ప్రముఖ ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ విషయంలో కేంద్రం కాస్త యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఎలన్ మస్క్‌కు ఓ బంపరాఫర్ ఇచ్చినట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.
గత కొన్నేళ్లుగా ఎలన్ మస్క్ భారత్‌లో టెస్లా యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే టెస్లా యూనిట్లను ఏర్పాటు చేస్తే కేంద్రం తమకు టెస్లా కార్లపై దిగుమతి పన్ను, సుంకాలు తగ్గించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనల్ని కేంద్రం ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తుంది.
కానీ తాజాగా టెస్లా,కేంద్రాల మధ్య సయోధ్య కుదురుతున్నట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ కోరినట్లు కేంద్రం టెస్లా యూనిట్లపై రాయితీ ఇచ్చేందుకు సిద్ధమైందని, అదే సమయంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లలో 500 మిలియన్ డాలర్ల మేర భారత్‌లో తయారుచేసిన వాహన పరికరాలనే వాడాలని షరతు విధించిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారంటూ నేషనల్ మీడియా కథనాల్ని ప్రచురించింది.
కార్ల తయారీకి ఉపయోగించే పరికరాల్ని మొదట భారత్ కు చెందినవే వినియోగించాలని, ప్రారంభంలో లోకల్ ప్రొడక్ట్ లు తొలుత 10-15 శాతం కొనుగోలు చేయాలని, ఆ తర్వాత కొనుగోళ్ల శాతాన్ని టెస్లా పెంచుకుంటూ పోయేందుకు అంగీకరించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన సంబంధిత శాఖ అధికారులు టెస్లాకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి కేంద్రం పెట్టిన ఈ షరతులకు ఎలన్ మస్క్ అంగీకరిస్తారో? లేదో?. ఒకవేళ ఎలన్ ఒప్పుకుంటే మాత్రం భారత రోడ్లపై టెస్లా కార్లు చక్కెర్లు కొట్టడం ఖాయమని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment