
స్వల్పంగా పెరిగిన మారుతీ సుజుకీ సేల్స్
మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా రెండంకెల వృద్ధి
నెమ్మదించిన హ్యుందాయ్, టాటా మోటార్స్
ముంబై: వాహన కంపెనీల విక్రయాలు ఎగుమతులతో కలుపుకుని ఫిబ్రవరిలో ఆశాజనకంగా నమోదయ్యాయి. ప్యాసింజర్స్ వెహికిల్స్ తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధితో సరిపెట్టుకుంది. డిమాండ్ స్తబ్ధుగా ఉండడంతో హ్యుందాయ్, టాటా మోటార్స్ వాహన అమ్మకాలు నెమ్మదించాయి. ఎస్‌యూవీలు, ఎంపీవీ మోడళ్లకు గిరాకీ లభించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ వాహన విక్రయాలు గత నెలలో రెండంకెల వృద్ధి సాధించాయి.
మారుతీ సుజుకీ దేశీయంగా గత నెలలో 1,60,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 1,60,271 యూనిట్లు. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్-ప్రెస్సో విక్రయాలు 14,782 నుంచి 10,226 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వేగన్–ఆర్ అమ్మకాలు 71,627 నుంచి 72,942 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 విక్రయాలు 61,234 నుంచి 65,033 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు కలుపుకొని ఈ ఫిబ్రవరిలో కంపెనీ 1,99,400 యూనిట్ల వాహనాలు విక్రయించింది.

➤హ్యుండై మోటార్ ఇండియా మొత్తం వాహన విక్రయాలు 3% క్షీణించి 58,727 యూనిట్లకు వచ్చి చేరాయి. దేశీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ.. కేంద్ర బడ్జెట్ 2025లో ప్రతిపాదిత పన్ను సంస్కరణలు, మెరుగైన ద్రవ్య లభ్యత మార్కెట్‌కు అవసరమైన డిమాండ్‌ను అందిస్తాయని ఆశావాదంగా ఉన్నాం’ అని కంపెనీ సీఈవో తరుణ్ గర్గ్ అన్నారు.
➤టాటా మోటార్స్ మొత్తం వాహన విక్రయాలు 8% తగ్గి 77,232 యూనిట్లకు పరిమితమయ్యాయి.
➤ఎస్‌యూవీలకు డిమాండ్ లభించడంతో ఎంఅండ్‌ఎం మొత్తం అమ్మకాల్లో 15% వృద్ధి నమోదై 83,072 యూనిట్లకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment