
రాష్ట్రంలో వక్ఫ్ భూముల లీజుపై టీడీపీ కూటమి సర్కారు పన్నాగం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఓ పక్క వక్ఫ్ సవరణ బిల్లుపై దుమారం చెలరేగుతుంటే సందట్లో సడేమియా అంటూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వక్ఫ్ భూములపై పెద్ద స్కెచ్చే వేసింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదానికి వచ్చిన రోజే ఇదే అదనుగా రాష్ట్రంలో ఆ భూముల లీజుకు నోటిఫికేషన్ జారీచేసేసింది. ప్రభుత్వ గ‘లీజు’ నిర్ణయంపై ముస్లిం సమాజం మండిపడుతోంది. వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికిన టీడీపీ కూటమి రాష్ట్రంలో వక్ఫ్ భూముల అన్యాక్రాంతానికి ఒక్కసారిగా ఊతమిచ్చే చర్యలు చేపట్టడంపై వారు రగిలిపోతున్నారు.
అభివృద్ధి పేరుతో హడావుడిగా లీజులు..
నిజానికి.. రాష్ట్రంలో రూ.కోట్ల విలువైన వక్ఫ్ భూములపై పచ్చగద్దలు ఎప్పటికప్పుడు కన్నేస్తూనే ఉన్నాయి. నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకుని వాటిని దక్కించుకునేందుకు ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం రాగానే.. అభివృద్ధి పేరుతో లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం హడావుడిగా ఆమోదముద్ర వేయడం గమనార్హం. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో 933 ఎకరాల వక్ఫ్ భూములను 2025–26 నుంచి 2027–28 (మూడేళ్ల) వరకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించారు.
ఈ ఏడాది మే 8లోపు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీచేశారు. వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగపడే వక్ఫ్ భూములను అభివృద్ధి చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి డెవలపర్లను, సంస్థలను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మొదట మూడేళ్ల లీజు అనే ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీచేసిన వక్ఫ్ బోర్డు.. ఆ భూముల్లో దీర్ఘ్ఘకాలిక లీజు కోసం పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో ఆసక్తి వ్యక్తీకరణ కింద ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.
సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య కాంప్లెక్సులు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఇతర వాణిజ్య ప్రాజెక్టులను అభివృద్ధి చేసేలా ఈ ప్రతిపాదనలు చేశారు. తొలిదశలో.. విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు నగరాల్లోని అత్యంత విలువైన వక్ఫ్ భూములను నామమాత్రపు లీజుకు అప్పన్నంగా కట్టబెట్టేలా స్కెచ్ వేశారు.
ఆక్రమణలు, వివాదాల్లో ఉన్నవి 31,594 ఎకరాలు..
ఇక రాష్ట్రంలో 2014–19లో యథేచ్ఛగా సాగిన వక్ఫ్ భూముల దురాక్రమణ.. టీడీపీ కూటమి సర్కారు రాకతో మళ్లీ ఊపందుకుంది. ప్రభుత్వంలోని ‘ముఖ్యుల’ ఆశీస్సులతో ‘పచ్చ’గద్దలు అడ్డూఅదుపు లేకుండా కబళిస్తున్నాయి. దీంతో.. అధికారులు అటువైపు చూసే సాహసం చేయట్లేదు. వాస్తవానికి.. రాష్ట్రంలో దానం (వక్ఫ్)గా 3,502 వక్ఫ్ సంస్థలకు 65,783.88 ఎకరాల భూమి సంక్రమించగా వాటిలో ఏళ్ల తరబడి ఆక్రమణలపాలైనవి, అన్యాక్రాంతమై వివాదాల్లో ఉన్నవి, కోర్టు కేసుల్లో ఉన్నవి 31,594.20 ఎకరాలు.
ఇంకా 4,500కు పైగా ఎకరాలు ప్రభుత్వ శాఖల వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం ఎటువంటి వివాదాల్లేని భూములు 29,578.21 ఎకరాలు. వక్ఫ్ సంస్థల నిర్వహణలోని విలువైన భూములు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ఉన్నప్పటికీ టీడీపీ కూటమి నేతలు వాటి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఫలితంగా.. ‘వక్ఫ్’ అసలు లక్ష్యం పక్కదారిపడుతోంది. ఇలా అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్ భూములను తిరిగి స్వా«దీనం చేసుకునే క్రమంలో ‘పచ్చ’నేతల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఇటీవల అధికమయ్యాయి.
ఆక్రమణల చెరలో మచ్చుకు కొన్ని..
» టీడీపీ కీలకనేతకు బంధువుగా చెప్పుకునే ప్రముఖుడు ఒకరు కృష్ణాజిల్లా తాడిగడపలోని సర్వే నెంబర్ 176లో 12.92 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమించి సాగుచేస్తున్నా దాన్ని వేలం వేయడానికి వక్ఫ్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
» అలాగే, మంత్రి ఫరూక్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న టీడీపీ నేత ఒకరు అనంతపురం మసీదు ఆస్తులను 40 ఏళ్లుగా అడ్డగోలుగా అనుభవిస్తున్నారు.
» కడప నాగరాజుపేటలో సర్వే నెంబర్ 18లో దర్గాకు చెందిన రూ.కోట్లు విలువైన భూమిని టీడీపీ నాయకుడు ఆక్రమించినా పట్టించుకునే దిక్కులేదు.
ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ డైరెక్షన్‌లో వక్ఫ్ బోర్డు తాజా నిర్ణయంతో టీడీపీ కూటమి బ్యాచ్ చేతుల్లోకి రూ.కోట్లు విలువైన భూములు వెళ్లిపోతాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.