Draft report
-
ఆర్బీఐ కీలక ఆదేశాలు - డిఫాల్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్
ముంబై: రుణాలు డిఫాల్ట్ అయిన కస్టమర్లపై బ్యాంకులు అదనపు వడ్డీ, చార్జీలు విధించి దాన్ని అసలుకు కలిపే విధానానికి చెక్ పెట్టేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదనలు చేసింది. జరిమానాగా వడ్డించే చార్జీల పరిమాణం అనేది డిఫాల్ట్ అయిన మొత్తానికి అనుగుణంగా మాత్రమే ఉండాలని సహేతుక రుణ విధానాలపై విడుదల చేసిన ఒక సర్క్యులర్ ముసాయిదాలో పేర్కొంది. తీసుకున్న రుణాన్ని రుణగ్రహీత సక్రమంగా తిరిగి చెల్లించేలా చూడటమే జరిమానాల ప్రధాన ఉద్దేశ్యమని, వాటిని ఆదాయ వనరుగా బ్యాంకులు భావించరాదని సూచించింది. -
ద్రవ్యోల్బణం కట్టడిలో వైఫల్యంపై ఆర్బీఐ చర్చ
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ వివరణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న విషయం ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్బంగా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. అయితే ఈ వివరాలను తెలపడానికి మాత్రం నిరాకరించారు. సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరిగిందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. -
బొగ్గు వినియోగం వద్దు
గ్లాస్గో/లండన్: శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని యూకేలోని గ్లాస్గోలో జరిగిన భాగస్వామ్య పక్షాల (కాప్–26) శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు గత రెండు వారాలుగా కొనసాగిన ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా తుది ప్రకటనను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. దీన్ని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పర్యావరణాన్ని, తర్వాత భూగోళాన్ని కాపాడుకోవాలంటే బొగ్గు వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని కాప్–26 సూచించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంకా బొగ్గును ఉపయోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదని వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తుచేసింది. చాలావరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కర్బన ఉద్గారాలను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం లేదని తెలిపింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని నిరుత్సాహపర్చాలని ఇందుకోసం, సబ్సిడీల్లో పెద్ద ఎత్తున కోత విధించాలని పేర్కొంది. కాప్–26లో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 నుంచి 2 డిగ్రీల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై కీలక ఒప్పందం భారత్ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్(యూఎన్ఎఫ్సీసీసీ) మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. యూకేలోని గ్లాస్గోలో కాప్–26 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా శుక్రవారం ఈ అవగాహనా ఒప్పందంపై ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్, యూఎన్ఎఫ్సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ఓవైస్ సర్మాద్ సంతకాలు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి, నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామని, తమవంతు సహకారం అందిస్తామని ఐఎస్ఏ హామీ ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా.. దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, క్లీన్ ఎనర్జీ వినియోగానికి పెద్దపీట వేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నదే లక్ష్యమని అజయ్ మాథుర్ చెప్పారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సౌర కూటమిని 2015 నవంబర్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. -
బీఐఎస్ నాణ్యత హెల్మెట్లు మాత్రమే..
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనదారులకు మరింత భద్రత కల్పించేలా బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే దేశంలో లభించేలా నియమాలను రూపొందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, హైవేల శాఖ ముసాయిదా నివేదికను ఇచ్చింది. దేశంలో బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే తయారు చేసేలా, బీఎస్ఐ సర్టిఫికెట్ ఉండేలా నియమాలు తీసుకొని రానుంది. దీనివల్ల ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు మరణాలపాలయ్యే అవకాశాలు తగ్గుతాయని చెప్పింది. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే నెల రోజుల్లోగా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీకి పంపాలని కోరింది. -
‘జమిలి ఎన్నికలపై మరింత చర్చ జరగాలి’
సాక్షి, న్యూఢిల్లీ : లా కమిషన్ జమిలి ఎన్నికలపై 164 పేజీల ముసాయిదా నివేదికను విడుదల చేసిన సందర్భంగా జమిలి ఎన్నికలపై మరింత చర్చ జరగాలని అభిప్రాయపడింది. ఏకకాల ఎన్నికల్లో అనేక జటిలమైన సమస్యలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలపై మరింత పరిశీలన అవసరమని పేర్కొంది. కేంద్రానికి సిఫారసు చేసే ముందు అన్ని వర్గాలు మరింత చర్చ జరపాలని కోరింది. లా కమిషన్ ఏకకాల ఎన్నికలపై చర్చకు ఏడు అంశాలను లేవనెత్తింది. లా కమిషన్ చర్చకు ఉంచిన ఏడు అంశాలు : ఏకకాల ఎన్నికల వల్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుందా? హంగ్ అసెంబ్లీ, పార్లమెంటు ఏర్పడిన సమయంలో పరిస్థితి ఏమిటి ? అటువంటి సమయంలో పదో షెడ్యూల్‌ను సవరించాలా ? ఏకకాల ఎన్నికలు ఆలోచన మంచిదే అయినా ఆచరణాత్మక విధానం ఏమిటి ? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సవరించాలి ? ముసాయిదా నివేదికలో చర్చించిన అంశాలు కాకుండా ఇంకా మరి ఏమైనా విషయాలు పరిశీలించాల్సి ఉందా? ఏకకాల ఎన్నికల వల్ల రాజ్యాంగపరమైన ఉల్లంఘన జరిగే అవకాశం ఉందా ? ఈ ఏడు అంశాలపై మరింత చర్చ అవసరమని, అన్ని వర్గాలు దీనిపై చర్చించిన తర్వాతే కేంద్రానికి తుది సిఫారసు చేస్తామని తేల్చిచెప్పింది. -
రిలయన్స్ గ్యాస్ ఓఎన్జీసీదే..
* విలువ దాదాపు రూ. 9వేల కోట్లు.. * కన్సల్టెన్సీ డీఅండ్‌ఎం ముసాయిదా నివేదిక న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య గ్యాస్ వివాదానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ డెగోల్యె అండ్ మెక్‌నాటన్ (డీఅండ్‌ఎం) శుక్రవారం ముసాయిదా నివేదికను సమర్పించింది. రెండు కంపెనీలతో పాటు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)కి కూడా నివేదికను అందించింది. దీని ప్రకారం రిలయన్స్ (ఆర్ఐఎల్) కేజీ-డీ6 క్షేత్రం నుంచి వెలికి తీసిన గ్యాస్‌లో 9 మిలియన్ ఘనపు మీటర్ల సహజ వాయువు.. ఓఎన్జీసీకి చెందిన జీ4 బ్లాకు నుంచి వచ్చి ఉండొచ్చని డీఅండ్‌ఎం పేర్కొంది. దీని విలువ దాదాపు రూ. 9,000 కోట్లు ఉంటుందని తెలిపింది. ఉపరితలంపై సరిహద్దుల రీత్యా జీ4, కేజీ-డీ6 బ్లాకులు వేరువేరు అయినప్పటికీ, ఈ రెండింటికి ఉమ్మడిగా అనేక మీటర్ల లోతున ఒకే గ్యాస్ నిక్షేపం ఉందని డీఅండ్‌ఎం వివరించింది. అందువల్లే రిలయన్స్ ఉత్పత్తి చేసిన గ్యాస్‌లో ఓఎన్జీసీ సహజ వాయువు కలిసిపోయి ఉంటుందని తెలిపింది. యూనిట్‌కు 4.2 డాలర్ల చొప్పున ఈ గ్యాస్ విలువ రూ. 8,675 కోట్లు ఉండగలదని అభిప్రాయపడింది. దీనిపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలిపిన తర్వాత డీఅండ్‌ఎం తుది నివేదిక రూపొందించనుంది. ఆర్ఐఎల్ ఉద్దేశపూర్వకంగా సరిహద్దుల వెంబడి బావులు తవ్వి, తమ గ్యాస్‌ను తరలించుకుపోతోందంటూ 2013లో ఓఎన్జీసీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం రేగిన దరిమిలా రెండు సంస్థలు కలసి వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు డీఅండ్‌ఎం కన్సల్టెన్సీని నియమించుకున్నాయి. దీనిపై డీఅండ్‌ఎం తుది నివేదిక ఇచ్చిన ఆరు నెలల్లోగా ఓఎన్జీసీకి ఆర్ఐఎల్ నుంచి పరిహారం ఇప్పించడంపై కేంద్ర చమురు శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
కేంద్ర పథకాల కుదింపు
* 72 నుంచి 30కి తగ్గించేందుకు ‘నీతి’ సీఎం సబ్ కమిటీ భేటీలో ఏకాభిప్రాయం * ప్రాధాన్యాల వారీగా రెండు గ్రూపులుగా పథకాల వర్గీకరణ * మొదటి గ్రూపులో ముఖ్యమైన స్కీంలు.. రెండో విభాగంలో సంక్షేమ పథకాలు * ఫ్లెక్సీ ఫండ్ వాటాను 10% నుంచి 25 శాతానికి పెంచాలని సిఫారసు న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్య భారీగా తగ్గనుంది. ప్రస్తుతం 72 ఉన్న ఈ పథకాలను 30కి కుదించనున్నారు. ఈ మేరకు నీతి ఆయోగ్ ముఖ్యమంత్రుల సబ్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కేంద్రం ఇచ్చే నిధుల్లో ప్రస్తుతం 10 శాతం నిధులను (ఫ్లెక్సీ ఫండ్) రాష్ట్రాలు తమ అభీష్టం మేరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ఈ వాటాను 25 శాతానికి పెంచాలని సబ్ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. శనివారమిక్కడ నీతి ఆయోగ్‌లో సబ్ కమిటీ భేటీ అయింది. అనంతరం కమిటీ కన్వీనర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడారు. ‘మా తుది సిఫారసులు జూలై 5నాటికి ఖరారవుతాయి. మరిన్ని సలహాలు స్వీకరించాల్సి ఉంది. ప్రధాని మోదీకి నివేదిక సమర్పించేందుకు ముందు కమిటీలోని సభ్యులతోపాటు సీఎంలందరి అభిప్రాయాలు తెలుసుకుంటాం. ఆ తర్వాతే నివేదిక ఇస్తాం’ అని ఆయన చెప్పారు. రెండు గ్రూపులుగా పథకాలు ఇప్పటిదాకా జరిగిన సబ్ కమిటీ సమావేశాల్లోని ప్రతిపాదనలను క్రోడీకరించి తాజా భేటీలో సభ్యులకు ముసాయిదా నివేదికను సమర్పించారు. దీన్ని నీతి ఆయోగ్ సీఈవో సింధుశ్రీ ఖుల్లర్ రూపొందించారు. కేంద్ర పథకాలను ప్రధానంగా రెండు గ్రూపులుగా విభజించాలని అందులో పేర్కొన్నారు. మొదటి గ్రూపులో కీలకమైన గ్రామీణ ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్, మధ్యాహ్న భోజనం వంటి పథకాలను చేర్చాలని ప్రతిపాదించారు. ఇక రెండో గ్రూపులో సామాజిక సంక్షేమ పథకాలను చేర్చాలని సూచించారు. మొత్తంగా 30 కేంద్ర పథకాలు ఉంటాయని, వీటి లో కేంద్రం వాటా 50 శాతానికి తగ్గకుండా ఉండాలని ప్రతిపాదించారు. స్పెషల్ కేటగిరీలో ఉన్న 11 రాష్ట్రాల్లో మాత్రం కీలక పథకాలకు సంబంధించి.. కేంద్రం, రాష్ట్రాల వాటా 90:10 నిష్పత్తిలో ఉండాలని సూచించారు. రెండో గ్రూపులోని పథకాల్లో ఈ వాటా 80:20గా ఉండాలని ముసాయిదా నివేదికలో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్, గ్రామీణ విద్యుదీకరణ, మహిళ, శిశు ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణం పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే ఇప్పటివరకు 30 శాతం పనులు జరిగిన కేంద్ర పథకాలను పూర్తి చేయాలని, వాటికి నిధులను ఎప్పట్లాగే అందించాలని ప్రతిపాదించారు. శనివారం నాటి సమావేశానికి మధ్యప్రదేశ్ సీఎంతోపాటు రాజస్తాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సబ్ కమిటీలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు కూడా సభ్యుడిగా ఉన్నారు. అయితే తాజా భేటీకి ఆయన హాజరు కాలేదు. అగ్రనేతలను కలవకుండానే వెళ్లిన రాజే న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీ వివాదంతో సతమతమవుతున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే.. శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ ఉప సంఘం సమావేశంలో పాల్గొని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను కానీ కలవకుండానే రాజస్తాన్‌కు న్కు తిరిగివెళ్లారు. ప్రత్యేక విమానంలో రాజస్తాన్ నుంచి ఢిల్లీ వెళ్లిన రాజే.. సమావేశం అనంతరం అదే విమానంలో తిరుగుపయనమయ్యారు. అక్కడ మీడియాకు కూడా ఎదురుపడలేదు. దీంతో.. పార్టీ అగ్ర నాయకత్వం ఆమెను కలవటానికి విముఖంగా ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పర్యటనలో ఎవరితోనూ సమావేశాలను నిర్ణయించలేదని రాజస్తాన్ సీఎంఓ ఆ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. మోదీది ‘రాజే ధర్మం’: కాంగ్రెస్ దేశంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న లలిత్‌మోదీ బ్రిటన్‌లో ప్రయాణ పత్రాలు పొందేలా సహాయపడిన రాజే, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌లను సమర్థించుకోవటం ద్వారా.. ప్రధాని మోదీ ‘రాజ ధర్మాన్ని’ కాకుండా ‘రాజే ధర్మాన్ని’ పాటిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. వారితో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మహిళా మంత్రులను తొలగించటంలో విఫలమైన ప్రధాని.. రాజీనామా చేయాలని కాంగ్రెస్ ప్రతినిధి రాజ్‌బబ్బర్ అన్నారు.