ముంబై: బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరో పావుశాతం పెంచుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్ (బీఆఫ్‌ఏఎంఎల్) అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడే ధ్యే యంగా డిసెంబర్ 18 మధ్యంతర పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంటుందని మిరిల్ లించ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెపోను రెండు దఫాలుగా 0.5% పెంచారు.
ద్రవ్యోల్బణం దిగివస్తుంది: కాగా ప్రస్తుతం 7 స్థాయిలో ఉన్న టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2014 ద్వితీయార్థంలో 5 శాతం దిగువకు పడే అవకాశం ఉందని కూడా ఫారిన్ బ్రోకరేజ్ బ్యాంక్ అంచనావేసింది. ఇందుకు సైతం తగిన వర్షపాతం సహకరించాల్సి ఉంటుందని పేర్కొంది.
60-65 శ్రేణిలో రూపాయి: బ్యాంకులు విదేశాల నుంచి నేరుగా డాలర్లను ఆకర్షించడానికి ఉద్దేశించిన స్వాప్ సదుపాయం నేపథ్యంలో భారత కరెన్సీ విలువ అమెరికా డాలర్ మారకంలో 60 నుంచి 65 శ్రేణిలో స్థిరపడుతుందని బ్యాంక్ అంచనావేసింది.