Tesla car
-
ట్రంప్ గెలుపుతో మస్క్ పంట పండింది!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దాంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.యూఎస్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు. దాంతోపాటు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పార్టీకి మస్క్ భారీగానే విరాళాలు అందించారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇలాన్ మస్క్‌కు సముచిత స్థానాన్ని కల్పిస్తానని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక అనుకున్న విధంగానే ట్రంప్ కార్యవర్గంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు.ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండబట్టే మస్క్ సంపద అధికమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ భవిష్యత్తులో తీసుకోబోయే కార్పొరేట్ నిర్ణయాల వల్ల మాస్క్‌కు లాభం చేకూరుతుందని, దాంతో కంపెనీకి మేలు కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మస్క్ కంపెనీల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఆయన సంపద పెరుగుతోంది. -
మస్క్ ఆవిష్కరణలు.. 2006 నుంచి 2024 వరకు (ఫోటోలు)
-
టెస్లా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ ఆవిష్కరణ
టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్ ఐ రోబోట్ ఈవెంట్లో రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది.కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.టెస్లా కంపెనీ ఇప్పటివరకు కార్లను తయారు చేయడంలోనే నిమగ్నమైంది. కానీ ఇక నుంచి ప్యాసింజర్ వాహనాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు సంస్థ వాహనాల సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రోబోవ్యాన్లో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు.వ్యక్తిగత అవసరాలతోపాటు వాణిజ్య అవసరాల కోసం, పెద్ద మొత్తంలో రవాణా చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగించేందుకు వీలుగా టెస్లా వాహనాలను తయారు చేయాలని నిర్ణయించుకుంది. సైబర్ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు మస్క్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలా కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. అందులో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.గతంలో వార్షిక సాధారణ సమావేశంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించారు. ఈవీల్లో బ్యాటరీలకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచి వాటి తయారీకి అయ్యే ఖర్చు తగ్గించేందుకు చాలా కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. -
టెస్లా రోబో కారు
‘ఐ రోటోట్’ సినిమా చూశారా..? అందులో కార్లు డ్రైవర్ ప్రమేయం లేకుండానే వాటికవే ప్రయాణిస్తుంటాయి. వాటంతటవే పార్క్ చేసుకుంటాయి. అచ్చం టెస్లా కంపెనీ అలాంటి కార్లను తయారు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా ‘రోబోవన్’ అనే కారును ఆవిష్కరించారు. టెస్లాకు చెందిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కంపెనీ సీఈఓ ఇలోన్‌మస్క్ ఈ కారుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ‘ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు’ అని మస్క్ తెలిపారు.Robovan seats 20 & can be adapted to commercial or personal use – school bus, RV, cargo pic.twitter.com/CtjEfcaoHI— Tesla (@Tesla) October 11, 2024ఈమేరకు రోబోవన్ రోడ్లపై పరుగెత్తిన వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు. ఈ ఈవెంట్లో సైబర్ క్యాబ్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సైబర్ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు ఇలొన్‌మస్క్ తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.Robotaxi pic.twitter.com/zVJ9v9yXNr— Tesla (@Tesla) October 11, 2024 -
‘లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కార్లు ఇండియాలోకి ఎప్పుడు వస్తుయో ప్రశ్నార్థకంగా మారింది. దేశీయ రోడ్లపై టెస్లా పరుగులు పెడుతుందని నమ్మినవారిలో కొందరు ఇప్పటికే ప్రీ ఆర్డర్ చేసుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కార్ల రాకకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో కస్టమర్లు తమ డిపాజిట్లను తిరిగి తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇతర కంపెనీల నుంచి పోటీ పెరిగిందని చెబుతున్నారు.జీఓక్యూఐఐ అనే హెల్త్ టెక్ స్టార్టప్ కంపనీ సీఈఓ గోండాల్ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత్‌లో టెస్లా ప్రవేశిస్తుందని నమ్మి 1000 డాలర్లతో మోడల్ 3 కారును ప్రీబుకింగ్ చేసుకున్నాను. ఏప్రిల్ 2016లో టెస్లా కారు భారత్‌లోకి వస్తుందని నమ్మబలికారు. ముందుగానే ఆర్డర్ చేసుకోమని చెప్పారు. కానీ ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దానిపై స్పష్టత లేదు. భారత్‌లో దిగుమతి చేయాలంటే ఖరీదుతో కూడుకున్న విషయమని కంపెనీ గతంలో చెప్పింది. దాంతో స్థానికంగానే కార్లను తయారు చేస్తామని కూడా పేర్కొంది. కొన్ని కారణాలవల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే అదనుగా ఇతర పోటీ కంపెనీలు ఈవీలను తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. టెస్లా ఫీచర్లకు పోటీ ఇచ్చేలా వాటిలో మెరుగైన టెక్నాలజీ వాడుతున్నారు. అసలు భారత్‌లోకి ఎప్పుడు వస్తుందో తెలియని కంపెనీ కార్ల కోసం వేచి చూడడం కంటే, దాదాపు అదే తరహా ఫీచర్లు అందించే ఇతర కంపెనీ కార్లును ఎంచుకోవడం మేలనిపించింది. దాంతో ప్రీ బుకింగ్ డబ్బును తిరిగి తీసుకున్నాను. టెస్లా గొప్ప టెక్ కంపెనీయే కావచ్చు. కానీ వారికి లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’ అని అన్నారు.ఇదీ చదవండి: సైబర్‌ట్రక్ ఆర్డర్ల నిలిపివేత!ఇదిలాఉండగా, దేశీయంగా టాటా, మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. మార్కెట్లోనూ వాటికి గిరాకీ పెరుగుతోంది. దాంతోపాటు విదేశీ కంపెనీలైన బీవైడీ, మోరిస్‌గరేజ్, బెంజ్, బీఎండబ్ల్యూ..వంటివి ఈవీలో కొత్త మోడళ్లను తీసుకొచ్చాయి. భారత ప్రభుత్వం విదేశీ కంపెనీ కార్ల తయారీదారులను ఆకర్షించడానికి 2024 మార్చిలో దిగుమతి సుంకాలను 70% నుంచి 15%కు తగ్గించింది. దాంతో భారత్‌లో తయారయ్యే విదేశీ ఈవీ కార్ల ధర రూ.30 లక్షల కంటే తక్కువకే లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తయారీని ప్రారంభించే దిశగా మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
సైబర్‌ట్రక్ ఆర్డర్లను నిలిపేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా సైబర్‌ట్రక్ బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ వినియోగదారులు తక్షణమే సైబర్‌ట్రక్‌ను పొందాలంటే 1 లక్ష డాలర్లు(రూ.83.9 లక్షలు) ధర ఉన్న ప్రీమియం వేరియంట్‌ను ఆర్డర్ చేయాలని తెలిపింది.టెస్లా ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కలిగిన సైబర్‌ట్రక్ బేసిక్ వేరియంట్ ధరను 61,000 డాలర్లు(రూ.51.2 లక్షలు)గా నిర్ణయించింది. దాంతో భారీగా ఆర్డర్లు వచ్చాయి. అయితే దీన్ని విక్రయించడం వల్ల కంపెనీకు తక్కువ మార్జిన్ వస్తున్నట్లు సమాచారం. సైబర్‌ట్రక్ ప్రీమియం వేరియంట్ ధరను 1 లక్ష డాలర్లు (రూ.83.9 లక్షలు)గా ఉంచారు. దాంతో దీనికి డిమాండ్ తగ్గిపోయింది. ఈ రెండు వేరియంట్లు కలిపి ఇప్పటివరకు దాదాపు 10 లక్షల యూనిట్లను ఆర్డర్ చేసుకున్నారని ఇలాన్‌మస్క్ తెలిపారు. ఇందులో బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో ఇకపై సైబర్‌ట్రక్ కావాలనుకునేవారు ప్రీమియం మోడల్‌ను బుక్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. దానివల్ల మార్జిన్ పెరిగి కంపెనీ బ్యాలెన్స్షీట్లో రెవెన్యూ అధికమవుతుందని భావిస్తోంది. ఒకవేళ కస్టమర్లు ప్రీమియం మోడల్‌ను ఆర్డర్‌చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని హామీ ఇస్తుంది. ఏలాగైనా ఈ ఏడాదిలో వీటి అమ్మకాలను 2 లక్షలకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.‘కాక్స్ ఆటోమోటివ్’ తెలిపిన వివరాల ప్రకారం..టెస్లా జులైలో దాదాపు 4,800 సైబర్‌ట్రక్ ప్రీమియం యూనిట్లను విక్రయించింది. ఇది యూఎస్‌లో 1 లక్ష డాలర్ల ధర శ్రేణిలో అత్యధికంగా అమ్ముడైన వాహనంగా నిలిచింది. అయితే ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం 16,000 యూనిట్లు మాత్రమే విక్రయించారు. ఆ సంఖ్యను పెంచడం కంపెనీకి సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: సీఈఓల జీతాలు పెంపు!ఇదిలాఉండగా, టెస్లా నవంబర్ 2023లో సైబర్‌ట్రక్‌ను ఆవిష్కరించింది. బేసిక్ వేరియంట్ కార్లను 2025లో డెలివరీ ఇస్తామని లక్ష్యంగా చేసుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 511 కిలోమీటర్ల వరకు వెళ్లే డ్యుయల్ మోటార్ వేరియంట్‌ను(ధర రూ.83.9 లక్షలు) ఆర్డర్ చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని ప్రకటించింది. ‘ట్రై-మోటార్ వేరియంట్ సైబర్‌బీస్ట్’ మోడల్ (ధర దాదాపు రూ.1 కోటి) అక్టోబర్ నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. -
16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో 16.8 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయకపోవడం వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రీకాల్ చేసిన కార్లులో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసి ఇస్తామని పేర్కొంది.టెస్లా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో దిగుమతి చేసుకున్న మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేస్తున్నారు. వాటితోపాటు అక్టోబర్ 15, 2020 నుంచి జులై 17, 2024 మధ్య చైనాలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా రీకాల్ చేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం..డ్రైవింగ్ సమయంలో కారులో సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా ఉండే ట్రంక్ డోర్ దానికదే తెరుచుకునే ప్రమాదం ఉంది. ఇది డ్రైవర్ దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమస్య ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం టెస్లా వెల్లడించలేదు. ఈ సమస్య పరిష్కారానికి రిమోట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయాలని పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో ఉచితంగానే ఈ సర్వీసును అందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..ఇదిలాఉండగా, టెస్లాకు చైనా ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోంది. జులైలో చైనా ప్రభుత్వం పెద్దమొత్తంలో ఈ కార్లను కొనుగోలు చేసింది. షాంఘైలో టెస్లా గిగాఫ్యాక్టరీని స్థాపించింది. 2023లో ఈ ఫ్యాక్టరీలో దాదాపు 9,47,000 కార్లు తయారు చేసింది. వీటిలో చాలా వరకు స్థానికంగా విక్రయించింది. మిగతావాటిని యూరప్‌కు ఎగుమతి చేసింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేస్తున్న ఈవీ కార్లు టెస్లాకు పోటీగా నిలుస్తున్నాయి. -
ఏడుసార్లు పల్టీ కొట్టిన టెస్లా కారు.. అయినా ప్రయాణికులంతా సేఫ్
కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో ఇటీవల టెస్లా కంపెనీ కారు ఘోర ప్రమాదానికి గురైంది. టెస్లా వై మోడల్‌కు చెందిన కారు డ్రైవర్ అతి వేగం కారణంగా.. ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం కారు ఏడుసార్లు పల్టికొట్టింది. అయినప్పటికీ డ్రైవర్‌తో సహా కారులోని వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. చిన్న గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.ప్రమాద సమయంలో కారు గంటకు 100 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం లేదా డ్రగ్స్ తీసుకొని ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారుటెస్లా కారు ప్రమాదంపై కంపెనీ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. ప్రయాణికుల భద్రతే తమ కార్ల రూపకల్పనలో ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. ప్రమాదంపై నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. టెస్లా తమ కస్టమర్ల గురించి చాలా శ్రద్ద వహిస్తుందని, ప్రయాణికుల భద్రతను వారు మరింత మెరుగుపరుస్తూ ఉన్నారని పేర్కొంటున్నారు.🚨TESLA FLIPPED 7 TIMES IN CRASH: NO ONE DIED!Footage of an accident showing a Tesla Model Y flying through the air after a crash at high speeds.In what looks almost miraculous, no one inside the car was seriously hurt. pic.twitter.com/pk0VdVuYAA— Mario Nawfal (@MarioNawfal) June 25, 2024Safety is our primary design goal— Elon Musk (@elonmusk) June 25, 2024 -
మస్క్‌కు జాక్‌పాట్ తగలింది.. రూ.4.5 లక్షల కోట్ల వేతనం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్‌తో సందడి చేశారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్హార్ట్ తెలిపారు.ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్‌కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నారు. Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024 -
షావోమి కారు విడుదల ఎప్పుడంటే..
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షావోమీ కార్పొరేషన్ 2025 నాటికి తన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించనుంది. కంపెనీ తన మొదటి మోడల్ ఎస్‌యూ7ను టెస్లా ఇంక్ మోడల్‌వై తరహాలో విపణిలోకి తీసుకురానుంది.కంపెనీ వచ్చే ఏడాది లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భవిష్యత్తులో డిమాండ్‌కు తగ్గట్టుగా అవుట్‌పుట్‌ని పెంచడానికి పని చేస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టెస్లా, బీవైడీ వంటి ప్రముఖ కంపెనీలతో పోటీపడుతూ వినియోగదారులను ఆకర్షించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: విమానంలో ల్యాండింగ్‌గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..చైనాలో ఎస్యూవీ వాహనాలకు జనాదరణ ఉంది. అయితే షావోమి తయారుచేస్తున్న కారు స్పెసిఫికేషన్లు, ధరలు ఏమేరకు ఉంటాయో ఇంకా స్పష్టతరాలేదు. బీజింగ్‌లోని షావోమి అసెంబుల్ ఫ్యాక్టరీ రెండోదశ నిర్మాణాన్ని పూర్తి చేసినప్పుడు 2025 నాటికి కార్ల ఉత్పత్తి జరగుతుందని ఊహించలేదని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి పనులు వేగంగా జరిగాయని చెప్పింది. కంపెనీ తయారీప్లాంట్ నెలకు 10,000 యూనిట్లనే సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉంది. దాంతో ముందుగా లక్ష యూనిట్లు సిద్ధంగా ఉంచుకుని 2025 నాటికి కారును విపణిలోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్‌కు తగిన సరఫరా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. -
మిస్టర్ బీస్ట్ బర్త్‌డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
అమెరికన్ యూట్యూబర్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన ఫాలోయర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మిస్టర్ బీస్ట్‌గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ తన 26వ పుట్టినరోజు (మే 7) సందర్భంగా 26 టెస్లా కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని ప్రకటించడం విశేషం. కండిషన్స్ అప్లయ్ అంటూ కొన్ని నిబంధనలు కూడా పెట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ కంటెంట్ విచిత్రమైన సవాళ్లతో తనకు తానే సాటి అని నిరూపించుకనే మిస్టర్ బీస్ట్ తాజాగా దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో ఒక మతలబు ఉంది. తన పోస్ట్ కింద కామెంట్ చేసి, ఇద్దరు ఫ్రెండ్స్‌ను ట్యాగ్ చేసిన 26 మందిని ఎంపిక చేసి, 26 కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. డ్రా తీసిన అనంతరం విజేతలకు డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తానని, వారం రోజుల్లో (మే 11న) ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తానని తెలిపాడు. అంతేకాదు రకరకాల పేర్లు, లేదా రీపోస్ట్‌లు లాంటి జిమ్మిక్కులు పనిచేయవని కూడా వెల్లడించాడు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) 254 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా కొనసాగుతున్న మిస్టర్ బీస్ట్ నికర విలువ రూ.4,175 కోట్లు (500 మిలియన్ల డాలర్లు)గా తెలుస్తోంది. 2012 ప్రారంభంలో 13 ఏళ్ల వయస్సులో 6000 పేరిట తొలుత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. ఆ తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2, అలాగే ఒక దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రరోపీని నడుపుతున్నాడు. దీని ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను విరాళాలిస్తుంటాడు. -
భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..
గురుగ్రామ్‌లోని టెస్లా పవర్ ఇండియా అనధికారికంగా తమ ట్రేడ్‌మార్క్‌ను వాడుకుంటోందని ఎలొన్‌మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా ఇంక్ గురువారం దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. టెస్లా పవర్.. టెస్లా ఇంక్ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ తరఫు న్యాయవాది చందర్ లాల్ కోర్టును అభ్యర్థించారు.‘గురుగ్రామ్ ఆధారిత కంపెనీ టెస్లా పవర్ ఇండియా.. టెస్లా ఇంక్ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కంపెనీ వ్యాపారాలపై కూడా దాని ప్రభావం పడుతోంది. టెస్లా పవర్ బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులను తమ వినియోగదారులు పొరపాటుగా టెస్లా ఇంక్‌తో లింక్ చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను నేరుగా అమెరికన్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నారు. టెస్లా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీగా జాతీయ వార్తాపత్రికల్లో అమెరికన్ కంపెనీ లోగోతో ప్రచారం చేసింది. టెస్లా పవర్ ‘టెస్లా’ ట్రేడ్‌మార్క్ వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి’ అని చందర్లాల్ వాదనలు వినిపించారు.టెస్లా పవర్ ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేయదని సంప్రదాయ వాహనాలు, ఇన్వర్టర్లలో ఉపయోగించే లెడ్ యాసిడ్ బ్యాటరీలను విక్రయిస్తుందని వాదించింది. ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ కవీందర్ ఖురానా మాట్లాడుతూ..తమ కంపెనీకి యూఎస్‌లో భాగస్వామ్య సంస్థ ఉందన్నారు. అయితే తాము ఎలాంటి ఈవీను తయారుచేయమని స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని ఖురానా చెప్పారు. తాము మరో సంస్థ ‘ఈ-అశ్వ’తో కలిసి ప్రకటన ఇచ్చినట్లు పేర్కొన్నారు. టెస్లా పవర్ బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయానికి ఈ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిష్ దయాల్ టెస్లా పవర్‌కి నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణను మే 22 తేదీకి వాయిదా వేశారు. టెస్లా ఇంక్‌ను పోలి ఉండే ట్రేడ్‌మార్క్‌తో ఎలాంటి ప్రచార ప్రకటనలను విడుదల చేయకూడదని ఆదేశించారు. అయితే, టెస్లా ఇంక్ ఈ కేసులో ఎలాంటి ఎమర్జెన్సీను ప్రదర్శించలేదని తెలిసింది. 2020 నుంచి ఇరు కంపెనీల మధ్య సంప్రదింపులు సాగుతున్నట్లు సమాచారం. -
టాప్ ఈవీ తయారీ సంస్థ క్యూ1 ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
అమెరికాలోని టాప్ ఈవీ తయారీ కంపెనీగా పేరున్న టెస్లా ఇటీవల విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు 3,87,000 యూనిట్లను డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే క్యూ1 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 8.5 శాతం తగ్గాయి. దాంతో కంపెనీ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది. ఏడేళ్లలో కంపెనీ ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెవెన్యూ తగ్గడంతో ఇటీవల కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10శాతం మందిని కొలువుల నుంచి తొలగించినట్లు టెస్లా ప్రకటించింది. అంటే సుమారు 14వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. చైనా ఈవీ తయారీ సంస్థల నుంచి టెస్లాకు భారీ పోటీ నెలకొన్నట్లు తెలిసింది. చైనాతోపాటు అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు ఈవీలను తయారుచేస్తున్నాయి. టెస్లాలో వాడుతున్న ఫీచర్లతోపాటు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఇతర కంపెనీ ఉత్పత్తులు కొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యటన వాయిదా.. టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారనే వార్తలు ఇటీవల వైరల్‌గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. అయితే ఆ పర్యటనను వాయిదావేశారు. ఏప్రిల్ 23న అమెరికాలో టెస్లా ఇన్వెస్టర్ల సమావేశం ఉండడంతో ఈ పర్యటన వాయిదా పడిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. మస్క్ భారత్‌లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్‌లో ప్రవేశించేందుకు లైన్‌క్లియర్ చేస్తూ కేంద్రం కొత్త ఈవీపాలసీను రూపొందించింది. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఆటోమొబైల్ తయారీ కంపెనీల అభిప్రాయాలను సైతం తీసుకున్నట్లు ప్రకటించింది. -
