ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది.
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్‌బీఐ వివరణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న విషయం ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్బంగా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. అయితే ఈ వివరాలను తెలపడానికి మాత్రం నిరాకరించారు. సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్‌బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరిగిందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment