ముంబై: దేశీయంగా వ్యక్తిగత రవాణా గిరాకీ పుంజుకోవడంతో నవంబర్‌లో వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి.
కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, ఎంజీ మోటార్స్ సంస్థలు సైతం చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం 1,59,044 వాహనాలు విక్రయించింది.
గతేడాది నవంబర్ నాటి 1,39,184 అమ్మకాలతో పోలిస్తే ఇవి 14 శాతం అధికం. డిసెంబర్‌తో కలుపుకొని ఈ ఏడాదిలో మొత్తం 38 లక్షల కార్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీవాస్తవ తెలిపారు.
హ్యుందాయ్ మోటార్ ఇండియా నవంబర్ విక్రయాలు 36 శాతం పెరిగి 64,004 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో కంపెనీ 46,910 వాహనాలను అమ్మింది.
టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు 62,192 నుంచి 21 శాతం పెరిగి 75,478కు చేరాయి. కియా ఇండియా మొత్తం అమ్మకాలు 69 శాతం పెరిగి 24,025 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ద్విచక్ర వాహనాల గణాంకాలను పరిశీలిస్తే.., హీరో మోటోకార్ప్ అమ్మకాలు నవంబర్‌లో 12 శాతం పెరిగి మొత్తం 3.90 లక్షల యూనిట్లను విక్రయించిట్లు ఆ కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో విక్రయాలు 19 శాతం మేర క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment