
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారతదేశంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో షోరూమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో పనిచేయడానికి కావలసిన నిపుణుల కోసం వెతుకుతున్నట్లు గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు టెస్లా కారు టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు త్వరలోనే అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది.
టెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
టెస్లా మోడల్ వై
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న టెస్లా మోడల్ వై కారు.. సింగిల్ ఛార్జిపై 526 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ పొందింది. 4.6 సెకన్లలో 0 నుంచి 96 కిమీ వేగాన్ని అందుకునే ఈ ఎలక్ట్రిక్ వెహికల్.. టాప్ స్పీడ్ 200 కిమీ. చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
భారతదేశంలో టెస్లా కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉంటుందనే చాలా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కారు భారతీయ రోడ్లకు తగిన విధంగా ఉండేలా కంపెనీ నిర్మిస్తుందని తెలుస్తోంది. ఇది దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.