భారత్‌లో ‘టెస్లా’పై..కేంద్ర మంత్రి పీయూష్ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో తన మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. టెస్లా అధినేత ఎలోన్ మస్క్ భారత్‌లో టెస్లా ఇకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పియూష్ గోయల్ ప్రకారం..మస్క్ భారత్ ఆటోమొబైల్ రంగం లాభదాయకమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు సేవలందించే వ్యూహాత్మక ప్రదేశంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారే నమ్మకం తమకు ఉందన్నారు. తద్వారా అన్ని ప్రధాన కంపెనీలు భారత్‌లో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశం సాధించిన పురోగతిని ప్రపంచం గమనించిందని ఉద్ఘాటించారు. -
మస్క్ భారత పర్యటనకు డేట్ ఫిక్స్.. ఏం జరగబోతుందంటే..
అమెరికాలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ ట్విటర్ వేదికగా స్పందించారు. భారతప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. మస్క్ పర్యటనకు డేట్ కూడా ఫిక్స్ అయిందని, ఏప్రిల్ 22న భారత్ రాబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది. ప్రధానితో భేటీలో భాగంగా భారత్‌లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మస్క్ భారత్‌లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. Looking forward to meeting with Prime Minister @NarendraModi in India! — Elon Musk (@elonmusk) April 10, 2024 ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాటు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్‌స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. ఇదీ చదవండి: వాట్సప్, టెలిగ్రామ్ బాటలోనే ట్రూకాలర్.. కొత్త ఫీచర్ ప్రారంభం ఏం జరగబోతుంది.. కొత్త ఈవీ పాలసీ నిబంధనల ప్రకారం ఒకవేళ భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తే స్థానికంగా చాలామందికి ఉపాధి లభిస్తుంది. కార్ల తయారీలో ముడిసరుకు అందిస్తున్న ఇండియన్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు వస్తాయి. ప్రధానంగా బ్యాటరీ తయారీ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, వైరింగ్ పరిశ్రమలోని కంపెనీలు, టైర్ సంస్థలు లాభపడనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు టెస్లా భారత్‌లో తయారీ ప్లాంట్ పెట్టే యోచనలో ఉంటే ఏ రాష్ట్రంలో దాన్ని ప్రారంభిస్తారనే చర్చలు ఇప్పటికే సాగుతున్నాయి. ఏదేమైనా మస్క్ పర్యటనతో ఒక స్పష్టత రాబోతుందని నిపుణులు చెబుతున్నారు. -
దేశంలో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం..!
-
ప్రాణం తీసిన టెస్లా కారు రివర్స్
వాషింగ్టన్: అమెరికాతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ మోడ్‌లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్ మోడ్‌కు మార్చడంతో అది చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్కానెల్ బంధువు, ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్‌మోస్ట్ గ్రూప్ సీఈఓ ఏంజెలా చావో(50) మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్‌లోని ఆస్టిన్ సమీపంలో ఉన్న తన ప్రైవేట్ అతిథి గృహానికి వెళ్లారు. 900 ఎకరాల్లో ఈ ఎస్టేట్ విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేర్ ఇక్కడ ఈ ఎస్టేట్ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు. మధ్యతో త్రీ పాయింట్ మూలమలుపు వచి్చంది. దానిని దాటే క్రమంలో ఏంజెలా గందరగోళానికి గురై పొరపాటున కారును రివర్స్ మోడ్‌లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడిపోయింది. ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్ చేశారు. వెంటనే గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు. చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా ప్రాణాలు కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ జిమ్ బ్రేయార్ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి అవుతారు. -
ప్రపంచంలో వేగవంతమైన కారు ఇదే!.. లాంచ్ ఎప్పుడంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. టెస్లా రోడ్‌స్టర్ (Tesla Roadster) పేరుతో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకుంటుందని సమాచారం.ఈ కారు గురించి టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) కొన్ని వివరాలను వెల్లడిస్తూ.. ఇది 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ కారుని టెస్లా, స్పేస్ఎక్స్ సహకారంతో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.Tonight, we radically increased the design goals for the new Tesla Roadster.There will never be another car like this, if you could even call it a car.— Elon Musk (@elonmusk) February 28, 2024టెస్లా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు అత్యంత ఆకర్షణీయమైన కారుగా పేర్కొన్నారు. ఈ కారు డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది 4 సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. దీని గురించి మస్క్ 2017లోనే వెల్లడించారు.కంపెనీ టెస్లా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారును బుక్ చేసుకోవాలనుంటే 50000 డాలర్ల టోకెన్ మొత్తాన్ని వెచ్చించి బుక్ చేసుకోవచ్చు. నిజానికి 2021లో లాంచ్ కావలసిన ఈ కారు 2024 చివరి నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారత యాప్స్‌పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్‌లో అవి మాయం!0-60mph < 1 secAnd that is the least interesting part— Elon Musk (@elonmusk) February 28, 2024 -
టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?
టెస్లా తన కార్ల తయారీ పరిశ్రమను గుజరాత్లో స్థాపించే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. గుజరాత్లో జనవరి 2024లో జరిగే సమ్మిట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెస్లా చాలా రోజులుగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి కేంద్రం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నందున ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం..గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సనంద్, ధోలేరా, బెచరాజీ ప్రదేశాల్లో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లను తీర్చేందుకు టెస్లా గుజరాత్ ప్లాంట్‌ను వినియోగించనున్నట్లు తెలిసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమక్షంలో గుజరాత్లో టెస్లా ప్లాంట్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కథనాల ద్వారా తెలుస్తుంది. టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా గతంలో కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో కొత్త చాట్‌బాట్.. ప్రత్యేకతలివే.. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం గతంలో కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
టెస్లా కారును ఇలా కూడా వాడొచ్చా? మస్క్‌కు మతిపోయే వీడియో!
టెస్లా.. అమెరికాకు చెందిన ప్రసిద్ధ కార్ల కంపెనీ. మల్టీ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. అయితే టెస్లా కారుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో టెస్లా కారును చిత్రంగా మాడిఫై చేశారు. కారు నాలుగు చక్రాలను పీకేసి 10 అడుగుల బగ్గీ చక్రాలను అమర్చారు. దీంతో ఆ కారు అస్తవ్యస్తమైన రోడ్డుపైనా రయ్ అని దూసుకెళ్తోంది. అంతేకాదు కారు తలకిందులుగా కూడా నడుస్తూ ఆశ్చర్యపరుస్తోంది. నాన్ ఏస్తటిక్ థింగ్స్ (non aesthetic things @PicturesFoIder) పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ మారింది. గంటల వ్యవధిలోనే 1.37 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. యాజర్లు తమకు తోచినవిధంగా కామెంట్స్ చేశారు. మాడిఫై చేసిన రకరకాల కార్ల వీడియోలను, మీమ్స్‌ను జోడించారు. కాగా కారును మాడిఫై చేసి వీడియో రూపొందించింది ఓ యూట్యూబర్ అని తెలుస్తోంది. Man puts 10ft buggy wheels on a Tesla and drives it upside down pic.twitter.com/1jGkvsYEjT — non aesthetic things (@PicturesFoIder) December 26, 2023 -
20 లక్షల టెస్లా కార్లు వెనక్కి.. కారణం ఏంటంటే?
అగ్రరాజ్యం అమెరికాలో టెస్లా కంపెనీ సుమారు 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? కారులో రీప్లేస్ చేయాల్సిన భాగాలూ ఏమైనా ఉన్నాయా.. అనే మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా.. కంపెనీకి చెందిన దాదాపు రెండు మిలియన్స్ కార్లలో ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి రీకాల్ చేసింది. ఇందులో 2015 నుంచి మార్కెట్లో విక్రయించిన కార్లు ఉన్నట్లు సమాచారం. ఆటోపైలట్ యాక్టివేట్ సిస్టం అనేది సెల్ఫ్-డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితుల గురించి డ్రైవర్‌ను హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేక ప్రమాదాలకు దారితీసినట్లు అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' వెల్లడించింది. ఈ దర్యాప్తు మొదలైన సుమారు రెండు సంవత్సరాల తర్వాత కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి రీకాల్ ప్రకటించడం జరిగింది. ఇదీ చదవండి: రూ.350 కోట్లతో 500 అడుగుల గడియారం - రంగంలోకి జెఫ్ బెజోస్.. సెల్ఫ్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు డ్రైవర్‌ను ఉంచడానికి ఆటోపైలట్ చర్యలు సరిపోకపోవచ్చని, తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిశోధనలో తేలింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో టెస్లా మోడల్ వై, ఎస్, 3 మాత్రమే కాకుండా 2012 నుంచి 2023 మధ్య ఉత్పత్తి అయిన టెస్లా మోడల్ ఎక్స్ కూడా ఉన్నాయి. కంపెనీ నిర్దేశించిన సమయంలో టెస్లా కార్లను కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు వారి కారులోని సమస్యను ఇప్పుడు రీకాల్ సమయంలో సులభంగా పరిష్కరించుకోవచ్చు. -
Tesla Cars: ఇండియాలో ఇక టెస్లా కార్లు.. ధర ఎంతంటే..?
టెస్లా తన కార్లను ఇండియాలో ప్రవేశపెట్టాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. తాజాగా భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ టెస్లాకు అన్ని పరిస్థితులు అనుకూలించి ఇండియాలో ప్రవేశిస్తే మొదటి మోడల్ కారు ధర 25వేల యూరోలు(రూ.22 లక్షలు) ఉండనుందని సమాచారం. ఈ మోడల్కారును మొదట జర్మనీలో తర్వాత భారతదేశంలో లాంచ్ చేయనున్నారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ కథనాల ప్రకారం.. భారతదేశంలో టెస్లా మోడల్ వై క్రాస్ఓవర్ పేరుతో కారు లాంచ్ చేయబోతుంది. మోడల్ వై అనేది మోడల్ 3 సెడాన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడుతుంది. ఈ క్రాస్ఓవర్ ఎస్యూవీను తయారుచేసేందుకు 2020 నుంచి కంపెనీ పనిచేస్తోంది. మూడు వరుసల్లో ఏడుగురు ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్లు తెలిసింది. టెస్లా చాలారోజుల నుంచి భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రకారం.. టెస్లా వాహనాలను వచ్చే ఏడాది నుంచి దేశంలోకి అనుమతిస్తారు. కంపెనీ రానున్న రెండేళ్లలో భారత్‌లో తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో గుజరాత్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పింది. టెస్లా భారతదేశంలో రూ.16 వేల కోట్లతో కొత్త ప్లాంట్ ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ కంపెనీల నుంచి రూ.1.24 లక్షల కోట్ల విలువైన ఆటో విడిభాగాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా దేశంలో బ్యాటరీలు కూడా తయారు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్బీఐ: దాస్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతవారం తన అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ ఎలాన్‌మస్క్‌ను కలవాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా మంత్రిని కలవలేకపోయానని క్షమాపణలు చెబుతూ మస్క్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. త్వరలో మంత్రిని కలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
మస్క్‌కు తెగ నచ్చేసిన సరికొత్త సైబర్ ట్రక్: వీడియో చూస్తే మీరూ ఫిదా!
ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సైబర్ట్రక్పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా వియత్నాంకు చెందిన యూ ట్యూబర్ టెస్లా సైబర్ ట్రక్ ప్రతిరూపాన్ని చెక్కతో అద్భుతంగా రూపొందించాడు. చెక్కతో పూర్తిగా పనిచేసేలా ఈ సైబర్‌ట్రక్ రూపొందించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కోసం నెట్లో సెర్చ్ చేసి, డిజైన్ చేసుకొని మరీ మెటల్ ఫ్రేమ్మీద చెక్కతో దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఎలక్ట్రిక్ మోటారు , బ్యాటరీలపై చెక్క పలకలను ఉపయోగించాడు. లైట్లను కూడా అందంగా పొందుపరిచాడు అలాగే X లోగోతో సైడ్ ప్యానెల్‌ను కూడా డిజైన్ చేశాడు. చివరికి తన వుడెన్ కారును కొడుకుతో కలిసి రైడ్‌కి తీసుకెళ్లడంతో క్లిప్ ముగుస్తుంది. దీనికి సంబంధించి వుడ్‌వర్కింగ్ ఆర్ట్ అనే YouTube ఛానెల్లో మస్క్ కోసం వందరోజుల్లో టెస్లా సైబర్ ట్రక్ తయారీ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు ఒక నోట్ పెట్టాడు. తనకు చెక్క వాహనాలంటే చాలా ఇష్టమని,అందులోనూ టెస్లాపై ఉన్న విపరీతమైన అభిమానంతో దీన్ని తయారు చేశానని చెప్పారు. ఇందులో అనుభవం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అనేక చెక్క కార్లను రూపొందించా.. ఇపుడు ఈ సైబర్‌ట్రక్ పూర్తి చేశా అన్నాడు. తన వ్యూయర్లలో చాలామందికి నచ్చిన, తాను మెచ్చిందీ, నిర్మించాలని కోరుకుంటున్న కారు కూడా ఇదే అంటూ యూట్యూబర్ వెల్లడించాడు. సైబర్‌ట్రక్ కోసం టెస్లా తన సవాళ్లను ఎదుర్కొందో తెలుసు. అయినా కూడా మస్క్ పైనా, టెస్లా సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసం ఉంది. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడమే కాదు. టెస్లా చెక్క సైబర్‌ట్రక్‌ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించడం విశేషం. సూపర్.. చాలా అభినందించదగ్గదే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 9 లక్షలకు పైగా వ్యూస్ 14 వేల లైక్స్ సాధించింది. వాట్ ఎ లెజెండ్ అంటూ అతనిపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. ఖచ్చితంగా మస్క్ మీ దగ్గరికి వస్తారు అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, టెస్లా సైబర్ ట్రక్ అంటే అత్యుత్తమంగా ఉండాలి తప్ప ఇలా కాదు.. దీన్ని టెస్లా హెడ్ క్వార్టర్ లో ఉంచితే బెటర్ అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. -
మంత్రికి క్షమాపణలు చెప్పిన మస్క్.. కారణం ఇదేనా..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్‌కు చెందిన దిగ్గజ సంస్థ టెస్లా ప్లాంట్‌ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం సందర్శించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లోని ఈ కేంద్రంలో విద్యుత్ కార్ల తయారీని మంత్రి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే మంత్రి వెంట టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కనిపించలేదు. దీనిపై ఎక్స్ వేదికగా మంత్రికి మస్క్ క్షమాపణలు చెప్పారు. మంత్రి తన సందర్శనను ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ‘కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఇక్కడ సీనియర్ హోదాలో పనిచేస్తోన్న భారత ఇంజినీర్లు, ఆర్థిక నిపుణులను కలవడం ఆనందంగా ఉంది. టెస్లా ప్రయాణంలో వారు అందిస్తోన్న సహకారం గర్వకారణం. టెస్లా తయారీలో ఇండియా నుంచి దిగుమతులు పెంచడం సంతోషంగా ఉంది. ఈ పర్యటనలో మస్క్‌ను మిస్ అవుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలి’ అని మంత్రి అన్నారు. మంత్రి ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘మీరు టెస్లాను సందర్శిచడం మాకు గొప్ప గౌరవం. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. త్వరలో మీతో జరగబోయే భేటీకి ఎదురుచూస్తున్నాను’ అని టెక్ దిగ్గజం పోస్ట్ చేశారు. టెస్లా విద్యుత్ కార్లు త్వరలోనే భారత్‌లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో జరిగిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. ఈవీ వాహనాల తయారీకోసం దేశంలోని కొన్ని నిబంధనలు సడలించనున్నట్లు సమాచారం. తాజా పర్యటనలో గోయల్-మస్క్ భేటీ జరుగుతుందని, భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటు, సుంకాల గురించి ప్రధానంగా చర్చిస్తారని వార్తలు వచ్చాయి. అయితే మస్క్ అనారోగ్యంతో ఈ భేటీ సాధ్యం కాలేదు. Visited @Tesla’s state of the art manufacturing facility at Fremont, California. Extremely delighted to see talented Indian engineers & finance professionals working at Senior positions and contributing to Tesla’s remarkable journey to transform mobility. Also proud to see… pic.twitter.com/FQx1dKiDlf — Piyush Goyal (@PiyushGoyal) November 14, 2023 -
టెస్లాకు త్వరలో లైన్ క్లియర్.. భారత్‌లోకి ప్రవేశం!
ఎలాన్‌మస్క్‌కు చెందిన టెస్లా కార్ల గురించి వినడం..సామాజిక మాధ్యమాల్లో చూడడం తప్పా నేరుగా భారత్‌లో ఉపయోగించింది లేదు. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల టెస్లా కార్లకు అనుమతులు ఇవ్వలేదు. అయితే ఈసారి 2024 జనవరి నాటికి అవసరమైన అన్ని అనుమతులను క్రమబద్ధీకరించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన సమావేశంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. టెస్లాతో సహా ఇతర పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చేలా చర్చలు జరిగాయని ఒక ఉన్నత అధికారి చెప్పినట్లు తెలిసింది. జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. అప్పటినుంచి కామర్స్ అండ్ ఇండస్ట్రీ, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లాను భారత్‌కు తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. 2024 జనవరిలో అనుమతులు లభిస్తే టెస్లా కార్లను వీలైనంత త్వరలో భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు చర్చల్లో పురోగతి లేకపోవడంతో టెస్లా గతంలో భారత్‌లో ప్రవేశించలేదు. దాదాపు రూ.33లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60% వరకే దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40% ట్యాక్స్ ఉండేలా అభ్యర్థించింది. టెస్లా వాహనాలను ఎలక్ట్రిక్ కార్లుగా కాకుండా లగ్జరీ కార్లుగా గుర్తించాలని తెలిపింది. భారత్‌లో స్థానిక తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ముందే తమ కార్ల విక్రయాన్ని ప్రారంభించాలని భావించింది. అయితే దిగుమతి సుంకం రాయితీల కోసం స్థానిక తయారీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కస్టమ్స్ డ్యూటీ రాయితీల స్థానంలో తయారీదారులకు ప్రత్యక్ష రాయితీలను అందిస్తూ, ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని టెస్లాకు వివరించింది. ఇదీ చదవండి: త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ భారత కస్టమ్స్ డ్యూటీ నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోకార్బన్ ఆధారిత వాహనాలను సమానంగా పరిగణిస్తారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి భారీగా సుంకాలను విధిస్తున్నారు. అయితే ఈవీ తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించేలా పర్యావరణ అనుకూల వాహనాలపై తక్కువ పన్ను విధించేలా కొత్త దిగుమతి పాలసీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వెసులుబాటు టెస్లాకు మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే ఏ కంపెనీకైనా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు.