
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో భౌగోళిక రాజకీయ మార్పుల కారణంగా భారతదేశ రక్షణ సాంకేతిక రంగాన్ని పెట్టుబడిదారులు అవకాశంగా చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం బలమైన విధాన మద్దతు, వేగవంతమైన సాంకేతిక పురోగతి ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్రం దృష్టి సారించడం, పరిశ్రమ ఆవిష్కరణలు, వ్యూహాత్మక పరిష్కారాలకు భారత్ గ్లోబల్ హబ్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై ఆసక్తిగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెట్టుబడుల వృద్ధికి కారణాలు
దేశీయ రక్షణ తయారీని బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ చర్యల వల్ల వివిధ కంపెనీలతో ఇటీవల 253 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకోవడంతో రూ.53,439 కోట్ల పెట్టుబడులు సమకూరే అవకాశం ఉంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం వల్ల రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడిదారులకు భారత్ ఆకర్షణీయంగా మారుతోంది.
సాంకేతికత అభివృద్ధి
సివిలియన్, మిలిటరీ అప్లికేషన్లకు సర్వీసులు అందించే డ్యుయల్-యూజ్ టెక్నాలజీలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. నిఘా, వ్యూహాత్మక కార్యకలాపాల కోసం స్వయంప్రతిపత్తి కలిగిన డ్రోన్ల తయారీ సంస్థలపై దృష్టి సారిస్తున్నారు. రియల్ టైమ్ ముప్పును గుర్తించడం కోసం ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను రూపొందించే కంపెనీలను గుర్తిస్తున్నారు. సముద్ర భద్రత, అన్వేషణ కోసం అండర్ వాటర్ డ్రోన్లు, అధునాతన డిఫెన్స్ ఇమేజింగ్, ఇంటెలిజెన్స్ కోసం హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాల వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఐఫోన్ అంతరించనుందా..?
కంపెనీల తీరు
డిఫెన్స్ టెక్ స్టార్టప్‌లు డీప్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ), మాడ్యులర్ టెక్నాలజీ, రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇస్తూ దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నాయి. కంపెనీలు తక్కువ ఖర్చుతో సుస్థిరమైన, కృత్రిమ మేధ ఆధారిత రక్షణ పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నాయి.