వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఓకే
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులపై రికార్డు నిర్వహించడానికి, వాటి లీజు గడువును 30 ఏళ్లకు పొడిగించడానికి ఉద్దేశించినవక్ఫ్ సవరణ బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. దీనిని ఆగస్టు 20న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల వరకు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయడానికి ఎక్కువ ఆదాయాన్ని రాబట్టాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. వక్ఫ్ సవరణ బిల్లు-2010 ద్వారా వక్ఫ్ ఆస్తులను వాణిజ్యపరంగా సరైన క్రమంలో ఉపయోగించడం ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందని మెనార్టీ వ్యవహారాల మంత్రి రహ్మాన్ ఖాన్ చెప్పారు.
వీధి వ్యాపారుల రక్షణ బిల్లుకు లోక్సభ ఆమోదం: పట్టణాల్లోని వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు పోలీసులు, ఇతర అధికారుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పిస్తుంది. వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ, వీధి వ్యాపారాల క్రమబద్ధీకరణ బిల్లును గృహనిర్మాణ, పట్టణ దారిద్య్ర నిర్మూలన శాఖ మంత్రి గిరిజా వ్యాస్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ధ్రువీకరణ పత్రాలున్న వీధి వ్యాపారులను పోలీ సులు లేదా ఇతర అధికారులెవరైనా తొలగించలేరన్నారు. యాభయ్యేళ్లకు పైగా ఉన్న మార్కెట్లను సహజమైన మార్కెట్లుగా పరిగణించడంతో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకునే వారి హక్కులను పరిరక్షించేందుకు ఈ బిల్లును తెచ్చినట్లు చెప్పారు.
భూసేకరణ బిల్లుకు పార్లమెంటు పచ్చజెండా: చరిత్రాత్మక భూసేకరణ బిల్లుకు గురువారం పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లు గతవారమే లోక్సభలో పాస్ అయినప్పటికీ రాజ్యసభలో ఆమోదం సందర్భంగా బుధవారం పలు సవరణలు చేశారు. రాజ్యసభలో బిల్లుకు చేసిన సవరణలకు మళ్లీ లోక్సభలోనూ గురువారం ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు.