర్‌లో నమోదైన 49,016 యూనిట్లతో పోలిస్తే 59,003 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఆల్టో, ఎస్–ప్రెసోలాంటి మినీ–సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు, వివిధ వర్గాల అవసరాలకు అనుగుణమైన హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ఎస్‌యూవీల వరకు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో విక్రయాలు మెరుగుపర్చుకుంటున్నట్లు టయోటా వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment