
దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) చెన్నైలోని ఓజోన్ టెక్నో పార్క్‌లో దాదాపు 6,30,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీనికి నెలవారీ అద్దె రూ. 2.8 కోట్లు అని.. రియల్ ఎస్టేట్ డేటా అనలిటికల్ సంస్థ ప్రాప్‌స్టాక్ ద్వారా తెలిసింది.
చెన్నైలోని నవలూర్‌లో టీసీఎస్.. ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె 2025 మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ స్థలాన్ని ప్లాటినం హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 10 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని కోసం టీసీఎస్ రూ. 25.5 కోట్లు డిపాజిట్ చేసినట్లు సమాచారం. అద్దె నెలకు చదరపు అడుగుకు రూ. 45 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే ప్రతి మూడు సంవత్సరాల తర్వాత అద్దె 12 శాతం పెరుగుతుంది. అయితే ఈ విషయంపై టీసీఎస్ అధికారికంగా స్పందించలేదు.
చెన్నైలో ఇతర వాణిజ్య రియల్ ఎస్టేట్ లావాదేవీలు
➤జనవరి 2025లో వాల్మార్ట్.. చెన్నైలో 4.6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని నెలకు రూ. 3.26 కోట్ల అద్దెకు లీజుకు తీసుకున్నట్లు ప్రాప్‌స్టాక్ యాక్సెస్ చేసిన పత్రాల ద్వారా తెలిసింది. ఈ ఆఫీస్ స్థలం ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో ఉంది. కంపెనీ దీనికోసం రూ.19.55 కోట్లు డిపాజిట్ చేసింది.
ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..
➤మార్చిలో, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా.. చెన్నైలోని తన ఇండియా ప్రధాన కార్యాలయాన్ని బాగ్మనే కన్‌స్ట్రక్షన్స్‌కు రూ. 612 కోట్లకు విక్రయించింది. ఈ ఆస్తి చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్(OMR)లోని తోరైపక్కంలో ఉంది. ఇది నగరంలోని కీలకమైన ఐటీ కారిడార్‌లలో ఒకటి. ఈ ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం వహించిన జేఎల్ఎల్ ధృవీకరించింది.
➤గత ఏడాది ఆగస్టులో, ఐటీ సేవల దిగ్గజం LTI మైండ్‌ట్రీ.. చెన్నైలోని మనపక్కం శివారులో 5.85 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని రూ.3.98 కోట్ల నెలవారీ అద్దెకు లీజుకు తీసుకుంది.