న్యూఢిల్లీ: గడిచిన రెండు సంవత్సరాల్లో పెరిగిన రుణ డిమాండ్ స్థాయిలో డిపాజిట్ల సమీకరణకు బ్యాంక్‌లు సమస్యలు ఎదుర్కొన్నట్టు ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు 2023–24లో జారీ చేసిన రుణాలు రూ.1,64,98,006కోట్లుగా ఉన్నాయి. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో (సీడీ రేషియో) ఈ కాలంలో 75.8 శాతం నుంచి 80.3 శాతానికి పెరిగింది. త్రైమాసికం వారీగా చూసిన కానీ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు ఇన్ఫోమెరిక్స్ నివేదిక తెలిపింది.
2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలోనూ డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాలు, అసంఘటిత రంగంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదు ఎక్కువగా ఉండడం డిపాజిట్ల సమీకరణపై ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య 2018–19 నాటికి 22.6 శాతంగా ఉంటే, 2025 జూలై నాటికి 39.9 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. యువ ఇన్వెస్టర్లలో ఈక్విటీ మార్కెట్ల పట్ల పెరిగిన ఆసక్తిని ఈ ధోరణి తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో 30–39 వయసులోని ఇన్వెస్టర్ల బేస్ (సంఖ్య) స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది.
సంయుక్త కృషి అవసరం: డిపాజిట్ల నిష్పత్తి పెరగాలంటే బ్యాంక్‌లు, ప్రభుత్వం ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ట్రూనార్త్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో రోచక్ బక్షి అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజల నుంచి చిన్న మొత్తాల్లో డిపాజిట్లు సమీకరించే వెనుకటి ధోరణి నుంచి బయటకు రావాలని.. పెద్ద మొత్తంలో కార్పొరేట్ డిపాజిట్లను ఆకర్షించడంపై దృష్టి సారించాలని సూచించారు.
బ్యాంక్ టర్మ్ డిపాజిట్లలో 47 శాతం 60 ఏళ్లు నిండిన వృద్ధులవే ఉన్నట్టు, యువతరం బ్యాంక్ డిపాజిట్ల వట్ల ఆసక్తి చూపించడం లేదన్న దానికి నిదర్శనమని చెప్పారు. కనీసం ఆదాయపన్ను అధిక శ్లాబులోని వారికి అయినా బ్యాంక్ డిపాజిట్ల వడ్డీపై పన్ను భారాన్ని తగ్గించాలని భక్షి సూచించారు. ఏటా వడ్డీపై టీడీఎస్ మినహాయించడం కాకుండా, డిపాజిట్ కాల వ్యవధి ముగిసిన సమయంలోనే పన్నును పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment