ప్రీ బుకింగ్ డిపాజిట్లను తిరిగి తీసుకుంటున్న టెస్లా కస్టమర్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కార్లు ఇండియాలోకి ఎప్పుడు వస్తుయో ప్రశ్నార్థకంగా మారింది. దేశీయ రోడ్లపై టెస్లా పరుగులు పెడుతుందని నమ్మినవారిలో కొందరు ఇప్పటికే ప్రీ ఆర్డర్ చేసుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కార్ల రాకకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో కస్టమర్లు తమ డిపాజిట్లను తిరిగి తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇతర కంపెనీల నుంచి పోటీ పెరిగిందని చెబుతున్నారు.
జీఓక్యూఐఐ అనే హెల్త్ టెక్ స్టార్టప్ కంపనీ సీఈఓ గోండాల్ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత్‌లో టెస్లా ప్రవేశిస్తుందని నమ్మి 1000 డాలర్లతో మోడల్ 3 కారును ప్రీబుకింగ్ చేసుకున్నాను. ఏప్రిల్ 2016లో టెస్లా కారు భారత్‌లోకి వస్తుందని నమ్మబలికారు. ముందుగానే ఆర్డర్ చేసుకోమని చెప్పారు. కానీ ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దానిపై స్పష్టత లేదు. భారత్‌లో దిగుమతి చేయాలంటే ఖరీదుతో కూడుకున్న విషయమని కంపెనీ గతంలో చెప్పింది. దాంతో స్థానికంగానే కార్లను తయారు చేస్తామని కూడా పేర్కొంది. కొన్ని కారణాలవల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే అదనుగా ఇతర పోటీ కంపెనీలు ఈవీలను తయారు చేసి మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. టెస్లా ఫీచర్లకు పోటీ ఇచ్చేలా వాటిలో మెరుగైన టెక్నాలజీ వాడుతున్నారు. అసలు భారత్‌లోకి ఎప్పుడు వస్తుందో తెలియని కంపెనీ కార్ల కోసం వేచి చూడడం కంటే, దాదాపు అదే తరహా ఫీచర్లు అందించే ఇతర కంపెనీ కార్లును ఎంచుకోవడం మేలనిపించింది. దాంతో ప్రీ బుకింగ్ డబ్బును తిరిగి తీసుకున్నాను. టెస్లా గొప్ప టెక్ కంపెనీయే కావచ్చు. కానీ వారికి లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’ అని అన్నారు.
ఇదీ చదవండి: సైబర్‌ట్రక్ ఆర్డర్ల నిలిపివేత!
ఇదిలాఉండగా, దేశీయంగా టాటా, మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. మార్కెట్‌లోనూ వాటికి గిరాకీ పెరుగుతోంది. దాంతోపాటు విదేశీ కంపెనీలైన బీవైడీ, మోరిస్‌గరేజ్, బెంజ్, బీఎండబ్ల్యూ..వంటివి ఈవీలో కొత్త మోడళ్లను తీసుకొచ్చాయి. భారత ప్రభుత్వం విదేశీ కంపెనీ కార్ల తయారీదారులను ఆకర్షించడానికి 2024 మార్చిలో దిగుమతి సుంకాలను 70% నుంచి 15%కు తగ్గించింది. దాంతో భారత్‌లో తయారయ్యే విదేశీ ఈవీ కార్ల ధర రూ.30 లక్షల కంటే తక్కువకే లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తయారీని ప్రారంభించే దిశగా మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment