కృష్ణా జిల్లా తాడిగడపలో టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్న వక్ఫ్ భూములు
పచ్చ నేతల చెరలో వక్ఫ్ భూములు
తాడిగడపలో దర్జాగా భూములు ఆక్రమించిన టీడీపీ నేత
వేలం వేసే దశలో బరితెగించి వరి నాట్లు
అనంతపురంలో 40 ఏళ్లుగా మసీదు ఆస్తులపై పెత్తనం
ముతవల్లీగా ఎన్నిక కాకుండానే అడ్డగోలుగా దోపిడీ
కడపలో దర్గా భూములు, ప్రొద్దుటూరులో వక్ఫ్ భూముల ఆక్రమణ
రాష్ట్రంలో 65 వేల ఎకరాల వక్ఫ్ భూముల్లో సగానికి సగం కబ్జా
చోద్యం చూస్తున్న సర్కారు పెద్దలు, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని పలువురు టీడీపీ నేతలు రెచ్చిపోతు న్నారు. వక్ఫ్ భూముల్లో ఎక్కడికక్కడ పాగా వేసి దర్జాగా అనుభవిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కృష్ణా జిల్లా తాడిగడపలోని సర్వే నంబర్ 176లో 12.92 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమించిన ఘనుడు ఈ సంక్రాంతి మూడు రోజులు ‘బరి’ తెగించి కోడి పందాలు నిర్వహించాలనుకుంటే, చివరి ఘడియలో అధికారులు అడ్డుకోవడంతో భంగపడ్డాడు. ఇప్పుడు ఆ భూమిని సాగుకు ఇచ్చేందుకు అధికారులు జనవరి 31న బహిరంగ వేలం నిర్వహిస్తామని ప్రకటించడంతో పెద్దపులిపాకకు చెందిన టీడీపీ నేతలకు అక్రమంగా సబ్ లీజ్‌కు ఇచ్చేశాడు. దీంతో వారు రాత్రికి రాత్రే ఆ భూముల్లో అడ్డగోలుగా వరినాట్లు వేసేశారు.
వెంటనే వక్ఫ్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి తహసిల్దార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేస్తే ఇప్పుడేమి చేయలేమని.. తర్వాత చూద్దామని తీరిగ్గా బదులిచ్చారు. ఆక్రమణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎందుకంటే అతనికి టీడీపీ నేతల అండదండలు ఉండటమే కారణం. ఇదే రీతిలో మంత్రి ఫరూక్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న టీడీపీ నేత ఒకరు అనంతపురం మసీదు ఆస్తులను 40 ఏళ్లుగా అడ్డగోలుగా అనుభవిస్తున్నాడు. నిబంధనల ప్రకారం అతను ముతవల్లిగా ఎన్నిక కాకుండానే నియామకం అయినట్టు చెప్పుకొని అధికార దుర్విని యోగానికి పాల్పడుతూ షాపింగ్ కాంప్లెక్స్ లీజుల పేరుతో అక్రమంగా జేబులు నింపుకొంటున్నాడు.
ముతవల్లీలకు రాష్ట్ర నాయకుడిగా ఎన్నికైనట్టు ప్రకటించుకుని వక్ఫ్ ఆస్తులను అనుభవిస్తున్న అతనిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, టీడీపీ నేతలు సన్మానాలు చేసి అక్రమాలకు తమ వంతు ఆశీస్సులు అందిస్తుండటం విస్తుగొలుపుతోంది. కడప నాగరాజుపేటలో సర్వే నంబర్ 18లో దర్గాకు చెందిన రూ.కోట్లు విలువైన భూమిని టీడీపీ నాయకుడు ఆక్రమించాడు. ప్రొద్దుటూరులో సుమారు రూ.70 కోట్ల విలువైన సర్వే నంబర్ 305/ఎలో 3.10 ఎకరాలు టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి సోదరుడే ఆక్రమించుకోవడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
బరితెగించి దందాలు..
రాష్ట్రంలో 2014–19లో యథేచ్ఛగా సాగిన వక్ఫ్ భూముల ఆక్రమణల పర్వం కూటమి సర్కారు రాకతో మళ్లీ ఊపందుకుంది. వక్ఫ్ భూములపై పచ్చ నేతలు పంజా విసరడంతో అధికారులు అటువైపు చూసే సాహసం చేయలేక పోతున్నారు. కూటమి నేతల ఆశీస్సులతో ఆక్రమించుకున్న భూములను అనుభవించేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ముస్లిం సమాజానికి చెందిన సంస్థలు, సేవకులకు జీతభత్యాలు, విద్యా, వైద్యం వంటి సామాజిక ప్రయోజనాల కోసం శతాబ్దాలు, దశాబ్దాల క్రితం దాతలు భూములు వక్ఫ్ చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో 3,502 వక్ఫ్ సంస్థలకు 65,783.88 ఎకరాల భూమి దానంగా సంక్రమించింది.
వాటిలో ఏళ్ల తరబడి ఆక్రమణలపాలైనవి, అన్యాక్రాంతమై అనేక వివాదాల్లో ఉన్నవి, కోర్టు కేసుల్లో 31,594.20 ఎకరాలున్నాయి. ప్రస్తుతం 29,578.21 ఎకరాలు ఎటువంటి వివాదాలు లేకుండా ఉన్నాయి. ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీల నియంత్రణలో ఉన్న ఆస్తులకు సంబంధించి వక్ఫ్ ప్రాపర్టీస్ లీజు నియమాలు–2014ను అనుసరించి వ్యవసాయ అవసరాల కోసం భూములను లీజుకు ఇస్తున్నారు. దానిపై వచ్చే ఆదాయంతో ఆయా సంస్థలను ర్వహిస్తున్నారు.
వక్ఫ్ భూములు, సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో ఏడు శాతాన్ని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు నిర్వహణ కోసం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీల ఆధ్వర్యంలో ఈద్గా, దర్గాలు, మసీదులు వంటి సంస్థల నిర్వహణ, సేవకులకు జీతభత్యాలు, ముస్లిం సమాజానికి అవసరమైన సాయం అందించేందుకు ఉపయోగిస్తారు. కాగా, వక్ఫ్ సంస్థలకు చెందిన అనేక షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా వక్ఫ్ బోర్డుకే చెందాలి. అయితే కూటమి నేతల మితిమీరిన జోక్యం, బెదిరింపులతో అసలు లక్ష్యం పక్కదోవ పడుతోంది.
ఎన్నికల హామీని అమలు చేసిన జగన్
వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నారు. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ చట్టం–1995 ప్రకారం గత ప్రభుత్వం సర్వే కమిషనర్ ద్వారా నోటిఫై చేయని వక్ఫ్ ఆస్తుల కోసం 2వ సర్వేను నిర్వహించింది. గుంటూరు, కృష్ణాŠ, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సర్వే నిర్వహించి.. 3,295 వక్ఫ్ ఆస్తులను గుర్తించి గెజిట్ నోటిఫికేషన్‌కు చర్యలు చేపట్టింది. గెజిట్ నోటిఫికేషన్ అయిన వక్ఫ్ ఆస్తులను అధునాతన సాంకేతిక పద్దతిలో జీఐఎస్, జీపీఎస్ మ్యాపింగ్ చేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సుమారు 223 వక్ఫ్ భూములు, 3,772 మసీదులు, దర్గాలకు అనుబంధమైన ఆస్తులను మ్యాపింగ్ చేశారు. దీనికితోడు ఆక్రమణల నుంచి 580.32 ఎకరాలను రికవరీ చేయగలిగారు. వక్ఫ్ భూములకు సంబంధించిన రికార్డులను కంప్యూటరీకరణ చేశారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాల వారీగా రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు చొప్పున పెంచి అందించారు.
వక్ఫ్ సర్వే నిర్వహించి ఆస్తులు కాపాడాలి
రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. రెండవ సర్వే నిర్వహించి వక్ఫ్ ఆస్తులను ఆక్రమణలను వెలికితీసి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదు. వక్ఫ్ సర్వేను నిర్వహించి దాతలు పెద్ద మనస్సుతో ఇచ్చిన ఆస్తులను కాపాడాలి. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు చేపట్టాలి.
– షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ముస్లిం దూదేకుల జేఏసీ
టీడీపీ డబుల్ గేమ్‌ను ముస్లిం సమాజం గమనిస్తోంది
వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడింది. ముందు నుంచి ముస్లిం సమాజ హితం కోరుతున్న వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలోనూ కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ముస్లిం సమాజం గమనిస్తోంది. ఇప్పటికైనా వక్ఫ్ ఆస్తులు ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
– కాగజ్‌ఘర్ రిజ్వాన్, అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment