బ్యాంక్‌ ఉద్యోగులకు తొందరలోనే రెండు శుభవార్తలు! | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఉద్యోగులకు తొందరలోనే రెండు శుభవార్తలు!

Published Mon, Feb 26 2024 7:57 PM

Bank Employees May Get 5 Day Working Salary Hike In 2024 - Sakshi

బ్యాంక్ ఉద్యోగులకు 2024 సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం కావచ్చు. తొందరలోనే రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ తన సమ్మతిస్తే జూన్ నాటికి  బ్యాంకు ఉద్యోగులకు 5 పని దినాల విధానం అమల్లోకి రావచ్చు. అలాగే జీతాల పెంపును కూడా పొందవచ్చు. 

బ్యాంక్ ఉద్యోగుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంకింగ్ రంగానికి వారానికి ఐదు రోజుల పనిని సిఫార్సు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం ఆదివారాలు, షెడ్యూల్డ్ సెలవులు అదనంగా ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవులు ఇస్తున్నారు.

ఐదు రోజుల పని విధానం మొత్తం బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించదని, కస్టమర్లకు బ్యాంకింగ్ అవర్స్‌లోగానీ, ఉద్యోగులకు మొత్తం పని గంటలలో గానీ తగ్గింపు ఉండదని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తన ప్రతిపాదనలో హామీ ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా ఈ ప్రతిపాదన చేసింది.

ఈ విషయాన్ని సానుకూలంగా సమీక్షించాలని, తదనుగుణంగా ముందుకు సాగేలా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను ఆదేశించాలని అసోసియేషన్ ఆర్థిక మంత్రిని అభ్యర్థించింది.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీలలో ఐదు రోజుల పని విధానం ఇప్పటికే ఆచరణలో ఉందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గుర్తు చేసింది.

జీతాల పెంపు
గత సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీ యూనియన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ఫలితంగా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 17 శాతం వేతనాల పెంపుదలకు రూ. 12,449 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ పథకానికి ఆమోదం లభిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement