పెట్రోలు,డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం..తగ్గింపుకు ఒప్పుకోని కేంద్రం! ఆర్బీఐ ప్రయత్నం విఫలం! | Why Economists Expect Rbi To Hike Repo Rate | Sakshi
Sakshi News home page

తప్పని పరిస్థితిలోనే ఒంటరి ప్రయాణం

Published Fri, May 6 2022 9:12 AM | Last Updated on Fri, May 6 2022 9:44 AM

Why Economists Expect Rbi To Hike Repo Rate - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యోల్బణం కట్టడికి తప్పనిసరి పరిస్థితుల్లోనే రెపో రేటును 0.4 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని అరశాతం పెంచిందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ వర్గాల కథనం ప్రకారం, పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని అలాగే పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఇతర సరఫరా వైపు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఆర్‌బీఐ ప్రయత్నించి విఫలమైంది. 

ఆయా అంశాలే ఆర్‌బీఐ అర్థాంతర, ఆశ్చర్యకరమైన రేటు పెంపును ప్రేరేపించాయి.  ఆర్‌బీఐ అనూహ్యరీతిలో బుధవారం బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఈ రేటు 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్‌బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. గడచిన 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. దీనితోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణం రెక్కలను తొలగించాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం.  

ద్రవ్యోల్బణంపై నిర్దేశాలు కీలకం... 
ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి. అయితే  జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలను ఏప్రిల్‌  మొదటి వారం ఆర్‌బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు ఇటీవలి కాలంలో మరింత స్పష్టమవుతున్నాయి.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌సహా కమోడిటీ ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. దీనితో పాటు వ్యవస్థ నుంచి ఈజీ మనీ ఉపసంహరణలో భాగంగా అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు (ఒక శాతానికి) వంటి పలు అంశాలు దేశంలో వడ్డీరేట్లు పెంచాల్సిన పరిస్థితిని సృష్టించాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది కీలకం. ఆయా పరిణామాల అన్నింటి నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా అనూహ్య నిర్ణయం తీసుకుంది. జూన్‌ తొలి వారంలో జరిగే పాలసీ సమావేశాల్లో రెపోను మరో 0.5% పెంచవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.  

దేశీయ పరిస్థితులు.. 
అంతర్జాతీయ పరిస్థితులు దేశీయంగా ద్రవ్యోల్బణానికి రెక్కలు తీసుకువచ్చే పరిస్థితి నెలకొంది. ‘‘దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధి లక్ష్యంతోనే తాజా రెపో రేటు పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థిరంగా కొనసాగే అధిక ద్రవ్యోల్బణం పొదుపు, పెట్టుబడి, పోటీతత్వం ఉత్పాదక వృద్ధిని అనివార్యంగా దెబ్బతీస్తుంది. ఇది పేద జనాభా వర్గాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది. ఇది ఎకానమీలో తీవ్ర ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది’’ అని పాలసీ సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. మార్చి 22 నుండి ప్రారంభమైన 16 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌ ధరలలో లీటరుకు రికార్డు స్థాయిలో రూ.10 పెరిగింది. ఇది ఇప్పటికే ఉన్న అధిక వస్తువుల ధరలకు మరింత ఆజ్యం పోసింది. ఇక తప్పదన్న పరిస్థితుల్లోనే ఆర్‌బీఐ కఠిన నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.  ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ఇంధనాలపై ఎక్సైజ్‌ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి చర్యల కోసం ఆర్‌బీఐ ప్రభుత్వాన్ని ‘‘వేడుకుంది,  ఉద్బోధించింది‘, కానీ ప్రతిస్పందనను పొందలేకపోయిందని ఆ వర్గాలు తెలిపాయి. భారీ సుంకాలను విధిస్తున్న రాష్ట్రాలనూ ఈ విషయంలో దూకుడు తగ్గించమని ఆర్‌బీఐ కోరిందని, ఇక్కడి నుంచి కూడా తగిన స్పందన రాలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనికి ఇక ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం కట్టడికి సంబంధించి తన పనిలో తాను ఒంటరిగా నడిచిందని వివరించింది.  

ఎన్నికల తర్వాత ఒత్తిడి... 
ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధనంపై ధరల పెంపు ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు యథాతథ రేటు కొనసాగింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు గతేడాది కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఎక్సైజ్‌ను తగ్గించాయి, అయితే చాలా ఇతర రాష్ట్రాలు ఈ దిశలో చర్యలు తీసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవల రాష్ట్రాలకు ఎక్సైజ్‌ సుంకం తగ్గించాలని ఉద్బోధించారు. అయినా పెద్దగా ఫలితం లభించలేదు. దీనితో వ్యవస్థలో వడ్డీరేట్ల పెంపు, తద్వారా డిమాండ్‌ కట్టడితో ద్రవ్యోల్బణం కట్టడి చర్యలకు ఆర్‌బీఐ శ్రీకారం చుట్టింది.  

రూ.14 లక్షల కోట్ల సమీకరణ ప్రణాళికలు... 
కాగా,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 14 లక్షల కోట్లకుపైగా స్థూల ప్రభుత్వ రుణ సమీకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్న దృఢ నిశ్చయంలో ఆర్‌బీఐ ఉందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అయితే ఇక్కడ రుణ సమీకరణ కార్యక్రమాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ‘కేవలం నిధుల’ పరిమాణంలో చూడరాదని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) రుణ సమీకరణ 6.8 శాతంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం 5 శాతానికి చేరిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఆ వర్గాలు సూచించాయి. 2022–23 ఆర్థిక సంవత్స రంలో తన వ్యయాల కోసం కేంద్రం రుణ సమీకరణల లక్ష్యం రూ.11,58,719 కోట్లు. స్థూల రుణాలు ఆర్థిక సంవత్సరంలో రూ.14,95,000 కోట్లుని బడ్జెట్‌ అంచనా. స్థూల రుణాల్లో గత రుణాల రీ పేమెంట్లు కలిసి ఉంటాయి. డేటెడ్‌ సెక్యూరిటీలు (బాండ్లు), ట్రెజరీ బిల్లుల ద్వారా ప్రభుత్వ తన ద్రవ్యలోటుకు నిధులను సమకూర్చుకుంటుంది.   

బ్యాంకింగ్‌ రుణ వృద్ధికి బ్రేకులు: ఇండియా రేటింగ్స్‌ 
ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం బ్యాంకింగ్‌ వ్యవస్థ రుణ వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ పేర్కొంది.  తాజా పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ, రిటైల్‌ విభాగాల నుంచి రుణ వృద్ధి ఉన్నప్పటికీ, పరిశ్రమ, సేవల విభాగాల నుంచి డిమాండ్‌ ఉంటుందని వివరించింది. నివేదిక ప్రకారం, మధ్యకాలికంగా చూస్తే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా చైన్‌లో అంతరాయాలు, బలహీనమైన వినియోగ డిమాండ్‌ రుణ వృద్ధి డిమాండ్‌ పునరుద్ధరణపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆర్‌బీఐ రేట్ల పెంపు నిర్ణయం రుణాలను వ్యయ భరితం చేయనుంది. స్థూల ఆర్థిక రంగంపై మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తున్నందున, మూలధన వ్యయ ప్రణాళికల అమల్లో వేచిచూసే ధోరణిని అవలంభిస్తామని తాను రేటింగ్‌ ఇస్తున్న పలు కంపెనీలు పేర్కొన్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2022 ఏప్రిల్‌ 8వ తేదీతో ముగిసిన కాలానికి రుణ వృద్ధి అంతకుముందు ఇదే కాలంతో పోల్చితే 5.3 శాతం నుంచి 11.2 శాతం పెరిగిందని, అయితే తాజా పెంపు రుణ వృద్ధి ఉత్సాహాన్ని నీరుగార్చే వీలుందని వివరించింది. 2022– 23లో 10 శాతం రుణ వృద్ధిని తన ఫిబ్రవరి నివేదికలో ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. అయితే ఈ అంచనాల్లో తక్షణం సంస్థ ఎటువంటి సవరణా చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement