
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విపక్షాలు
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులు, బోర్డ్ వ్యవహారాల్లో సంస్కరణలు, పారదర్శకత తేవడమే లక్ష్యంగా మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు(Waqf (Amendment) Bill)ను సమీక్షించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(Joint Parliamentary Committee) ఎట్టకేలకు తమ ముసాయిదా నివేదికను బుధవారం ఆమోదించింది. జేపీసీ 38వ సారి సమావేశమై ముసాయిదా నివేదికను ఆమోదించడం కోసం జరిపిన ఓటింగ్‌లో 15 మంది సభ్యులు నివేదికకు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు.
మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓట్లేయడంతో బీజేపీ నేత జగదాంబికాపాల్(Jagdambika Pal) నేతృత్వంలోని జేపీసీ ఈ నివేదికను ఆమోదించింది. జేపీసీలో సభ్యులుగా ఉన్న విపక్ష పార్టీల నేతలు ఈ నివేదికపై తమ పూర్తి అసంతృప్తిని వ్యక్తంచేస్తూ నోట్‌లను సమర్పించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆధునికత సాధించే ఉద్దేశ్యంతోనే గత ఏడాది ఆగస్ట్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందని బీజేపీ సభ్యులు చెప్పారు.
అయితే ఈ బిల్లు ద్వారా ముస్లింల మతసంబంధ వ్యవహారాల్లో కమలదళం ఉద్దేశపూర్వకంగా కలగజేసుకుంటోందని, వక్ఫ్ బోర్డ్ నిర్వహణ అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటోందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ నివేదికను గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేస్తామని, శుక్రవారం మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు జగదాంబికా పాల్ చెప్పారు.
వక్ఫ్ బోర్డులోకి ముస్లిమేతర వ్యక్తులను సభ్యులుగా అనుమతిస్తూ సవరణ బిల్లు తేవడాన్ని విపక్షాలు ప్రధానంగా తప్పుబడుతున్నాయి. ప్రతి పౌరుడికీ తన మత సంబంధ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, మత సంబంధ, దాతృత్వ సంబంధ సంస్థల నిర్వహణపై ఆ మతస్థులకే పూర్తి హక్కు ఉంటుందని విపక్షాలు తేల్చి చెప్పాయి. సవరణ బిల్లుతో ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 26లోని పౌరుల మతస్వేచ్ఛకు భంగం కల్గిస్తోందని ధ్వజమెత్తాయి. నివేదికను ఆమోదించడాన్ని జేపీసీలో కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ తప్పుబట్టారు.
‘‘ రాజ్యాంగం ద్వారా మాకు సంక్రమించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వం తరచూ ఉమ్మడి పౌరస్మృతి గురించి మాట్లాడుతుంది. మరి సభ్యుల విషయానికొస్తే హిందూ ఎండోమెంట్ బోర్డ్‌లో హిందూయేతర సభ్యులు లేరు. అలాగే సిఖ్ బోర్డ్‌లో సిఖ్‌యేతర సభ్యుడు లేడు. క్రిస్టియన్ బోర్డ్‌లో క్రైస్తవేతర సభ్యుడు లేడు. ఇదే నియమాన్ని ముస్లింలకూ వర్తింపజేయాలిగదా?. ఇదంతా వక్ఫ్ బోర్డ్‌లను నాశనంచేసే కుట్ర’’ అని మసూద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘‘ సవరణల్లో ఒక్కటికూడా వక్ఫ్‌కు మేలుచేసేలా లేవు. సవరణలన్నీ వక్ఫ్ బోర్డ్‌ను నాశనంచేసి, వక్ఫ్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యాన్ని పెంచేలా ఉన్నాయి. ఖాళీ వక్ఫ్ స్థలాలను ప్రభుత్వం లాగేసుకునే ప్రమాదముంది. ముస్లిం ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం ఆమోదించట్లేదు. ఈ సవరణలను మేం తిరస్కరిస్తున్నాం. సవరణలను ఒప్పుకుంటే మేం మా మసీదులను కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment