
2024లో ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టిన అయిన రెండవ తరం స్కోడా కొడియాక్ ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ అయింది. ఇది లౌరిన్ & క్లెమెంట్ (L&K), స్పోర్ట్‌లైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 46.89 లక్షలు, రూ. 48.69 లక్షలు (ఎక్స్ షోరూమ్).
2025 స్కోడా కొడియాక్ కారు దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ కారు ముందు భాగంలో సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్ ఉంటుంది. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ అలాగే ఉంది. కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్ సిగ్నేచర్‌లను పొందుతాయి. బంపర్ రెండు అంచులలో ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్‌ను పొందుతుంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో సీ షేప్ టెయిల్ లాంప్ వంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కొత్త కొడియాక్ దాని మునుపటి మోడల్ కంటే కొంత పెద్దదిగా ఉంటుంది.
కొడియాక్ లోపలి భాగంలో 13 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 13 స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ఇంజిన్ విషయానికి వస్తే.. 2025 కొడియాక్ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతాయి. మైలేజ్ 14.86 కిమీ/లీ వరకు ఉంటుందని స్కోడా వెల్లడించింది.