
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కెనరా బ్యాంక్ ఉద్యోగులు అద్భుతమైన ఘనత సాధించారు. బ్యాంక్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో పది వారాల్లో రూ.16,700 కోట్లు సమీకరించారు. డిపాజిట్ల వృద్ధి లేమితో సతమతమవుతున్న కెనరా బ్యాంకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్యాంకులో పనిచేసే 82,000 మంది సిబ్బందిని నిధుల సమీకరణకు వెళ్లాలని కోరింది.
పీటీఐ నివేదిక ప్రకారం.. ఇటీవల పెరిగిన డిపాజిట్ల ఉపసంహరణతో బ్యాంకింగ్ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులందరికీ డిపాజిట్ల సేకరణకు పిలుపునిచ్చింది. 2024 జనవరి 26న ప్రారంభమైన ఈ డ్రైవ్‌కు సిబ్బంది మనస్ఫూర్తిగా సహకరించారు.
‘బ్యాంక్ డిపాజిట్‌లను పెంచడానికి సహకరించాలని మొత్తం 82,000 మంది సిబ్బందిలో ప్రతిఒక్కరికీ పిలుపునిచ్చాం. కాసా (కరెంట్, సేవింగ్స్ అకౌంట్) లేదా రిటైల్ టర్మ్ డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరూ రూ.10 లక్షలు తీసుకురావాలని కోరాం' అని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె సత్యనారాయణ రాజు తెలిపారు.
సీడీ నిష్పత్తి విషయంలో కెనరా బ్యాంక్ 80 శాతం పరిమితిని చేరుకునే అంచున ఉందని ఆయన తెలిపారు. పీరియడ్ ఎండ్ లో అధిక సంఖ్యలో డిపాజిట్లు పెట్టడం ఈ డ్రైవ్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. కాసా బ్యాలెన్స్ లలో కూడా స్థిరత్వం ఉన్నందున ఈ డ్రైవ్ మొత్తం వ్యాపారానికి సహాయపడిందని పేర్కొన్నారు. ఈ డ్రైవ్ కారణంగా కెనరా బ్యాంక్ బల్క్ డిపాజిట్లపై ఆధారపడటం కూడా తగ్గిందని ఆయన అన్నారు. అధిక వ్యయ రుణాల వాటా 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని వివరించారు.