భారత్ మార్కెట్‌లోకి టెస్లా కార్ల రాక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు శుభవార్త. కేంద్రం దిగుమతి సుంకంపై ఇచ్చే రాయితీని పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అపర కుబేరుడు ఎలోన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ భారత్‌లో అడుగు పెట్టడం దాదాపూ ఖరారైనట్లేనని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
రూ .30 లక్షలు (36,000 డాలర్లు) మించిన ఎలక్ట్రిక్ కార్లపై రాయితీ దిగుమతి సుంకాన్ని 2-3 సంవత్సరాల పాటు పొడిగించాలని కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే టెస్లా భారత్‌కు రాక సుగమైనట్లే. కాగా, కేంద్రం దిగుమతి సుంకంపై రాయితీలను కొనసాగిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడమే కాకుండా, విదేశీ వాహన తయారీ సంస్థలు భారత్‌లో తమ తయారీ కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీపై నిర్ణయం తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో.. టెస్లా ఇప్పటి వరకు భారత్‌లో టెస్లా ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంక్ గ్యారెంటీలను అడుగుతోంది. తాజాగా పరిణామాలతో బ్యాంక్ గ్యారెంటీ బదులు దిగుమతి సుంకం తగ్గింపుపై కేంద్రంతో ఎలోన్ మస్క్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
వంద శాతం దిగుమతి సుంకం
ప్రస్తుత విధానం ప్రకారం కేంద్రం 40,000 డాలర్ల (రూ.33 లక్షలు) విలువ చేసే కార్లపై 100 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తుండగా.. కారు ధర 40 వేల డాలర్ల కంటే తక్కువ ధర ఉంటే 60 శాతం పన్ను విధిస్తోంది.
దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తే
ఎలోన్ మస్క్ కేంద్రం వాహనాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తే భారత ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి దేశంలో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. అందుకే దిగుమతి చేసుకున్న కార్లపై రాయితీ దిగుమతి సుంకాలను తగ్గించాలని, బ్యాంకు గ్యారంటీల ఆధారంగా పాలసీని ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
దేశీయ కార్ల తయారీ సంస్థలకు భారీ షాక్!
ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా, ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు ఈవీ కార్ల తయారీలో ముందజలో ఉన్నాయి. ఈ కంపెనీలు టెస్లా అడుగుతున్న గొంతెమ్మ కోరికలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా కేంద్రాన్ని సంప్రదించి భారత్‌లో తయారీని పెంచేలా ప్రోత్సహకాలు అందించాలని కోరింది. ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ కూడా విదేశీ సంస్థల నుంచి ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవాలనే ఆలోచనను వ్యతిరేకించారు. టెస్లా, ఇతర అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలను అందించడం దేశీయంగా తయారయ్యే కార్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment