Repo rate hike
-
బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..త్వరలోనే ఆర్బీఐ కీలక నిర్ణయం?!
దేశంలో వెహికల్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ చెల్లింపు దారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పనుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన 19 లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన 35 మంది మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ గణనీయమైన వృద్ధి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే తదితర అంశాలపై మాట్లాడారు. దేశం ఆర్ధికంగా బలంగా ఉందని, పదేళ్ల సగటు ద్రవ్యోల్బణం దాదాపు 5 నుంచి 5.5 శాతం ఉందని చెప్పారు. కాబట్టే త్వరలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత వడ్డీ రేట్లు మళ్లీ 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి. కానీ ఇప్పుడు ద్రవ్యోల్భణం చాలా వరకు నియంత్రణలో ఉంది. త్వరలో వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో బ్యాంకుల నుంచి వసూలు చేస్తే వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించే అవకాశం ఉందని అన్నారు. అదే జరిగితే బ్యాంకుల నుంచి కస్టమర్ల తీసుకునే లోన్లపై విధించే వడ్డీ రేట్లు అదుపులోకి వస్తాయి. ఈఎంఐల భారం తగ్గుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే సెంట్రల్ బ్యాంక్ .. దేశంలో పలు బ్యాంకులకు లోన్లు ఇస్తుంటుంది. బ్యాంకులు తీసుకునే ఆ రుణాలపై ఆర్బీఐ కొంత మొత్తంలో వడ్డీని వసూలు చేస్తుంటుంది. అయితే, ఈ ఇంట్రస్ట్ రేటు ఎక్కువగా ఉంటే.. సదరు బ్యాంకుల్లో తీసుకునే కస్టమర్లకు తీసుకునే లోన్ పై చెల్లింపులు అధికంగా ఉంటాయి. అదే ఇంట్రస్ట్ రేటు తక్కువగా ఉంటే ఆయా లోన్లపై విధించే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటుంది. అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5 శాతం వడ్డీని విధించింది. ఆ మొత్తం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వడ్డీ చెల్లింపులు వడ్డీలను కొనసాగిస్తూ వస్తుంది. ఫలితంగా ఆయా బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై అధిక మొత్తంలో వడ్డీని వసూలు చేస్తున్నాయి. పియూష్ గోయల్ చెప్పినట్లు ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే ఈఎంఐల భారం తగ్గనుంది. -
ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. 3, 5, 6 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ మçహావీర్ జయంతి సందర్భంగా సెలవు. ఈ సమావేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే నెల 3,5,6వ తేదీల్లో జరపనున్న ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును మరో పావుశాతం పెంచడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. పాలసీ సమీక్ష నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. ఇదీ చదవండి: Twitter gold tick: నీ బ్యాడ్జ్ బంగారం గానూ! ట్విటర్ గోల్డ్ టిక్ కావాలంటే అంతా? ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? జాగరూకత అవసరం: కాగా, వడ్డీరేట్ల పెరుగుదల, దీనికి సంబంధించిన ఎదురయ్యే సవాళ్ల వంటి విషయాల్లో అప్రమత్తత అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆమె ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బ్యాంకింగ్ పనితీరు, పటిష్టతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! -
రెపో రేటు పెంపును వ్యతిరేకించిన ఆ ఇద్దరు ఎంపీసీ సభ్యులు!
ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ఇటీవలి పావుశాతం పెంపునకు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో ఇరువురు ఇరువురు వ్యతిరేకించారు. గవర్నర్‌సహా నలుగురు పెంపునకు అనుకూలంగా ఓటు చేశారు. ద్రవ్యోల్బణం భయాలతో ఈ నెల మొదట్లో రెపో పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో గవర్నర్‌తోపాటు డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్, ముగ్గురు ప్రభుత్వం నామినేట్ చేసిన– ఎక్స్‌టర్నర్ సభ్యులు –– శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు ఉన్నారు. వీరిలో వర్మ గోయల్‌లు ఇరువురూ రేటు పెంపును వ్యతిరేకించినట్లు బుధవారం వెలువరించిన మినిట్స్ తెలిపాయి. ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తున్నందున, రేటు పెంపునకు బదులుగా వృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని వీరు అభిప్రాయపడ్డారు. అక్టోబర్ వరకూ గడచిన 10 నెలల్లో రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతంపైబడి కొనసాగిన సంగతి గమనార్హం. నవంబర్, డిసెంబర్లలో ఇది 6 శాతం దిగువకు చేరడం ఇరువురు సభ్యుల అభిప్రాయాల నేపథ్యం. -
RBI Policy review: రెపో రేటు పెంపు, ఈఎంఐలు మరింత భారం!
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంకు ఇండియా (ఆర్బీఐ) అంచనాలకు అనుగుణంగానే రెపో రేటు పావు శాతం పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు 6.50 శాతానికి చేరింది. అలాగే ఎంఎస్ఎప్ రేట్లు 25 బీపీఎస్ పాయింట్లు పెరిగి 6.75శాతానికి చేరింది. జీడీపీ వృద్ధి అంచనాలు 2023 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 6.8 శాతం నుండి 7 శాతానికి పెరిగింది. 2023-24లో GDP వృద్ధిని 6.4శాతంగా అంచనా వేసింది ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం (ఫిబ్రవరి8, 2023) ద్రవ్య విధాన ప్రకటనను ప్రకటించారు. ఇది వరుసగా ఆరోసారి వడ్డీ రేటు పెంపు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటు, తాజా పెంపుతో కలిపి 250 బేసిస్ పాయింట్లు పెంచింది. పెరగనున్న రుణ భారం తాజా రేట్ల పెంపు ప్రభావం అన్ని రకాల రుణాల రేట్లపై భారం పడనుంది. ఇప్పటికే వరుసగా పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా రుణ వినియోగదారులపై భారం పడుతున్న సంగతి తెలిసిందే -
ద్రవ్యోల్బణం కట్టడిలో వైఫల్యంపై ఆర్బీఐ చర్చ
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ వివరణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న విషయం ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్బంగా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. అయితే ఈ వివరాలను తెలపడానికి మాత్రం నిరాకరించారు. సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరిగిందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. -
ధరల స్పీడ్‌కు వడ్డీ రేటు పెంపు బ్రేక్!
న్యూఢిల్లీ: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) పెంపు చర్యలు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కట్డికి దోహదపడుతుందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ స్పష్టం చేశారు. 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివస్తుందన్న బరోసా ఇచ్చారు. వ్యవస్థలో ప్రస్తుత వడ్డీరేట్లు వృద్ధి రికవరీకి ఎటువంటి విఘాతం ఏర్పడని స్థాయిలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుముఖం పడతాయని, సరఫరాల చైన్ మున్ముందు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆమె ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో తెలిపారు. సరఫరాల వైపు సమస్యలను తగ్గించడానికి భారత్ ప్రభుత్వం నుంచి సైతం తగిన చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇవన్నీ వచ్చే ఐదారు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని మరో ఎంపీసీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. కరెన్సీ విషయంలో మనం బెస్ట్ డాలర్ మారకంలో భారత్ రూపాయి ఎప్పటికప్పుడు చరిత్రాత్మక కనిష్టాలను తాకుతున్న అంశానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో ఒకరైన గోయల్ సమాధానం చెబుతూ, ‘క్షీణించిన రూపాయి దిగుమతుల బిల్లును మరింత పెంచుతుంది. విదేశాలలో రుణాలు తీసుకున్న వారిని సమస్యల్లోకి నెడుతుంది. అయితే కొంతమంది ఎగుమతిదారులకు రాబడిని పెంచుతుంది’ అని అన్నారు. ఫెడ్ రేట్లు పెరగడం వల్ల అమెరికా తిరిగి వెళుతున్న డాలర్ల వల్ల ఈ రిజర్వ్ కరెన్సీ విలువ పెరుగతోందని అన్నారు. అన్ని కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోందని వివరించారు. ఇతర అభివృద్ధి చెందిన, వర్థమాన మార్కెట్లతో పోల్చితే రూపాయి విలువ పతనం తక్కువగా ఉందని అన్నారు. ఇటీవల ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ కూడా తిరిగి పెరుగుతున్నట్లు తెలిపారు. భారత్ ఈక్విటీల ధరల పతనం తక్కువగా పలు దేశాలతో పోల్చితే తక్కువగా ఉందని స్పష్టం చేశారు. భారత్ మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తుందని పేర్కొన్నారు. వాల్యుయేషన్ ప్రభావాల వల్లే భారత్ విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) ఎక్కువగా పడిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ఫారెక్స్ ఏడాది కాలంలో దాదాపు 100 డాలర్ల తగ్గి 544 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో 77 శాతం వ్యాల్యుయేషన్ల ప్రభావం వల్లే తగ్గాయని ఆర్బీఐ సెప్టెంబర్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా వివరించిన సంగతి తెలిసిందే. తక్కువ దిగుమతులు– అధిక ఎగుమతులు కరెంట్ ఖాతా (భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసం) లోటును తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్న ఆమె, ఎగుమతుల పెంపు ఆవశ్యకతను ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మందగమనం ప్రతికూలమే, కానీ... ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయంపై అడిగిన ప్రశ్నకు గోయల్ సమాధానం చెబుతూ, ప్రపంచ మందగమనం భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ‘కానీ భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉంది. దాని పరిమాణం, వైవిధ్యం, వైశాల్యం, ఆర్థిక రంగం బలం మంచి సానుకూల వృద్ధినే అందిస్తుంది’’ అని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో కార్పొరేట్లు రుణాన్ని తగ్గించుకున్నారని, ఆర్థిక రంగం బాగా మూలధనం పొందిందని గోయల్ తెలిపారు. ఇవన్నీ భారతదేశానికి అంతర్జాతీయంగా ఎదురయ్యే ‘మందగమన’ సవాళ్లను తగ్గిస్తాయని వివరించారు. డిసెంబర్లో మరో అరశాతం పెంపు అవకాశం అషిమా గోయల్ ప్రకటన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకూ జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటును కనీసం అరశాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్‌కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. -
సవాళ్లు ఉన్నా... ప్రపంచంలో మనమే ఫస్ట్
ముంబై: భౌగోళిక రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మొదట ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష సందర్భంగా దాస్ ఈ విశ్లేషణ చేశారు. అప్పటి మూడురోజుల సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడానికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కమిటీలో సభ్యురాలు అషీమా గోయల్ మాత్రం 35 బేసిస్ పాయింట్ల మేర మాత్ర మే పెంపునకు తన అంగీకారం తెలిపారు. ఎకానమీ క్రమంగా పురోగతి చెందుతోందని, ఈ విషయంలో తగిన సానుకూల సంకేతాలు అందుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మే తర్వాత 1.9 శాతం అప్ సెప్టెంబర్ తాజా సమీక్ష పెంపు నిర్ణయంతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి సారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీ, ఆగస్టు 5వ తేదీన 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నిర్ణయంతో రెపో మే తర్వాత 1.9 శాతం పెరిగినట్లయ్యింది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పెంపు దిశగా తప్పని అడుగులు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం గాడిన పడుతూ, అప్పట్లో వ్యవస్థలోకి విడుదలైన అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి చర్యలు ప్రారంభించే తరుణంలోనే పలు దేశాల వాణిజ్య యుద్ధం ప్రతికూలతను తీసుకువచ్చింది. ఈ సమస్య పరిష్కారంలోపే ప్రపంచంపై కోవిడ్–19 విరుచుకుపడింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాసహా పలు దేశాలు మరింత సరళతర వడ్డీరేట్లకు మళ్లాయి. వ్యవస్థలో ఈజీ మనీ ప్రపంచ దేశాల ముందుకు తీవ్ర ద్రవ్యోల్బణం సవాలును తెచ్చింది. దీనికితోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీనితో ధరల కట్టడే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్‌సహా ప్రపంచ దేశాలు కీలక రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లో ఒకవైపు ద్రవ్యోల్బణం సవాళ్లు, మరోవైపు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో ఈక్విటీల్లోంచి వెనక్కు వెళుతున్న విదేశీ నిధులు వంటి ప్రతికూలతలు ఎదురవడం ప్రారంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2–6 శాతం మధ్య కట్టడి చేయాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తుండగా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలలు (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం, ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం, మేలో 7.04 శాతం, జూన్‌లో 7.01 శాతం, జూలైలో 6.71 శాతం, ఆగస్టులో 7 శాతం) ఈ రేటు అప్పర్ బ్యాండ్ దాటిపోవడం ప్రారంభమైంది. దీనితో భారత్ కూడా కఠిన ఆర్థిక విధానంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటు 6.5 శాతం వరకూ వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కీలక నిర్ణయాల్లో కొన్ని... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంకాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. -
RBI Monetary Policy: రుణాలు మరింత భారం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) మరో 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4%గా ఉన్న రెపో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. మరింత పెరగవచ్చని సైతం తాజాగా ఆర్బీఐ సంకేతాలిచ్చింది. తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. జీడీపీ అంచనాలు కట్... వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నదే రెపోరేటు ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశ్యం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. కాగా, పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7 శాతంగా ఉంటుందన్న తన అంచనాలను యథాథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలో మాత్రం అంచనాను కిత్రం 7.2 శాతం నుంచి 7 శాతానికి ఆర్బీఐ కుదించింది. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7% కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతం కాగా, క్యూ2, క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1%, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. ► డాలర్ మారకంలో రూపాయి విలువపై జాగ్రత్తగా పరిశీలన. సెప్టెంబర్ 28 వరకూ ఈ ఏడాది 7.4 శాతం పతనం. రూపాయిని నిర్దిష్ట మారకం ధర వద్ద ఉంచాలని ఆర్బీఐ భావించడం లేదు. తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి ఆర్బీఐ చర్యలు ఉంటాయి. వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బాగుంది. ► ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్ 23 నాటికి 537.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. డాలర్ బలోపేతం అమెరికన్ బాండ్ ఈల్డ్ పెరగడం వంటి మార్పులే కావడం గమనార్హం. ► రూపాయిలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి నాలుగైదు దేశాలు, అనేక బ్యాంకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ► 2022–23లో బ్యాంకింగ్ రుణ వృద్ధి 16.2 శాతంగా ఉంటుందని అంచనా. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 వరకు జరుగుతుంది. నేటి నుంచి టోకెనైజేషన్ దాదాపు 35 కోట్ల కార్డుల వివరాలు, లావాదేవీల గోప్యత లక్ష్యానికి సంబంధించిన టోకెనైజేషన్ వ్యవస్థ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, ఆగస్టు నాటికి వ్యవస్థలో 101 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సెప్టెంబర్‌లో దాదాపు 40% లావాదేవీల టోకెనైజేషన్ జరిగింది. వీటి విలువ దాదాపు రూ.63 కోట్లు. టోకెనైజేషన్ వ్యవస్థలో చేరడాన్ని తప్పనిసరి చేయకపోవడం వల్ల ఈ వ్యవస్థ వేగంగా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. -
ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు, సామాన్యులపై మరింత భారం
కీలక వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయ తీసుకుంది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను 0.50 శాతానికి పెంచుతున్నట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ వడ్డీ రేట్లను ఆర్బీఐ మే నెల నుంచి పెంచుతూ వచ్చింది. తాజాగా మరో సారి పెంచడంతో బ్యాంకులు రుణగ్రస్తులకు అందించే రుణాల వడ్డీ రేట్లను పెంచనున్నాయి. తద్వారా హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఇలా బ్యాంకు నుంచి తీసుకున్న లోన్లపై నెలవారీ చెల్లించే ఈఎంఐ మరింత పెరగనుంది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేట్లను రెపోరేట్లు అని అంటారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రెపోరేట్లను పెంచుతూ వస్తుంది. ఇలా మే నెలలో 0.40శాతం, జూన్, ఆగస్టులో 0.5శాతం, శుక్రవారం మరో 0.5శాతం పెంచాయి. కాగా, ఆర్బీఐ రెపో రేట్లను పెంచిన ప్రతిసారి.. బ్యాంకులు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లను పెంచే విషయం తెలిసిందే. చదవండి👉 చిన్న పొదుపు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త -
వరుసగా నాలుగో విడత పెంపు
ముంబై: రిజర్వ్ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ భేటీ ఈ నెల 28న మొదలు కానుంది. 30వ తేదీన తన నిర్ణయాలను ఎంపీసీ ప్రకటిస్తుంది. వరుసగా నాలుగో విడత ఆర్బీఐ రేట్ల పెంపును చేపడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కనీసం 0.40–0.50 శాతం వరకు ఈ పెంపు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది మే నుంచి ఆర్బీఐ మూడు విడతలుగా మొత్తం 1.4 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.4 శాతానికి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రెపో రేటు 6 శాతంగా ఉండొచ్చన్న అంచనాలు లోగడే వ్యక్తమయ్యాయి. ఒకవేళ 0.50 శాతం రేటు పెంపును ఆర్బీఐ చేపడితే అప్పుడు రెపో రేటు 5.9 శాతానికి చేరనుంది. వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రిత పరి మితి అయిన 6 శాతానికి పైనే గత కొన్ని నెలలుగా చలిస్తున్న విషయాన్ని నిపుణులు తమ అంచనాలకు ఆధారంగా తీసుకుంటున్నారు. -
పెంపు ఇక నిదానమే!
ముంబై: రెపో రేటు పెంపు విషయంలో ఆర్బీఐ ఇకమీదట దూకుడుగా వ్యవహరించకపోవచ్చని డాయిష్ బ్యాంకు అంచనా వేసింది. రేటును పావు శాతం మేర పెంచొచ్చని పేర్కొంది. మే నుంచి ఇప్పటి వరకు మూడు విడతలుగా 1.40 శాతం మేర రెపో రేటును ఆర్బీఐ పెంచడం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం గరిష్ట పరిమితి దాటిపోవడంతో కట్టడి చేయడాన్ని ప్రాధాన్యంగా భావించి వరుసగా రేట్లను పెంచుతూ వస్తోంది. ఇక నుంచి రేట్ల పెంపు నిదానంగా ఉండొచ్చని డూచే బ్యాంకు తెలిపింది. ఆర్బీఐ ఆగస్ట్ సమీక్ష మినిట్స్ విడుదల కాగా, దీని ఆధారంగా ఈ అంచనాలకు వచ్చింది. క్రమబద్ధంగా, చురుగ్గా చర్యలు ఉండాలన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటన కీలకమైనదిగా పేర్కొంది. ఆర్బీఐ ఈడీ రాజీవ్ రంజన్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని డాయిష్ గుర్తు చేసింది. మానిటరీ పాలసీ స్థిరత్వం కోసం మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయని ఆర్బీఐ మినిట్స్ ఆధారంగా తెలుస్తున్నట్టు దేశీ బ్రోకరేజీ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ సైతం తెలిపింది. రెపో రేటు 5.75–6 శాతానికి చేరొచ్చన్న తన అంచనాలను కొనసాగించింది. రెపో రేటు 5.75 శాతం వద్ద స్థిరపడొచ్చని ఎంకే గ్లోబల్ అంచనాగా ఉంది. ప్రస్తుతం రెపో రేటు 5.4 శాతం వద్ద ఉంది. -
ఆర్బీఐ షాక్: ఇక ఈఎంఐలు భారమే!
సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో 50 బీపీఎస్ పాయింట్లు మేర రెపోరేటును నిర్ణయాన్ని ఏకగగ్రీవంగా తీసుకున్నారు. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు పెంచకుండా ఉండవు. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ముఖ్యంగా రెపో రేట్‌కు అనుసంధానమైన హోమ్ లోన్లు తీసుకున్న వారికి తాజా సవరణతో సమస్య తప్పదు. దాదాపు 40 శాతం రుణాల రేట్లు ఇలానే ఉంటాయి. అలాగే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూలంగా ఉండనుంది. (చదవండి: Adani Road Transport: అదానీ హవా, 3 వేల కోట్ల భారీ డీల్ హోం లోన్ తీసుకున్నవారికి మరో భారీ షాక్ తప్పదా? ఏం చేయాలి? -
ఆర్బీఐ పాలసీ రివ్యూ: 5.4 శాతానికి రెపో రేటు
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ నిపుణులు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును 50 బీపీఎస్ పాయింట్లు మేర పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీసీ కమిటీ ఏకగగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. తాజా పెంపుతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) 5.15 శాతానికి సర్దుబాటు చేసింది. జీడీపీ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సహజంగానే ప్రభావితమవుతోందని తెలిపారు. ఆర్థికవ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు. త్వరలోనే వంటనూనెలు దిగి రానున్నాయని ఆయన చెప్పారు. కాగా గత మూడు నెలల్లో రెపో రేటును పెంచడం ఇది వరుసగా మూడోసారి. గవర్నర్ శక్తికాంత దాస్ నేృత్వత్వంలో మూడు రోజుల సమావేశాల అనంతరం కమిటీ పాలసీ విధానాన్ని ప్రకటించింది. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ రేటు పెంపునకే మొగ్గు చూపింది. -
Repo rate rise: రేట్లకు రెక్కలు.. ఏం చేద్దాం?
ఈ ఏడాది ఏప్రిల్ వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు 6.5 శాతం. ఇళ్ల కొనుగోలుదారులను ఈ రేటు ఎంతో ఆకర్షించింది. కనిష్ట రేటును చూసి ఇళ్లను కొనుగోలు చేసిన వారు ఎందరో..? పాశ్చాత్య దేశాల మాదిరే మన ఆర్థిక వ్యవస్థ కూడా తక్కువ రేట్ల దిశగా అడుగులు వేస్తుందన్న విశ్లేషణలు అంతకుముందు వరకు వినిపించాయి. కానీ, కేవలం కొన్ని నెలల్లోనే పరిస్థితులు మారిపోయాయి. రుణ రేట్లు సుమారు ఒక శాతం మేర పెరిగాయి. ఆర్బీఐ రెపో రేటును 0.90 శాతం మేర పెంచింది. ఇది కచ్చితంగా రుణ గ్రహీతలపై భారం మోపేదే. రేట్ల పెంపు కథ ఇంతటితో ముగియలేదు. ఇప్పుడే మొదలైంది. మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ తరుణంలో రేట్ల పెంపు ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది..? గృహ రుణాలు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి..? తీసుకోబోయే వారి ముందున్న మార్గాలు ఏంటన్న విషయాలను చర్చించే కథనమే ఇది. 80 శాతం రిటైల్ రుణాలు ఫ్లోటింగ్ రేటు ఆధారితంగానే ఉంటున్నాయి. కనుక ఆర్బీఐ రేట్ల సవరణ ప్రభావం దాదాపు అన్ని రకాల రిటైల్ రుణాలపైనా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా ఈబీఎల్ఆర్ను గృహ రుణాలను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టిందేనని గుర్తు పెట్టుకోవాలి. రిటైల్ రుణాల్లో సగానికి పైన గృహ రుణాలే ఉన్నాయి. కనుక బ్యాంకులు వేగంగా గృహ రుణ రేట్లను సవరించాయి. కారు, ద్విచక్ర వాహన రుణాలపైనా అదనపు భారం పడింది. అయితే ఈ విభాగంలోని మొత్తం రుణాల్లో ఈబీఎల్ఆర్కు అనుసంధానమై ఉన్నవి 40 శాతం కంటే తక్కువ. ఈ తరహా రుణాలకు ఈబీఎల్ఆర్ కంటే ముందు విధానమైన ఎంసీఎల్ఆర్నే బ్యాంకులు అనుసరిస్తున్నాయి. బ్యాంకులు రెపో మాదిరే గృహ రుణాలపై 0.90 శాతం పెంపును అమలు చేయగా.. ఇతర రుణ ఉత్పత్తులపై పెంపు వాటి విచక్షణకు అనుగుణంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకు కారు రుణంపై రేటును 7.45 శాతం నుంచి 8.5 శాతానికి పెంచగా.. ఎస్బీఐ 7.2 శాతం నుంచి 7.7 శాతానికి సవరించింది. ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్ వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ఉన్నాం. కనుక గృహ రుణం తీసుకునే వారు డౌన్ పేమెంట్ (తన వంతు వాటా) ఎక్కువ సమకూర్చుకోవడం ఒక మార్గం. ఎక్కువ సమకూర్చుకునేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు ‘హోమ్‌లోన్ ఇంటరెస్ట్ సేవర్ అకౌంట్’ లేదా ‘స్మార్ట్లోన్’ను పరిశీలించొచ్చు. ఒక్కో బ్యాంకు ఒక్కో పేరుతో ఈ తరహా రుణాలను మార్కెట్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ‘మనీ సేవర్ హోమ్ లోన్’, ఎస్బీఐ ‘మ్యాక్స్ గెయిన్ హోమ్‌లోన్’, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ‘హోమ్ సేవర్’ అనేవి ఈ తరహా రుణ ఉత్పత్తులే. రెండు ప్రయోజనాలు.. ఈ రుణం కరెంటు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. మీ దగ్గర ఉన్న మిగులు బ్యాలన్స్ ఎంతైనా కానీయండి ఈ కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకుంటే చాలు. ఆ మేరకు రుణంపై వడ్డీ భారం తగ్గిపోయినట్టే. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల గృహ రుణాన్ని ఇంకా చెల్లించాల్సి ఉందనుకుంటే.. రూ.5 లక్షలు మిగులు మీ వద్ద ఉంటే దాన్ని కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకోవాలి. అప్పుడు గృహ రుణం రూ.45 లక్షలపైనే వడ్డీ పడుతుంది. మరొక ప్రయోజనం ఏమిటంటే.. మిగులు రూ.5లక్షలను కరెంటు ఖాతా నుంచి ఎప్పుడైనా వెనక్కి తీసేసుకోవచ్చు. కనుక మిగులు నిల్వలను ఈ ఖాతాలో ఉంచుకోవడం ద్వారా గృహ రుణంపై వడ్డీ భారాన్ని కొంత దింపుకోవడం ఇందులో ఉన్న అనుకూలత. మంచి మార్గం అందరూ కాకపోయినా.. కొందరు అయినా అత్యవసర నిధి అంటూ కొంత మొత్తాన్ని నిర్వహిస్తుంటారు. కొందరు బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఉంచేస్తుంటారు. లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టేవారు కూడా ఉన్నారు. ఇలా ఉంచేయడానికి బదులు ఆ మొత్తాన్ని తీసుకెళ్లి హోమ్‌లోన్ ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్లో ఉంచుకోవడం మంచి మార్గమని ఆర్థిక సలహాదారుల సూచన. మిగులు నిల్వలు ఏవైనా కానీ ఈ ఖాతాలో ఉంచుకోవడం వల్ల వడ్డీ భారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చని లాడర్7వెల్త్ ప్లానర్స్ ప్రిన్సిపల్ ఆఫీసర్ సురేష్ సెడగోపన్ సూచించారు. వడ్డీ రేటు వేరు సాధారణ గృహ రుణాలతో పోలిస్తే,, ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌తో కూడిన రుణాలపై వడ్డీ రేటు 0.5–0.6 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మిగులు నిల్వలు లేని వారికి ఇదేమంత ప్రయోజనం కాదు. వేతన జీవులు, వ్యాపారులు సాధారణంగా తమ అవసరాల కోసం మిగులు నిల్వలు ఎంతో కొంత నిర్వహిస్తుంటారు. అటువంటి వారికి ఈ తరహా రుణం అనుకూలం. వడ్డీ ఆదా/ముందస్తు చెల్లింపు ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌కు బదులు రెగ్యులర్ హోమ్ లోన్ తీసుకుని.. మధ్య మధ్యలో తమకు బోనస్, ఇతర రూపాల్లో అందిన నిధులతో ముందస్తు గృహ రుణం చెల్లింపు మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా కూడా అదనపు రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు. కానీ, మిగులు నిల్వలు ఎప్పుడూ ఎంతో కొంత ఉండే వారికి.. వాటిని రాబడి మార్గంగా మలుచుకోవడం తెలియని వారికి ఇంట్రెస్ట్ సేవర్ హోమ్ లోన్ అకౌంట్ మెరుగైన మార్గం అవుతుంది. అయితే, కొన్ని బ్యాంకులే ఈ ఉత్పత్తిని ఆఫర్ చేస్తున్నాయి. ఆయా అంశాలపై ఈ విభాగంలోని నిపుణులు, బ్యాంకర్ల సలహాలను తీసుకోవాలి. ఈఎంఐ పెరుగుదల..? రూ.75 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలవ్యవధిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.5 శాతం రేటు మీద తీసుకుని ఉన్నారనుకుంటే.. నెలవారీ ఈఎంఐ రూ.55,918 అవుతుంది. గృహ రుణ రేటు 7.3 శాతానికి పెరిగిందని అనుకుంటే ఈఎంఐ రూ.59,506 అవుతుంది. సుమారు రూ.4,500 పెరిగింది. అది కూడా క్రెడిట్ స్కోరు 791కి పైన ఉన్నవారికే ఇది. 681 నుంచి 790 మధ్య క్రెడిట్ స్కోరు ఉన్న వారికి వడ్డీ రేటు 7.65 శాతం నుంచి 7.9 శాతం వరకు చేరింది. ఈ రేటు ప్రకారం చూస్తే రూ.75 లక్షల గృహ రుణం ఈఎంఐ రూ.55,918 నుంచి రూ.61,109–62,267కు పెరిగినట్టు అవుతుంది. ఏడాదికి చూసుకుంటే వడ్డీ పెంపు వల్ల పడుతున్న అదనపు భారం రూ.46,000–73,000 మధ్య ఉంది. ప్రత్యామ్నాయాలు.. ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారు ఈఎంఐ పెరగడకుండా ఉండేందుకు రుణ కాలవ్యవధిని పెంచుకోవచ్చు. నిజానికి చాలా బ్యాంకులు ఈఎంఐ పెంపునకు బదులు వాటంతట అవే రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. రుణ కాలవ్యవధి ఎంత మేర పెరుగుతుందన్న దానికి ఒక సూత్రం ఉంది. 20 ఏళ్ల కాలానికి గృహ రుణాన్ని తీసుకుని ఉంటే.. తీసుకునే నాటి రేటుపై ప్రతి పావు శాతం పెంపునకు 10 నెలల మేర కాలవ్యవధి పెరుగుతుంది. 6.5 శాతం రేటుపై గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకుని ఉన్నారనుకుంటే.. 0.90 శాతం రేటు అధికం కావడం వల్ల రుణ కాలవ్యవధి సుమారు మూడేళ్లపాటు పెరుగుతుంది. మరో 0.75శాతం మేర ఈ ఆర్థిక సంవత్సరంలో రేటు పెరుగుతుందని అనుకుంటే.. ఈఎంఐ ఇప్పటి మాదిరే ఉండాలనుకుంటే రుణ కాలవ్యవధి 5.5 ఏళ్లు పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈఎంఐ భారం కాకూడదు, రుణ కాలవ్యవధి పెరగొద్దు అనుకుంటే రుణ గ్రహీతల ముందున్న మరో మార్గం ఒకే విడత కొంత మొత్తం గృహ రుణాన్ని చెల్లించడమే. ఒకవేళ గృహ రుణం ముగియడానికి ఇంకా చాలా వ్యవధి ఉంటే, అప్పుడు పలు విడతలుగా కొంత మొత్తం చొప్పున ఈఎంఐకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం కాల వ్యవధి చివర్లో ఉంటే.. పెరిగిన మేర ఈఎంఐను కడుతూ వెళ్లాలి. లేదంటే పొదుపు, పెట్టుబడులు ఉంటే వాటితో గృహ రుణాన్ని కొంత చెల్లించేయాలి. కానీ, ఇక్కడ చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడం వల్ల పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి రావచ్చు. కనుక పన్ను పరిధిలో ఉన్న వారు లెక్కలు వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మిగులు నిల్వలు ఉంటే వాటిని గృహ రుణంగా తీర్చివేయడం కంటే పెట్టుబడి ద్వారా ఎక్కువ రాబడి వచ్చే మార్గం ఉంటే దాన్ని కూడా కోల్పోవాల్సి రావచ్చు. కనుక ఈ కోణాల నుంచి పరిశీలించాకే ఈ నిర్ణయానికి రావాలి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు రుణాన్ని పరిశీలించొచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఫిక్స్డ్ రేటుపై గృహ రుణాలను 9.6 శాతం రేటుకు ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అయితే ఇది 11.5 శాతం మేర ఉంది. కాకపోతే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి ఫ్లోటింగ్ రేటుపై రుణమే నయం. 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు 8.15 శాతం! గతంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించినా, పెంచినా ఆ ప్రభావం రుణాలపై ప్రతిఫలించడానికి కొన్ని నెలలు పట్టేది. దీన్ని గమనించిన ఆర్బీఐ.. రేట్ల సవరణ సత్వరం అమలయ్యేందుకు వీలుగా.. 2019లో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును (ఈబీఎల్ఆర్) ప్రవేశపెట్టింది. దీంతో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే బ్యాంకులు కూడా సవరణ చేయక తప్పని పరిస్థితి. రెపో రేటు, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఇవన్నీ ఈబీఎల్ఆర్కు ప్రామాణికం. ఆర్బీఐ నూతన విధానం నేపథ్యంలో చాలా వరకు గృహ రుణాలకు రెపో రేటు ప్రామాణికంగా మారిపోయింది. ఈ విధానం కారణంగానే 2020లో రెపో రేటు 4% కనిష్టానికి తగ్గిపోవడం వల్ల రుణ గ్రహీతలు ప్రయోజనం పొందారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపు తప్పిన క్రమంలో మళ్లీ రేట్ల పెంపు ప్రభావం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే మరో 0.75 శాతం మేర ఆర్బీఐ రేట్లను పెంచుతుందని విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తక్కువలో తక్కువ గృహ రుణ రేటు 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా రేట్లను పెంచితే 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు ఎంత లేదన్నా 8.15 శాతానికి చేరుతుంది. 2019లోనూ 8 శాతం స్థాయిలోనే గృహ రుణ రేట్లు ఉన్నాయి. -
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు.. రియల్ ఎస్టేట్‌పై తగ్గిన ఆసక్తి!
న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి కొంత తగ్గింది. నైట్ ఫ్రాంక్ ఇండియా, నారెడ్కో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ సూచీ క్యూ2లో 62 పాయింట్లకు పరిమితమైంది. జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ1) ఇది 68గా నమోదైంది. డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలపై సర్వే ప్రాతిపదికన ఈ సూచీలో స్కోరు ఉంటుంది. 50కి ఎగువన ఉంటే సెంటిమెంటు ఆశావహంగా ఉన్నట్లు, సరిగ్గా 50 ఉంటే యథాతథంగా లేదా తటస్థంగా ఉన్నట్లు, 50కి దిగువన ఉంటే నిరాశ ధోరణిలో ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ ఏడాది మే, జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండు సార్లు కీలక పాలసీ రేట్లను పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలతోనే క్యూ2లో సెంటిమెంట్ సూచీ స్కోరు తగ్గిందని వివరించాయి. వచ్చే ఆరు నెలల కాలాన్ని ప్రతిబింబించే భవిష్యత్ ధోరణి సెంటిమెంట్ సూచీ కూడా క్యూ1లోని చారిత్రక గరిష్ట స్థాయి 75 నుండి క్యూ2లో 62 పాయింట్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణం. అయినప్పటికీ ప్రస్తుత, భవిష్యత్ సూచీలు రెండూ 50కి ఎగువనే ఉన్న నేపథ్యంలో సెంటిమెంటు వచ్చే ఆరు నెలలు ఆశావహంగానే ఉండగలవని నైట్ ఫ్రాంక్–నారెడ్కో నివేదికలో పేర్కొన్నాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ♦రియల్ ఎస్టేట్ రంగంలో సరఫరాకు కీలకంగా ఉండే డెవలపర్లు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలు .. అమెరికాలో ఆర్థిక సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, యూరప్‌లో ఆర్థిక మందగమనం వంటి అంశాలపై మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. ♦రెసిడెన్షియల్ విభాగంలో పటిష్టమైన డిమాండ్ ఉన్నట్లు గత 8–10 త్రైమాసికాలుగా రుజువైంది. సరైన ధర, ప్రోత్సాహకాలు ఉంటే ఇది అమ్మకాల రూపంలోకి మారగలదు. ♦కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కమర్షియల్ ఆఫీస్ విభాగం వృద్ధి బాట పట్టింది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, నియామకాల జోరు, ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండటం తదితర అంశాలతో గత 3–4 త్రైమాసికాలుగా ఈ విభాగం పుంజుకుంటోంది. -
SBI: ఇళ్లు కట్టాలంటే ఇబ్బందే.. హోంలోన్స్‌పై వడ్డీరేట్ల పెంపు
ముంబై: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై కనీస వడ్డీ రేట్లను 7.55 శాతానికి పెంచింది. బుధవారం నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రెపో రేటు 4.40% నుంచి 4.90%కి పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. మేలో ఈ రేటు 4% నుంచి 4.4%కి చేరిన సంగతి తెలిసిందే. వెబ్సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్)ను కూడా ఎస్బీఐ జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంపుదల చేసింది. ప్రస్తుతం ఈ రేటు 6.65 శాతం ప్లస్ క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలిగి ఉంది. తాజాగా ఈ రేటు 7.15 శాతానికి చేరింది. బీఓబీ డిపాజిట్ రేట్ల పెంపు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు 40 బేసిస్ పాయింట్ల వరకూ బుధవారం ప్రకటించింది. చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే? -
మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04%
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే నెల్లో 7.04 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర 2021 మే నెలతో పోల్చితే 7.04 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం నెల ఏప్రిల్ (7.79 శాతం) కన్నా ద్రవ్యోల్బణం కొంచెం తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయితే ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణిపైన ద్రవ్యోల్బణం కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆరుశాతం పైన రేటు నమోదుకావడం ఇది వరుసగా ఐదవనెల. ఏప్రిల్ కన్నా మేలో ధరల స్పీడ్ తగ్గడానికి ఆహార, ఇంధన ధరల్లో కొంత తగ్గుదల నమోదుకావడం కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, సరఫరాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఇక్కడ గమనార్హం. మరోవైపు గత నెల ప్రారంభంలో ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారంలో ఈ రేటు మరో అరశాతం పెరిగింది. ఇదే ధోరణిని ఆగస్టు ద్వైమాసిక సమావేశాల్లోనూ సెంట్రల్ బ్యాంక్ కొనసాగిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► 2022 మేలో ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 7.97 శాతం. ఏప్రిల్‌లో ఈ రేటు 8.31 శాతంగా ఉంది. మొత్తం వినియోగ ధరల సూచీలో ఫుడ్ బాస్కెట్ వెయిటేజ్ 39.06 శాతం. ఏప్రిల్‌లో 5.96 శాతం ఉన్న తృణ ధాన్యాల ద్రవ్యోల్బణం మేలో 5.33 శాతానికి తగ్గింది. ఇక ఆయిల్, ఫ్యాట్ ధరల స్పీడ్ కూడా ఇదే కాలంలో 17.28 శాతం నుంచి 13.26 శాతానికి తగ్గింది. పండ్ల ధరలు 4.99 శాతం నుంచి 2.33 శాతానికి తగ్గాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 15.41 శాతం నుంచి 18.26 శాతానికి పెరిగాయి. కాగా, గుడ్ల ధరలు 4.65 శాతం క్షీణిస్తే, పప్పు దినుసుల ధరలు 0.42% తగ్గాయి. ► ఇక ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 10.80% ఉంటే మేలో 9.54%కి తగ్గింది. ఆర్బీఐ అంచనాలు ఇలా... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనాలతో ఇటీవలి పాలసీ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022లో తగిన వర్షపాతం, దీనితో తగిన ఖరీఫ్ పంట దిగుబడి అంచనాతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 6.7% ఉంటుందని (తొలి అంచనా 5.5%) ఆర్బీఐ అంచనావేసింది. మొదటి త్రైమాసికంలో 7.5%, రెండవ త్రైమాసికంలో 7.4%, మూడవ త్రైమాసికంలో 6.2% నమోద య్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8%గా నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. జనవరి (6.01%), ఫిబ్రవరి (6.07%), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95%) నెలల్లో హద్దులు మీరి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగించింది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. -
అన్ని రుణాలూ భారమే
న్యూఢిల్లీ: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు హెచ్డీఎఫ్సీ ఇప్పటికే రేట్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాల రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువగా రెపో ఆధారిత రేట్ల విధానాన్నే రుణాలు, డిపాజిట్లకు అనుసరిస్తున్నాయి. జూన్ 8నాటి సమీక్షలో ఆర్బీఐ అర శాతం మేర రెపో రేటును పెంచింది. దీనికి నెల ముందు 0.40 శాతం పెంచడంతో నెలన్నర వ్యవధిలోనే 0.90 శాతం రేటు పెంపు అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంతో కమోడిటీల ధరలు అదుపు తప్పాయి. అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధి దాటిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రేట్ల పెంపు బాట పట్టింది. ఒక్కో బ్యాంకు.. ► ఐసీఐసీఐ బ్యాంకు రెపో అనుసంధానిత ‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు’ (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతం నుంచి 8.60 శాతం చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 8 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ► పీఎన్బీ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.90% నుంచి 7.40% చేసింది. ► బ్యాంకు ఆఫ్ బరోడా సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.40 శాతానికి సవరించింది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటును 7.05 శాతానికి సవరిస్తూ ఆర్బీఐ జూన్ పాలసీకి ముందే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా కలిపి రుణాలపై వడ్డీ రేటును అమలు చేయనుంది. ► హెచ్డీఎఫ్సీ.. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై అర శాతం పెంచింది. ఇది జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల కాల గృహ రుణాలపై ప్రతీ రూ.లక్షకు రూ.31 పెరిగినట్టయింది. ► ఇండియన్ బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్ను 7.70 శాతానికి, బ్యాంకు ఆఫ్ ఇండియా 7.75 శాతానికి పెంచాయి. ► ఐఓబీ ఆర్ఎల్ఎల్ఆర్ను జూన్ 10 నుంచి 7.75%కి సవరించినట్టు తెలిపింది. ► బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.20 శాతం నుంచి 7.70 శాతానికి సవరించినట్టు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రుణాలపైనా 0.30% మేర రేటును పెంచింది. ► కెనరా బ్యాంకు ఏడాది ఎంసీఎల్ఆర్ను 7.35 శాతం నుంచి 7.40 శాతం చేస్తూ, జూన్ 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ► 2019 అక్టోబర్ 1 నుంచి రెపో, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును బ్యాంకులు అమలు చేస్తున్నాయి. అంతక్రితం ఎంసీఎల్ఆర్ విధానం ఉంది. -
ఆర్బీఐ తీరు మారాలి!
రెండేళ్లపాటు కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసమూ... దాన్ని ఎదుర్కొనడంలో మన వైఫల్యాలకూ తోడు అనుకోకుండా వచ్చిపడిన రష్యా–ఉక్రెయిన్ లడాయి దేశంలో ద్రవ్యోల్బణం హద్దులు మీరడానికి దారితీస్తోంది. దాని కట్టడికి ఇంతవరకూ తీసుకున్న చర్యలు ఆశించిన ఫలితా లివ్వడం లేదని రిజర్వ్‌బ్యాంకు తాజా నిర్ణయం చెబుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని రెండో త్రైమాసి కానికల్లా 6 శాతంకన్నా తక్కువ స్థాయికి నిలువరించాలన్న తన లక్ష్యం విఫలమైందని గ్రహించిన రిజర్వ్‌బ్యాంకు పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వడ్డీరేటు(రెపో రేటు)ను అరశాతం పెంచింది. కేవలం అయిదు వారాల వ్యవధిలో రెండోసారి రెపో రేటు పెంచి దాన్ని 4.9 శాతంకి చేర్చడం వర్తమాన ఆర్థిక స్థితిగతులకు అద్దం పడుతోంది. ఆర్బీఐ సమీక్షలో ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంచనాలు చూస్తుంటే దాని కట్టడి ఇప్పట్లో సాధ్యమేనా అన్న సందేహాలు తలెత్తకమానవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం మొత్తంగా 5.7 శాతం ఉండగలదని గతంలో అంచనా వేసిన ఆర్బీఐ అదిప్పుడు 6.7 శాతానికి ఎగబాకగలదని అంటు న్నది. అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా పెద్దగా ఫలితాన్నివ్వకపోవచ్చని అది పరోక్షంగా ఒప్పుకుంటున్నది. 2040 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 20 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు ఊరిస్తున్న తరుణంలో ద్రవ్యోల్బణం పగ్గాలు తెంచుకుని పరుగులు పెట్టడం ఎవరికైనా ఆందోళన కలిగించేదే. రెపో రేటు పెరగడం పర్యవసానంగా గృహ, వాహన రుణాలతోపాటు ఇతర రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. నెలవారీ చెల్లించే ఈఎంఐలు భారమవుతాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా ప్రపంచ సరఫరా అస్తవ్యస్థమైన సంగతిని కాదనలేం. బొగ్గు మొదలుకొని ఎరువుల వరకూ అన్నింటికీ కొరత ఏర్పడింది. కనీసం ఈ ఏడాది చివరికైనా సరఫరా వ్యవస్థ సర్దుకుంటుందన్న ఆశ లేదు. కనుక రాగల కాలంలో ఆహారం, ఇంధనం, కమోడిటీల ధరలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవు. ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు సహ కరించి సాధారణ వర్షపాతం ఉండొచ్చన్న అంచనాలు మాత్రమే కొంత ఆశాజనకంగా ఉన్నాయి. దాంతోపాటు పామాయిల్ ఎగుమతులపై ఇండోనేసియా ఆంక్షలు ఎత్తివేయడం కొంతవరకూ శుభసూచికం. అయితే ఇలాంటి పరిణామాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఏమేరకు ప్రభావం చూపుతాయన్నది వేచిచూడాల్సి ఉంది. 2016లో అప్పటి రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘరాం రాజన్ తప్పుకున్నాక విధాన నిర్ణాయక ప్రక్రియ మారింది. అప్పట్లో ఆయన దేశీయ వృద్ధిని దెబ్బతీసేలా, సంపన్న దేశాలు లాభపడేలా వడ్డీ రేట్లు పెంచుతూ పోయారన్న నింద ఎదుర్కొన్నారు. ఆ తర్వాతే ఏక వ్యక్తి నిర్ణయానికి బదులు బహుళ వ్యక్తుల ఆలోచనలకు చోటిస్తూ ఎంపీసీ ఆవిర్భవించింది. ద్రవ్యోల్బణం కట్టడే రిజర్వ్ బ్యాంకు ప్రధాన లక్ష్యంగా మారింది. కానీ 2008లో ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం సమయంలో బ్యాంకు వ్యవహరించిన తీరుకూ, దాని ప్రస్తుత పనితీరుకూ ఏమాత్రం తేడా లేకుండా పోయింది. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు లేకుండా సాగడానికి కేంద్రమూ, రిజర్వ్ బ్యాంకు సమన్వయంతో వ్యవహరించడం అత్యుత్తమనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ అదే సమయంలో బ్యాంకు నిర్మొహమాటంగా ఉండటం, చొరవ ప్రదర్శించడం అత్యవసరం. అది సక్రమంగా లేకపోవడం వల్ల కావొచ్చు... ద్రవ్యోల్బణ గమనాన్ని అంచనా వేయడంలో, దాని కట్టడికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో రిజర్వ్‌బ్యాంకు విఫలమైంది. ఎంపీసీ సభ్యులకు చట్టపరంగా విశేష అధికారాలున్నాయి. ఏదైనా అంశంపై విభేదించేందుకు, తమ అసమ్మతి రికార్డు చేసేందుకు వారికి అవకాశం ఉంది. కానీ కమిటీ సభ్యుల్లో ఎవరూ దీన్ని వినియోగించుకున్న దాఖలా లేదు. ఏక వ్యక్తి నిర్ణయాలు సమస్యలు సృష్టిస్తాయనీ, సమష్టి ఆలోచనలు మెరుగైన విధానా నికి దోహదపడతాయనీ ఆశించింది కాస్తా ఆచరణలో ఇలా అఘోరించింది. కరోనా ఉగ్రరూపం దాల్చినప్పుడు విధించిన లాక్డౌన్లతో కోట్లాదిమంది ఉపాధి కోల్పో వడం, మరిన్ని కోట్లమందికి ఆదాయాలు పడిపోవడం వంటి కారణాలతో డిమాండు అడుగం టింది. సరైన డేటా అందుబాటులో లేకపోవడంతో ద్రవ్యోల్బణం గురించి, ఇతర అంశాల గురించి రిజర్వ్‌బ్యాంకు సరిగా అంచనా వేయలేకపోయిందనడంలో సందేహం లేదు. ప్రపంచ వృద్ధి రేటు ఈసారి 4 శాతం ఉండగలదని గతంలో అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి దాన్ని ఇప్పుడు 3.1 శాతానికి తగ్గించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు సైతం తమ గత అంచనాలను సవరించు కున్నాయి. ఇవన్నీ మన చేతుల్లో లేని పరిణామాలు. కానీ 2020 నుంచీ ఆర్థికరంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోవడంలో బ్యాంకు ఎందుకు విఫలమైందన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం నిరుడు ఏప్రిల్‌లో 10.7 శాతం ఉండగా, మొన్న ఏప్రిల్‌కు 15 శాతానికి చేరింది. సహజంగానే దీని ప్రభావం రిటైల్ ధరల సూచీపై పడుతుంది. ఆ సూచీ 4 శాతంగా ఉంటేనే నిత్యావసరాల ధరలు నియంత్రణలో ఉంటాయి. అందుకు భిన్నంగా అది 6 శాతానికి చేరుకుంది. తన నిర్వా్యపకత్వం వల్ల ఏమైందో తెలిసింది గనుక రిజర్వ్‌బ్యాంకు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. తన విధాన నిర్ణయ ప్రక్రియను మెరుగుపరుచుకుని, సంక్షోభ నివా రణకు అవసరమైన చర్యలు సకాలంలో తీసుకోగలిగితే ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. సామా న్యుల జీవితాలు ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతాయి. -
RBI Hikes Repo Rate: ఆర్బీఐ షాక్! మరోసారి రెపోరేటు పెంపు
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయాలు తీసుకుంది. మరోసారి రెపోరేట్లను పెంచింది. ప్రస్తుతం ఉన్న రేటుపై అదనంగా 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దీంతో రెపోరేటు 4.40 శాతం నుంచి 4.90 శాతానికి పెరిగింది. తాజా పెరుగుదలతో వడ్డీరేటు ఇంచుమించు ఒక శాతం (0.90) పెరిగినట్టయ్యింది. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది. దాదాపు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు రెపోరేటు పెరిగింది. ఏప్రిల్, మే నెలలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ప్రకటించింది. జీడీపీ వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేసింది. -
హోమ్‌లోన్.. భారంగా మారుతోంది!
నాలుగేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును ఆర్బీఐ 0.40 శాతం పెంచడం ఆలస్యం.. వరుసగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణ రేట్ల పెంపును అమల్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగాయి. మంచి క్రెడిట్ స్కోరుతో మూడు నెలల క్రితం బ్యాంకును సంప్రదించి ఉంటే 6.5 శాతానికే గృహరుణం లభించేది. కానీ, ఇప్పుడు వెళ్లి అడిగితే 6.9–7 శాతం కంటే చౌక ఆఫర్ వినిపించకపోవచ్చు. ప్రముఖ గృహ రుణ సంస్థ హెచ్డీఎఫ్సీ సైతం రుణ రేట్లను 7–7.45 శాతానికి పెంచింది. ఎస్బీఐ సహా ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా రేట్లను సవరించాయి. రుణాల రేట్లే కాదు డిపాజిట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో గృహ రుణం తీసుకోవాలని భావించే వారు ఇప్పుడు అప్రమ్తతం కావాలి. ఎందుకంటే గత ఏడాది కాలంలో మంజూరు చేసిన రుణాల్లో సగానికి సగం రెపో రేటు ఆధారితమే. కనుక రెపోతో పాటు రెపో రుణ రేట్లు కూడా వెనువెంటనే సవరణకు లోనవుతాయి. ఇది రుణ గ్రహీతలకు భారంగా మారుతుంది. కనుక గృహ రుణ గ్రహీతలు ఈ తరుణంలో ఏది చేస్తే బావుంటుంది..? నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయి..? వేచి చూస్తే లాభం లేదు.. వడ్డీ రేటు తక్కువకు లభిస్తుందేమో..? అని వేచి చూడడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటున్న వేళ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం అసాధ్యం. రానున్న ఏడాది కాలంలో పలు విడతలుగా ఆర్బీఐ కీలక రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రెండు, మూడో ఇల్లు కొనుగోలు చేస్తుంటే కనుక వేచి చూస్తానంటే అది వేరే విషయం. కానీ, మొదటి ఇల్లు సమకూర్చుకోవాలన్నది మీ ప్రాధాన్య జాబితాలో ఉంటే వెంటనే గృహ రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే రైట్. ఇక్కడ గృహ రుణ రేటే కాదు.. ప్రాపర్టీ రేటు కూడా చూడాలి. కరోనా సంక్షోభానంతరం రియల్టీ మార్కెట్లో ధరలు పడిపోయి అక్కడి నుంచి కోలుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. కనుక ప్రాపర్టీ ధరలతో ముడిపెట్టి గృహ రుణ రేటును చూడాలి. వేచి చూస్తే ప్రాపర్టీ ధరలు దిగొస్తాయా..? లేక రెక్కలు విప్పుకుంటాయా..? ఎవరు చెప్పగలరు. ఆలస్యం చేస్తే ముందు ముందు మరింత అధిక రేటుపై రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రతి 10 బేసిస్ పాయింట్లు (అంటే 0.1 శాతం) రుణ రేటు పెరిగితే రూ.లక్షపై ఒక ఏడాదికి పడే అదనపు భారం రూ.100. రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే అప్పుడు రూ.5000 భారం అవుతుంది. కనుక మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారు రుణదాతలతో సంప్రదింపులు చేయడం వల్ల కనిష్ట రేటుపై గృహ రుణం లభించే అవకాశం లేకపోలేదు. రుణ రేట్లను తగ్గించే అధికారం అందరికీ ఉండదు. బ్యాంకు హోంశాఖ లేదంటే ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్‌ను ఈ విషయమై సంప్రదించొచ్చు. ఫోన్ కాల్స్‌తో రుణ రేట్ల గురించి బేరమాడడం ఫలితాలనివ్వదు. మరోవైపు కమోడిటీల మంటలతో నిర్మాణ వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ భారాన్ని ఇళ్ల విక్రయధరలతో డెవలపర్లు సర్దుబాటు చేసుకోవాల్సిందే. అందుకే ఆలస్యం చేస్తే రెండు విధాలుగా భారం పడొచ్చు. రుణ కాలవ్యవధి గృహ రుణం తీసుకునే సమయంలో సాధారణంగా ఈఎంఐ(ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్) ఎంతన్నది చూసి చెల్లించగలిగే సామర్థ్యం ఆధారంగా కాలవ్యవధిని నిర్ణయించుకుంటూ ఉంటారు. తక్కువ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాలి. అప్పుడు వడ్డీ భారం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ కాల వ్యవధిని నిర్ణయించుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గినట్టు అనిపించొచ్చు. కానీ, దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. అయితే, ఎంత గృహ రుణం తీసుకోవాలి, ఈఎంఐ ఎంత నిర్ణయించుకోవాలన్నది అంత సులభంగా తేలే అంశం కాదు. కచ్చితంగా నిపుణుల సాయం తీసుకోవడం మంచిది. ఇక్కడ పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా చూడాలి. రిటైర్మెంట్కు ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది? చెల్లింపుల సామర్థ్యం, ఇతర జీవిత లక్ష్యాలు, వాటికి సంబంధించి చేయాల్సిన కేటాయింపులు అన్నీ చూసుకున్న తర్వాత గృహ రుణాన్ని అనుకూలమైన కాలవ్యవధికి తీసుకోవాలి. నిపుణుల అవసరం వద్దనుకుంటే మధ్యే మార్గంగా మీడియం టర్మ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 6.99 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే పదేళ్ల టర్మ్‌లో చెల్లించే వడ్డీ రూ.19 లక్షలుగా ఉంటుంది. రుణ కాలాన్ని 20 ఏళ్లకు పెంచుకుంటే చెల్లించే వడ్డీ మొత్తం రూ.43 లక్షలు. కనుక వెసులుబాటు ఉంటే అధిక ఈఎంఐను నిర్ణయించుకోవడమే సరైనది. ఒకవేళ టర్మ్ ఎక్కువ పెట్టుకున్నా.. వెసులుబాటు ఉన్నప్పుడల్లా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం మంచి ఐడియా. లోన్ టు వ్యాల్యూ ప్రాపర్టీ విలువలో బ్యాంకు మంజూరు చేసే రుణాన్ని లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ)గా చెబుతారు. సాధారణంగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 60–65 శాతం వరకు రుణంగా మంజూరు చేస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్సీలు అయితే ఇంకొంచెం రిస్క్ చేసి 75 శాతం వరకు రుణంగా ఇస్తాయి. మిగిలిన మేర రుణ గ్రహీత స్వయంగా సమకూర్చుకోవాలి. ఉదాహరణకు రూ.1.50 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. బ్యాంకులు రుణదాత వంతుగా రూ.60 లక్షలు సమకూర్చుకోవాలని కోరొచ్చు. బ్యాంకులు కొంచెం అధికంగా ఇచ్చినా.. రుణదాత తనవైపు నుంచి వీలైనంత అధిక భాగాన్ని సమకూర్చుకుని, మిగిలిన మేరే బ్యాంకు నుంచి తీసుకోవడం మంచిది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా రుణ రేట్లు పెరిగే కాలంలో రుణ గ్రహీతలు తమ భాగం ఎక్కువ ఉండేలా చూసుకోవడం ఒక మార్గం. లేదంటే అధిక పన్ను శ్లాబు (30 శాతం) పరిధిలోకి వచ్చి.. భారీగా ఆదాయపన్ను కడుతూ ఎక్కువ ఆదా చేసుకోవాలని అనుకునే వారు బ్యాంకులు ఇచ్చే గరిష్ట ఎల్టీవీవైపే మొగ్గు చూపించడం మంచిది. దీనివల్ల వడ్డీకి చేసే చెల్లింపులు, అసలుపై క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫిక్స్డ్ టెన్యూర్ దాదాపు చాలా బ్యాంకులు గృహ రుణాలను రెపో రేట్లతో అనుసంధానించాయి. రెపోను ఆర్బీఐ 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన తర్వాత పలు బ్యాంకులు రెపో ఆధారిత రుణ రేటును పెంచాయి. రెపో రేటు మార్పునకు లోనైతే త్రైమాసికం వారీగా గృహ రుణ రేటు కూడా సవరణకు లోను కావచ్చు. బ్యాంకులు రెపో రేటు సవరణను వెంటనే ఆచరణలో పెట్టే విధంగా ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కనుక ఇక మీదట వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో గృహ రుణ రేట్లు కూడా ఆ మేరకు సవరణకు లోనవుతాయి. ఇది రుణాలు తీసుకున్న వారి నగదు ప్రవాహాలపై ప్రభావం చూపిస్తుంది. ఫ్లోటింగ్ రుణంలో సహజం గానే ఈ రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ రేటు రుణాలను ఇప్పుడు బ్యాంకులు దాదాపుగా ఆఫర్ చేయడం లేదు. చేస్తే కనుక ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకోవడమే లాభదాయకం. ఫ్లోటింగ్ రేటుకు వెళ్లాలా? కొన్ని బ్యాంకులు 2–3 ఏళ్లపాటు ఫిక్స్డ్ రేటును, ఆ తర్వాత నుంచి ఫ్లోటింగ్ రేటును అమలు చేస్తున్నాయి. రుణ గ్రహీతపై ఒకేసారి భారం పెరగకుండా ఈ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఉదాహరణకు 15 ఏళ్ల గృహ రుణ కాలంలో మొదటి ఐదేళ్లు చేసే చెల్లింపుల్లో అధిక భాగం వడ్డీకే వెళుతుంది. కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఫ్లోటింగ్ రేటు రుణానికే వెళ్లాలా? అన్నది నిర్ణయించుకోవాలి. ఎన్బీఎఫ్సీలు టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ రేటు విధానంపై రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఒకవేళ కొనుగోలు చేసే ప్రాపర్టీ ధర రూ.2–3 కోట్లు అంతకుమించి ఉండి, లోన్ వ్యాల్యూ రూ.1.5 కోట్లకు పైన ఉంటే బ్యాంకులు సైతం టైమ్‌బౌండ్ ఫిక్స్డ్ రేటుపై ఆఫర్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు, గృహ రుణ సంస్థల రుణ రేట్లు 25–35 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటాయి. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల రూపంలో తక్కువకే నిధుల లభ్యత ఉంటుంది. కనుక అవి కొంచెం తక్కువ రేటుకు రుణాలను ఇస్తుంటాయి. ఇది అటు బ్యాంకులు, ఇటు రుణ గ్రహీతలకూ మంచిదే. . భారం దింపుకోవాలంటే..? కొత్తగా రుణాలు తీసుకునే వారే కాకుండా.. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా బ్యాంకులు కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. మరి ఈ తరుణంలో గృహ రుణంపై పడే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈఎంఐ పెరగకూడదని అనుకుంటే ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకోవాలి. ఈఎంఐ పెరిగినా ఫర్వాలేదు కట్టగలిగే స్వేచ్ఛ ఉందంటే అది కూడా నయమే. అదనంగా చెల్లించే వెసులుబాటు ఉందంటే.. అటువంటి వారు ఈఎంఐకి అదనంగా కొంత మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నిర్ణీత కాలవ్యవధికి ముందే గృహ రుణాన్ని ముగించేయవచ్చు. ఫలితంగా వడ్డీ రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. లేదంటే ప్రతి నెలా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం వల్ల.. భవిష్యత్తులో ఏవైనా కారణాల వల్ల ఆదాయం తగ్గినా.. కొంతకాలం పాటు ఉపాధి కోల్పోయినా పరిమిత కాలం పాటు తక్కువ ఈఎంఐ చెల్లించుకోవచ్చు. ఏటా సంస్థ ఇచ్చే బోనస్‌లు, ఇతరత్రా వచ్చే అదనపు ఆదాయాన్ని రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి. టాపప్ రెండో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారు లేదంటే అప్పటికే సమకూర్చుకున్న ప్రాపర్టీ విస్తరణ కోరుకునే వారు ప్రస్తుత గృహ రుణానికి టాపప్ లోన్ తీసుకోవచ్చు. అది కూడా తక్కువ రేటుకే. సాధారణంగా ఇంటి నవీకరణ కోసం పొదుపు చేసుకున్న మొత్తాలను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. లేదంటే వ్యక్తిగత రుణానికి వెళ్లేవారు కూడా ఉన్నారు. వాటికి బదులు గృహ రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్‌లోన్ తీసుకోవచ్చు. టాపప్‌పై గృహ రుణం మాదిరే తక్కువ వడ్డీ రేటు అమలవుతుంది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఎక్కువగా హోమ్‌లోన్ టాపప్లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వీటిపై అప్పటికే తీసుకున్న గృహ రుణంతో పోలిస్తే 10–15 బేసిస్ పాయింట్లు అధిక రేటును అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ప్రత్యేక రుణంగా పరిగణించి అధిక రేట్లను చార్జ్ చేస్తున్నాయి. అయినా, వ్యక్తిగత రుణ రేట్ల కంటే తక్కువే ఉన్నాయి. కనుక అవసరమైతేనే ఈ మార్గాన్ని పరిశీలించాలి. గృహ రుణం తీసుకున్న సమయంలోనే ఈ యాడాన్ లోన్ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే యాడాన్ రుణం తీసుకోకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో కావాల్సినప్పుడు వినియోగించుకునేందుకు రుణదాతలు అనుమతిస్తారు. ఒక్క ప్రాసెసింగ్ ఫీజు మినహా అదనంగా చెల్లించే పని ఉండదు. 10–15 బేసిస్ పాయింట్లు అధికంగా ఉన్నా సరే గృహ రుణం సమయంలోనే యాడాన్ను కూడా ఓకే చేసుకుని ఉంచుకోవాలి. -
గోధుమ ఎగుమతులపై నిషేధం సానుకూలం
ముంబై: గోధుమల ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం ద్రవ్యోల్బణం నియంత్రణకు కొంత సానుకూలమని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ప్రస్తుత అధిక వేడి వాతావరణం గోధుమల దిగుబడికి ఎన్నో సవాళ్లను విసురుతోంది. ప్రభుత్వం అనూహ్యంగా గోధుమల ఎగుమతులను నిషేధించడం దేశీయంగా ధరల ఒత్తిళ్లను కొంత వరకు తగ్గించగలదు’’అని బార్క్లేస్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలకు 8 శాతం సమీపానికి చేరడం తెలిసిందే. కొద్ది కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఇది కొనసాగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ రెపో రేటు పెంపు, గోధుమల ఎగుమతులపై నిషేధం సానుకూలిస్తాయన్న అభిప్రాయాలను బార్క్లేస్ వ్యక్తం చేసింది. గోధుమల ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణంపై 0.27 శాతం ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిషేధించడం, సెర్బియా, కజకిస్థాన్ ఆహార ధాన్యాల ఎగుమతులను నిషేధించిన తరహాలోనే భారత్ నిర్ణయం కూడా ఉందని బార్క్లేస్ గుర్తు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల ధరలు ఇప్పటికే 44 శాతం పెరగ్గగా.. దేశీయంగా మూడు శాతమే పెరగడం గమనార్హం. ఎగుమతులపై నిషేధం విధించకుండా 10 మిలియన్ టన్నుల సమీకరణ లక్ష్యాన్ని ధరలపై ఒత్తిడి లేకుండా ప్రభుత్వం సాధించడం కష్టమవుతుందని బార్క్లేస్ నివేదిక పేర్కొంది. -
రేట్ల పెంపు ఎకానమీలకు ప్రతికూలమే!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు పాలసీ రేట్లను కఠినతరం చేయడం వల్ల వచ్చే 6–8 నెలల్లో డిమాండ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, రికవరీ ప్రక్రియ మందగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐసహా (4 నుంచి 4.4 శాతానికి) అమెరికా సెంట్రల్ బ్యాంక్ (అరశాతం పెంపుతో ఒక శాతానికి), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (పావు శాతం పెంపుతో 13 ఏళ్ల గరిష్ట స్థాయి ఒక శాతానికి)సహా పలు కేంద్ర బ్యాంకులు ‘రష్యా–ఉక్రెయిన్ వివాదంతో తీవ్రమవుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు’ తమ బెంచ్‌మార్క్ రుణ రేట్లను పెంచాయి. 77వ రోజులోకి ప్రవేశించిన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ సరఫరా చైన్‌కు అంతరాయం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇంధనం, ఆహారధాన్యాల ధరలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎకనమిస్టులు, నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే... - వివిధ కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు డిమాండ్‌పై ప్రభావం చూపుతాయి. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇంకా మహమ్మారి ముందు స్థాయికి చేరుకోని ప్రపంచంలోని పలు ఎకానమీలకు తాజా పరిస్థితులు మరింత తీవ్ర ప్రతికూలతలను సృష్టిస్తాయి. - గతంలో సరఫరా చైన్ వల్ల మాత్రమే పెరిగే ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రస్తుతం యుద్ధం వల్ల మరింత తీవ్రతరమవుతున్నాయి. - ద్రవ్యోల్బణం సవాళ్ల కట్టడికి అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు వడ్డీరేట్ల పెంపు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. రాబోయే 6–8 నెలల పాటు ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా చర్యలు ఉంటాయి. ఇవి వ్యవస్థలో డిమాండ్‌ను తగ్గిస్తాయి. భవిష్యత్తులోనూ రేట్ల పెంపు తప్పదని సెంట్రల్ బ్యాంకులు సంకేతాలు ఇస్తుండడం గమనార్హం. రూపాయిలో ఆర్బీఐ జోక్యం ఇబ్బందే! ఆర్బీఐ వర్గాల కథనం ప్రకారం, రూపాయి అస్థిరతను అరికట్టడానికి గత కొన్ని రోజులుగా ఫారెక్స్ మార్కెట్లో కూడా ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. ఈ వారం ప్రారంభంలో అమెరికా డాలర్‌తో రూపాయి తన జీవితకాల కనిష్ట స్థాయి 77.44కి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రూపాయిని ఒక స్థాయి వరకూ ఆర్బీఐ పడిపోకుండా చూడగలదుకానీ, భారీ పతనాలను నివారించలేదన్నది నిపుణుల వాదన. అలాంటి చర్యలకు ఆర్బీఐ దిగితే, భారత్ విదేశీ మారకద్రవ్యం నిల్వలు తరిగిపోయి, రూపాయి మారకంలో డాలర్ పటిష్టత మరింత ఊపందుకుంటుంది. 2021 సెప్టెంబర్‌లో జీవితకాల గరిష్ట స్థాయి 642.54 బిలియన్ డాలర్ల స్థాయికి చేరిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రస్తుతం 600 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు 12 నెలల దిగుమతులకు ఇవి సరిపోతాయి. అధిక ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యత: ఆర్థికశాఖ ఇదిలావుండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ నెలవారీ ఆర్థిక సమీక్షను విడుదల చేస్తూ, దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండకుండా కట్టడి చేసేందుకే ప్రభుత్వం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆర్బీఐ ఇటీవలి రేట్ల పెంపు ఈ దిశలో తీసుకున్న చర్యేనని పేర్కొంది. ద్రవ్యోల్బణమే ప్రధాన సమస్యగా వివరించింది. డబ్ల్యూటీవో కృషి చేయాలి అంతర్జాతీయ ద్రవ్యోల్బణం కట్టడికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పాటు పడాలని భారత్ డిమాండ్ చేసింది. అధిక ద్రవ్యోల్బణం సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తు చేసింది. డబ్ల్యూటీవోలో భారత శాశ్వత రాయబారి బ్రజేంద్ర నవనీత్ ఈ మేరకు ప్రకటన చేశారు. కరోనా విపత్తు తర్వాత, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకోవడం, స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధనను అత్యంత ప్రాధాన్య అంశాలుగా తీసుకోవాలని డబ్ల్యూటీవోను భారత్ కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. -
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్‌నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్... రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కెనరా బ్యాంక్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్‌లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది.