Lease
-
రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్బుక్' (Facebook) తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం రెండు లీజింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పుడు కంపెనీ నెలకు రూ.2.8 కోట్లు అద్దె చెల్లించనుంది.హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉన్న మొత్తం ఆఫీస్ స్పేస్ 3.7 లక్షల చదరపు అడుగులు. ఇప్పటి వరకు కంపెనీ దీనికోసం నెలకు రూ. 2.15 కోట్ల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె రూ. 2.8 కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ ఐదేళ్ల కాలనికి చెల్లించాల్సిన అద్దె రూ.168 కోట్లు.మొత్తం లీజు వ్యవధి ఐదు సంవత్సరాలు.. దీని కోసం కంపెనీ రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించింది. అయితే 2026 నుంచి అద్దె మరో 15 శాతం పెరుగుతుందని ఒప్పందంలో పేర్కొన్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఐదేళ్ల తరువాత అద్దె మరింత పెరుగుతుందని స్పష్టమవుతోంది.వేగంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగంరియల్ ఎస్టేట్ (Real Estate) రంగం వేగంగా పెరుగుతోంది. దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.. అద్దెకు ఆకాశాన్నంటుతున్నాయి. న్యూస్ పోర్టల్ ప్రకారం.. 2019లో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో అద్దె నెలకు రూ. 23,000. ఈ అద్దె 2023లో రూ. 27,500కు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే అద్దె సుమారు 19 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!హైదరాబాద్‌లో ఐటీ హబ్‌గా.. బెంగళూరుకు గట్టి పోటీనిస్తుంది. ఇక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు ఐటీ, ఆర్థిక సేవలకు నెలవు. ఆఫీస్ స్పేస్ కూడా.. సాధారణంగా హైటెక్ సిటీలో సగటున అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. అనరాక్ డేటా ప్రకారం.. కొండాపూర్‌లో 2019 - 23 మధ్యలో అద్దెలు 19 శాతం పెరిగాయి. గచ్చిబౌలిలో 20 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది ఆగస్టులోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా హైదరాబాద్‌లోని తన ఆఫీస్ స్పేస్ డీల్ పునరుద్ధరణ చేసుకుని నెలకు రూ. 2 కోట్ల రెంట్ చెల్లించేలా డీల్ కుదుర్చుకుంది. -
'మాన్సాస్' కౌలు కిరికిరి
తగరపువలస (విశాఖ): అవి ఏడెనిమిది తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములు.. వాటికి పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ఏనాడూ కౌలు వసూలు చేయలేదు.. ఇప్పుడు ఉన్న పళంగా ఎవరికీ చెప్పాపెట్టకుండా గ్రామసభ పెట్టి కౌలు వేలం నిర్వహిస్తామని ఏకపక్షంగా ప్రకటించేశారు. పైగా గతంలో వన్‌టైమ్ సెటిల్మెంట్కు వచ్చి ఇప్పుడు ఆ మాట మార్చేశారు. దీంతో ఆ భూములు సాగుచేసుకుంటున్న రైతులు మండిపడుతున్నారు. ఈ కలవరపాటుకు కారణం విశాఖ జిల్లాలో ‘మాన్సాస్’ ట్రస్ట్ తాజా వ్యవహారం. విషయం ఏమిటంటే.. ఆనందపురం మండలం బోని పంచాయతీలో మాన్సాస్ ట్రస్ట్‌కు 614.97 ఎకరాల భూములున్నాయి. వీటికి సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జూలై ఒకటి నుంచి మూడో తేదీ వరకు లైసెన్సు హక్కులు నిర్ణయించనున్నారు. బహిరంగ వేలం ద్వారా నిర్ణయించనున్న ఈ ట్రస్ట్ భూములకు సంబంధించి మాన్సాస్ ప్రతినిధులు, ఆనందపురం రెవెన్యూ అధికారులు బోని పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం గ్రామసభ నిర్వహించారు. మాన్సాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల అభివృద్ధికి గాను ఈ కౌలు ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు రైతులకు తెలిపారు. కొన్నాళ్లుగా రైతులెవరూ కౌలు చెల్లించకపోవడంతో మాన్సాస్ లక్ష్యం దెబ్బతింటోందని దీనికి కౌలు రైతులంతా సహకరించకపోతే తాము మరోదారిలో వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.మాన్సాస్ భూములు కేవలం కౌలుకు మాత్రమేనని విక్రయానికి సాధ్యపడదని రైతులకు తెలిపారు. ఎవరైనా వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో వచ్చినా నమ్మవద్దని తెలిపారు. వ్యవసాయానికి అయితే ఏడాదికి ఎకరాకు రూ.5వేలు.. ఇటుక బట్టీలకైతే ఇంకా ఎక్కువ ధర నిర్ణయించనున్నట్లు మాన్సాస్ ప్రతినిధులు తెలిపారు. సాగు హక్కులు కావాలంటూ రైతుల పట్టు.. పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఇనాం రైతులకు ఇచ్చినట్లే తమకు కూడా మాన్సాస్ సాగు హక్కులు ఇవ్వాలంటూ కౌలు రైతులు పట్టుబట్టారు. గతంలో మాన్సాస్ ప్రతినిధులు రైతులతో వన్‌టైమ్ సెటిల్మెంట్కు వచ్చినట్లు గుర్తుచేశారు. అసలు ఇక్కడి భూముల్లో బంజరు, ఇనాం, మాన్సాస్‌లకు చెందినవి విడివిడిగా చూపించాలన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి తమ ఏడెనిమిది తరాల వారు ఈ భూములను సాగు చేసుకుంటున్నట్లు వారంతా గుర్తుచేశారు. నిజానికి.. 18 ఏళ్లకు పైగా మాన్సాస్ ట్రస్ట్ తమ నుంచి కౌలు వసూలు చేయడంలేదని.. అంతకుముందు ఏడాదిలో ఎకరాకు రూ.20 నుంచి రూ.50 కౌలు మించేది కాదన్నారు. ఆరి్థకంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన తమపై కౌలు పేరుతో చెల్లించలేనంత భారాన్ని మోపితే సహించబోమన్నారు. దీంతో గ్రామసభ మరోమారు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పుడు కౌలు అడగడం సరికాదు.. ముగ్గురు ఆడపిల్లలు, భార్య, నేను కలిసి ఎకరా భూమి సాగుచేసుకుంటున్నాం. మాకు తాతముత్తాతల నుంచి ఈ భూమే ఆధారం. ఇప్పుడొచ్చి ఏడాదికి రూ.5 వేలు కౌలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం సరిగాలేదు. – కాళ్ల నారాయణ, కౌలు రైతు, బోని గ్రామం ముందస్తు సమాచారమే లేదు.. ముందుగా సర్పంచ్, ఎంపీటీసీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వలేదు. వాళ్లంతట వాళ్లే కరపత్రాలు ఈరోజు పట్టుకొచ్చి గ్రామసభలో పంచిపెట్టారు. కౌలు రైతులు ఎవరూ ఇందుకు సిద్ధంగా లేరు. – బోని ముకుంద, కౌలు రైతు, బోని గ్రామం కౌలు భూములకు కమర్షియల్ ధరలా? మేం సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కులు కల్పించాలి. అప్పుడే మా కుటుంబాలకు భద్రత. కౌలు భూములకు కమర్షియల్ ధరలంటూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. – సూరకత్తుల వెంకట్రావు, కౌలు రైతు, బోని గ్రామం రైతులను వేధిస్తే ఊరుకోం.. 1971లో గరీబ్ హఠవో ద్వారా ఇందిరాగాంధీ.. 1986లో దున్నేవాడిదే భూమిపై హక్కులు అంటూ ఎన్టీఆర్.. 30 ఏళ్లు సాగులో ఉండేవారికి భూమిపై అన్ని హక్కులు సంక్రమిస్తాయని చెప్పారు. 1956లో ట్రస్ట్లన్నింటినీ ప్రభుత్వం రద్దుచేసింది. 1958లో పుట్టుకొచ్చిన మాన్సాస్‌పై చాలా కేసులున్నాయి. చాలా ఏళ్ల తరువాత వచ్చి ఇప్పుడు కౌలు కట్టాలని రైతులను వేధిస్తే ఊరుకోం. – బోని సోంబాబు, కౌలు రైతు, బోని గ్రామం వన్‌టైం సెటిల్మెంట్పై మాటమార్చారు.. మా బోని గ్రామ పంచాయతీ ప్రజలంతా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వాలు కల్పిస్తున్న వసతులతో కౌలు భూములు సాగుచేసుకుంటున్నాం. గతంలో మాన్సాస్ ప్రతినిధులు వన్ టైమ్ సెటిల్మెంట్కు వచ్చారు. ఇప్పుడు కాదంటున్నారు. – మద్దిల తాతినాయుడు, కౌలు రైతు, బోని గ్రామం -
సంద్రంలో ‘విండ్ పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్‌కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది. థర్మల్ కంటే ఖర్చు తక్కువ పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రాష్ట్రంలో సముద్రం అనుకూలం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. -
టీడీపీ నేతల గ‘లీజు’ దందా
చిత్తూరు అర్బన్: మునిసిపల్ స్థలాన్ని కొట్టేసేందుకు బినామీ పేరుతో టీడీపీ నేతలు సాగించిన గలీజు దందాకు అడ్డుకట్ట పడింది. మంగళవారం చిత్తూరులోని ఎంఎస్ఆర్ మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని వాణిజ్య సముదాయాన్ని మునిసిపల్ కమిషనర్ అరుణ, అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 2016లో చిత్తూరుకు చెందిన టీడీపీ కార్పొరేటర్, ఓ క్రియాశీలక నేత.. జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న మునిసిపల్ ఖాళీ స్థలంపై కన్నేశారు. ఇందులో భాగంగా కమలహాసన్ అనే వ్యక్తి పేరుతో అప్పటి మేయర్‌కు లేఖ రాశారు. తనకు ఎలాంటి ఆసరా లేదని, మునిసిపల్ స్థలం లీజుకు ఇస్తే బతుకుదెరువు చూసుకుంటానని అందులో పేర్కొన్నారు. ఆ వెంటనే మునిసిపల్ కౌన్సిల్ రూ.కోట్ల విలువైన స్థలాన్ని ఏటా రూ.15 వేలు చెల్లించేలా మూడేళ్ల పాటు లీజుకిచ్చింది. ఆ వెంటనే టీడీపీ నేతలు చిత్తూరులోని ఎంఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పరిధిలో.. ఏడు దుకాణాలు నిర్మించారు. వాటిని ఏటా రూ.70 వేల వరకు అద్దెలకు ఇచ్చారు. అడ్వాన్సుల పేరుతో రూ.లక్షలు వసూలు చేశారు. మూడేళ్ల లీజు పూర్తయినా స్థలాన్ని మునిసిపాలిటీకు అప్పగించకుండా రూ.లక్షలు దండుకున్నారు. ఇదే సమయంలో లీజు పొడిగించాలంటూ హైకోర్టుకు వెళ్లగా.. కొన్నాళ్ల పాటు స్టే ఇచ్చింది. తాజాగా న్యాయస్థానం స్టేను డిస్మిస్ చేయడంతో రూ.కోట్ల విలువైన స్థలాన్ని, వాణిజ్య సముదాయాన్ని మునిసిపల్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. -
బాలీవుడ్ స్టార్ బిల్డింగ్‌లో సూపర్‌మార్కెట్: నెలకు అద్దె ఎంతో తెలుసా?
ముంబైలోని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు చెందిన ఇంటిని IIT గ్రాడ్యుయేట్లు లీజుకు తీసుకున్నారు. ఇక్కడ సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ముంబైలోని శాంతాక్రూజ్ పరిసరాల్లో సల్మాన్ నాలుగంతస్తుల కమర్షియల్ బిల్డింగ్‌లో "ఫుడ్ స్క్వేర్" అనే సూపర్ మార్కెట్ కొలువు దీరింది. మయాంక్ గుప్తా, లలిత్ ఝవార్ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లు దీన్ని షురూ చేశారు. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం లీజుకు తీసుకున్న 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లకు గాను నెలకు అద్దె రూ. 90 లక్షలు. తొలి 12 నెలలకు అద్దె రూ. 90 లక్షలు. ఏడాది తర్వాత రూ. 1 కోటికి పెరుగుతుందని భవిష్యత్తులో మరింత పెరగవచ్చని తెలుస్తోంది. స్వయంగా రైతులమైన తమకు గత ఐదేళ్లకు పైగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆక్వాపోనిక్స్, స్థిరమైన నేల ఆధారిత వ్యవసాయ క్షేత్రాలను నిర్వహిస్తున్న అనుభవం ఉందని ఫుడ్ స్క్వేర్ జనరల్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు మయాంక్ గుప్తా తెలిపారు. "ఫుడ్ స్క్వేర్" ప్రపంచం నలుమూలల నుండి పండ్లు, కూరగాయలను అందిస్తుంది, 350 రకాల చీజ్‌లను కూడా అందిస్తుంది. గుప్తా, ఝవార్ 2019లో భారతదేశంలోని కొల్హాపూర్‌లో "ల్యాండ్‌క్రాఫ్ట్ ఆగ్రో"ని స్థాపించగా ఇప్పటివరకు 3.6 మిలియన్ల పెట్టుబడులను సాధించగలిగారు. 2012లో దాదాపు రూ. 120 కోట్లతో ఆస్తిని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో దీన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుల్హాల్కు జూలై 2017లో లీజుకు ఇచ్చారు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ఈ రిటైల్ చైన్ ఫుడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ సల్మాన్‌కు కూడా రూ.2.40 కోట్లు బకాయిపడింది. దీంతో తమ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో సల్మాన్ఖు అనుకూలంగా తీర్పు రావడంతో కొన్ని నెలల క్రితం ఫుడ్ హాల్ ఖాళీ చేసింది. ఇప్పుడు ఈ స్థానంలో ఫుడ్ స్క్వేర్ ఈ స్థానంలో చేరింది. సల్మాన్ ఖాన్ నికర విలువ పలు నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ నికర విలువ 2850 కోట్లు. సినిమాలతోపాటు, సల్మాన్ పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోట్లాది రూపాయిలు ఆర్జిస్తాడు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం రూ.6 నుంచి 7 కోట్లు వసూలు చేస్తాడు. వార్షిక సంపాదన దాదాపు రూ.220 కోట్లు. ఆదాయం నెలకు 16 కోట్లు. సల్మాన్‌కు ముంబైలో ఆస్తి ఉండటమే కాకుండా దుబాయ్‌లో కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న సంగతి తెలిసిందే. -
ట్రంప్ టవర్స్‌లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ పూణెలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారన్న వార్తలు మీడియాలో సందడి చేస్తున్నాయి. పూణేలోని ట్రంప్ టవర్స్‌లోని దాదాపు 7,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు వార్షిక అద్దెగా రూ. 48 లక్షలకు లీజుకు తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో కలిసి ఇటీవల న్యూయార్క్ నుండి తిరిగి వచ్చిన రణబీర్ ఈ అపార్ట్మెంట్ లీజ్‌కు తీసుకోవడం వార్తల్లో నిలిచింది. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) పూణేలోని కళ్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్స్‌లోని 10వ అంతస్థులో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్‌ని మూడు సంవత్సరాల పాటు నెలవారీ అద్దెకు రూ. 4 లక్షలు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, అపార్ట్‌మెంట్‌ను పూణేకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ వెహికల్ కాంపోనెంట్ పరిశ్రమలోని ప్రముఖ తయారీదారు డ్యూరోషాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అద్దెకు తీసుకున్నారు. లీజు అండ్ లైసెన్స్ ఒప్పందంపై సెప్టెంబర్ 15, 2023న సంతకం చేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా రూ. 24 లక్షల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌కూడా చెల్లించారు. మొదటి ఏడాది రూ.4 లక్షలు, రెండో ఏడాది రూ.4.2 లక్షలు, మూడో ఏడాది నెలకు రూ.4.41 లక్షలు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. (పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్‌కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?) మరోవైపు రణబీర్ అప్‌కమింగ్ మూవీ యానిమల్ డిసెంబరు 1న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు రణబీర్. ఈ సినిమాలో రష్మిక మందన్న, బాబీ డియోల్ , అనిల్ కపూర్ కూడా నటించారు. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న రణబీర్ ,అలియా భట్ రాహా అనే కుమార్తె ఉంది. కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో నెలకు దాదాపు రూ. 1.5 లక్షల అద్దెకు మూడేళ్లపాటు ఒక ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నాడు. పూణేలోని ఈ జంట టవర్లు ఇండియాలో తొలి ట్రంప్ టవర్స్. 23 అంతస్తుల ఈ ట్రంప్ టవర్లను అతుల్ చోర్డియా నేతృత్వంలోని పంచశిల్ రియాల్టీ అభివృద్ధి చేసింది. -
రిటైల్ లీజింగ్ 15 శాతం అధికం
ముంబై: మెగా పట్టణాల్లో రిటైల్ స్థలాల లీజు పరిమాణం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 15 శాతం పెరిగినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్లు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ రిటైలర్ల నుంచి లీజింగ్‌కు డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో 14.6 శాతం మేర రిటైల్ లీజింగ్ పెరిగింది. మొత్తం లీజు పరిమాణం 0.21 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం ముంబైలో 0.18 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. మొత్తం తాజా లీజు పరిమాణంలో హోమ్‌వేర్, డిపార్ట్మెంట్ స్టోర్ల వాటా 20 శాతంగా ఉంది. ఆ తర్వాత కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్ అండ్ అప్పారెల్ వాటా 17 శాతం మేర నమోదైంది. టాప్ డీల్స్‌లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో 20,800 ఎస్ఎఫ్టీ స్థలాన్ని కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ లీజుకు తీసుకోవడం ఒకటి. అలాగే, కస్తూరి రీజియస్లో 13,500 ఎస్ఎఫ్టీని పాంటలూన్ లీజుకు తీసుకోగా, విశ్వరూప్ ఐటీ పార్క్‌లో 10,800 ఎస్ఎఫ్టీని క్రోమా తీసుకుంది. దేశవ్యాప్తంగా 24 శాతం అప్ దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రిటైల్ లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 24 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 2.9 మిలియన్ ఎస్ఎఫ్టీని సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో 15 శాతం వృద్ధితో పోల్చి చూసినప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో లీజు పరిమాణంలో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ పట్టణాల వాటాయే 65 శాతంగా ఉంది. రానున్న కాలంలోనూ రిటైల్ లీజింగ్ మంచి వృద్ధిని చూస్తుందని సీబీఆర్ఈ చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. మాల్ సరఫరాకు తోడు, పండుగల సీజన్లో వినియోగ డిమాండ్ ఇందుకు మద్దతుగా నిలుస్తుందన్నారు. 2023 మొత్తం మీద రిటైల్ లీజు పరిమాణం 5.5–6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని సీబీఆర్ఈ ఎండీ రామ్ చంద్నాని పేర్కొన్నారు. 2019లో 6.8 మిలియన్ చదరపు అడుగుల లీజు అనంతరం ఇదే అధికమన్నారు. -
అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?
HDFC: ప్రపంచ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి అమాంతం ముందుకు దూసుకెళుతోంది. ఈ కారణంగా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లకు చేరిన సంగతి తెలిసింది. కాగా అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో ఒక బ్యాంకు నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లిస్తూ ఐదు సంవత్సరాల అగ్రిమెంట్‌తో ఆఫీస్ స్పేస్ లీజుకి తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెలకు రూ. 1.62 కోట్లు అద్దె.. నివేదికల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ ముంబైలోని వన్ ఇంటర్నేషనల్ సెంటర్లో తన ఆఫీస్ కోసం 64,337 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలానికి నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీని కోసం సంస్థ ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తరువాత అగ్రిమెంట్ కాలవ్యవధి పెరుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బ్యాంకు 7వ అంతస్తులో మూడు యూనిట్లు, 8వ అంతస్తులో రెండు యూనిట్లను లీజుకు తీసుకుంది. ఇవి టవర్స్ 2, 3లో ఉన్నాయి. ఈ డీల్ కోసం బ్యాంక్ దాదాపు రూ.9.73 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అయితే అద్దె సంవత్సరానికి 4.5 శాతం పెరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ఐదు సంవత్సరాలకు అద్దె ఇలా.. దీని ప్రకారం మార్చి 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అద్దె రూ. 1.62 కోట్లు. 2024 ఆగష్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు అద్దె నెలకు రూ.1.69 కోట్లు. 2025 ఆగష్టు 1 నుంచి 2026 జూలై 31 వరకు అద్దె రూ. 1.77 కోట్లు. 2026 ఆగష్టు 1 నుంచి 2027 జులై 31 వరకు అద్దె రూ.1.85 కోట్లు ఉండనున్నట్లు సంస్థ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! గత కొన్ని రోజులకు ముందు హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అద్దె రూపాయి మాత్రమే!
రాజంపేట: దాదాపు రూ.10కోట్లు విలువ చేసే పురపాలక స్థలానికి నేటి అద్దె రూపాయే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవునండి నిజం .. ఇది ఎక్కడో కాదు.. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని పాతబస్టాండు నడిబొడ్డున తిరుపతి వైపు ఉన్న వంకదారి సత్యనారాయణ పెట్రోలు బంకు కథ.. కాస్ట్ ఆఫ్ లివింగ్ టౌన్‌గా పిలువబడే రాజంపేటలో ఇంటి బాడుగులు ఆకాశంలో ఉంటాయి. అలాంటిది ఏకంగా 19సెంట్ల స్థలానికి 69 ఏళ్లుగా కొనసాగుతున్న రూపాయి అద్దె వ్యవహారం బట్టబయలైంది. ఈ విషయాన్ని పురపాలకసంఘం కౌన్సిల్ సీరియస్‌గా తీసుకుంది. ఈమేరకు శుక్రవారం చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్లో ఈ పెట్రోలు బంకును స్వాధీనం చేసుకోవాలని తీర్మానం చేశారు. లీజు వ్యవహారం ఇలా.. 1954లో సర్వే నంబరు 961/ఏలో రాజంపేట పురపాలకసంఘం(అప్పట్లో మేజర్ పంచాయతీ)కి సంబంధించిన 19 సెంట్ల స్థలాన్ని వంకదారి సత్యనారాయణ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అప్పట్లో కేవలం రూపాయి అద్దెతో ఆ స్థలాన్ని కేటాయించారు. అయితే నేటి వరకు అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో పెట్రోలు బంక్‌ను ఏర్పాటు చేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లీజుకు తీసుకుంది. స్థలానికి సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ కాలం ముగిసి కొన్ని సంవత్సరాలు అవుతోంది. నోటీసులు ఇచ్చినా కానరాని స్పందన.. సుమారు 40 సంవత్సరాలుగా రూపాయి కూడా అద్దె చెల్లించకుండా ఉచితంగా పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో చైర్మన్ పోలా రంగప్రవేశం చేశారు. కమిషనర్ జనార్దన్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు. వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇందుకు నిర్వాహకులు రెండు మాసాలు గడువు కోరారు. రెండు నెలలు పూర్తి అయినా పెట్రోలు బంకు నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. కేవలం రూపాయి అద్దెతో కోట్లు విలువ చేసే స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో మున్సిపాలిటీ లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. పురపాలక స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం పురపాలక సంఘం నిబంధనల మేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఆ విధంగానే కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. స్థలం నిర్వాహకులకు అనేక మార్లు నోటీసులు ఇచ్చారు. వారు ఏ మాత్రం స్పందించలేదు. పురపాలక సంఘం స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల పరోక్షంగా ఆదాయ వనరులు పెంచుకునేందుకు వీలుంటుంది. –పోలా శ్రీనివాసులరెడ్డి,చైర్మన్, పురపాలక సంఘం, రాజంపేట -
ఔటర్ లీజుపై రాష్ట్రపతికి లేఖ
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడాన్ని కట్టడి చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాస్తామని, కోర్టుకు కూడా వెళ్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓఆర్ఆర్ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి 30 ఏళ్ల పన్నులను ఒకేసారి తీసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి? రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భట్టి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగుతోంది. బుధవారం ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదగిరిగుట్టలో ఆటో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం గొల్లగుడెసెలు, దాతరుపల్లి గ్రామాల మీదుగా యాత్ర భువనగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. బస్వాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న నృసింహసాగర్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యలను ఆలకించారు. రిజర్వాయర్ కట్టపై మీడియాతో మాట్లాడుతూ ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఎకరానికి రూ.50–60 లక్షల ధర ఉంటుందని పేర్కొన్న సీఎం కేసీఆర్.. ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఎట్లా ఇస్తారని నిలదీశారు. భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి కోటిన్నర పరిహారం ఇవ్వాలన్నారు. -
ఓఆర్ఆర్ లీజులో భారీ కుంభకోణం ఆరోపణలు.. పూర్తి వివరాలు ఇవిగో!
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు లీజు అంతా పారదర్శకమని, కేంద్రం ఆమోదంతో జాతీయ రహదారుల సంస్థ గుర్తించిన టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) విధానాన్ని పాటించినట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 30 ఏళ్ల లీజుపై తాము నిర్ణయించిన బేస్‌ప్రైస్ కంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థ రూ.7380 కోట్లతో ఎక్కువ మొత్తంలో బిడ్ చేసినట్లు వెల్లడించారు. పోటీలో ఉన్న నాలుగు సంస్థల్లో ఇదే ఎక్కువ మొత్తమని చెప్పారు. బేస్‌ప్రైస్ విషయంలో సాంకేతికంగానే గోప్యత పాటించినట్లు పేర్కొన్నారు. ఔటర్ లీజులో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే.. బిడ్డింగ్‌లో లోపాల్లేవ్.. . ♦ జాతీయ రహదారుల సంస్థ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6 బండిల్స్‌లో సుమారు 1600 కిలోమీటర్లను టీఓటీ ప్రాతిపదికన 15 నుంచి 30 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చిన పద్ధతినే ఔటర్ విషయంలో అనుసరించాం. రెవెన్యూ మ ల్టిఫుల్ పరంగా దేశంలోని రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ప్రాజెక్టుల కోసం ఖరారు చేసిన వాటిలో ఔటర్ లీజు అత్యుత్తమ బిడ్. ♦ హైదరాబాద్ మహానగరం చుట్టూ 8 లేన్లతో చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం 2006లో ప్రారంభమైంది. 2012 నాటికి 79.45 కిలోమీటర్లు, 2018 నాటికి 158 కి.మీ పూర్తి చేశారు. 2012 నుంచే ఔటర్‌పై టోల్ వసూలు మొదలైంది. ఆ ఏడాది రూ.11.11 కోట్లు ఆదాయం లభించగా 2018 నాటికి రూ.340 కోట్లు, 2022 నాటికి రూ.542 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. జాతీయ రహదారుల సంస్థ 2008లో విధించిన నిబంధనల మేరకు టోల్ రుసుము నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోల్ రుసుముపై అదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ♦ కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదించిన టీఓటీ ప్రకారం ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గతేడాది ఆగస్టు 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతేడాది నవంబర్ 9న అంతర్జాతీయ సంస్థల నుంచి హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 11 బిడ్డర్లు ఆసక్తి ప్రదర్శించారు. బిడ్డింగ్‌లో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకతను పాటించేందుకు 142 రోజుల వ్యవధి ఇచ్చాం. పదేళ్లకోసారి సమీక్ష... ♦ ఐఆర్బీకి 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చినప్పటికీ ప్రతి పదేళ్లకు ఒకసారి లీజును సమీక్షిస్తారు. రోడ్డు మరమ్మతులు, నిర్వహణ, టోల్ రుసుము, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయ,వ్యయాలు, తదితర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ సమీక్షను నిర్వహిస్తారు. ♦ టోల్ పెంపు పైన ఐఆర్బీ చేసే ప్రతిపాదనలు జాతీయ రహదారుల సంస్థ నిబంధనలకు లోబడి ఉంటాయి. హెచ్ఎండీఏ ఆమోదంతోనే అవి అమలవుతాయి. ఔటర్‌పైన పచ్చదనం నిర్వహణ పూర్తిగా హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును ఐఆర్బీ చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఔటర్‌పైన ఇంటర్‌చేంజ్‌ల వద్ద ఉన్న ట్రామాకేర్ సెంటర్లను ఐఆర్బీ నిర్వహించనుంది. ఐఆర్బీ సంస్థకు లీజు ఆమోదపత్రం అందజేశాం. 120 రోజుల్లోపు ఐఆర్బీ బిడ్డింగ్ మొత్తాన్ని (రూ.7380కోట్లు) ఏకమొత్తంలో చెల్లించిన అనంతరమే ఔటర్‌ను అప్పగిస్తాం. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఈగిల్ ఇన్ఫ్రా సంస్థే టోల్ వసూలు చేస్తుంది. ఎవరెంత బిడ్ వేశారంటే.. ♦ మొత్తం ఈ బిడ్డింగ్ ప్రక్రియలో 11 సంస్థల్లో చివరకు నాలుగు మాత్రమే అర్హత సాధించాయి. ‘ప్రస్తుతం టోల్ వసూలు చేస్తున్న ఈగల్ ఇన్ఫ్రా సంస్థ 30 ఏళ్ల ఔటర్ లీజుపై రూ.5634 కోట్లు, గవార్ కన్స్ట్రక్షన్స్ రూ.6767 కోట్లు, దినేష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.7007 కోట్లు చొప్పున బిడ్ వేశాయి. ఐఆర్బీ అత్యధికంగా రూ. 7380 కోట్లతో ముందుకు వచ్చింది. తాము నిర్ణయించిన బేస్ ప్రైస్ కంటే ఇది ఎక్కువగా ఉండడంతో ఐఆర్బీ హెచ్–1 కింద లీజు పొందింది. ♦ బేస్ ప్రైస్ ముందే నిర్ణయించినప్పటికీ ఎన్హెచ్ఏఐ నిబంధనలతో పాటు ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందే లక్ష్యంతో బేస్ ప్రైస్‌ను గోప్యంగా ఉంచాం. ఓఆర్ఆర్పై వస్తున్న సుమారు రూ.541 కోట్ల ఆదాయాన్ని రెవెన్యూ మ ల్టిపుల్ ఫార్ములా (ఆర్‌ఎంఎఫ్) ప్రకారం లీజు మొత్తంతో హెచ్చించగా 30 ఏళ్లలో అది రూ.1.30 లక్షల కోట్లకు సమానమవుతుందన్నారు. ఔటర్ బిడ్డింగ్‌లో ఆర్‌ఎంఎఫ్ 13.64 వరకు వచ్చింది. టీఓటీ విధానంలో ఇది ఉత్తమ ఆర్‌ఎంఎఫ్. ప్రస్తుతం ఔటర్‌పై ప్రతి రోజు సగటున 1.6 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, రూ.1.48 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. -
కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రైవేటుకు ఓఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారమైన 158 కి.మీ. నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లపాటు లీజుకు అప్పగించింది. టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) ప్రాతిపదికన ఓఆర్ఆర్ నిర్వహణ లీజు కోసం హెచ్ఎండీఏ బిడ్లను ఆహ్వానించగా 11 అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. చివరకు నాలుగు సంస్థలు అర్హత సాధించగా జాతీయ రహదారుల నిర్వహణలో అతిపెద్ద సంస్థగా పేరొందిన ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7,380 కోట్లకు ఈ లీజును పొందింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్బీ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డ్‌ను (ఎల్ఓఏ)ను అందజేసింది. దేశంలోని అతిపెద్ద టీఓటీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. ఈ బిడ్‌ను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. ఏటేటా ఔటర్‌పై పెరుగుతున్న వాహనాల రద్దీ, టోల్ ద్వారా వస్తున్న ఆదాయం, ఓఆర్ఆర్ నిర్వహణ, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్పీవీ (నెట్ ప్రజెంట్ వాల్యూ) పద్ధతిలో లీజు మొత్తాన్ని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో టోల్ పెంపు వంటి అంశాలతోపాటు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో ఇచి్చన లీజులను కూడా ప్రామాణికంగా తీసుకున్నట్లు చెప్పారు. నిర్వహణ ఇక ప్రైవేట్ సంస్థదే.. ఇప్పటివరకు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్వహణ హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఓఆర్ఆర్పై టోల్ వసూలుతోపాటు రోడ్లకు మరమ్మతులు, లైట్లు, పచ్చదనం, తదితర పనులన్నింటినీ హెచ్‌జీసీఎల్ పర్యవేక్షిస్తోంది. తాజా ఒప్పందం వల్ల ఆ బాధ్యతలన్నింటినీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనుంది. టోల్ ద్వారా వచ్చే ఆదాయం ఆ సంస్థకే లభించనుంది. ప్రస్తుతం ఔటర్‌పై నిత్యం సుమారు 1.3 లక్షల నుంచి 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్ వసూలు ద్వారా ఏటా సుమారు రూ. 452 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఏటా టోల్ రుసుమును కొంత మేరకు పెంచడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈగిల్ ఇన్ఫ్రా సంస్థ ఇప్పటివరకు టోల్ వసూలు చేస్తుండగా ఇకపై ఐఆర్బీ సంస్థ పరిధిలోకి వెళ్లనుంది. రహదారుల నిర్వహణలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు దేశంలో టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టీఓటీ) పద్ధతి అత్యుత్తమ విధానంగా పేరొందింది. ఎన్హెచ్ఏఐ 2016 నుంచి ఈ పద్ధతిని అవలంబిస్తోంది. మొత్తం 1,600 కి.మీ.కిపైగా మార్గాన్ని ఈ పద్ధతిలో 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లీజుకు ఇచి్చంది. ఔటర్ లీజు విషయంలోనూ ఇదే పద్ధతిని అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడులకు ఊతం: సీఎం కేసీఆర్ ఈ లీజు ఒప్పందంపట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా చక్కటి ఒప్పందమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులకు ఇది ఊతమిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపునకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, వ్యాపార సంస్థలకు అనుకూలమైన విధానాలను అమలు చేయడం వల్లే అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు తీస్తోందన్నారు. ఇదీ ఔటర్ స్వరూపం.. హైదరాబాద్ నగరం చుట్టూ 8 వరుసల్లో ఉన్న 158 కి.మీ. నిడివిగల ఔటర్ రింగురోడ్డు నిర్మాణం ఉమ్మడి ఏపీలో 2006లో మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని 2018లో పూర్తి చేసింది. ఔటర్‌కు 44 చోట్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉన్నాయి. 22 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేశారు. ఔటర్ మీదుగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు. నెహ్రూ ఓఆర్ఆర్ నిడివి: 158 కిమీ. వరుసలు: 8 నిత్యం రాకపోకలు సాగించే వాహనాలు: 1.3 నుంచి 1.5 లక్షలు ఏటా టోల్ వసూలు: రూ. 452 కోట్లు (సుమారుగా). ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ.. -
ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు
న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. -
గుట్టలు గుల్ల.. సర్కారు లీజు గోరంత.. తవ్వుకునేది గుట్టంతా
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘కొండలు పగలేసినం..బండలనూ పిండినం.. మా పదవులు అడ్డుపెట్టి ఉన్నకాడికి ఊడ్చుతం’’.. ఇదేంటీ యాభై ఏళ్ల క్రితం విప్లవ కవి చెరబండ రాజు అప్పటి దోపిడీ పీడనపై ఎక్కుపెట్టిన ‘కొండలు పగిలేసినం..’’అన్న కవితకు పూర్తి వ్యతిరేకంగా ఉంది అనుకుంటున్నారా? అవును..వ్యతిరేకమే..ఇప్పుడిలాగే ఉంది పరిస్థితి. అక్రమాలు సాగించే వారికి పదవుల్లో ఉన్నవారి అండా దండా తోడైతే ఇంక అడ్డేముంది? అందినకాడికి మనదే..అన్నట్టుగా కళ్ల ముందే కొండలన్నీ పిండి చేస్తున్నారు. సర్కారుకు కొసరంత సీనరేజీ కట్టి..కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో భూగర్భ వనరుల శాఖ కొండలు, గుట్టలను పలు సంస్థలకు లీజుకు ఇస్తుంటుంది. ఆయా సంస్థల నుంచి సీనరేజీ వసూలు చేస్తుంది. అయితే కొండ/గుట్టలో కొంత భాగం లీజుకు తీసుకుంటున్న అక్రమార్కులు మొత్తం కొండంతా తవ్వేస్తున్నారు. అధికారులెవరైనా ప్రశ్నిస్తే నయానో, భయానో వారిని చెప్పుచేతల్లో పెట్టుకుని మైనింగ్ జోన్ సహా, ఇతర ప్రాంతాల్లోనూ దందా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల్లో అడ్డూఅదుపూ లేని క్రషింగ్‌తో కొండలు కనుమరుగవుతున్నా, భారీయెత్తున సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వాస్తవ లీజును మించి పదింతల మైనింగ్! నిజామాబాద్ జిల్లాలో గుట్టల్ని మింగే ‘అనకొండలు’ బట్టాపూర్ కొండను ఆనవాళ్లే లేకుండా మింగేస్తున్నాయి. తీసుకున్న లీజును మించి పదింతల మైనింగ్, క్రషింగ్ చేస్తూ ఎవరడ్డొచ్చినా తగ్గేదేలేదంటున్నారు. ఈ జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న బట్టాపూర్ కొండ క్రషింగ్ వివరాల్లోకి వెళితే.. ఏర్గట్ల మండలం బట్టాపూర్ సర్వేనంబర్ 195/1లో 3.85 హెక్టార్లను 2016లో లీజుకు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుండి అనుమతి (కన్సెంట్ ఫర్ ఆపరేషన్) లేకుండానే గుట్టను తొలిచి క్రషింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు 13,686 క్యూబిక్ మీటర్ల మేరకే భూగర్భ శాఖ నుండి అనుమతి తీసుకుని సుమారు రూ.6.36 లక్షల సీనరేజీని చెల్లించారు. కానీ వాస్తవంగా సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కొండను తొలిచి కంకరగా మార్చి కోట్లలో సొమ్ము చేసుకున్నారు. జియో ట్యాగింగ్ ద్వారా ఫిట్ మెజర్మెంట్ పద్ధతిలో బట్టాపూర్ క్వారీలో పరిమితికి మించి తవ్వకం జరిగినట్లు అధికార యంత్రాంగం గుర్తించినా..దీని వెనక ఉన్న ముఖ్యనేత హెచ్చరికతో ఆ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదు. ఈ క్వారీలో పరిమితికి మించిన పేలుళ్ల కారణంగా బండరాళ్లు పంటపొలాల్లో, పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో పడుతున్నాయన్న ఫిర్యాదుతో.. ఓ మారు తనిఖీకి వచ్చిన కమ్మర్పల్లి ఎఫ్ఆర్వో ఆనంద్‌రెడ్డిని 24 గంటల్లోనే బదిలీ చేయించడంతో, ఇక ఏ ప్రభుత్వ శాఖ అధికారీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. సామాన్యులు బకాయి పడితే వారం రోజులు కూడా ఉపేక్షించని విద్యుత్ అధికారులు.. ఈ వీవీఐపీ ఫిబ్రవరి, 2022 నుండి విద్యుత్ బిల్లు చెల్లించకపోయినా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు సంబంధిత సంస్థ ఎన్పీడీసీఎల్కు రూ.51.15 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా..ఆ వైపు వెళ్లేందుకు విద్యుత్ అధికారులు సాహసించటం లేదు. ఇది బట్టాపూర్ గుట్ట. ఇందులో అతి కొద్ది భాగాన్నే లీజుకు తీసుకున్నారు. (2015లో గూగుల్ ఎర్త్ చిత్రం ఇది) ప్రస్తుతం బట్టాపూర్ గుట్ట దాదాపు కనుమరుగైన పరిస్థితి. (2022లో గూగుల్ ఎర్త్ చిత్రం ఇది) అన్నిచోట్లా ఇదే తంతు.. ►రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సర్వే నంబర్ 268లో 680 ఎకరాల్లో ఉన్న మైనింగ్ జోన్‌లోనూ పలు అక్రమాలు చోటు చేసుకుంటు న్నట్లు ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వం నుండి లీజు మంజూరైన వాటిలో మెజారిటీ సంస్థలు తమ లీజులను అనధికారికంగా ఇతరులకు విక్రయించేశాయి. ఈ జోన్‌లోని మెజారిటీ లీజులు ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకి వచ్చేశాయి. ►నిబంధనల మేరకు క్వారీ తవ్విన ప్రాంతాలను మళ్లీ మట్టితో నింపి చదును చేయాల్సి ఉండగా ఆ పని ఎవరూ చేయటం లేదు. ఇక మైనింగ్ కోసం ఏకంగా నాలుగు ఇంచుల బోర్లు వేస్తూ వాటిలో పేలుడు పదార్థాలు నింపి పేల్చేస్తున్నారు. తీసుకున్న లీజు పరిధిని మించి మైనింగ్ చేస్తున్నారు. జియో ట్యాగింగ్ ఫిట్ మెజర్మెంట్ పక్కాగా జరగటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ►సంగారెడ్డి జిల్లాలో మైనింగ్ క్వారీల పేలుళ్లతో భూ ప్రకంపనలు నిత్యకృత్యమయ్యాయి. పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల తదితర మండలాల్లోని క్వారీల్లోనూ తీసుకున్న అనుమతుల కంటే భారీ విస్తీర్ణంలో తవ్వకాలు చేస్తున్నారు.పరిమితికి మించిన పేలుడు పదార్థాలు వాడుతుండటంతో మాదారాం, లకుడారం గ్రామాల్లో ఇళ్లకు బీటలు పడుతున్నాయి. పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ►క్వారీలు, క్రషర్ల నిర్వాహకులంతా కీలక ప్రజాప్రతినిధులు కావటం, వారు సిఫారసు చేసిన అధికారులే పర్యవేక్షకులు కావడంతో క్రషింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. -
తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను?
సాక్షి, హైదరాబాద్: బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే. 2019లో ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వం వాటిని పెంచుకునేందుకు అనుమతించి టెండర్లు పిలవడంతో వాటి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇప్పుడు వాటిల్లో చాలా బస్సులు నడవటం లేదు. వాటిని కొనేందుకు ఆర్టీసీ ఆలోచిస్తోంది. వాటినే ఎందుకు? ఆర్టీసీ కొన్నేళ్లుగా సరిపడినన్ని బస్సులు కొనటం లేదు. 2015లో 800 బస్సులు కొనటం మినహా ఆ తర్వాత కొత్తవి సమకూర్చుకోలేకపోయింది. దీంతో క్రమంగా ఉన్న బస్సులు పాతబడి డొక్కుగా మారిపోయాయి. గత్యంతరం లేక వాటినే మరమ్మతు చేసుకుంటూ, నిత్యం మెయింటెనెన్స్ పనులు జరుపుతూ నెట్టుకొస్తోంది. కొన్ని సరిగా నడవని పరిస్థితి ఉంది. ఆదివారం వికారాబాద్ శివారులో అనంతగిరి గుట్ట దిగుతూ ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇది డొక్కు బస్సు కావటం వల్లనే అదుపు తప్పిందని కార్మిక సంఘాలు ఆరోపణలు ఎక్కుపెట్టాయి. ఇలాంటి బస్సులు దాదాపు రెండున్నర వేలున్నాయని పేర్కొంటున్నారు. ఇటీవలే 675 కొత్త బస్సుల కోసం టెండర్ల ప్రక్రియ ముగిసింది. అవి వచ్చే మార్చి నాటికి చేతికందబోతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న కొరతను అవి తీర్చలేవు. ఈ నేపథ్యంలో అద్దె బస్సులవైపు ఆర్టీసీ దృష్టి సారించింది. నిష్క్రమించినవి 600 కొన్ని నెలలుగా గిట్టుబాటు ఉండటం లేదంటూ అద్దె బస్సు నిర్వాహకులు క్రమంగా వైదొలుగుతూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 600 బస్సులు అలా అర్టీసీ నుంచి నిష్క్రమించాయి. ఇంకా చాలామంది యజమానులు వాటిని విరమించుకునే యత్నంలో ఉన్నారు. ఆరేడేళ్ల వయసున్న బస్సులను వారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ధరకు విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నారు. ఆర్టీసీ అదే కొత్త బస్సు కొనాలంటే రూ.35 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. తక్కువ ధరలో వస్తున్నందున ఆ బస్సులను కొని సొంత వర్క్‌షాపులో మెరుగుపరిస్తే కనీసం ఏడెనిమిదేళ్ల వరకు ఇబ్బంది ఉండదనేది అధికారుల యోచన. ఆ బస్సుల కొనుగోలు ఎంతవరకు సరైన నిర్ణయమనేది తేల్చేందుకు ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చే నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ఈలోపు ఎన్ని అద్దె బస్సులు అమ్మకానికి ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం -
అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్–2021(ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది. నెట్వర్క్ సమస్యకు చెక్ ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్‌కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్‌లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్వర్క్ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన! -
చిన్న దుకాణానికి రూ.1.72 కోట్ల లీజు.. ఒక్క అడుగు రూ.2.47 లక్షలు
ఇండోర్: గుడి ఆవరణలో కేవలం పూలు, పూజా సామగ్రి, ప్రసాదాలు విక్రయించే 69.50 చదరపు అడుగుల వైశాల్యమున్న చిన్నపాటి దుకాణాన్ని ఓ వ్యాపారి రూ.1.72 కోట్లకు 30 ఏళ్లపాటు లీజుకు దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ప్రఖ్యాత ఖజ్రానా గణేశ్ ఆలయ కాంప్లెక్స్‌లో ఈ లీజు వ్యవహారం చోటుచేసుకుంది. ‘1–ఎ’ దుకాణాన్ని లీజుకు ఇవ్వడానికి ఆలయ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. రూ.30 లక్షలు కనీస మొత్తంగా నిర్ణయించారు. వేలం పాటలో ఇది ఏకంగా రూ.1.72 కోట్లకు చేరింది. అంటే ఒక్కో చదరపు అడుగు స్థలం రూ.2.47 లక్షలు పలికింది. వాణిజ్య స్థలం లీజు కోసం ఈ స్థాయిలో ధర పలకడం అరుదైన సంఘటన అని చెప్పొచ్చు. ఖాజ్రానా వినాయక ఆలయానికి దర్శించుకొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక్కడ వ్యాపారం భారీగానే జరుగుతోంది. -
ఆఫీస్ స్థలం లీజింగ్ పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 1.61 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధి అని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. పరిమాణం పరంగా ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికమని వివరించింది. ‘లీజింగ్ లావాదేవీల పరిమాణం మహమ్మారికి ముందస్తు త్రైమాసిక సగటును 6 శాతం అధిగమించాయి. మొత్తం లీజింగ్ పరిమాణంలో బెంగళూరు అత్యధికంగా 45 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ నగరంలో లీజింగ్ 71 శాతం దూసుకెళ్లి 73 లక్షల చదరపు అడుగులుగా ఉంది. గత 18 నెలల్లో ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. కంపెనీలు కార్యాలయం నుంచి పని విధానాలను అమలు చేయడం వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. ఈ ఏడాది వార్షిక లీజింగ్ పరిమాణం 2019 రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనాగా చెప్పారు. నగరాల వారీగా ఇలా.. ఆఫీస్ లీజింగ్ స్థలం ఢిల్లీ రాజధాని ప్రాంతంలో 23 శాతం పెరిగి 24 లక్షల చదరపు అడుగులు, ముంబై 82 శాతం ఎగసి 21 లక్షల చదరపు అడుగులు, అహ్మదాబాద్ రెండింతలై 7 లక్షల చదరపు అడుగులు, కోల్‌కత రెండింతలకుపైగా దూసుకెళ్లి 3 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఇక హైదరాబాద్ గతేడాదితో పోలిస్తే కార్యాలయ స్థలం లీజింగ్ 60 శాతం పడిపోయి 8 లక్షల చదరపు అడుగులు, పుణే 27 శాతం తగ్గి 7 లక్షల చదరపు అడుగులకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కార్యాలయ స్థలం నూతనంగా 1.3 కోట్ల చదరపు అడుగులు జతకూడింది. ఇందులో బెంగళూరు 49 లక్షలు, హైదరాబాద్ 33 లక్షల చదరపు అడుగులు సమకూర్చాయి. మొత్తం లావాదేవీల్లో కో–వర్కింగ్ రంగం వాటా 23 శాతానికి చేరింది. చదవండి: Natural Gas Prices Hike: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు -
రైల్వే భూములు లీజు 35 ఏళ్లకు పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఇవాళ(బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్ క్లియర్ అయ్యింది. పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. అలాగే రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజు కూడా ఆరు శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న లీజ్ పీరియడ్‌ను.. ఏకంగా 35 ఏళ్లకు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్‌కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. పీఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ కోసం 35 ఏళ్ల లీజుకు రైల్వేభూములు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. అయిదేళ్లలో 300 పిఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ నిర్మాణం చేపడతామని తెలిపారాయన. Union Cabinet has approved policy on long-term leasing of Railways' Land to implement PM Gati Shakti framework. 300 cargo terminals will be developed in 5 years: Union Minister Anurag Thakur on Union Cabinet decisions pic.twitter.com/i3VEwVSXYs — ANI (@ANI) September 7, 2022 ప్రైవేటీకరణలో భాగంగానే.. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాటాను కేంద్రం త్వరగతిన అమ్మేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న రైల్వే లీజ్ నిర్ణయాలు.. నీతి ఆయోగ్ సిఫారసుల ఆధారంగానే తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతకు ముందు నీతి ఆయోగ్.. 3 శాతం కంటే తక్కువగా రైల్వే ల్యాండ్ లీజింగ్ ఫీజు ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధరకు రైల్వే భూములను లీజ్‌కు ఇవ్వాలని, పీపీపీ పద్దతిలో రైల్వే భూములను ఆస్పత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఇవ్వాలని కూడా కేబినెట్ భేటీలో కేంద్రం నిర్ణయించింది. పీఎం శ్రీస్కూల్స్ కేంద్ర కేబినెట్లో ఇవాళ.. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. అలాగే.. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూల్స్‌ను ఎంపిక చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో రూ. 27,360 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం, ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు ఉండనుంది. నూతన జాతీయ విద్యావిధానం అమలులో వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అనుభవాలు, ప్రాక్టీకల్స్ ఆధారంగా విద్యాబోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర కేబినెట్ భావిస్తోంది. ఇదీ చదవండి: హెలికాప్టర్ సర్వీస్ పేరిట కుచ్చు టోపీ -
రాష్ట్రంలోని సంస్థలకే దేవదాయ లీజులు
సాక్షి, అమరావతి: వ్యవసాయేతర భూములు మినహా దేవదాయ శాఖ పరిధిలో జరిగే లీజు ఒప్పందాలకు రాష్ట్ర పరిధిలో రిజిస్టర్ చేసుకున్న సంస్థలకే ప్రాధాన్యత ఇచ్చేలా లీజు నిబంధనలు మారుస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ అంశంపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల పాటు అవకాశం కల్పించినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధన అమలులోకి వస్తే.. రాష్ట్ర పరిధిలోని ఆలయాల్లో ఎలాంటి లీజు ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా మన రాష్ట్రంలోనే ట్యాక్స్ చెల్లించేలా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం -
లీజు కట్టరు.. వాటా ఇవ్వరు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో పర్యాటక ఆధారిత ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇటు లీజు మొత్తం, అటు ఆదాయంలో ప్రతిపాదిత వాటా చెల్లించకుండా బకాయిపడ్డ బడా సంస్థలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో వాటి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి, బకాయి మొత్తం చెల్లించాల్సిందిగా గడువు విధించనుంది. చెల్లించని పక్షంలో ఆయా సంస్థలకు నీళ్లు, కరెంటు సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో నోటీసులు జారీ కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో స్థలాల కేటాయింపు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంస్థలు.. తమకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే హోటళ్లు, సినిమా హాళ్లు, గోల్ఫ్ కోర్సులు, ఇతర మనోరంజక ప్రాజెక్టులు నిర్మిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. దీంతో ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. అలాంటి వాటిల్లో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, జలవిహార్, స్నో వరల్డ్ లాంటి వాటితో పాటు మరెన్నో హోటళ్లు ఉన్నాయి. ఇవి లీజు మొత్తంతో పాటు రాబడిలో నిర్ధారిత వాటాను కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అలా కొన్ని సంస్థలు లీజు మొత్తం చెల్లిస్తుండగా, రాబడిలో కొంతమేర చెల్లిస్తూ వచ్చాయి. కొన్ని లీజు ఇస్తూ రాబడిలో వాటా చెల్లించటం లేదు. కొన్ని సంస్థలు లీజు మొత్తాన్ని కూడా సరిగా చెల్లించటం లేదు. ఇటీవల కోవిడ్ వల్ల ఆదాయం సరిగా లేదని చెప్తూ కొన్ని సంస్థలు లీజు మొత్తం ఇవ్వటం లేదు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.140 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఎన్నిసార్లు అడిగినా.. అధికారులు ఎన్నిసార్లు కోరినా నిర్వాహకులు బకాయిలు చెల్లించటం లేదు. దీంతో వాటిపై గట్టిగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని సంస్థలు కోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో, కోర్టు కేసులు కూడా సమసిపోయేలా చేసి తగు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ గురువారం అధికారులతో సమావేశమై చర్చించారు. బకాయి పడిన సంస్థలకు మంచినీరు, కరెంటు సరఫరా నిలిపివేసే విషయమై సంబంధిత విభాగాలకు లేఖలు రాయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఐదేళ్ల బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది....
5-Year-Old Girl Gives New Lease Of Life To Four: చండీఘడ్‌లోని ఐదేళ్ల బాలిక బ్రైయిన్ డెడ్ అయ్యి చనిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకుని మరి తల్లిదండ్రులు అవయదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అయితే ఆ బాలిక డిసెంబర్ 22న ఎత్తు నుండి పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణల కోసం పోరాడి చనిపోయింది. (చదవండి: 200 ఏళ్ల నాటి పండుగ... పిండి, కోడి గుడ్లతో చేసే తమాషా యుద్ధం!!) ఈ చిన్నారి ప్రాణాలతో బయటపడదని గ్రహించిన పీజీమర్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు ఆ చిన్నారి తండ్రిని సంప్రదించారు. అయితే ఆ తండ్రి ఎంతో గుండె నిర్భారాన్ని ప్రదర్శించి అవయదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో ఆ బాలిక శరీరం నుంచి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ వంటి అవయవాలను తీసుకున్నారు. దీంతో ముంబై, ఢిల్లీలో ఒక్కొక్కరు చండీఘడ్‌లోని ఇద్దరికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ క్రమంలో పీజీమర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్ ఎంతో ధైర్యంతో ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన ఆ బాలిక కుటుంబాన్ని ప్రశంసించడమే కాక ఇలాంటి చైతన్యం ఎందరో రోగుల ఆశాకిరణాన్ని నిలబెట్టడానికి దోహదడుతుందని అన్నారు. (చదవండి: వికటించిన పెడిక్యూర్.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం) -
Mahindra : కొత్త కారు.. కొనక్కర్లేదు.. అద్దెతోనే నడిపేయండి
Mahindra Finance Vehicle Leasing & Subscription Business Under Quiklyz Brand: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ క్విక్లీజ్ పేరుతో లీజ్ ఆధారిత సబ్స్క్రిప్షన్ సేవలను పరిచయం చేసింది. ఆన్లైన్ వేదికగా రిటైల్, కార్పొరేట్ క్లయింట్లు లక్ష్యంగా అన్ని రకాల బ్రాండ్లకు చెందిన కార్లను అద్దె విధానంలో ఆఫర్ చేస్తుంది. ఎటువంటి ముందస్తు చెల్లింపు అవసరం లేదు. కనీస చందా నెలకు రూ.10,000 ఉంది. 24–60 నెలల కాలానికి కస్టమర్ తనకు నచ్చిన సరికొత్త కారును అద్దెకు తీసుకోవచ్చు. ఈ పద్దతిలో క్విక్లీజ్ వెబ్సైట్లో లాగిన్ అయి కారుతోపాటు కంపెనీ నుంచి ఎటువంటి సేవలు కావాలో ఎంచుకోవాలి. అవసరమైన పత్రాలు జతచేసి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే చాలు. స్టాక్నుబట్టి కొద్ది రోజుల్లోనే కస్టమర్ పేరునే వైట్ నంబర్ ప్లేట్‌తో ఇంటి ముంగిట వాహనం ఉంటుంది. కాల పరిమితి తర్వాత కారును వెనక్కి ఇవ్వొచ్చు. లేదా అదే వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మరో కారుకు అప్‌గ్రేడ్‌కూ అవ కాశం ఉంది. ఎనిమిది మోడళ్లు బుధవారం నాటికి ఎనిమిది బ్రాండ్లకు చెందిన 22 మోడళ్లు కొలువుదీరాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను జోడిస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌సహా ఎనిమిది నగరాల్లో క్విక్లీజ్ అందుబాటులో ఉంది. ఏడాదిలో 30 నగరాలకు సేవలను విస్తరించాలన్నది సంస్థ ఆలోచన. - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: -
ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ... జాబితాలో ఉన్న తెలుగు రాష్ట్రాల ఆస్తులివే
National Monetisation Pipeline ప్రైవేట్ పెట్టుబడుల ఊతంతో మౌలిక రంగాన్ని మరింత మెరుగుపర్చేందుకు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీని కింద కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక ఆస్తుల మానిటైజేషన్ ద్వారా రూ. 6 లక్షల కోట్ల విలువను రాబట్టనుంది. ప్యాసింజర్ రైళ్లు మొదలుకుని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్‌ను లీజుకివ్వడం తదితర మార్గాల్లో ‘మానిటైజ్’ చేయనుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియంలతో పాటు పలు రైల్వే కాలనీలతో పాటు ప లు ఆస్తులు ఇందులో భాగంగా ఉండనున్నాయి. 2022–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. ఎన్ఎంపీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆవిష్కరించారు. నేషనల్ ఇన్ఫ్రా పైప్‌లైన్ (ఎన్ఐపీ) కార్యక్రమం కింద తలపెట్టిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఇది మరో అంచె పైకి తీసుకెడుతుందని విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు. ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంలో లేనివి, పూర్తి స్థాయిలో విలువను అందించలేకపోతున్న బ్రౌన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్‌కి మాత్రమే ఎన్ఎంపీ పరిమితమని మంత్రి చెప్పారు. అమ్మేయడం లేదు.. ఎన్ఎంపీ విధానంలో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రైవేట్ రంగం పాలుపంచుకునేందుకు అవకాశం కల్పించడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుంది. అలాగే మానిటైజేషన్ ద్వారా వచ్చిన నిధులను .. మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుంది’’ అని పేర్కొన్నారు. ‘ఆయా అసెట్స్ యాజమాన్య హక్కులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత వాటిని తప్పనిసరిగా ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదో అమ్మేస్తోందంటూ గందరగోళపడాల్సిన అవసరం లేదు. ఈ బ్రౌన్‌ఫీల్డ్ అసెట్లు అన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి‘ అని ఆమె స్పష్టం చేశారు. విభాగాలవారీగా చూస్తే.. రహదారులు..: అసెట్ మానిటైజేషన్‌లో సింహభాగం వాటా రహదారుల విభాగానిదే ఉండనుంది. సుమారు రూ. 1.6 లక్షల కోట్ల విలువ చేసే 26,700 కి.మీ. మేర జాతీయ రహదారులను (ప్రస్తుతమున్నవి, కొత్తగా రాబోయేవి) మానిటైజ్ చేయనున్నారు. దీన్ని రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అమలు చేయనుంది. టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్విట్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) రూపంలో ఇది ఉండనుంది. టీవోటీ విధానంలో టోల్ రాబడులను బిడ్డరు నుంచి ప్రభుత్వం ముందుగానే తీసుకుంటుంది. ఆ తర్వాత సదరు రహదారిని వినియోగించే వారి దగ్గర్నుంచి బిడ్డరు టోల్ ఫీజు వసూలు చేసుకుని, నిర్దిష్ట లీజు వ్యవధికి రహదారిని నిర్వహించి, తిరిగి ప్రభుత్వానికి బదలాయించాల్సి ఉంటుంది. ఇక రాబడులు అందించగలిగే ఇన్ఫ్రా అసెట్స్‌లో ఇన్విట్ల ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం ఉంటుంది. విమానాశ్రయాలు..: నాలుగేళ్లలో 25 విమానాశ్రయాల (విజయవాడ, తిరుపతి, చెన్నై, వడోదరసహా) మానిటైజేషన్ ద్వారా రూ. 20,782 కోట్ల మేర పెట్టుబడులు రాగలవని అంచనా. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు (13 శాతం వాటా) ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో ఉన్న వాటాలను విక్రయించే యోచన ఉంది. రైల్వే..: రైల్వేలకు సంబంధించి నిర్దిష్ట రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లు, ప్యాసింజర్ రైళ్లు, కొంకణ్ రైల్వే మానిటైజేషన్ విలువ సుమారు రూ. 1.52 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకోసం 400 రైల్వే స్టేషన్లు, 90 ప్యాసింజర్ రైళ్లు, 1,400 కి.మీ. మేర ఉన్న 1 రైల్వే ట్రాక్, 741 కి.మీ. కొంకణ్ రైల్వే, 15 రైల్వే స్టేడియంలు, కొన్ని రైల్వే కాలనీలు, రైల్వేకి చెందిన 265 గూడ్స్–షెడ్లు మొదలైనవి ఎంపిక చేశారు. టెలికం..: సుమారు రూ. 35,100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ అసెట్స్‌ను ఎన్ఎంపీ జాబితాలో నీతి ఆయోగ్ చేర్చింది. భారత్‌నెట్ ప్రాజెక్టు కింద బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ వేసిన 2.86 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ అసెట్స్ విలువ రూ. 26,300 కోట్లుగా లెక్కగట్టింది. అలాగే, బీఎస్ఎన్ఎల్కి చెందిన 13,567 మొబైల్ టవర్లు, ఎంటీఎన్ఎల్కి చెందిన 1,350 టవర్ల విలువను రూ. 8,800 కోట్లుగా అంచనా వేసింది. మైనింగ్..: దాదాపు రూ. 28,747 కోట్ల విలువ చేసే బొగ్గు గనులను మానిటైజ్ చేయనున్నారు. ఇందుకోసం 160 అసెట్స్‌ను గుర్తించారు. 761 ఖనిజ బ్లాక్‌లను నాలుగేళ్ల వ్యవధిలో వేలం వేయనున్నారు. షిప్పింగ్..: వచ్చే నాలుగేళ్లలో రూ. 12,828 కోట్ల విలువ చేసే షిప్పింగ్ అసెట్ల మానిటైజేషన్ జరగనుంది. దీన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ అమలు చేయనుంది. ఇందుకోసం 31 ప్రాజెక్టులను గుర్తించారు. రియల్ ఎస్టేట్..: రియల్ ఎస్టేట్, హోటల్ అసెట్స్ మానిటైజేషన్ విలువ సుమారు రూ. 15,000 కోట్ల మేర ఉండగలదని అంచనా వేస్తున్నారు. దేశ రాజధానిలోని పలు హౌసింగ్ కాలనీలు, ఎనిమిది ఐటీడీసీ హోటళ్లు కూడా ఈ మానిటైజేషన్ ప్రణాళికలో భాగంగా ఉంటాయి. ఉభయతారకం.. ఈ ప్రణాళిక ప్రకారం ప్రైవేట్ సంస్థలు ఇన్విట్ల(ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు) ద్వారా నిర్దిష్ట ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే నిర్దిష్ట కాలానికి అసెట్లను నిర్వహించి, అభివృద్ధి చేసి, ప్రభుత్వానికి బదలాయించే విధానంలోనూ రాబడులు అందుకోవచ్చు. గిడ్డంగులు, స్టేడియంలు మొదలైన కొన్ని అసెట్స్‌ను ప్రభుత్వం నుంచి దీర్ఘకాలిక లీజుకి తీసుకోవచ్చు. ఇటు ప్రైవేట్ పెట్టుబడులతో ఇన్ఫ్రా అభివృద్ధి చేయడంతో పాటు అటు ఇతర మౌలిక ప్రాజెక్టులకు నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వానికి ఎన్ఎంపీ ఉపయోగపడనుంది. రూ. 111 లక్షల కోట్లతో నిర్దేశించుకున్న నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రణాళికలో ఎన్ఎంపీ విలువ 5.4%గా ఉండగా, ప్రతిపాదిత ఎన్ఐపీలో కేంద్రం వాటాలో (రూ. 43 లక్షల కోట్లు) 14 %గా ఉండనుంది. ఎన్ఎంపీలో చేర్చేందుకు ఆస్కారమున్న బ్రౌన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్ జాబితాను నీతి ఆయోగ్ రూపొందించింది. ఎన్ఎంపీ జాబితాలో ఉన్న తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ ఆస్తులు 1. రహదారులు (పొడవు కి.మీ.లలో) కడ్తాల్–ఆర్మూర్: 31 కి.మీ. కడ్లూరు ఎల్లారెడ్డి– చేగుంట: 52 కి.మీ. చేగుంట – బోయినిపల్లి: 62 కి.మీ. మహారాష్ట్ర /తెలంగాణ సరిహద్దు– ఇస్లాంనగర్ (ఎన్‌హెచ్ 7): 55 కి.మీ. ఆర్మూర్–కడ్లూరు ఎల్లారెడ్డి: 59 కి.మీ. కడ్లూరు ఎల్లారెడ్డి – గుండ్ల పోచంపల్లి: 86 కి.మీ. హైదరాబాద్–బెంగళూరు (తెలంగాణ): 75 కి.మీ. 2. రైల్వేలు దేశవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉన్న 12 క్లస్టర్లలోని 109 రూట్లలో 150 అధునాతన రైళ్ళను తీసుకొచ్చేందుకు ప్రైవేట్ పెట్టుబడులను స్వాగతిస్తున్నారు. దీని ద్వారా సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు రానున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి రద్దీ క్లస్టర్లతో పాటు సికింద్రాబాద్ క్లస్టర్ అభివృద్ధికి బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఎన్ఎంపీ జాబితాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రం ఆస్తులు 1. రహదారులు (పొడవు కి.మీ.లలో) ► కొత్తకోట బైపాస్– కర్నూలు: 75 కి.మీ. ► హైదరాబాద్ – బెంగళూరు(ఏపీ): 251 కి.మీ. ► చిలకలూరిపేట– విజయవాడ: 68 కి.మీ. 2. గ్యాస్‌పైప్ లైన్ నెట్వర్క్ ► కేజీ బేసిన్ పైప్‌లైన్ నెట్వర్క్ – 889 కి.మీ. పొడవు 3. ఎయిర్‌పోర్టులు ► విజయవాడ (2023–24) – విలువ అంచనా: రూ. 600 కోట్లు ► తిరుపతి (2023–24) – విలువ అంచనా: రూ. 260 కోట్లు ► రాజమండ్రి (2024–25) – విలువ అంచనా: రూ. 130 కోట్లు 4. నౌకాశ్రయాలు ► పోర్టులకు సంబంధించి 2022–25 మధ్య దేశంలోని పోర్టుల్లో మొత్తం 31 ప్రాజెక్టులను పీపీపీ పద్ధతి ద్వారా అభివృద్ధి చేయనున్నారు. అందులో విశాఖపట్టణం పోర్టుకు సంబంధించిన నాలుగు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. వీటి విలువ సుమారు రూ. 988 కోట్ల మేర ఉండనుంది. 5. రైల్వేలు ► స్టేషన్ల పునర్అభివృద్ధి కింద తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల మానిటైజేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. - సాక్షి, న్యూఢిల్లీ -
10 ఎకరాలు.. రూ. 500 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: రైల్వే శాఖ ప్రైవేటీకరణ వైపు పరుగెడుతోంది. విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా ఆదాయ వనరులను సమీకరించునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతోపాటు రైళ్లను కూడా ప్రైవేటీకరించేందుకు ఇప్పటికే బడా సంస్థలకు ఆహ్వానం పలికిన రైల్వేశాఖ.. తాజాగా ఖాళీ స్థలాల వినియోగంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే మౌలాలి, మెట్టుగూడ, లాలాగూడ, చిలకలగూడ, తదితర ప్రాంతాల్లోని సుమారు 10 ఎకరాల విలువైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలోని రైల్వే అధికారుల క్వార్టర్స్‌ను అప్పగించేందుకు రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మొత్తం స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేస్తోంది. అందరి చూపు అటు వైపే... సంగీత్ చౌరస్తా నుంచి రైల్ నిలయం వైపు వెళ్లే దారిలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే అధికారుల క్వార్టర్స్ ఇవి. 40 మందికి పైగా అధికారులు ఈ క్వార్టర్స్‌లో నివాం ఉంటున్నారు. జనరల్ మేనేజర్, అదనపు జనరల్ మేనేజర్ మినహాయించి కనీసం పదేళ్లకు పైగా సీనియారిటీ కలిగిన ఉన్నతస్థాయి అధికారులకు ఈ క్వార్టర్స్ కేటాయిస్తారు. ఈ ప్రాంగణంలో జీ+1 భవనాల్లో అన్ని వసతులు ఉంటాయి. ఇళ్లల్లో పని చేసేవాళ్లకు, డ్రైవర్లకు ఔట్ హౌస్‌లు ఉంటాయి. రైల్‌నిలయంతో పాటే ఈ క్వార్టర్లను 1965–1970 మధ్య కట్టించారు. ఇటు రైల్‌నిలయం, అటు సంచాలన్‌భవన్, హైదరాబాద్ భవన్, లేఖాభవన్, తదితర రైల్వేకార్యాలయాలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వే క్వార్టర్స్‌పై ప్రస్తుతం ఆర్ఎల్డీఏ కన్ను పడింది.ప్రైమ్ ల్యాండ్ కావడంతో దీన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఎక్కువ ఆదాయం లభించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. లీజుపైనే సందిగ్ధం... రెండేళ్ల క్రితమే రైల్వేస్థలాల లీజుకోసం రైల్ లాండ్ డెవలప్మెంట్ అథారిటీ సన్నాహాలు చేపట్టింది. మొదట్లో 39 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని భావించారు.కానీ నిర్మాణ సంస్థల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. దీంతో గడువును 99 ఏళ్లకు పెంచినట్లు సమాచారం.కానీ సాధారణంగా స్థలాలను పూర్తిగా కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టే కార్పొరేట్ సంస్థలు లీజు స్థలాల పట్ల ఎలా ఆసక్తి చూపుతారనిదే సందిగ్ధం. లీజుకు ఇలా.... ⇔ రైళ్ల నిర్వహణ, సరుకు రవాణాపైనే కాకుండా రైల్వేస్థలాల నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించేందుకు రైల్వేశాఖ మూడేళ్ల క్రితం రైల్‌లాండ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ రైల్వేస్థలాలను గుర్తించి బడా కార్పొరేట్ సంస్థలకు 99 ఏళ్ల వరకు లీజుకు ఇస్తుంది. ⇔ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని రైల్వేకార్టర్స్ స్థలంలో భారీ వ్యాపార,వాణిజ్య భవన సముదాయాలను నిర్మించి నిర్వహించేందుకు (బిల్డ్, ఆపరేట్) లీజుకు ఇవ్వనున్నారు. దీనిద్వారా రైల్వేకు రూ.150 కోట్లకు పైగా ఆదాయం రాబట్టవచ్చని అంచనా.